కన్న వారికి దూరంగా ఏళ్ల తరబడి అమెరికాలోనే
ఆ ఆలోచన లేని టెకీలు.. భారత్‌కు రావాలంటే భయ పడే పరిస్థితులున్నాయి. అమెరికాను వీడితే వీసా స్టాంపింగ్‌కు ఫీజు కట్టాల్సి రావచ్చు.. మరే కారణం చేతనైనా అమెరికాకు రావొద్దని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆంక్షలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. దీని ఫలితంగానే డాలర్ల మోజులో అక్కడే ఉంటున్న భారతీయులు.. కన్న వారు.. అయిన వారికి దూరంగా ఉంటూ అల్లాడిపోతున్నారు. గతంలో ఇంట్లో.. కుటుంబ సభ్యుల.. బంధు మిత్రుల ఇళ్లలో శుభ కార్యాలకు వచ్చి వెళ్లే వారు. అయినా వారి ఆరోగ్యం మీద ఆరా తీసి.. అత్యవసరమైతే వచ్చి పోయే వారు.. కానీ.. ఈ ఆరాలకు చెల్లు చీటి ఇచ్చి ఏళ్ల తరబడి అక్కడే ఉండాల్సి వస్తోందని భారతీయ టెకీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తొలిసారి ట్రంప్ ఆంక్షలు ఇలా
తొలిసారి అమెరికా అధ్యక్షుడిగా పని చేసినప్పుడూ దేశంలోని ఐటీ కంపెనీల్లోకి విదేశీ నిపుణులకు వీసా జారీ చేయడానికి ఆంక్షలు విధించారు. ఐటీ, సాఫ్ట్‌వేర్, టెక్నాలజీ రంగంలో భారత్ సహా అమెరికాలోని వివిధ దేశాల కంపెనీల్లో స్థానికులకు ఉద్యోగాల కోసం తొలిసారి డొనాల్డ్ ట్రంప్ పట్టుబట్టారు. తర్వాత కొంత పట్టు సడలించినా.. మళ్లీ మలి దఫా అధ్యక్షుడిగా ట్రంప్.. ఐటీ నిపుణులకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నారు.
హెచ్-1 వీసా ప్లస్ ఓటీపీతో కొంత కాలం గడువు పొడిగింపు
హెచ్1-బీ వీసాపై అమెరికాకు వచ్చే వారికి రూ.లక్ష వీసా ఫీజు చెల్లించాలని డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం పెట్టిన షరతుల్లో ఒకటి. చచ్చీ చెడీ అప్పు చేసి అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసి.. ఉద్యోగం సంపాదించుకున్నా.. ప్రతి ఏటా హెచ్1-బీ వీసా మీద భారతీయులే రమారమీ 87 వేల మంది ఉంటారు. అలా హెచ్1-బీ వీసాపై వెళ్లిన భారతీయులు.. ఆప్షనల్ ట్రైనింగ్ (ఓటీపీ) కింద కొంతకాలం ఉండొచ్చు.
గ్రీన్ కార్డుపై 12 లక్షల మందికి ఆశల పల్లకి
అలా అమెరికాకు వెళ్లి అక్కడ స్థిర పడిన ఎన్నారైలలో దాదాపు 12 లక్షల మంది టెకీలు.. గ్రీన్ కార్డు కోసం వేచి చూస్తున్నారని నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికా పాలసీ (ఎన్ఎఫ్ఏబీ) అంచనా వేసిందని బీబీసీ కథనం. వారిలో 79 శాతం మంది టెక్కీలు.. అమెరికాలో ఉద్యోగం పెండింగ్‌లో ఉన్న వారేనని గతేడాది డిసెంబరులో ఎన్ఎఫ్ఏపీ చెప్పింది. అడ్వాన్సుడ్ డిగ్రీ పూర్తిచేసిన ఈబీ-2 కు చెందిన 7,31,566 మంది ఉంటే.. బ్యాచ్‌లర్ డిగ్రీ పూర్తి చేసిన ఈబీ-3 వారు సుమారు 2,13,414 మంది టెకీలు గ్రీన్ కార్డు కోసం వేచి చూస్తున్నారని అంచనా..
గ్రీన్ కార్డు కోసం ఇలా ఇండియన్స్ ఎదురుచూపులు
భారతీయ టెక్కీలకు గ్రీన్ కార్డు రావాలంటే ఈబీ-1 క్యాటగిరీ వారు 4-5 ఏళ్లు, ఈబీ-3 విభాగానికి చెందిన టెక్కీలు 38 ఏళ్లు, ఈబీ-2 కేటగిరీ వారు 179ఏళ్లు వేచి చూడాల్సి వస్తుందని ఎన్ఎఫ్ఏపీ గత జనవరిలో అంచనా వేసింది. ప్రతి ఏటా విదేశీ టెక్కీల్లో 1.40 లక్షల మందికి మాత్రమే గ్రీన్ కార్డు జారీ చేయాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయించింది. అదీ ఒక్కో దేశం నుంచి పని చేస్తున్న టెకీల్లో ఏడు శాతానికి మించరాదు. అంటే .. ప్రస్తుతం అమెరికాలో ఉన్న భారత టెక్కీలు దాదాపు 12 లక్షలు.. అంటే వారందరికీ గ్రీన్ కార్డు రావాలంటే ఏండ్లు పూండ్లు పడుతుంది.. ఇక ట్రంప్ వంటి పాలకులు.. అధికారంలోకి వస్తే.. అదీ గుటుక్కుమనొచ్చు.. కనుక భారతీయ టెకీల్లో అత్యధికులు ఇతర దేశాలకు వలస బాట పడుతున్నారు.
హెచ్-1 బీ వీసా నిబంధనల్లో మార్పులు.. గ్రీన్ కార్డు కోసం ఎడతెగని వెయిటింగ్
హెచ్-1బీ వీసా నిబంధనల్లో తరుచుగా చేస్తున్న మార్పులు, గ్రీన్ కార్డు పొందడంలో అంతులేని వెయిటింగ్.. వంటి అంశాలు అమెరికాలో మంచి ఉద్యోగం, భారీ వేతనం.. టెక్నాలజీ రంగంలో ఉన్నతస్థాయి కెరీర్‌ను వదులకుకుని.. భవిష్యత్ మీద భరోసా కోసం బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా తదితర దేశాలకు తరలి పోతున్నారు మనాళ్లు. ప్రస్తుతం మంచి ఉద్యోగాల్లో కొనసాగుతున్నా.. ఫ్యూచర్ మీద బెంగ ఎక్కువైంది. ఆరేడు ఏళ్లుగా హెచ్-1 బీ వీసాపై పని చేస్తున్నా.. సమీప భవిష్యత్‌లో గ్రీన్ కార్డు పొందే అవకాశాలు తగ్గిపోవడం.. వీసా నిబంధనల్లో మార్పులతో ఆందోళనకు గురవుతున్నామని గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్‌లో పని చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఒకరు తెలిపారు.
విలాస జీవితానికీ చెల్లు చీటి.. యూరప్ దేశాల వైపు ఇండియన్స్ చూపు
శాన్‌ఫ్రాన్సిస్కోలో టాప్ టెక్ కంపెనీలో కొలువు.. విలాసవంతమైన జీవితం ఇష్టమైనా.. తమకు అమెరికా `బంగారు పంజరం`గానే మారిపోయిందని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు చెబుతున్నారు. గ్రీన్ కార్డు కోసం భారీ నిరీక్షణ తప్పక పోవడంతో ఏడాదిన్నర కాలంగా అమెరికాను వీడలేదని మరో ప్రవాస భారతీయుడు ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను, స్నేహితులను కలవడంతోపాటు ఉద్యోగ సంబంధిత సమావేశాలకూ వెళ్లలేక దూరంగా ఉంటున్నామని రవీందర్ అనే ఇంజనీర్ పేర్కొన్నారు. చివరకు అసాధారణ ప్రతిభావంతులకు ఇచ్చే వీసా కోసం చేసిన ప్రయత్నాలు తిరస్కరణకు గురయ్యాయని.. బ్రిటన్ నుంచి గ్లోబల్ టాలెంట్ వీసా లభించినందున అక్కడికే వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.
ఇండియన్లకు భారంగా హెచ్-1 బీ వీసా ఫీజు
అక్రమ వలసల నియంత్రణ పేరిట డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రారంభించిన చర్యలు.. చట్టబద్ద వలసల మీద కూడా ప్రభావం చూపుతున్నాయి. మంచి నైపుణ్యం గల విదేశీ ఉద్యోగులను అనుమతించే హెచ్1-బీ వీసాల జారీ విషయంలోనూ ట్రంప్ తీరు ఇబ్బందులు తెచ్చి పెడుతోంది. కొత్తగా హెచ్-1 బీ వీసాకు దరఖాస్తు చేసుకునే వారు రూ.లక్ష ఫీజు చెల్లించాలన్న నిబంధన పెట్టడం.. అమెరికన్లకే ఉద్యోగాలివ్వాలని కంపెనీలపై ఒత్తిళ్లు తేవడం వంటి అంశాలు భారత ఐటీ నిపుణులపై బాగానే ప్రభావం చూపుతున్నాయి.
విదేశీ నిపుణులకు వీసాపై యూఎస్ కంపెనీలూ వెనుకంజే
ట్రంప్ సర్కారు విధానాలతో అమెరికాలోనే దిగ్గజ సంస్థలు సైతం విదేశీ ఉద్యోగుల నియామకం విషయంలో తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. విదేశీ ఉద్యోగుల నియామకంలో చిన్న ఉల్లంఘన జరిగిందని ఆరోపణలు వచ్చినా వీసా నిషేధంతోపాటు క్రిమినల్ విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని ఆయా సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా స్టీఫెన్ మిల్లర్‌కు ట్రంప్ బాధ్యతలు అప్పగించడం, విదేశీ ఉద్యోగులకు గ్రీన్ కార్డు స్పాన్సర్‌షిప్‌పై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ విచారణకు ఆదేశించిన ఘటనలు భారత నిపుణుల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇక విదేశీ ఉద్యోగులకు శాశ్వత నివాస హోదా కల్పనపైనా అమెరికా కార్మికశాఖ కఠిన నిబంధనలను ప్రతిపాదించింది.
అమెరికాకెళ్లే విద్యార్థులూ.. ఓటీపీ అప్లికెంట్లూ తగ్గారు
ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అమలు చేస్తున్న వలస విధానాల ప్రభావం ఉద్యోగాలకే కాక అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్లే భారతీయ విద్యార్థుల మీదా ప్రతికూల వాతావరణం పడింది. ఏడాది కాలంగా యూఎస్ యూనివర్సిటీల్లో చేరిన విదేశీ విద్యార్థులు 15 శాతం తగ్గారని అమెరికా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అంచనా వేసింది. అమెరికాలో తాత్కాలికంగా పని చేసే అవకాశం కల్పించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓటీపీ) కోసం పేర్లు నమోదు చేసుకున్న భారత విద్యార్థులు ఆరు శాతం తగ్గారని.. గత ఐదేళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి అని టెక్కీలు చెబుతున్నారు.


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి