12.11.26

Sundar Pichai-Satya Nadella | దూకుడుగా మైక్రోసాఫ్ట్ పెట్టుబ‌డులు.. కానీ, టాప్‌లో సుంద‌ర్ పిచ్చాయ్-ఆల్పాబెట్‌


``టాప్‌-5 సంస్థ‌ల విలువ 9.1 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల‌కు పెర‌గ‌డంలో భా ర‌త సంత‌తికి చెందిన కొద్ది మంది టెక్నాల‌జీ లీడ‌ర్ల సార‌థ్యమే దానికి కార‌ణం.సుంద‌ర్ పిచ్చాయ్‌, స‌త్య నాదెళ్ల‌, సంజ‌య్ మ‌ల్హోత్రా త‌ర్వాత యూ-ట్యూబ్ నీల్ మోహ‌న్‌, ఐదో స్థానంలో గూగుల్ క్లౌడ్‌  థామ‌స్ కురియ‌న్ నిలిచారు``

Sundar Pichai-Satya Nadella | నాలుగైదేళ్ల నాటి వ‌ర‌కూ మ‌న‌కు తెలియ‌ని అంశ‌మేదైనా ఉంటే `గూగుల్ త‌ల్లి`, `గూగుల‌మ్మ‌`ను అడిగే వాళ్లం.. కానీ కృత్రిమ మేధ (ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌) వ‌చ్చాక‌.. దాని చాట్ బోట్‌ల సేవ‌లు విస్తృత‌మ‌య్యాక ఏఐ చాట్‌బోట్‌ల‌దే ఆధిప‌త్యమైంది. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ మీద ప‌ట్టు సాధించిన వారే ముందుకు దూసుకెళ్ల‌గ‌ల‌ర‌ని తాజా ప‌రిణామాలు చెబుతున్నాయి. 

గూగుల్‌-ఆల్పాబెట్ కంటే ముందు ఏఐ చాట్‌బోట్ చాట్ జీపీటీని తీసుకొచ్చిన ఓపెన్ ఏఐలో పెట్టుబ‌డులు పెట్టింది మైక్రోసాఫ్ట్‌. అటుపై మైక్రోసాఫ్ట్‌తో పోటీ ప‌డ్డ గూగుల్‌-అల్పాబెట్ ఇప్పుడు కృత్రిమ మేధ‌లోనే కాదు ఆదాయం, లాభాలార్జ‌న‌లోనే మైక్రోసాఫ్ట్‌ను తోసి రాజ‌ని మొద‌టి వ‌రుస‌లోకి దూసుకొచ్చింది. 

స‌త్య నాదెళ్ల‌ను దాటేసిన పిచ్చాయ్‌

ఇక మైక్రోసాఫ్ట్ సీఈఓ కం చైర్మ‌న్ స‌త్య నాదెళ్ల‌ను గూగుల్ - ఆల్పాబెట్ సీఈఓ సుంద‌ర్ పిచ్చాయ్ కూడా దాటేశారు. 2026 హెచ్ఎస్‌బీసీ హురున్ గ్లోబ‌ల్ ఇండియ‌న్స్ జాబితాలో స‌త్య నాదెళ్ల‌ను దాటి సుంద‌ర్ పిచ్చాయ్ మొద‌టి స్థానంలో నిలిచారు దానికి కార‌ణం ఈ ఏడాది గూగుల్‌-ఆల్పాబెట్ విలువ 98% పెరిగి 4.2 ల‌క్ష‌ల డాల‌ర్ల‌కు చేరుకుంది. గ్లోబ‌ల్ కార్పొరేట్ రంగం రూపురేఖ‌ల‌ను ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తోపాటు క్లౌడ్ కంప్యూటింగ్‌, డిజిట‌ల్ అడ్వ‌ర్టైజింగ్ మార్చేశాయి. 

అత్యంత విలువైన కంపెనీ ఆల్పాబెట్‌

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌, క్లౌడ్ కంప్యూటింగ్‌, డిజిట‌ల్ అడ్వ‌ర్టైజింగ్ విభాగాలపై ప‌ట్టు సాధించ‌డంతో హెచ్ఎస్‌బీసీ హురున్ గ్లోబ‌ల్ ఇండియ‌న్స్ జాబితాలో సుంద‌ర్ పిచ్చాయ్‌కు ప్ర‌థ‌మ ర్యాంకు ద‌క్కితే.. మైక్రోసాఫ్ట్‌ను దాటేసిన గూగుల్‌-ఆల్పాబెట్.. ప్ర‌పంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా తొలి ర్యాంకును సొంతం చేసుకుంది. 

ఆల్పాబెట్ ఇలా .. మైక్రోసాఫ్ట్ అలా..

హెచ్ఎస్‌బీసీ హురున్ గ్లోబ‌ల్ ఇండియ‌న్స్ జాబితా-2026 ప్ర‌కారం సుంద‌ర్ పిచ్చాయ్ సార‌థ్యంలో సాగుతున్న‌ ఆల్పాబెట్ విలువ 98 % పుంజుకుని 4.2 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల‌కు పెరిగితే.. స‌త్య నాదెళ్ల నేతృత్వంలో న‌డుస్తున్న మైక్రోసాఫ్ట్ విలువ 17% త‌గ్గి 2.6 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల‌కు ప‌డిపోయింది. 2024లో టాప్ పొజిష‌న్‌లో నిలిచిన మైక్రోసాఫ్ట్ ఇప్పుడు తిరోగ‌మ‌న స్థితికి చేరుకుంది. 

ఏఐ బిజినెస్‌లో టాప్‌-5 భార‌త సంత‌తి వారిదే సార‌థ్యం

సుంద‌ర్ పిచ్చాయ్‌, స‌త్య నాదెళ్ల త‌ర్వాత మ‌రో భార‌త సంత‌తికి చెందిన సంజ‌య్ మ‌ల్హోత్రా.. జాబితాలో మూడో ర్యాంకు పొందారు. ప్రెసిడెంట్ కం సీఈఓగా సంజ‌య్ మ‌ల్హోత్రా సార‌థ్యం వ‌హిస్తున్న మైక్రాన్ టెక్నాల‌జీ 1.4 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల సంప‌ద‌ను కూడ‌బెట్టుకుంది. ఇక ఈ జాబితాలోని టాప్‌-5 సంస్థ‌ల విలువ 9.1 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల‌కు పెర‌గ‌డంలో భా ర‌త సంత‌తికి చెందిన కొద్ది మంది టెక్నాల‌జీ లీడ‌ర్ల సార‌థ్యమే దానికి కార‌ణం కావ‌డం మ‌రో విశేషం. నాలుగో స్థానంలో యూ-ట్యూబ్ నీల్ మోహ‌న్‌, ఐదో స్థానంలో గూగుల్ క్లౌడ్‌కు చెందిన థామ‌స్ కురియ‌న్ నిలిచారు. వీరంతా భార‌త సంత‌తి టెక్నాల‌జీ లీడ‌ర్స్ కావ‌డం ఇండియ‌న్స్‌కు గ‌ర్వ కార‌ణం. 

ఆల్పాబెట్ వృద్ధికి కార‌ణ‌మేమిటంటే..

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌, క్లౌడ్ కంప్యూటింగ్‌, డిజిట‌ల్ అడ్వ‌ర్టైజింగ్ రంగాల్లో విస్త‌ర‌ణ ఆల్పాబెట్ ఎదుగుద‌ల‌ను ప్ర‌తిబింబిస్తోంది. ఏఐ-ప‌వ‌ర్డ్ సెర్చ్, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌, టెక్నాల‌జీ ప్లాట్‌ఫామ్స్ మీద సుంద‌ర్ పిచ్చాయ్ నాయ‌క‌త్వం పెట్టుబ‌డులు కొన‌సాగిస్తూ వ‌చ్చింది. ఏఐ స‌ర్వీసుల‌కు అంత‌ర్జాతీయంగా ఉన్న డిమాండ్‌ను ఏంచ‌క్కా సొమ్ము చేసుకుంది.

మైక్రోసాఫ్ట్ దూకుడుగా దూసుకెళ్లినా..

స‌త్య నాదెళ్ల సార‌థ్యంలో మైక్రోసాఫ్ట్ కూడా దూకుడుగా ఏఐ ఆధారిత పెట్టుబ‌డుల వ్యూహాన్ని అమ‌లు చేసింది. ఎంట‌ర్ ప్రైజెస్ సాఫ్ట్ వేర్ గా ఆర్టిపిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌ను ఇంటిగ్రేటింగ్ చేయ‌డంతోపాటు క్లౌడ్ కంప్యూటింగ్‌, ప్రొడ‌క్టివిటీ అప్లికేష‌న్స్ మీద దృష్టి పెట్టినా ఆల్పాబెట్ శ‌క్తిమంతంగా త‌న విలువ‌ను పెంచుకుంది. అలాగ‌ని ఆల్పాబెట్ వృద్ధిలో దాని వ్య‌క్తిగ‌త బిజినెస్ సెగ్మెంట్ల‌ను హురున్ గ్లోబ‌ల్ రిచ్ జాబితా నివేదిక వ‌దిలేయ‌లేదు. 

హురున్ గ్లోబ‌ల్ ఇండియా జాబితాలో టాప్‌లో ఏఐ

ఏఐ ఆధారిత కంపెనీల విలువ‌ 10.7 ల‌క్ష‌ల కోట్ల‌ డాల‌ర్ల మార్కుకు చేరుకున్నది. హెచ్ఎస్‌బీసీ హురున్ గ్లోబ‌ల్ ఇండియ‌న్స్ లిస్టు-2026లో ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ నిర్ణ‌యాత్మ‌కంగా మారింది. ఈ జాబితాలో చోటు ద‌క్కించుకున్న 200 సంస్థ‌ల్లో 103 సంస్థ‌లు ఏఐ- డ్రైవెన్ లేదా ఏఐ- ఇంటిగ్రేటెడ్ సంస్థలు కాగా, వాటి విలువ 10.7 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్లు కాగా, మొత్తం 200 సంస్థ‌ల విలువ 15 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల‌లో 71 శాతం. 

హురున్ ఇండియా ఫౌండ‌ర్ అండ్ చీఫ్ రీసెర‌చ‌ర్ అనాస్ రెహ్మాన్ జునాయిద్ మాట్లాడుతూ `ఈ జాబితాలో 71 శాతానికి పైగా కంపెనీల విలువ ఏఐ ఆధారితం` అని వ్యాఖ్యానించారు. ప్ర‌వాస భార‌తీయులు కేవ‌లం ఏఐ విప్ల‌వంలో భాగ‌స్వాములే కాదు.. దానికి సార‌థ్యం వ‌హిస్తున్నార‌ని ప్ర‌శంసించారు. 

లాభాల్లోనూ ఆల్పాబెట్‌-గూగుల్‌దే పైచేయి

ఆదాయంతోపాటు లాభాల్లోనూ మైక్రోసాఫ్ట్‌ను ఆల్పాబెట్‌-గూగుల్ అధిగ‌మించింది. 2025లో ఆల్పాబెట్ నిక‌ర లాభం 132.2 బిలియ‌న్ డాల‌ర్లైతే.. మైక్రోసాఫ్ట్ 101.8 బిలియ‌న్ డాల‌ర్లతో స‌రి పెట్టుకుంది. రెండు కంపెనీలు క‌లిసి సుమారు 234 బిలియ‌న్ డాల‌ర్ల లాభాలు సృష్టించాయి. 

ఇక ఆల్పాబెట్ ఆదాయం 402.8 బిలియ‌న్ల డాల‌ర్ల‌కు చేరుకుంటే, మైక్రోసాఫ్ట్ 281.7 బిలియ‌న్ డాల‌ర్లు. సుంద‌ర్ పిచ్చాయ్‌.. కార్పొరేట్ విలువ ఆధారిత ర్యాంకుల్లో ముందు ఉంటే.. లింక్డ్ ఇన్‌లో స‌త్య నాదెళ్ల క‌మాండ్ సాధించారు. స‌త్య నాదెళ్ల‌కు 12.1 మిలియ‌న్ల ఫాలోవ‌ర్లు ఉంటే.. సుంద‌ర్ పిచ్చాయ్‌కు 4.7 మిలియ‌న్ల అభిమానులే ఉన్నారు. 

200 గ్లోబ‌ల్ కంపెనీల‌కు 236 మంది ఎన్నారైల సార‌థ్యం

236 మంది భార‌త సంత‌తి కార్పొరేట్ అధిప‌తులు.. ఇండియా ఆవ‌ల ప్ర‌పంచంలోకెల్లా అత్యంత విలువైన 200 కంపెనీల‌కు సార‌థులుగా ఉన్నారు. 2024లో 9.9 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్లుగా ఉన్న ఈ కంపెనీల విలువ 2026లో 15 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల‌కు దూసుకెళ్లింది. 

ఒక కంపెనీ క‌నీస విలువ రెట్టింపుకు పైగా పెరిగి 1.2 బిలియ‌న్ డాల‌ర్ల నుంచి 2.5 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరుకుంది. టెక్నాల‌జీ ప్ర‌పంచ చ‌రిత్ర‌లోనే ఏఐ ఆధారిత 18 కంపెనీల విలువ 227 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరుకోవ‌డం ఇదే మొద‌టి సారి. 

కంపెనీల్లో అమెరికా టాప్‌

అమాన్ సంగ‌ర్ కో ఫౌండ‌ర్ గా ఉన్న స్టార్ట‌ప్ క‌ర్స‌ర్ విలువ‌ 60 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరుకోగా త‌ర్వాత 41 బిలియ‌న్ డాల‌ర్ల‌తో ప్రొమెథియాస్‌, 20 బిలియ‌న్ డాల‌ర్ల‌తో ప‌ర్‌ప్లెక్సిటీ నిలిచాయి. కంపెనీల జాబ‌తాలో అమెరికా ఆధిపత్యం ప్ర‌ద‌ర్శిస్తే.. మ‌హిళ‌ల ప్రాతినిధ్యం మ‌రోమారు త‌క్కువే. 177 అమెరికా కంపెనీలు, యూఏఈ, యూకే చెరో 15 కంపెనీలు ఈ జాబితాలో చోటు ద‌క్కించుకున్నాయి. 

శాన్ ఫ్రాన్సిస్కో 40, కాలిఫోర్నియా నుంచి 91 సంస్థ‌లు జాబితాలో చేరాయి. 236 మంది కార్పొరేట్ అధిప‌తుల్లో మ‌హిళ‌లు 16 మందే. 208 బిలియ‌న్ డాల‌ర్ల‌తో ఆర్టిస్టా నెట్‌వ‌ర్క్‌కు జ‌య‌శ్రీ వి ఉల్లాల్ సార‌థ్యం వ‌హిస్తున్నారు. 

58 శాతం మంది ఇండియాలో అండ‌ర్ గ్రాడ్యుయేట్సే

వీరిలో 58 శాతం మంది భార‌త్‌లో అండ‌ర్ గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసిన వారే. అందునా ఐఐటీ ఢిల్లీ విద్యార్థులే ఎక్కువ‌. ఈ కంపెనీల‌న్నీ 53 ల‌క్ష‌ల మందికి ఉద్యోగాలు క‌ల్పించి 2025లో 2.5 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల ఆదాయం, 416 బిలియ‌న్ డాల‌ర్ల లాభాలు గ‌డించాయి. 


మీరు ఈ వార్త‌లు కూడా చూడండి:

Satya Nadella- Microsoft | భాగ్య‌న‌గ‌రం టూ సిలికాన్ వ్యాలీ.. మైక్రోసాఫ్ట్ సీఈవో స‌త్యనాదెళ్ల ఎవ‌రో తెలుసా..?!

bill gates- satya nadella | యుగంధ‌ర్ త‌న‌యుడే స‌త్య‌నాదెళ్ల‌.. మైక్రోసాఫ్ట్‌లో ఆయ‌నే స‌ర్వాంత‌ర్యామి..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి