2.12.18

KCR-Sonia Gandhi |ఇదీ కేసీఆర్ మర్మం: నాడు సోనియా ఉదాత్తురాలు.. మరి నేడు?

KCR-Sonia Gandhi | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని ప్రజాకూటమికి, అధికార టీఆర్ఎస్ మధ్య నువ్వా? నేనా? అన్నట్లు పోరాటం సాగుతోంది. ఈ క్రమంలో ఇటీవల సోనియాగాంధీని నీకెందుకు బాధవుతున్నదమ్మా? అని ప్రశ్నించిన సీఎం కేసీఆర్.. ఆమె ఉదాత్తమైన, ఉదారమైన నాయకురాలని కీర్తించారు. దీని వెనుక భావమేమిటన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే.


హైదరాబాద్: యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఉదారమైన నేత.. ఈ మాటలన్నది ఎవరో కాదు సాక్షాత్ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో విజయావకాశాలపై ప్రముఖ ఆంగ్ల టీవీ చానెల్ ఎడిటర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్య ఇది. తెలంగాణ రాష్ట్ర సాధన డిమాండ్ ను గట్టిగా వినిపించిన కేసీఆర్.. ఆ డిమాండ్‌లో న్యాయబద్ధత, హేతుబద్దతను గుర్తిస్తూ 2014లో యూపీఏ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ తీసుకున్న సాహసోపేత నిర్ణయం వల్లే తెలంగాణ కల సాకారమైందని అంగీకరించారు. 

2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియాగాంధీ పాత్ర, క్రెడిట్‌ను ఎవరూ కొట్టేయలేరని కేసీఆర్ చెప్పారని సదరు టీవీ చానెల్ ఎడిటర్ గుర్తు చేశారు. ఈ విషయం సబ్బండ తెలంగాణ వర్ణాలన్నింటికి తెలుసు. కానీ రెండు రోజుల క్రితం కేసీఆర్ తనయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రాజకీయ అనివార్యత వల్లే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిందని చెప్పారు. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సారథ్యం వహించిన సోనియాగాంధీ ఇటీవల మేడ్చల్ వేదికగా ప్రజాకూటమి ఎన్నికల ప్రచారసభలో సమర శంఖారావం పూర్తిస్తూ ‘నాకడుపు తరుక్కుపోతోంది.. తెలంగాణ పరిస్థితి చూసి బాధ కలుగుతోంది.. మిమ్మల్ని చూస్తుంటే కొన్నేళ్ల తరువాత పిల్లల్ని చూసినట్లుంది.. నీళ్లు, నిధులు, నియామకాల ఆకాంక్షల్ని టీఆర్ఎస్ నెరవేర్చలేదు.. కేసీఆర్‌ ప్రజల్ని పక్కన పెట్టి కుటుంబ బాగోగులు చూసుకున్నారు.. మాటపై నిలబడని వారిని నమ్మకూడదు.. పిల్లలు అభివృద్ధి చెందితేనే తల్లికి ఆనందం.. రాజకీయంగా నష్టమని తెలిసీ తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం.. కొత్త రాష్ట్రంలో అభివృద్ధి, పరిపాలన జరగడం లేదు’ అని తెలంగాణ ప్రజల్లో సెంటిమెంట్ పండించారు. 

కానీ ఈ అప్పీల్ అధికార టీఆర్ఎస్ నాయకత్వానికి కష్టంగా తోచింది. ఎన్నికల సమరాంగణంలో తమ ప్రత్యర్థి కాంగ్రెస్ కనుక.. వెనుకా ముందు చూసుకోకుండా సీఎం కేసీఆర్ మొదలు కేటీఆర్, హరీశ్ రావు, కవిత అంతా సోనియా వ్యాఖ్యలపై విరుచుకు పడ్డారు. 

ఆ మరుసటి రోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ‘అమ్మా.. సోనియా గాంధీ.. తెలంగాణ ప్రజలను చూసి ఎందుకు తల్లడిల్లుతున్నావు.. గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో వచ్చినట్లు నీకు మామూళ్ల సూట్‌కేసులు రావడం లేదా.. తెలంగాణలో రైతులు, చేనేత కార్మికుల ఆకలి చావులు, ఆత్మహత్యలు తగ్గాయనా.. ఎందుకమ్మా? నీకు సూటుకేసులు వస్తలేవని తల్లడిల్లుతున్నవా?’ అని ఎదురు దాడికి దిగారు.

ఇంకా ‘మొన్న రాష్ర్టానికి సోనియాగాంధీ వచ్చిండ్రు. అమె కడుపు తరుక్కుపోతున్నదట మరి ఏం జరిగిందో! ఇక్కడి కాంగ్రెస్ దద్దమ్మలు రాసిస్తరు.. ఆ సోనియాగాంధీ చదివిపోతరు. తెలంగాణ గడ్డమీద మీటింగ్‌పెట్టి ఆంధ్రకు ప్యాకేజీ ప్రకటించి పోతరు. మన దగ్గర ఉన్న పరిశ్రమలన్నీ పోవాల్నా? తల్లడిల్లుతున్నదట సోనియాగాంధీ. ఎందుకు తల్లడిల్లుతున్నవమ్మా? సమైక్యరాష్ట్రంలో వచ్చినట్టు నెలవారీ మామూళ్లు వస్తలేవా? సూటుకేసులు, మూటలు బంద్ అయినందుకే కదా నీ బాధ! ఏం కొంపలంటుకున్నయని.. ఎందుకు కడుపు తరుక్కుపోతుందో.. తల్లడిల్లుతున్నవో చెప్పాలె’ అని నిష్ఠూరమైన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్.

అంతేకాదు 2001లో విద్యుత్ పోరాటం పుణ్యమా? అని 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైతును ఆదుకునేందుకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ అందుబాటులోకి తెచ్చింది. కానీ ఈ నాడు తెలంగాణ వచ్చిన తర్వాత ధనిక రాష్ట్రంగా నిధులు అధికంగా ఉండటంతో 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారు కేసీఆర్.. కానీ దీనికి మూలం 2004లో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ప్రారంభమైందన్న సంగతి ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తున్నారని రాజకీయ విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు. అంతేకాదు మాట మీద నిలబడని వారిని నమ్మకూడదని మేడ్చల్ సభలో సోనియాగాంధీ పేర్కొన్నారు. 

వాస్తవమేమిటంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందు రాష్ట్ర విభజన పూర్తయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేస్తానని నర్మగర్భంగా పదేపదే హామీలు గుప్పించారు. తీరా ఏరు దాటే వరకు ఓడ మల్లయ్య.. దాటిం తర్వాత బోడిమల్లయ్య అన్నచందంగా పార్టీ విలీనం సంగతి దేవుడెరుగు.. కనీసం కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు కూడా సుముఖత వ్యక్తం చేయలేదు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే దళితుడ్ని సీఎంగా చేస్తానని ఇచ్చిన హామీని ఫలితాలొచ్చిన తర్వాత తుంగలో తొక్కేశారు. ఇలా అవసరానికి అనుగుణంగా వ్యూహాలు మార్చడంలో మన కేసీఆర్ గండరగండుడేనని రాజకీయ వ్యాఖ్యాతలు అభిప్రాయ పడుతున్నారు.

ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని ప్రజాకూటమికి ‘టఫ్’ ఫైట్ జరుగుతున్నదని పరిస్థితులు చెబుతున్నాయి. ఈ తరుణంలో 100కి పైగా సీట్లు గెలుచుకుని విజయం సాధిస్తామని సీఎం కేసీఆర్ పదేపదే చెబుతున్నా.. అది వాస్తవమా? కదా? అన్న సంగతి తెలియాలంటే మరో ఎనిమిది రోజులు వేచి చూడాల్సిందే.

ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక సమరానికి దిక్సూచి కానున్నాయని రాజకీయ పార్టీలు, విశ్లేషకులు, మేధావులు భావిస్తున్నారు. అందువల్లే జాతీయ మీడియా కూడా హైదరాబాద్ వేదికగా పరిస్థితులను మదింపు చేస్తున్నది. ఈ తరుణంలోనే ప్రముఖ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘సోనియాగాంధీ ఉదాత్తురాలు’ అని ముక్తాయింపునిచ్చారు సీఎం కేసీఆర్.. దీని వెనుక పరమార్థం ఏదైనా ఉన్నదా? అని రాజకీయ విశ్లేషకులు సందేహిస్తున్నారు. దీని భావమేమిటన్నది ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే వరకు మిలియన్ డాలర్ల ప్రశ్నే మరి. 

7.8.18

మేరునగధీరుడు..ద్రవిడ సూరీడు


- ఏడు దశాబ్దాల రాజకీయ జీవితంలో తానే తలైవర్
- ఐదుసార్లు ముఖ్యమంత్రి, 13 సార్లు ఎమ్మెల్యేగా జయకేతనం
- సినీ వినీలాకాశంలో కలైజ్ఙర్‌గా పట్టాభిషేకం
- హేతువాదిగా, సినీ సాహితీ వేత్తగా, రాజకీయ దురంధరుడిగా బహుముఖ ప్రస్థానం
-తెలుగు గడ్డపైనే మూలాలు
ఆయన గురించి చెప్పాలంటే మాటలు చాలవు.. ఆయన గురించి రాయాలంటే పుస్తకాలు సరిపోవు.. ద్రవిడ ఉద్యమానికి నిలువెత్తు ప్రతీక.. ఆత్మగౌరవ పోరాటానికి ఆయన పతాక. పోరాటం ఆయన మార్గం.. ధిక్కారం ఆయన నైజం.. అన్యభాష వద్దు.. తమిళమే ముద్దు అంటూ హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని నడిపిన సిపాయి.. కళారంగం ఆయన పుట్టిల్లు.. రాజకీయం ఆయన కదనరంగం.. తన కలం, గళం జనం కోసం..ఆయన ప్రసంగం ప్రవాహఝురి.. ఆయన వాక్చాతుర్యం నిరుపమానం.. ఓటమికి ఆయనంటేనే భయం.. 60 ఏండ్ల అప్రతిహత విజయపరంపర ఆయన సొంతం. 94 ఏండ్ల నిండైన జీవితం.. 80 వసంతాల రాజకీయ వైభవం.. 64 ఏండ్ల సినీ పట్టాభిషేకం.. 50 వసంతాల పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇదీ ఆయన ట్రాక్ రికార్డు. కేంద్రం పెత్తనాన్ని ప్రశ్నించిన ధీశాలి.. బహుముఖ ప్రజ్ఞాశాలి, రాజకీయ కోవిదుడు, కళామతల్లి ముద్దుబిడ్డ.. ఏడు దశాబ్దాల రాజకీయ చైతన్య తరంగం, డీఎంకే దిగ్గజం, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ముత్తువేల్ కరుణానిధి అలియాస్ కలైజ్ఙర్ అలియాస్ నల్ల కళ్లద్దాల పెద్దాయన(దేశవ్యాప్తంగా ప్రజలు ముద్దుగా పిలుచుకునే పేరు) ప్రస్థానం గురించి సవివరంగా..

అసలు పేరు దక్షిణామూర్తి.. ములాలు తెలుగుగడ్డలో..


భారతదేశంలో స్వాతంత్య్రానికి ముందు రాజకీయ జీవితం ప్రారంభించి, ప్రస్తుతం జీవించి ఉన్న అతి కొద్ది మంది నాటి తరం నేతల్లో కరుణానిధి ఒకరు. కరుణానిధి అసలు పేరు ముత్తువేల్ దక్షిణామూర్తి. 1924 జూన్ 3వ తేదీన నాగపట్టిణం జిల్లా తిరుక్కువలై గ్రామంలో నాయి బ్రాహ్మణ కులంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ముత్తువేలు, అంజు. వారి పూర్వీకులు తెలుగువారు కావడంతో ఆయనకు తొలుత దక్షిణామూర్తి అని పేరు పెట్టారు. కరుణ పూర్వీకులు ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు జిల్లాకు చెందినవారు. ఆయన జన్మించకముందే కరుణ కుటుంబం తమిళనాడుకు వలస వెళ్లింది. సంగీతకారుల కుటుంబానికి చెందిన కరుణ మాతృభాష తెలుగు కావడంతో ఆయన ప్రత్యర్థులు తరుచూ పరాయి అంటూ విమర్శలు గుప్పించేవారు. కానీ, ఆయన వాటిని తేలిగ్గా తీసిపారేసేవారు. మరోవైపు ద్రవిడ ఉద్యమ కెరటం అన్నాదురై కూడా తెలుగు మూలాలు ఉన్నవారే కావడం గమనార్హం. ఒక ఇంటర్వ్యూలో అన్నాదురై మాట్లాడుతూ.. మా అమ్మ బంగారమ్మ కంచి గుడిలో దేవదాసి, ఆమె స్పష్టంగా తెలుగు మాట్లాడుతుంది అని చెప్పారు.

సాహిత్య నిధి..


కేవలం ఎనిమిదో తరగతి మాత్రమే చదివిన కరుణానిధికి ఉద్యమాలు, నాటకాలు, సాహిత్యం అంటే ఎంతో ఆసక్తి. మూఢ విశ్వాసాల నుంచి ప్రజల్ని చైతన్యం చేసేందుకు నాటికలు రాసి ప్రదర్శించేవారు. కవితలు రాసి చదివి వినిపించేవారు. కవితలు, సాహిత్యంపై ఉన్న ఆసక్తి ఆయన్ను తమిళ సినీ పరిశ్రమలో అడుగుపెట్టేలా చేసింది. స్రిప్టు రచయితగా ఆయన కెరీర్ ప్రారంభించారు. సహజసిద్ధంగా ఆయనకు గల తెలివి తేటలు, వ్యాఖ్యాన నైపుణ్యం ప్రజాదరణ గల రాజకీయ నాయకుడిగా శరవేగంగా రూపాంతరం చెందేందుకు దోహదపడ్డాయి. ద్రవిడ ఉద్యమంలో భాగస్వామిగా, హేతువాద, సామ్యవాద సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడైన కరుణానిధి తన రచనల్లో వాటికి ఇతోధికంగా చోటు కల్పించేవారు. చారిత్రక, సామాజిక సంస్కరణలను ప్రోత్సహిస్తూ రాసిన రచనలు ఆయనకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. తమిళ సాహిత్యంలో కరుణానిధిది ప్రత్యేకస్థానం. గేయాలు, లేఖలు, స్క్రీన్‌ప్లేలు, నవలలు, జీవిత గాథలు, చారిత్రక నవలలు, నాటకాలు, డైలాగ్‌లు, సినిమా పాటలు ఇలా విభిన్న రంగాల్లో తన నిరుపమాన శైలిని కొనసాగించారు. కరుణ వందకుపైగా కవితలు, గేయాలు, పుస్తకాలు రాశారు. గత ఆరు దశాబ్దాల్లో ఆయన సుమారు 2లక్షలకుపైగా పేజీలు రాశారంటే ఆయనకు ఈ రంగంపై ఎంత ఇష్టమో చెప్పనక్కరల్లేదు. 

14వ ఏటే రాజకీయ ప్రస్థానం..


కరుణానిధి 14వ ఏటే రాజకీయ రంగంలో ప్రవేశించారు. జస్టిస్ పార్టీ వ్యవస్థాపక నేతల్లో ఒకరిగా భావించే అళగిరిస్వామి ప్రసంగాలతో స్ఫూర్తి పొందిన కరుణానిధి 1938లో జరిగిన హిందీ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్నారు. స్థానిక యువత కోసం సంస్థను స్థాపించిన కరుణానిధి.. ఆ సంస్థ కోసం చేతిరాతతో కూడిన దినపత్రిక మానవర్ నెసాన్ నడిపారు. దాని ద్వారా యువతలో స్ఫూర్తిని రగల్చడానికి ప్రాధాన్యమిచ్చారు. తదుపరి దశలో తమిళ్ మానవర్ మాండ్రం అనే పేరుతో విద్యార్థి సంఘాన్ని స్థాపించారు. తర్వాతి కాలంలో ఉధృతంగా సాగిన ద్రవిడ ఉద్యమంలో తొలి విద్యార్థి సంఘంగా తమిళ్ మానవర్ మాండ్రం పేరొందింది. విద్యార్థి సంఘ సభ్యుల్లో స్ఫూర్తిని, ఆవేశాన్ని రంగరించేందుకు ప్రారంభించిన దినపత్రిక క్రమంగా మురసోలిగా రూపాంతరం చెందింది. అదే తర్వాతి కాలంలో డీఎంకే అధికార దినపత్రికగా అవతరించింది. మురసోలి పత్రికలో కరుణ రాస్తున్న ఉదాస్‌పిరప్పి (ఓ సోదరుడా) అనే లేఖల సీరియల్ ప్రపంచంలోని న్యూస్ పేపర్ల సీరియల్ చరిత్రలో అతి సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నదిగా రికార్డు సృష్టించింది. 

కరుణ టూ తలైవర్ వయా కలైజ్ఙర్


రాజకీయరంగంలోనే కాదు తమిళ సినీ పరిశ్రమలోనూ కరుణానిధి పాత్ర ఎనలేనిది. స్క్రిప్టు, పాటలు, డైలాగుల రచయితగా ఆయన పేరొందారు. థోకూ మెడాయి అనే కళారూపాన్ని వీనులవిందుగా ప్రదర్శించినందుకు కరుణానిధి కలైజ్ఙర్ (కళాకారుడు) అనే బిరుదును సొంతం చేసుకున్నారు. ఇప్పటికీ ఆయన అభిమానులు, డీఎంకే నేతలు, శ్రేణులు ముద్దుగా కలైజ్ఙర్ అని పిలుచుకుంటారు. రాజకీయ రంగంలో అశేష ప్రజాభిమాన్ని సంపాదించుకున్న కరుణను పార్టీ శ్రేణులు గౌరవంగా తలైవర్(నాయకుడు) అని పిలుస్తారు. తన రచనలతో కోట్లాది మంది ప్రజల హృదయాలను గెలిచిన కరుణను కళైమామణి పురస్కారంతో సత్కరించారు.

కళ్లకూడి ఉద్యమంతో పేరు ప్రఖ్యాతులు


1953లో పారిశ్రామిక పట్టణం కళ్లకూడిలో జరిగిన ఉద్యమం కరుణకు తమిళనాడులో ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. కళ్లకూడి ఆందోళనగా ఇది ప్రసిద్ధి చెందింది. ఉత్తరాదికి చెందిన సిమెంట్ మొఘల్ దాల్మియా పేరిట కళ్లకూడి గ్రామ పేరును నాటి ప్రభుత్వం దాల్మియాపురంగా మార్చింది. తమిళనాడుపై ఉత్తరాది పెత్తనం ఏంటని ప్రశ్నిస్తూ డీఎంకే ఆందోళన బాట చేపట్టింది. దాల్మియాపురం పేరును మార్చి కళ్లకూడి పేరునే తిరిగి పెట్టాలని పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగింది. కరుణ దీనికి సారథ్యం వహించారు. ఆయన నేతృత్వంలో రైల్వే స్టేషన్‌కు దాల్మియాపురం అన్న పేరును తొలగించి రైలు పట్టాలపై బైఠాయించారు. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించారు. ఈ ఉద్యమంలో ఇద్దరు ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోగా, కరుణానిధి అరెస్టయ్యారు. తమిళ రాజకీయాల్లో ప్రధాన నాయకుడిగా ఎదిగేందుకు కళ్లకూడి ఉద్యమం కరుణకు ఎంతగానో దోహదపడింది. ఎమర్జెన్సీ సమయంలో 1975లో మీసా చట్టం కింద జైలు పాలైనప్పుడు కరుణ పలు సమస్యలు ఎదుర్కొన్నారు. జైలులో ఆయన్ను పోలీసులు తీవ్రంగా కొట్టేవారు. కరుణను రక్షించేందుకు డీఎంకే పార్టీ ఖైదీ ఒకరు మరణించారు. 

1957లో తొలిసారిగా అసెంబ్లీలో అడుగు..


కరుణానిధి 1957లోనే తన 33వ ఏట తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కులిథాళాయి స్థానం నుంచి విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1961లో డీఎంకే కోశాధికారిగా నియమితులైన కరుణానిధి, ఏడాదిలోపే 1962లో అసెంబ్లీలో డిప్యూటీ ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 1967లో డీఎంకే అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజాపనులశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తదుపరి రెండేండ్లకే 1969లో అప్పటి ముఖ్యమంత్రి అన్నాదురై మరణించడంతో కరుణానిధి(48 ఏండ్ల వయస్సులో) తొలిసారి తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అంతేకాదు డీఎంకే పార్టీ తొలి అధినేతగా ఎన్నికయ్యారు. 1949లో డీఎంకేను సీఎన్ అన్నాదురై స్థాపించారు. అయితే, ఆయన తన గురువు పెరియార్ రామస్వామి నాయకర్‌పై ఉన్న గౌరవంతో అధ్యక్ష స్థానాన్ని ఖాళీగా ఉంచి తాను మాత్రం ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. అన్నాదురై మరణాంతరం డీఎంకే పగ్గాలు చేపట్టిన కరుణ 1969లో డీఎంకే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. నాటి నుంచి నేటి వరకు గత 50 ఏండ్లుగా డీఎంకే అధినేతగా కొనసాగుతున్నారు. 1972లో తన స్నేహితుడు, ప్రముఖ నటుడు ఎంజీ రామచంద్రన్‌తో విభేదాలు తలెత్తాయి. దీంతో రామచంద్రన్ కరుణకు ప్రత్యర్థిగా మారారు. డీఎంకే నుంచి విడిపోయి స్వంతంగా అన్నాడీఎంకే పార్టీని ఆయన ఏర్పాటుచేశారు. 1977, 80, 85 ఎన్నికల్లో ఎంజీఆర్ ఘనవిజయం సాధించారు. 1987లో రామచంద్రన్ కన్నుమూశారు. ఆ తర్వాత 1989లో జరిగిన ఎన్నికల్లో కరుణ విజయం సాధించి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. 

నిండుసభలో జయలలితకు పరాభవం


1989-91 మధ్య కొద్దికాలం సీఎంగా పనిచేసిన కరుణానిధి ప్రభుత్వాన్ని 1991లో శాంతిభద్రతల పరిస్థితి సరిగ్గా లేదన్న కారణంతో కేంద్రం రద్దుచేసింది. 1989లో తిరిగి సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన కరుణానిధి హయాంలో జయలలితకు అసెంబ్లీలో నిండు సభ సాక్షిగా ఘోర అవమానం జరిగింది. డీఎంకే ఎమ్మెల్యేలు ఆమె హెడ్‌ఫోన్లు లాగేశారు. ఈ సందర్భంగా జయలలిత పట్ల కరుణ చేసిన అనుచితవ్యాఖ్య సభలో గందరగోళానికి దారితీసింది. దురై మురుగన్ అనే డీఎంకే సభ్యుడు ఆమె చీర లాగడానికి ప్రయత్నించడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. నాటి నుంచి 1991 ఎన్నికల్లో తిరిగి గెలుపొందే వరకు జయలలిత అసెంబ్లీలో అడుగు పెట్టనేలేదు. తిరిగి 1996 ఎన్నికల్లో డీఎంకేను కరుణానిధి విజయ పథాన నడిపించి రాష్ట్ర సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు.

వివాదాలూ ఎక్కువే


తమిళ రాజకీయాల్లో, సినీ పరిశ్రమలో, సామాజిక కార్యక్రమాల్లో ఎనలేని కీర్తిని సంపాదించుకున్న కరుణానిధి సుదీర్ఘ జీవితంలో వివాదాలూ ఎక్కువే. వీరనామ్ ప్రాజెక్టు టెండర్ల కేటాయింపులో అవినీతి జరిగిందని కరుణానిధి ప్రభుత్వంపై సర్కారియా కమిషన్ అభియోగాలు మోపింది. విభజన రాజకీయాలతోపాటు అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలపై కరుణానిధి ప్రభుత్వాన్ని నాటి కేంద్రంలోని ఇందిరాగాంధీ ప్రభుత్వం రద్దుచేసింది. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చెన్నైలో ైఫ్లెఓవర్ల నిర్మాణంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై 2001లో ఆయన అరెస్టయ్యారు. అర్ధరాత్రి సమయంలో సరాసరి ఆయన పడకగదిలోకి ప్రవేశించిన పోలీసులు కరుణను అరెస్టు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సేతు సముద్రం వివాదం చర్చకు వచ్చినప్పుడు కరుణానిధి చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి దారితీశాయి. వేల ఏండ్ల క్రితం రాముడు అనే దేవుడు ఉన్నాడని ఇది (రామసేతు) చెబుతున్నది. ఆయన నిర్మించిన వంతెనను ముట్టుకోవద్దని చెబుతారు. రాముడు ఎవరని నేను ప్రశ్నిస్తున్నా? ఏ ఇంజినీరింగ్ కాలేజీ ఆయనకు డిగ్రీ పట్టా ఇచ్చింది? అని కరుణానిధి చేసిన వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే చెలరేగింది. ఇక 1991 మే 21న మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యపై దర్యాప్తు జరిపిన జస్టిస్ జైన్ కమిషన్ మధ్యంతర నివేదికలో కరుణానిధి పేరు చేర్చింది. ఎల్‌టీటీఈకి కరుణానిధి సహకరించారని పేర్కొంది. రాజీవ్ హంతకులకు తమిళనాడు సీఎం కరుణానిధి, డీఎంకే సహకరించాయని, ఆయన హత్యకు వారిదే బాధ్యత అని తాత్కాలిక నివేదికలో పేర్కొంది. కానీ తుది నివేదికలో కరుణ పేరు కనుమరుగైంది. ఎల్‌టీటీఈ వ్యవస్థాపకుడు ప్రభాకరన్ తనకు మంచి మిత్రుడని 2009 ఏప్రిల్‌లో ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కరుణానిది వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి పీఠంపై ఐదుసార్లు.. ఎమ్మెల్యేగా 13 సార్లు


కరుణానిధి తొలిసారిగా ముఖ్యమంత్రి పీఠంపై 1969లో కూర్చున్నారు. ఆ తర్వాత 1971, 1989, 1996, 2006లో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 1957లో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన కరుణ అప్రతిహతంగా తన విజయయాత్రను కొనసాగించారు. తాను పోటీచేసిన ఏ ఎన్నికల్లోనూ ఆయన ఓడిపోలేదు. 2017లో జరిగిన తాజా ఎన్నికల వరకు మొత్తం ఆయన 13 సార్లు ఘనవిజయం సాధించి గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించారు. సుమారు 61 ఏండ్లపాటు ఆయన శాసనసభ్యుడిగా సేవలందించారు. ప్రస్తుతం ఆయన తిరువావూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 40 పార్లమెంటు స్థానాలకు గానూ 40 స్థానాల్ని గెలుచుకుని రికార్డు సృష్టించారు. దక్షిణ భారత సినిమా రంగానికి చెందిన వారిలో ముఖ్యమంత్రి అయిన మొదటి వ్యక్తి కరుణే.

పరాశక్తితో తమిళనాట ప్రభంజనం


ఆత్మగౌరవ, ద్రవిడ రాజకీయాలకు పెట్టింది పేరైన కరుణానిధి తమిళ సినిమాలో తన సిద్ధాంతాలు, భావాల ప్రచారానికి తొలిసారి పరాశక్తి సినిమాను ఉపయోగించుకున్నారు. ద్రవిడ ఉద్యమ సిద్ధాంతాలు, విలువలకు మద్దతునిస్తూ నిర్మించిన ఈ చిత్రం తమిళ సినిమాను మలుపు తిప్పింది. తమిళ సినీరంగానికి శివాజీ గణేశన్, ఎస్‌ఎస్ రాజేంద్రన్ అనే ఇద్దరు ప్రముఖ నటులను పరిచయం చేసింది. తొలుత ఈ సినిమాపై నిషేధం విధించినా.. తుదకు 1952లో విడుదలైంది. వివాదాల మధ్య విడుదలైన పరాశక్తి అప్పట్లో భారీ హిట్‌గా నిలిచింది. కరుణ 1947 నుంచి 2011 వరకు సుమారు 64 ఏండ్లపాటు స్క్రిప్టు రచయితగా పనిచేశారు. 50కిపైగా సినిమాలకు కథలు, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించారు. కరుణ సంభాషణలను అందించిన రాజకుమారి చిత్రంతోనే ఎంజీఆర్ నటుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. మదరుదనట్టు ఇలవరసి(1950), మందిరి కుమారి (1950), పరాశక్తి(1952), తిరుంబిపర్(1953), అరసిలంగ్‌కుమారి(1961) ఆయనకు ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. పరాశక్తి విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని అదే సందేశంతో పణం, థాంగరత్నం అనే సినిమాలకు కరుణానిధి స్క్రిప్ట్ రాశారు. తర్వాతి కాలంలో వితంతు పునర్వివాహం, ఆత్మగౌరవ వివాహాలను ప్రోత్సహిస్తూ.. అంటరానితనం, జమిందారీ వ్యవస్థను అంతం చేయాలన్న సందేశాలతో కరుణానిధి రచనలు సాగాయి. టీఆర్ సుందరం స్థాపించిన మోడ్రన్ థియేటర్స్ స్టూడియో.. స్క్రిప్ట్ రచయితగా కరుణానిధికి ఎంతో ఖ్యాతిని తెచ్చిపెట్టింది. 

స్టాలిన్‌కు రాజకీయ వారసత్వం


కరుణ తన రాజకీయ వారసత్వాన్ని చిన్న కుమారుడు ఎంకే స్టాలిన్‌కు అప్పగించారు. తండ్రి నిర్ణయంతో విభేదించిన పెద్ద కుమారుడు అళగిరి తండ్రిపై తిరుగుబాటు చేశారు. దీంతో 2014లో అళగిరిని డీఎంకే నుంచి బహిష్కరించారు. దశాబ్దాలపాటు స్టాలిన్ రాజకీయ నైపుణ్యాల్ని పరిశీలించిన తర్వాతే ఆయన్ను తన వారసుడిగా ప్రకటించారని డీఎంకే పెద్దలు చెబుతుంటారు. స్టాలిన్ తొలిసారి 1989, 1996ల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండుసార్లు కరుణ సీఎంగా ఉన్నా స్టాలిన్‌ను క్యాబినెట్‌లోకి తీసుకోలేదు. 1996లో చెన్నై నగర మేయర్‌గా స్టాలిన్ ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2006లో నాలుగోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాకే స్టాలిన్‌కు మంత్రి పదవి దక్కింది. 2009లో డిప్యూటీ సీఎంగా నియమించారు. 

ముగ్గురు సతులు.. ఆరుగురు సంతానం


కరుణానిధికి ముగ్గురు భార్యలు.. పద్మావతి అమ్మళ్, దయాళు అమ్మళ్, రజతీ అమ్మళ్. వీరి ద్వారా ఆరుగురు సంతానం కలిగారు. వీరిలో నలుగురు కొడుకులు ఎంకే ముత్తు, ఎంకే అళగిరి, ఎంకే స్టాలిన్, ఎంకే తమిళరసు. ఇద్దరు కూతుళ్లు ఎంకే సెల్వి, కనిమొళి. తొమ్మిది మంది మనుమలు ఉన్నారు. మొదటి భార్య పద్మావతి అమ్మాల్ కొడుకు ఎంకే ముత్తు. పద్మావతి అమ్మాళ్ 1948లోనే మృతి చెందారు. రెండో భార్య దయాళు అమ్మాళ్‌కు కొడుకులు అళగిరి, స్టాలిన్, తమిళరసుతోపాటు కూతురు సెల్వి ఉన్నారు. 60వ పడిలో ఉన్నప్పుడు కరుణానిధి మూడో భార్య రజతీ అమ్మాళ్‌ను పెండ్లి చేసుకున్నారు. రజతీ అమ్మాళ్‌కు కూతురు కనిమొళి జన్మించారు. కరుణానిధి మేనల్లుడు మురసోలి మారన్ కొడుకులే దయానిధి మారన్, కళానిధిమారన్. 

నలుగురు సీఎంలను అందించిన తమిళ సినిమా


తమిళ రాజకీయాల్లో సినీ ప్రముఖులు కీలక పాత్ర పోషించారు. హేతువాద నేత పెరియార్ రామస్వామి శిష్యుడిగా ఉన్న సీఎన్ అన్నాదురై సినీ కథా రచయిత. తర్వాతీ కాలంలో రామస్వామి పెరియార్‌ను వ్యతిరేకించి 1949 సెప్టెంబర్ 17న డీఎంకే స్థాపించారు. రాజకీయంగా ప్రజాదరణ సాధించేందుకు తమిళ సినిమాను విస్తృతంగా వినియోగించుకున్న నేత అన్నాదురై. డీఎంకే కార్యకర్తలందరికీ అన్నగా సుపరిచితుడైన అన్నాదురై 1967 నుంచి 1969 వరకు సీఎంగా పని చేశారు. అన్నాదురై మరణం తర్వాత 1969 నుంచి 1976 వరకు కరుణానిధి సీఎంగా ఉన్నారు. తర్వాత డీఎంకే నుంచి విడిపోయి అన్నా డీఎంకే ఏర్పాటు చేసిన సినీ నటుడు ఎంజీ రామచంద్రన్ 1977 నుంచి 1987లో మరణించే వరకు సీఎంగా పనిచేశారు. 1991లో కరుణ ప్రభుత్వాన్ని రద్దుచేయడంతో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో అన్నాడీఎంకేకు సారథ్యం వహించిన నటి జయలలిత తొలిసారి సీఎం అయ్యారు.

27.3.18

సిద్దూ చరిత్ర తిరగ రాస్తారా?!: కన్నడిగులు రెండోసారి ‘పవర్’ ఇస్తారా?!!

బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ నేత సిద్దరామయ్య సారథ్యంలోని కర్ణాటక ప్రభుత్వం.. మూడు దశాబ్దాలుగా కన్నడనేలపై సాగుతున్న ఎన్నికల రాజకీయాన్ని తిరగరాయాలని కలలు కంటోంది. అవును మరి 1989 తర్వాత ఏ పార్టీ కూడా కర్ణాటకలో రెండోసారి అధికారంలోకి రాలేదు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చివరి అతిపెద్ద రాష్ట్రం కర్ణాటకలో అధికారాన్ని చేజిక్కించుకుని రికార్డు నెలకొల్పాలని కమలనాథులు ఉవ్విళ్లూరుతున్నారు. రాజకీయ వేడికి నిలయమైన వింధ్య పర్వతాలకు దక్షిణ దిశగా ఉన్న కర్ణాటకలో ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం 'సమర భేరి' మ్రోగించింది. మే 12వ తేదీన పోలింగ్, 15వ తేదీన ఫలితాలు వెలువడతాయని ప్రకటించింది. రాజకీయంగా అత్యంత గణనీయ ప్రభావం చూపే ఆ రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై యావత్ భారతావని ఆసక్తిగా ఎదురు చూస్తోంది. 
కన్నడిగుల మద్దతు కూడగట్టేందుకు ఇరు పార్టీలు సమాయత్తం 
ఇప్పటికే యువ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గత రెండు నెలలుగా కర్ణాటక రాష్ట్రమంతటా కలియదిరుగుతున్నారు. మరోవైపు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా అదే స్థాయిలో కమలనాథుల పట్ల ప్రజల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. 1989 తర్వాత వరుసగా ఏ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన సంప్రదాయం లేదు. కానీ దాన్ని తిరుగరాయాలని సిద్దరామయ్య కలలు కంటున్నారు. 
కన్నడిగుల నేలపై రాజకీయాలకు ఆరు రీజియన్లు కీలకం
ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ కర్ణాటకను ‘చే'జిక్కించుకునేందుకు సుదీర్ఘ కాలంగా వ్యూహ రచన చేస్తూ ముందుకు సాగుతున్నాయి. కన్నడ నేల ఆరు రీజియన్లుగా విడిపోయి ఉండటంతోపాటు మిగతా రాష్ట్రాల మాదిరిగానే కర్ణాటకలోనూ స్వంతంగా కుల సమీకరణాలు ఎన్నికల సమరాంగణంలో కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రీజియన్ల పరిధిలో రెండు పార్టీలకు సానుకూలత, ప్రతికూలతలు కూడా ఉన్నాయి. 
వొక్కలిగ సామాజిక వర్గమూ కన్నడ రాజకీయాల్లో కీలకమే 
ఓల్డ్ మైసూర్ రీజియన్ రాష్ట్రంలోనే అతిపెద్ద సబ్ రీజియన్ కావడమే కాదు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట కూడా. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ సారథ్యంలోని జనతాదళ్ సెక్యులర్ పార్టీ 40 సీట్లకు 30 కైవసం చేసుకున్నది. మిగతా 10 సీట్లతోనే కాంగ్రెస్ పార్టీ సరిపెట్టుకున్నది. ఈ రీజియన్ పరిధిలో వొక్కలిగ సామాజిక వర్గం ప్రభావమే చాలా ఎక్కువ. తొలి నుంచి వొక్కలిగలు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు. ఈ సామాజిక వర్గానికి చెందిన ప్రజాదరణ గల నాయకుడు మాజీ సీఎం ఎస్ ఎం క్రుష్ణ (85)కు ఈ ప్రాంత బలం, బలహీనతలు కొట్టిన పిండి. 
బీజేపీ - జేడీఎస్ కూటమితో కాంగ్రెస్ ఓటు బ్యాంకు చిల్లు? 
గతేడాదే బీజేపీలో చేరిన ఎస్ఎం క్రుష్ణ వల్ల ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో కమలనాథులకు లబ్ధి చేరే అవకాశాలు ఉన్నాయి. బీజేపీతోపాటు జేడీఎస్ కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్ల వాటాను స్వాహా చేసేసి సీట్లను కొల్లగొట్టాలని కాచుక్కూర్చున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకున్నా.. బీజేపీ - జేడీఎస్ కలిసి పోటీ చేస్తే తమ ఓటు బ్యాంకు దెబ్బ తింటుందేమోనని ఆందోళనకు గురవుతున్నది. 
2013లో కుమ్ములాటలు, అవినీతి ఆరోపణలతో బీజేపీ ఇలా
హైదరాబాద్ -కర్ణాటక రీజియన్‌లో బీజేపీ నేతలు రెడ్డి బ్రదర్స్ కు తిరుగులేని పట్టు ఉన్నది. భారీ స్థాయిలో లింగాయత్‌లు ఉన్నారు. 2013లో బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు, కమలనాథులపై భారీ స్థాయిలో అవినీతి ఆరోపణలు, బళ్లారిలో ప్రతికూల పరిస్థితుల్లో కమలనాథులు దెబ్బ తిన్నారు. కానీ ఈ దఫా కమలనాథులంతా ఐక్యతా రాగం ఆలాపిస్తూ అధికార కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టేందుకు సిద్దమవుతున్నారు. కాకపోతే లింగాయత్ సామాజిక వర్గానికి ప్రత్యేక మైనారిటీ హోదా కల్పిస్తూ సిద్దరామయ్య క్యాబినెట్ కేంద్రానికి చేసిన సిఫారసు వల్ల కాంగ్రెస్ పార్టీకి సానుకూల పరిణామమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. 
కర్ణాటకలో లింగాయత్‌లు 19% జనాభా 
కన్నడ నేలపై లింగాయత్‌లు రాజకీయంగా శక్తిమంతులు. ఓబీసీ హోదా కలిగి ఉన్న లింగాయత్ ల జనాభా కర్ణాటకలో ఎక్కువ. ఈ ప్రాంతంలో లింగాయత్ ల జనాభా 11.5 నుంచి 19 శాతంగా ఉంటుంది. కేవలం హైదరాబాద్ -కర్ణాటక రీజియన్ వరకు మాత్రమే లింగాయత్ సామాజిక వర్గం జనాభా పరిమితమై లేదు. పలు రీజియన్లలో విస్తరించి ఉన్న లింగాయత్‌లు రాష్ట్రంలోని 224 అసెంబ్లీ స్థానాల్లో సుమారు సగం సెగ్మెంట్ల పరిధిలో విజయావకాశాలను శాసించగల సత్తా ఉన్నవారే కావడం గమనార్హం. 
2013లో ఒక్క సీటులో మాత్రమే బీజేపీ గెలుపు
ఇక కర్ణాటక కోస్తా తీర ప్రాంతం బీజేపీకి నిద్రలేని రాత్రిళ్లు మిగిల్చింది. ఉడుపి జిల్లాలోని ఐదు సీట్లలో కేవలం ఒక్కటంటే ఒక్క స్థానాన్ని గెలుచుకున్న కమలనాథులు.. దక్షిణ జిల్లాలోని ఎనిమిది స్థానాల్లో ఖాతానే తెరవలేదు. కానీ సమీకరణాలు మారిపోయిన పరిస్థితుల్లో బీజేపీకి అత్యంత సానుకూల ప్రాంతం కోస్తా. కోస్తా ప్రాంతంలో ఉత్తర కర్ణాటక, ఉడుపి, చిక్ మంగళూరు జిల్లాల పరిధిలో 24 స్థానాలు ఉన్నాయి. మతతత్వ రాజకీయాల ప్రచారం బీజేపీకి లాభిస్తుందన్న మాట కూడా వినిపిస్తున్నది.
సెంట్రల్ కర్ణాటకలో 32 స్థానాలకు రెండు స్థానాల్లో బీజేపీ గెలుపు 
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని తుడిచి పెట్టేసిన రీజియన్ సెంట్రల్ కర్ణాటక. ఈ రీజియన్ పరిధిలోని 32 స్థానాల్లో కేవలం రెండే రెండు స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. తూంకూరు, దవణగిరె, చిత్రదుర్గ, షిమోగ జిల్లాల పరిధిలో తిరిగి పట్టు సాధించే లక్ష్యంతో బీజేపీ పని చేస్తూ మరింత విశ్వాసాన్ని ప్రోది చేసుకుని ముందుకెళుతున్నది. ఇక గత ఎన్నికల్లో 10 స్థానాల్లో గెలుపొందిన జేడీఎస్ ఈ దఫా విస్తరణ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. 2013లో షిమోగా నుంచి 3.5 లక్షల ఓట్లకు పైగా ఆధిక్యతతో విజయం సాధించిన బీఎస్ యెడ్యూరప్ప ఈ దఫా కర్ణాటక సీఎం అభ్యర్థిగా బీజేపీ ఎన్నికల ప్రచారానికి సారథ్యం వహిస్తున్నారు. 
లింగాయత్‌లకు మైనారిటీ హోదా జిమ్మిక్కని బీజేపీ ప్రచారం 
లింగాయత్ సామాజిక వర్గం ఆధిపత్యం గల రీజియన్ ‘ముంబై- కర్ణాటక'. లింగాయత్ సామాజిక వర్గానికి మైనారిటీ మత హోదా కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ‘ఎన్నికల జిమ్మిక్కు' అని ప్రచారం చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ ప్రచారంతోనే ముంబై - కర్ణాటక రీజియన్‌లో అధికార కాంగ్రెస్ పార్టీపై పట్టు సాధించాలని కమలనాథులు వ్యూహాలు రూపొందించారు. లింగాయత్ సామాజిక వర్గ నాయకుడైన బీఎస్ యెడ్యూరప్ప.. తమ సామాజిక వర్గం ఓటు బ్యాంకు బలంతో సొంతంగా ఏర్పాటు చేసిన కర్ణాటక జనతా పక్ష పార్టీతో 2013లో బీజేపీని 40 స్థానాలను పరిమితం చేయ గలిగారు. తర్వాత కర్ణాటక జనతా పక్ష పార్టీని బీజేపీలో విలీనం చేశారు. 
ప్రధాని మోదీ ప్రచారానికి బీజేపీ వ్యూహం ఇలా
బీజేపీకి సంప్రదాయంగా పెట్టని కోటగా ఉన్న రాష్ట్ర రాజధాని బెంగళూరు. 2013లో బెంగళూరు రీజియన్ పరిధిలోని 28 స్థానాల్లో 17 చోట్ల బీజేపీ గెలుపొందింది. అంతకుముందు 2008లో అత్యధిక స్థానాలను బీజేపీ గెలుచుకున్నది. తర్వాత 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి అత్యధికంగా ఓట్ల వర్షం కురిపించిందీ బెంగళూరు రీజియన్ అంటే అతిశయోక్తి కాదు. ఈ ప్రాంతంలో రెండు వారాల పాటు ప్రధాని నరేంద్రమోదీ ప్రచారం చేసేందుకు వ్యూహ రచన చేశారు. అత్యధికంగా మోదీ ప్రభావంతో ఓట్లు, సీట్లు కొల్లగొట్టాలని కల కంటున్నారు కమలనాథులు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా అభివ్రుద్ధి నినాదంతో ఉన్నత కులాలు, మైనారిటీల ఓట్లతో సీట్లు సమకూర్చుకోవాలని ఆశిస్తోంది. 

కుమార ‘సైంధవ’పాత్ర: కన్నడ నేలపై కమలానికే సపోర్ట్

బెంగళూరు: దేశమంతా కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రతిపక్ష పార్టీలు ఏకమవుతుంటే మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన కుమారుడు కుమారస్వామి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు బీజేపీతో చేతులు కలిపేందుకు సిద్ధమని జేడీ (ఎస్) కర్ణాటక రాష్ట్ర శాఖ అధ్యక్షుడు హెచ్ డీ కుమారస్వామి సంకేతాలిచ్చారు. ఒకవేళ హంగ్ అసెంబ్లీ ఏర్పడితే బీజేపీకే మద్దతునిస్తామని పేర్కొన్నారు. వారం క్రితం జరిగిన రాజ్యసభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఒక సీనియర్ మంత్రితోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సాంకేతిక లోపాలతో రెండోసారి ఓటేసేందుకు అనుమతించడంపై కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమని దేవెగౌడ వ్యంగ్యం
తాను బీజేపీతో కలిసి పని చేస్తే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా తుడిచిపెట్టుకుపోతుందని సీఎం సిద్దరామయ్యను కుమారస్వామి హెచ్చరించారు. కర్ణాటక అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. బీజేపీకి బీ టీంగా జనతాదళ్ (ఎస్) మారిందని ఆరోపించారు. దీనికి ప్రతిగా జేడీఎస్ అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ వ్యంగ్యాస్త్రం సంధించారు. ముందు తమకు కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు ఇస్తుందో చెబితే, తామెన్ని సీట్లు ఇస్తామో తర్వాత చెబుతామనడంతోనే దేవెగౌడ మనోగతం అర్థమవుతూనే ఉంది. 

కింగ్ మేకర్ పాత్ర కోసం కుమారస్వామి ఇలా తహతహ
ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని జేడీఎస్ చేసిన అభ్యర్థనను సీఎం సిద్దరామయ్య వెటకారం చేయడం మాజీ సీఎం కుమారస్వామి ఆగ్రహానికి కారణమైంది. తనకు, తన జేడీఎస్‌కు కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి పాత్ర లేదని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు ఉన్నదని కుమారస్వామి మండిపడ్డారు. ఒకవేళ ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడితే కింగ్ మేకర్ పాత్ర పోషించాలని జేడీఎస్ తహతహలాడుతోంది. 

రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు కోరిన కుమారస్వామి
ఎన్నికల తర్వాత పరిస్థితిని బట్టి కాంగ్రెస్ పార్టీతో గానీ, బీజేపీతో కలిసి పని చేసేందుకు సిద్ధమని జేడీఎస్ సంకేతాలిచ్చింది. రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి బీఎం ఫరూక్‌కు మద్దతు ఇవ్వాలని, అందుకు ప్రతిగా అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతునిస్తామని ప్రతిపాదించామని మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి గుర్తు చేశారు. గతేడాది జరిగిన గుండ్లుపేట, నంజన్‌గుడ్ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లోనూ, 2015లో బీబీఎంపీ కౌన్సిల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన సంగతి గుర్తు చేశారు. 
రాహుల్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన కుమారస్వామి 
అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడితే 2018 ఎన్నికల ఫలితాల తర్వాత జేడీఎస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ కలిసి పని చేయాల్సి ఉంటుందని అన్నారు. బీజేపీకి జేడీఎస్ బీ టీమ్‌గా వ్యవహరిస్తున్నదన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కుమారస్వామి తిప్పికొట్టారు. ప్రస్తుతం కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే.. జేడీఎస్‌కు బీ టీం అని ఎద్దేవా చేశారు. సిద్దరామయ్య పూర్వాశ్రమంలో జనతాదళ్ సెక్యులర్ పార్టీలో కీలక పాత్ర పోషించారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుకున్నారు. 
2006 - 08 మధ్య బీజేపీతో కలిసి 20:20 నిష్పత్తిలో పొత్తు 
2004 నుంచి జేడీఎస్, కాంగ్రెస్ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం నడిపాయి. కానీ 2006లో కాంగ్రెస్ పార్టీతో స్నేహానికి చెల్లుచీటి ఇచ్చింది జేడీఎస్. బీజేపీతో కలిసి 20:20 నిష్పత్తి ప్రకారం అధికారం పంచుకునేందుకు సిద్ధమైంది. తొలుత 20 నెలల పాటు జేడీఎస్ అధికారాన్ని అనుభవించింది. తర్వాత బీఎస్ యెడ్యూరప్ప సారథ్యంలో ఏర్పాటైన ప్రభుత్వానికి మద్దతునిచ్చేందుకు కుమారస్వామి నిరాకరించడంతో కొద్దికాలం రాష్ట్రపతి పాలన విధించారు. తిరిగి 2008 ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరిగాయి. 
ఏడు రాష్ట్రాల నుంచి 280 మంది బీజేపీ నేతల ప్రచారం
గతేడాది ప్రారంభంలో జరిగిన ఉత్తరప్రదేశ్, చివరిలో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్నే వచ్చేనెలలో జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ అనుసరించాలని కమలనాథులు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కర్ణాటకలో గెలుపొందడానికి ఏడు రాష్ట్రాల నుంచి సుమారు 280 మంది సీనియర్, చురుకైన నేతలను ప్రచార బరిలోకి దించింది బీజేపీ. వీరిలో ఒక్కొక్కరు ఒక్కో అసెంబ్లీ స్థానంలో ప్రచార వ్యూహాన్ని పర్యవేక్షిస్తారు. అలాగే పోలింగ్ బూత్ కమిటీల పనితీరును ఆరుగురు సభ్యుల టీం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటుంది. 
వచ్చేనెల 10 లోగా ఓటర్ల మనోగతంపై నివేదికకు అమిత్ షా ఆదేశం
మహారాష్ట్ర నుంచి 25 శాతం మంది నాయకులు రంగంలోకి దిగితే.. గోవా, గుజరాత్, బీహార్, ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణ రాష్ట్రాల నేతలు కూడా కన్నడ నేలపై బీజేపీ ప్రచార బరిలో భాగస్వాములయ్యారు. అంతటితో ఆగలేదు కమలనాథుల వ్యూహం. వచ్చేనెల 10 నాటికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో దాదాపు ప్రతి ఓటరుకు సంబంధించిన సమాచారంపై సవివరమైన నివేదిక తనకు సమర్పించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. 
పార్టీ పునాది పెంపుపైనే బీజేపీ ఫోకస్ 
కొల్హాపూర్ జిల్లా పరిషత్ సభ్యుడు ప్రసాద్ ఖొబారె మాట్లాడుతూ తన టీం హవేరీ జిల్లాలోని హనగల్ అసెంబ్లీ స్థాన పరిధిలో 60 శాతం ఓటర్ల వివరాలను సేకరించిందని తెలిపారు. తాను బూత్ స్థాయి కమిటీల పనితీరును పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలోని ఇంటింటి పరిస్థితిపై సమాచారం సేకరించామన్నారు. ఇక ఆయా ప్రాంతాల్లో ప్రముఖుల ఫోన్ నంబర్లు కూడా సేకరించినట్లు తెలిపారు. సామాన్యులతో అనుబంధం పెంచుకునేందుకు... తద్వారా తమ పార్టీ పునాది బలోపేతం చేసేందుకు పని చేస్తున్నట్లు ఖొబారె తెలిపారు. 

27.2.18

సెల్యూలాయిడ్ జీవితమే సందేహస్పదం

సావిత్రి నుంచి శ్రీదేవి వరకు అందరిదీ అదే బాట?
ముంబై: బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు యావత్ భారతావనిలోని అభిమానులు తమ అఖిల భారత అభిమాన కథా నాయిక శ్రీదేవి మరణంతో శోక సముద్రంలో మునిగిపోయారు. ఆమె పార్ధివ దేహం రాక కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న వేళ.. అందరి మనస్సులు చూరగొన్న అతిలోక సుందరి మరణం వెనుక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మేనల్లుడి పెళ్లి కోసమని దుబాయ్ వెళ్లిన శ్రీదేవి అక్కడే మృతి చెందింది. ఆమె మరణానికి కారణాలేమైనా.. ఆమె భర్త బోనీ కపూర్‌ను దుబాయి పోలీసులు మూడున్నర గంటల పాటు విచారించడంతోపాటు అంతా కొలిక్కి వచ్చే వరకు దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశించినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి శ్రీదేవి కూడా మిగతా సినీ నటీమణుల జాబితాలోనే చేరిపోయారా? కుట్ర కోణం నుంచి సినీ నటీమణులు తప్పించుకోలేరా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 
శ్రీదేవి మరణంపై రకరకాల సందేహాలు ఇలా 
54 ఏళ్ల వయస్సు అంటే మరీ అంత పెద్ద వయస్సేం కాకపోవడంతో అనుమానాలు బలపడుతున్నాయి. కార్డియాక్ అరెస్ట్‌తో మరణించారని తొలి కబురు. తర్వాత ప్రమాదవశాత్తు బాత్ టబ్‌లో పడి మరణించారని ఆల్కహాల్ సేవించారని పోస్ట్ మార్టం నివేదిక వచ్చింది. దీనిపై టీవీ చానెళ్లు, సోషల్ మీడియాలోనూ అడ్డూ అదుపూ లేని చర్చ జరుగుతోంది. శ్రీదేవి మాదిరిగానే దక్షిణ భారత సినీ నటీమణులు పలువురు అనుమానాస్పదంగా, యుక్త వయస్కులుగా ఉండగానే మరణించారు. అలనాటి మహా నటి సావ్రితి 47 ఏళ్లకే మరణిస్తే.. 14 ఏళ్ల క్రితం చనిపోయిన సౌందర్య వయస్సు 34 ఏళ్లే మరి. వీరంతా సినీ రంగంలో తమ ప్రొఫెషన్ పట్ల అంకిత భావంతో పని చేసిన వారే. 
సంసారం సినిమాతో ఇలా సావిత్రి తెరంగ్రేటం 
‘సంసారం' సినిమాతో సెల్యూలాయిడ్‌పై వెలుగు వెలిగిన సావిత్రి తర్వాత పలు తెలుగు సినిమాల్లో ఆదర్శప్రాయమైన పాత్రలు పోషించారు. పురాణ గాథల నుంచి సామాజిక అంశాలే నేపథ్యంగా నిర్మించిన సినిమాల్లో నటించారు. తొలిసారి ‘పెళ్లి చేసి చూడు' సినిమాలో ఆమె లీడ్ పాత్ర పోషించారు. దక్షిణాది తారలు అక్కినేని నాగేశ్వర్ రావు, ఎన్టీఆర్, జెమినీ గణేశన్ తదితర ప్రముఖ కథా నాయకులతో పలు సినిమాల్లో నటించారు. తర్వాతీ దశలో జెమినీ గణేశన్‌ను వివాహం చేసుకున్నారు. కారణాలేమైనా జెమినీ గణేశన్‌తో వైవాహిక జీవితంతో అంతా బాగాలేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో తాగుడుకు బానిసై.. చివరి దశలో ఆరోగ్య సమస్యలతో గుర్తించని పరిస్థితి నెలకొంది. దక్షిణాది సినీ రంగాన్ని ‘మహారాణి'గా ఏలిన సావిత్రి.. చివరకు దురదృష్టకరమైన రీతిలో కన్నుమూయడం విషాదమే. 
బెంగళూరు నుంచి కరీంనగర్ వెళ్తుండగా విమాన ప్రమాదంలో డెత్ 
నాలుగు దక్షిణ భారతీయ భాషల్లో నటించిన ప్రముఖ సినీ కథా నాయిక సౌందర్య. అత్యధికంగా తెలుగు భాషలో నిర్మించిన సినిమాల్లో నటించారు. 1990వ దశకంలో అత్యుత్తమమైన సినీ కథా నాయికల్లో ఆమె వరకు. 1992లో కన్నడ చిత్రం గంధర్వ చిత్రంలో సినీ రంగ ప్రవేశం చేశారు. వెంకటేశ్, చిరంజీవి, నాగార్జున, రజనీకాంత్‌లతో తెలుగు, తమిళ భాషల్లో నటించారు. 2004 ఎన్నికల్లో బీజేపీ తరఫున కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావుకు మద్దతుగా ప్రచారం చేసేందుకు బెంగళూరు నుంచి కరీంనగర్ వస్తుండగా విమాన ప్రమాదంలో మరణించారు. 
టాలీవుడ్, బాలీవుడ్‌లను ఊపు ఊపేసిన దివ్యభారతి 
అంతకుముందు శ్రీదేవిలాగే 16 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా దివ్యభారతి మారింది. ఆమెలాగే మంచి అందగత్తె. అనతికాలంలోనే టాలీవుడ్, బాలీవుడ్‌లను ఊపేసింది. కానీ 19 ఏళ్ల వయసులోనే మరణించింది. 1990లో వెంకటేశ్ నటించిన బొబ్బిలి రాజా సినిమాతో తెరంగేట్రం చేసిన ఆమె.. మూడేళ్లే సినిమా ఇండస్ట్రీలో ఉన్నా.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. తెలుగులో ఆమె నటించిన బొబ్బిలి రాజాతోపాటు అసెంబ్లీ రౌడీ, రౌడీ అల్లుడు, ధర్మక్షేత్రంలాంటి సినిమాలన్నీ హిట్టే. హిందీలోనూ షోలా ఔర్ షబ్నమ్, దీవానా, విశ్వాత్మలాంటి హిట్ సినిమాలు ఉన్నాయి. తెలుగులో తొలిముద్దు సినిమా చేస్తున్నపుడే ఆమె చనిపోయింది. దీంతో ఈ మూవీలో కొంత భాగాన్ని అప్పట్లో ఆమెలాగే ఉండే రంభతో పూర్తి చేశారు. 1993, ఏప్రిల్5న ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో ఐదో అంతస్తు నుంచి కింద పడి మృతి చెందింది. మద్యం మత్తులో బాల్కనీ నుంచి కింద పడిందని, ఎవరో తోసేశారని, ఆత్మహత్య చేసుకుందని.. ఇలా రకరకాల వార్తలు వచ్చాయి. ఆమె ఎలా కింద పడిపోయిందన్నది మాత్రం తేలనేలేదు. పోస్టుమార్టమ్ రిపోర్ట్ మాత్రం ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయినట్లు స్పష్టంచేసింది. దీనిపై విచారణ చేపట్టిన ముంబై పోలీసులు 1996లో కేసును మూసేశారు. ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా వాళ్లు తేల్చేశారు. 
తక్కువ కాలంలోనే 450కి పైగా సినిమాల్లో నటన 
1980వ దశకంలో ధైర్య సాహసవంతమైన సినీ నటి సిల్క్ స్మిత. ప్రజల హ్రుదయాల్లో గూడుగట్టుకున్న సినీ నటి అంటే అతి శయోక్తి కాదు. విజయలక్ష్మి అంటే ఆమె బంధువులు, సన్నిహితులకు తెలుసు. 1960 - 1996 వరకు సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన కథా నాయిక సిల్క్ స్మిత. 1979లో తమిళ మూవీ ‘వండిచక్కారం' సినిమాలో ‘సిల్క్' పాత్ర పోషించడంలో ఫేమ్ అయ్యారు.. ప్రజల ద్రుష్టిని ఆకర్షించారు. అతి తక్కువ కాలంలో పేరు సంపాదించుకున్పారు. హిందీ. తెలుగు, తమిళ భాషల్లో 450కి పైగా భాషల్లో నటించారు. తెలుగు సినీ రంగంలో ఆమె పేరు ప్రసిద్ది చెందిన వ్యక్తిగత జీవితం ఒడిదొడుకుల మయం. ఆమె మరనం ఇప్పటికీ మిస్టరీ అని చెబుతారు. జీవితంలో వరుస వైఫల్యాలు ఎదురవుతుండటంతో బలవన్మరణానికి పాల్పడ్డారని సన్నిహితులు అంటారు. 
2010లో ముంబైలో ఇలా వివేకా బాబాజీ ఆత్మహత్య 
బ్రిటిష్ అమెరికా సంతతి యువతి జియాఖాన్ (1988 - 2013) న్యూయార్క్‌లో జన్మించినా.. బాలీవుడ్ లో 2007లో ‘నిషాద్' సినిమాలో రంగ ప్రవేశం చేశారు. అదీనూ అమితాబ్ బచ్చన్ సరసన నటించారు. అదే సినిమాకు ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకున్నారు. పలు ప్రాంతీయ భాషా చిత్రాల్లో నటించిన జియాఖాన్ అకస్మిక మరణానికి గురి కావడానికి గగనాన తిరుగాడే మేఘాల మాదిరే అయ్యింది. దీనికి ఆమె స్నేహితు సూరజ్ పంచోలీకి ఏదో సంబంధం ఉన్నదని వినికిడి. మిస్ మారిషస్ టైటిల్ అందుకున్న వివేకా బాబాజీ 2002లో ‘యెహ్ కైసీ మొహబ్బత్ హై' సినిమాలో దీక్ష, కృష్ణ సరసన నటించారు. అంతగా ఆడకపోవడంతో బాక్సాఫీసు వద్ద ఆమెను గుర్తించే వారు లేకుండా పోయారు. 1990ల్లో వాణిజ్య ప్రకటనల ద్వారా అందరికీ తెలిసారు. 1994లో మనీలా ఫిల్మ్ ఫెస్టివల్ కుంభకోణంలో ఆమె ప్రధాన సూత్రధారి అని అనుమానాలు ఉన్నాయి. 2010లో ముంబైలోని బంద్రాలోని తన అపార్ట్‌మెంట్‌లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మ చేసుకోవడం ఫ్యాషన్ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. 
జయలలిత మరణం వెనుక ఇలా అనుమాన మేఘాలు
పురుచ్చితలైవి అంటే జయలలిత తెలియని వారు లేరు. 2016 డిసెంబర్ ఐదో తేదీన అనారోగ్యంతో మరణించిన ‘అమ్మ'గా తమిళులందరికీ ఎంతో ఇష్టమైన అభిమాన నాయకురాలు. ఎంజీఆర్, శోభన్ బాబు తదితరులతో నటించిన జయలలిత.. తర్వాత ఎంజీఆర్ పిలుపు మేరకు అన్నాడీఎంకేలో చేరారు. ఆయన మరణించే నాటికి రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. కానీ ఆమె వ్యతిరేకులు జానకీ రామచంద్రన్‌ను తెర మీదకు తెచ్చారు. కానీ రాజకీయాలు తెలియని జానకీ రామచంద్రన్ వెనుకబడిపోయారు. నాటి నుంచి 2016లో మరణించే నాటి వరకు జయలలిత తమిళనాట ప్రధాన పాత్ర పోషించారు. కానీ చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి మరణించే వరకు రకరకాల సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఆమె స్థానే అధికార దండాన్ని చేపట్టాలని కలలు కన్న చిన్నమ్మ ‘శశికళ' జైలు పాలైన తర్వాత జయలలిత మరణంపై విచారణకు ఆదేశించారు.

16.2.18

ముళ్ల నిచ్చెనపై మాణిక్‌ ‘సర్కార్’: కాషాయానికే త్రిపుర ఓటు?

అగర్తల: త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో ఏళ్ల తరబడి పోటీ చేస్తున్న బీజేపీ ఒక్క సీటు కూడా గెలుచుకోవడం కాదుగా కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేదు. కానీ రెండున్నరేళ్ల గడువులోపే తాజాగా ఆదివారం పోలింగ్ జరిగే త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార సీపీఎంకు బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా సవాల్ విసురుతోంది. 2013 ఎన్నికల్లో కేవలం 1.53 శాతం ఓట్లు పొందిన బీజేపీకి ఆ లెక్క ప్రకారం సవాల్ కు అవకాశమే లేదు. అధికార సీపీఎం సారధ్యంలోని లెఫ్ట్ ఫ్రంట్ 48.11 శాతం ఓట్లు పొంది గట్టిగా ఉన్నదన్న సంకేతాలిస్తున్నా.. ఇప్పుడది సందేహస్పదంగా కనిపిస్తున్నట్లు తాజా పరిణామాలు చెబుతున్నాయి. దీనికి ఆరెస్సెస్ ప్రచారక్ సునీల్ డియోధర్ కృషే ప్రధానమనే వాదన వినిపిస్తున్నది. సునీల్ డియోధర్ తెర వెనుక ప్రచారంతో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో మాణిక్ సర్కార్ సారథ్యంలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వానికి బీజేపీ.. నువ్వా? నేనా? అన్నట్లు సవాల్ విసురుతోంది. 

దాదాపు 30 ఏళ్ల తర్వాత తొలిసారి సీపీఎం సారథ్యంలోని లెఫ్ట్ ఫ్రంట్ తన కంచుకోటలోనే ముఖాముఖీ పోటీని ఎదుర్కొంటున్నది. రెండున్నరేళ్ల క్రితం మహారాష్ట్రలో సీపీఎం ఏకైక స్థానాన్ని గెలుచుకోవడంలో సునీల్ డియోధర్ కృషిని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా గుర్తించి.. త్రిపురలో ఇన్ చార్జీగా నియమించారా? అన్న అభిప్రాయం వినిపిస్తున్నది. మేఘాలయలో నివసిస్తున్న సునీల్ డియోధర్.. 2014 లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ పోటీ చేసిన వారణాసికి ఇన్ చార్జీగా వ్యవహరించారు. అంతకుముందు 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో దాహోద్ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ బలాబలాలు 5:1గా ఉంటే దాన్ని సమబలంగా మార్చడంలో సునీల్ డియోధర్ కీలకంగా వ్యవహరించారు. 

పది స్థానాలకు ఎనిమిది చోట్ల బీజేపీ విజయం 

వీటికి ముందుగా 2013లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దక్షిణ ఢిల్లీ ప్రాంత ఇన్ చార్జీగా వ్యవహరించిన సునీల్ డియోధర్ 10 అసెంబ్లీ స్థానాలకు ఏడు బీజేపీ ఖాతాలో పడటంలో కీలకంగా వ్యవహరించారు. అప్పటి వరకు బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టిలో ఆయన ఊసే లేదు. కానీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కొనసాగింపుగా 2014లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార వ్యూహం బాధ్యత ఆయనపైనే పడింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన విడివిడిగా పోటీ చేశాయి. ఈ నేపథ్యంలో 32 అసెంబ్లీ స్థానాలకు ఇన్ చార్జీగా వ్యవహరించిన సునీల్ డియోధర్.. ప్రత్యేకించి సీపీఎం ప్రాతినిధ్యం వహించిన పాల్ఘార్ స్థానంలో ఆ పార్టీని ఓడించడంలో కీలకంగా వ్యవహరించడమే ఆయనను త్రిపురకు బీజేపీ డిప్యూట్ చేయడానికి దారి తీసింది. రెండున్నరేళ్ల క్రితమే త్రిపురలో తిష్ట వేసి సునీల్ డియోధర్ కొద్ది మంది గల పార్టీ, ఆరెస్సెస్ కార్యకర్తలతో కలిసి ప్రచార వ్యూహం రూపొందించారు. అందుకు తీవ్రంగా శ్రమించారు. పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు తనును కలిసి బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పునాది ఏర్పాటు చేసుకున్న బీజేపీ.. ఆరు నెలలుగా సీపీఎంలో అసమ్మతి వాదులను చేరదీస్తూ వచ్చింది. 

10 ఎస్సీ స్థానాల్లో 8చోట్ల బీజేపీ విజయ సంకేతాలు?

'త్రిపురలో ఓబీసీల జనాభా 35 శాతం. సునీల్ డియోధర్ ఈ దఫా ఓబీసీలెవ్వరూ సీపీఎంకు ఓటేయరని ఘంటాపథంగా చెబుతున్నారు. దళితులకు రిజర్వు చేసిన 10 స్థానాల్లో ఎనిమిది చోట్ల గెలుస్తామని ఆయన చెప్పారు. గిరిజనులకు పట్టు గల 20 స్థానాల్లో బీజేపీ పట్ల ఆగ్రహం ఉన్నా.. అక్కడ ఇద్దరు పార్టీ ఉపాధ్యక్షులు, నలుగురు కోర్ కమిటీ సభ్యులు పని చేస్తున్నారని చెప్పారు. గతేడాది ఆగస్టులో బీజేపీలో చేరిన విపక్ష నేత దీబా చంద్ర హ్రంగ్ఖావాల్.. గిరిజనుల సమస్యలపై పోరాటం ప్రారంభించడంతో అధికార సీపీఎంలో కదలికలు మొదలయ్యాయి. 

బీజేపీ విస్తరణపై సీపీఎంలో ఆందోళన 

'కేవలం 18 నెలల్లో ప్రతి నియోజకవర్గంలో ఒక ప్రచారకర్తను నియమించడంతో తొలిసారి బీజేపీ విస్తరిస్తున్నార‌న్న సంగతిని సీపీఎం గుర్తించింది. దీనికి చంద్రమోహన్ అనే విస్తారక్ హత్యకు గురి కావడమే దీనికి నిదర్శనం. ఈ హత్య తర్వాత అన్ని స్థానాల పరిదిలో చంద్రమోహన్ అస్తికలతో చేపట్టిన శాంతియాత్ర ప్రజలను ఆకర్షించిద'ని సునీల్ డియోధర్ చెబుతారు. ప్రజలంతా సీపీఎం పట్ల ఆగ్రహావేశాలతో ఉన్నారని పేర్కొన్నారు. చంద్రమోహన్ అనే విస్తారక్ హత్యకు వ్యతిరేకంగా 62 చోట్ల నిర్వహించిన జైలుభరోలో 42 వేల మంది పాల్గొన్నారు. గతంలో ఏ ప్రతిపక్ష పార్టీ ఈ సాహసం చేయలేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. 

సోషల్ మీడియాకు దూరమే సీపీఎంకు ఇలా నష్టం 

మోదీ టీ - షర్టులు ధరించిన యువత ప్రతిరోజూ ఉదయం ఆరు గంటల నుంచి అగర్తల నుంచి ధర్మనగర్ కు వెళ్లే రైలులో పుస్తకాలతో ప్రచారం చేపట్టామని,. బంగ్లా, కోర్బోరోక్ భాషల్లో వాటిని ముద్రించి రైలులో పంపిణీ చేశామని బీజేపీ నేతలు చెబుతున్నారు. గ్రామాల్లో ప్రజలతో మాట్లాడేందుకు ఇబ్బందికర పరిస్థితులు ఉండేవన్నారు. కానీ రైళ్లలో స్వేచ్చగా ప్రచారం చేయడంతో సీపీఎం పట్ల వ్యతిరేకత ఉన్నదని అర్థమవుతున్నదని బీజేపీ చెబుతోంది. సోషల్ మీడియా మద్దతుతో ఏర్పాటు చేసిన వార్ రూమ్.. తర్వాత కాల్ సెంటర్.. ప్రజలకు చేరువ కావడానికి మార్గం చూపాయి. ఆన్ లైన్ పార్టీ సభ్యత్వ అవకాశం కల్పించడంతో ప్రస్తుతం త్రిపురలో బీజేపీకి నాలుగు లక్షల మంది సభ్యులు ఉండటం ఆసక్తి కర పరిణామం. 2009లో బీజేపీ సభ్యుల సంఖ్య కేవలం 10 వేలు మాత్రమే. సీపీఎంకు సోషల్ మీడియాలో చోటు లేకపోవడం తమకు అనుకూలించిందని బీజేపీ శ్రేణులు చెబుతున్నారు. 

బీజేపీ ఇలా ‘చలో పల్టాయి’ నినాదం 

మూడేళ్లలో 15 రోజుల కోసారి మొత్తం 52 మంది కేంద్ర మంత్రులు త్రిపురలో పర్యటించారు. మారుమూల ప్రాంతాలకు దూసుకెళ్లి సమస్యలను తెలుసుకోవడంతో పరిస్థితుల్లో మార్పులు వచ్చాయని సునీల్ డియోధర్ చెబుతున్నారు. దీనికి అనుగుణంగానే ‘చలో పల్టాయి' నినాదం ఇవ్వడం మరింత ఊపునిచ్చిందంటారు. ‘పేదలు మరణిస్తారు. సీఎం హెలికాప్టర్ లో ప్రయాణిస్తారు' అన్న నినాదం ప్రజల్లోకి చొచ్చుకెళ్లిందని చెబుతారు. గండచెరలో మలేరియాతో 100 మంది బాలలు మరణించడంపై బీజేపీ చేసిన ప్రచారం సీపీఎంకు ప్రతికూలంగా మారింది. 20 ఏళ్ల తర్వాత తాము చేసే ప్రచారంతో సీఎం గతేడాది ఏప్రిల్ లో సీఎం మాణిక్ సర్కార్ రైలులో ప్రయాణం చేశారని బీజేపీ నాయకులు అంటున్నారు.

గిరిజన ప్రాంతాలకు సీపీఎం ఇలా దూరం 
2008, 2013ల్లోనూ త్రిపుర ప్రజలు మార్పు కోసం సిద్ద పడినా.. కాంగ్రెస్ నాయకులు గట్టిగా పోటీనివ్వకపోవడానికి కారణం కాంగ్రెస్ హై కమాండ్ నుంచి మద్దతు లేదన్న విమర్శ ఉంది. దీనికి లెఫ్ట్ పట్ల కాంగ్రెస్ సానుకూల వైఖరే కారణమన్న విమర్శ ఉంది. దీంతో కాంగ్రెస్ త్రిపుర నేతల్లో పట్టుదల పెరిగింది. 2013 ఎన్నికల వేళ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చివరి క్షణంలో పర్యటన రద్దు చేసుకున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి సీపీఎం గిరిజనులతో కలిసి పని చేసింది. కానీ ఏళ్ల విరామం తర్వాత కొండ ప్రాంతాల్లో సీపీఎంకు, ఇతర సంస్థలకు మధ్య దూరం పెరిగింది. ఇది ఐపీఎప్టీ వంటి సంస్థల ఏర్పాటుకు దారి తీసిందని బీజేపీ వాదిస్తోంది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 33 వేల ఓట్లతో 20 స్థానాల్లో ఓటమి పాలైంది. అదీ 65 ఓట్ల నుంచి రెండువేల ఓట్ల తేడాతో కాంగ్రెస్ పార్టీ ఆ సీట్లలో ఓటమి పాలైంది. 

ఇలా మోదీ జన్ ధన్ యోజనకు ప్రజాదరణ 

ప్రజలు మార్పు కోసం సిద్ధమైనా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదన్న అనుమానం ప్రజల్లో పెరిగింది. ఇదే పరిస్థితి ఇప్పటికీ ఉన్నదని బీజేపీ నేతలు అంటున్నారు. దశల వారీగా బీజేపీ త్రిపురలో ప్రయాణం సాగిస్తున్నది. రాష్ట్ర జనాభాలో 67 శాతం మంది బీపీఎల్ వారే. వారిలో 20 శాతం మందికి ఇప్పటికీ కార్డులు లేవు. సీపీఎంతో అనుబంధం గల వారికి మాత్రమే రేషన్ కార్డులు ఉన్నాయి. దీంతో ప్రధాని మోదీ ప్రారంభించిన జన్ ధన్ యోజనకు త్రిపురలో మంచి స్పందన వచ్చిందని సునీల్ డియోధర్ చెప్తారు. ఒకవైపు మాణిక్ సర్కార్ ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకతకు తోడు మరోవైపు కేంద్రం విధానాలపై ప్రచారం స్పీడ్ పెంచడంతో పరిస్థితిలో మార్పు వచ్చిందన్నారు. 

నృపేన్ చక్రవర్తిపై అభిమానం పెంచుకున్న సునీల్ డియోధర్ 

ఐపీఎఫ్టీతో కలిసి పోటీ చేసినా.. ట్విప్రాలాండ్ కోసం పోరాడుతున్నఆ సంస్థ వైఖరితో బీజేపీ ఏకీభవించడం లేదన్నారు. ఆరో షెడ్యూల్‌కు సవరణ ద్వారా కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామని త్రిపుర వాసులకు బీజేపీ హామీ గుప్పిస్తోంది. మాణిక్ సర్కార్ పేద సీఎం అని మీడియాలో వార్తలొచ్చాయని, కానీ ఆయన నెలవారీ విమాన ప్రయాణ ఖర్చులే రూ.10 కోట్లు ఉంటుందని చెప్పారు. కానీ త్రిపురలో పేద సీఎం అంటే నృపేన్ చక్రవర్తి మాత్రమేనన్నారు. ఆయన సిద్దాంతాలతో విభేదించినా ఆయనంటే అభిమానం అని సునీల్ డియోధర్ తెలిపారు. నృపేన్ చక్రవర్తి మాత్రమే నిజమైన మార్క్సిస్టు అని, మాణిక్ సర్కార్ కేవలం షో మాత్రమే చేస్తున్నారని, ఆయన జీవన విధానం వేరు అని ఆరోపించారు. 

15.2.18

పీఎన్బీ చీటింగ్: సత్యం కంప్యూటర్స్’ను మించిన మాయ.. ఆర్బీఐ మొద్దు నిద్ర?

న్యూఢిల్లీ/ ముంబై: తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) శాఖలో వెలుగు చూసిన నయా మోసం భారతీయ బ్యాంకింగ్ రంగంలోనే.. ఆ మాటకు వస్తే.. భారత ఆర్థిక వ్యవస్థలోనే అతిపెద్ద కుంభకోణంగా మిగిలిపోనున్నది. 2009లో వెలుగులోకి వచ్చిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో రూ.9000 కోట్ల మేరకు మోసం జరిగినట్లు నాటి సత్యం కంప్యూటర్స్ సంస్థ అధినేత బైర్రాజు రామలింగరాజు బయటపెట్టారు. తర్వాత 2015లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) సహచర ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ)లోని ఢిల్లీ శాఖలో ఇద్దరు హస్తిన కేంద్రంగా వ్యాపార లావాదేవీలు జరిపిన వ్యాపార వేత్తలు జరిపిన మోసం విలువు అక్షరాల రూ.6000 కోట్లు. అప్పట్లో అది అమెరికా డాలర్లలో గణిస్తే బిలియన్ డాలర్ల కంటే తక్కువ. అప్పట్లోనే బ్యాంకింగ్‌లో పలు అవకతవకలు చోటుచేసుకుంటున్న అంశం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) దృష్టికి వచ్చింది. 2015లో బ్యాంక్ ఆఫ్ బరోడా న్యూఢిల్లీ అశోక్ విహార్ బ్రాంచ్‌లో చేటుచేసుకున్న రూ.6,100 కోట్ల దిగుమతుల చెల్లింపుల కుంభకోణంపై ఆర్బీఐ జరిపిన పరిశీలనలో తాజా అంశాలు వెలుగులోకి వచ్చాయి. అనుమానాస్పద లావాదేవీల రిపోర్టుల (ఎస్‌టీఆర్) ఫైలింగ్‌లు సమర్పించకపోవడం, సమర్పించినా తీవ్ర ఆలస్యం, నో యువర్ కస్టమర్ (కేవైసీ) మార్గదర్శకాలు పాటించకుండానే అకౌంట్ల ప్రారంభం వంటి ఎన్నో అంశాలు ఇందులో ఉన్నాయని ఆర్బీఐ తేల్చింది. 
యధాతథ స్థితిపై నివేదిక పంపాలని తాజాగా ఆర్బీఐ ఆదేశం 
2015లో బ్యాంక్ ఆఫ్ బరోడాలో మోసం ఉదంతం తరువాత అన్ని వాణిజ్య బ్యాంకుల చైర్మన్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లకు లేఖ రాసిన ఆర్‌బీఐ ప్రస్తుత విధానాలపై సమీక్ష జరపాలని ఆదేశించింది. ఎటువంటి అవకతవకలూ లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఆర్బీఐ సూచించింది. పీటీఐ ఫైల్ చేసిన ఒక ఆర్‌టీఐ ప్రశ్నకు సమాధానంగా అందిన ఆర్‌బీఐ లేఖ ప్రతి ద్వారా ఈ అంశాలు తెలిశాయి. వివిధ బ్యాంకులనుంచి అంతర్గత ఆడిట్ నివేదికలను తెప్పించుకునే ప్రక్రియ కొనసాగుతున్నట్లు కూడా ఆర్‌టీఐ దరఖాస్తుకు సమాధానంగా ఆర్‌బీఐ తెలిపింది.తాజాగా పీఎన్బీ కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత అన్ని బ్యాంకులను యధాతథ స్థితిపై నివేదికలను సాధ్యమైనంత త్వరగా సమర్పించాలని ఆర్బీఐ హుకుం జారీ చేసింది. కాకపోతే నీరవ్ మోదీ వంటి వారు కుటుంబ సమేతంగా దేశం విడిచి వెళ్లిపోయిన తర్వాత స్పందించడమే కొసమెరుపు. సత్యం కంప్యూటర్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా కుంభకోణాలతోపాటు కింగ్ ఫిషర్స్ ఎయిర్ లైన్స్ తదితర సంస్థల స్టాక్‌ల పతనం ఒకసారి పరిశీలిద్దాం. 

రెండు దశాబ్దాల్లోనే ఇంతింతై వటుడింతై అన్నట్లు.. 
కొత్త సహస్రాబ్ది తొలి దశకంలో ఓ వెలుగు వెలిగింది సత్యం కంప్యూటర్స్ సంస్థ. సంస్థ వ్యవస్థాపకుడు, అధినేత బైర్రాజు రామలింగరాజు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా యావత్‌ భారత ఐటి రంగానికే చుక్కానిగా ఒక వెలుగు వెలిగారు. నాడు అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌లో ఐటి విద్య అభ్యసించిన వారెవరైనా సత్యంలో ఉద్యోగం చేయాలని కలలు కనే వారు. అంతర్జాతీయ ఐటి దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కన్నా కూడా సత్యం కంప్యూటర్స్‌కే విలువ ఎక్కువ ఉండేదంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌ హైదరాబాద్‌ వచ్చినప్పుడు వేదికపై ఆయన సరసన రామలింగరాజు కూచోగలిగారన్నా అందుకు సత్యం కంప్యూటర్స్‌ ద్వారా ఆయన ఆర్జించిన పేరు ప్రతిష్ఠలే కారణం. అంతర్జాతీయ ఐటి చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక్క కంపెనీకి కూడా స్థానం లేని రోజుల్లో స్థాపించిన సత్యం కంప్యూటర్స్‌ రెండు దశాబ్దాల వ్యవధిలోనే ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఎదిగిపోయింది. 

మేటాస్ డీల్ ప్రకటించినప్పుడూ చెలరేగిన దుమారం 
2007 నాటికి 52 వేలకు పైబడిన ఉద్యోగులతో 12,600 కోట్ల రూపాయల (210 కోట్ల డాలర్లు) ఆదాయాలతో దేశంలో నాలుగో అతి పెద్ద ఐటి కంపెనీ అన్న హోదాను సత్యం కంప్యూటర్స్ దక్కించుకున్నది. 1992 మే 5న బొంబాయి స్టాక్‌ ఎక్స్ఛేంజీలో నమోదైంది. 1999లో నాస్‌డాక్‌లో, 2001లో న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలోకి ప్రవేశించింది.అసలు రామలింగరాజు లేని సత్యంను ఊహించనేలేమని ఆ సంస్థలో పని చేసిన ఉద్యోగులు చెబుతూ ఉండేవారు. 2008 చివరిలో ఆయన మేటాస్‌ డీల్‌ను ప్రకటించినప్పుడు చాలా దుమారం చెలరేగింది. అయినా ఆ సమయంలో సత్యం ఉద్యోగులు, ఆ సంస్థలో అధిక వాటాలున్న అబెర్డీన్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ప్రతినిధులు ఆయనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కానీ ఇన్ని ఘనతలు సాధించిన కంపెనీ నెల తిరక్కుండానే అదే వ్యక్తి చేతిలో మసకబారిపోయి చరిత్ర పుటల్లో కలిసిపోయింది. 
రాజు ప్రకటనతో నివ్వెరపోయిన ప్రపంచం 
2009 జనవరి ఏడో తేదీన రామలింగరాజు ఆశ్చర్యకరంగా తమ కంపెనీలో భారీ కుంభకోణం జరిగిందని షేర్‌హోల్డర్లకు, స్టాక్‌ ఎక్స్ఛేంజిలకు లేఖ రాయడంతో ప్రపంచం యావత్తు నివ్వెరపోయింది. ఉద్యోగులు, ఇన్వెస్టర్లు కూడా ఆయన నాయకత్వం పట్ల విశ్వాసం ప్రకటిస్తూ రామలింగరాజు లేని సత్యంను ఊహించనైనా లేమని తేల్చి చెప్పిన రెండు రోజుల వ్యవధిలోనే రామలింగరాజు ఆర్థిక వ్యవహారాల్లో తన ఘోర తప్పిదాల్ని అంగీకరిస్తూ సెబికి, స్టాక్‌ ఎక్స్ఛేంజిలకు పంపిన లేఖలో కంపెనీ వాస్తవ నగదు నిల్వ 321 కోట్లుండగా దాన్ని కొన్ని రెట్లు ఎక్కువ చేసి 5040 కోట్ల రూపాయలుగా చూపించామని, 376 కోట్ల మేరకు రాని వడ్డీ వచ్చినట్టుగాను చూపించామని, 1230 కోట్ల రూపాయల మేరకు అప్పుల్ని కప్పిపెట్టామన్న వాస్తవాన్ని బట్టబయలు చేశారు. ఇది కాకుండా షేర్లు తాకట్టు పెట్టి తీసుకువచ్చిన 1200 కోట్ల రూపాయలను కూడా కలిపితే తమ సంస్థలో జరిగిన అక్రమాల పరిమాణం ఏడు వేల కోట్ల రూపాయలకు పైబడే ఉన్నట్టు ఆయన తేల్చారు. ఈ లోటును పూడ్చేందుకు, తన తప్పిదాలు బయటకు పొక్కకుండా చూసేందుకు చివరి ప్రయత్నంగా మేటాస్‌ ఒప్పందాన్ని తెర పైకి తెచ్చానని, అది కూడా బెడిసికొట్టడంతో దిక్కుతోచని స్థితిలో ఈ ప్రకటన చేస్తున్నానని తెలిపారు. 
ఇలా సత్యం.. కింగ్ ఫిషర్స్ షేర్ పతనం
ఇలా సత్యం కుంభకోణం దేశంలో అతి పెద్ద కార్పొరేట్‌ కుంభకోణంగా చరిత్రపుటలకెక్కింది. నాడు సత్యం కంప్యూటర్స్ షేర్ రూ.542 నుంచి రూ.58కి పడిపోయిన తర్వాత ప్రభుత్వం ద్వారా టెక్ మహీంద్రా కొనుగోలు చేసి తనలో విలీనం చేసుకున్నది. ఇలా సత్యం కంప్యూటర్స్ చరిత్ర అంతర్జాతీయ ఐటీ రంగం నుంచి కనుమరుగైంది. మరోవైపు కింగ్ ఫిషర్స్ ఎయిర్ లైన్స్ యాజమాన్యం సిబ్బంది వేతనాలు చెల్లించక, బ్యాంకుల వద్ద తీసుకున్న రుణ బకాయిలు చెల్లించకుండా దాటేస్తూ మోసగించేందుకు పూనుకున్నది. ఈ క్రమంలో ప్రభుత్వ నియంత్రణ సంస్థలన్నీ ఆంక్షలు విధించాయి. చివరకు న్యాయస్థానాలు జోక్యం చేసుకున్నాయి కూడా. ఈ క్రమంలో కింగ్ ఫిషర్స్ షేర్ ట్రేడింగ్‌ను స్టాక్ మార్కెట్లు తాత్కాలికంగా నిలిపేసినప్పుడు దాని షేర్ విలువ రూపాయికి పడిపోయింది.  

కస్టమ్స్ డ్యూటీల ఎగవేత, అక్రమ చెల్లింపులతో ఇలా 
ఢిల్లీలోని అశోక్ విహార్‌లో గల బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో రూ. 6,000 వేల కోట్ల మనీ లాండరింగ్ కుంభకోణం వెలుగు చూసింది. బ్యాంకులోని 59 మంది కరెంట్‌ అకౌంట్‌ హోల్డర్లు, పలువురు బ్యాంకు ఉద్యోగులు కుమ్మక్కై విదేశాలకు అక్రమ చెల్లింపులు, కస్టమ్స్‌ డ్యూటీల ఎగవేతకు పాల్పడి సుమారు 6 వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని అభియోగాలు ఉన్నాయి. బ్యాంకు అధికారులే మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ లక్ష డాలర్ల లోపు మొత్తాలుగా విడగొట్టి వివిధ అకౌంట్లలో చెల్లించడం ద్వారా ఆటోమేటిక్‌ గుర్తింపు సాఫ్ట్‌వేర్‌ దృష్టి నుంచి తప్పించుకున్నారని సీబీఐ అందులో పేర్కొంది. 2014-15 మధ్య ఇలాంటి లావాదేవీలు సుమారు 8 వేల వరకు జరిగినట్లు సీబీఐ తెలిపింది. బ్యాంక్ ఆఫ్ బరోడా మనీ లాండరింగ్ కుంభకోణంలో మొత్తం 59 నకిలీ కంపెనీలకు భాగస్వామ్యం ఉన్నట్లు తేలింది. ఈ కుంభకోణంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా జరిగే లావాదేవీకి డాలరుకు 30- 50 పైసలు కమీషన్‌ తీసుకొని హెచ్ డీఎఫ్‌సీ ఉద్యోగి సాయం చేసినట్లు ఈడీ వెల్లడించింది. వీరిలో భాటియా నకిలీ కంపెనీలను సృష్టించడంలో కీలకమని, ధావన్‌ రెడీమేడ్‌ దుస్తుల ఎగుమతిదారని తెలిపింది. వీరు అగర్వాల్‌తో కలిసి అశోక్‌ విహార్‌లోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్‌ ద్వారా రూ. 430 కోట్ల విలువైన విదేశీ చెల్లింపులను అతితక్కువ కాలంలో మాయం చేసారని తెలిపింది. దీనికి తోడు ధావన్‌ 6-7 నెలల కాలంలో రూ. 15 కోట్ల కస్టమ్స్‌ డ్యూటీని డ్రా బ్యాక్‌ చేసినట్లు తెలిపింది. 
కరిగిపోయిన సంపదతో మదుపర్ల గగ్గోలు 
తాజాగా మరో ‘నయా మోసం' కుంభకోణంలో చిక్కుకున్న ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) షేర్ల పతనం కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు గురువారం పీఎన్‌బీ షేరు మరో 12 శాతం క్షీణించింది. బీఎస్‌ఈలో రూ. 128.35కి పడిపోయింది. స్కాం బైటపడిన బుధవారం నాడు షేరు సుమారు పది శాతం క్షీణించింది. దీంతో రెండు రోజుల వ్యవధిలోనే బ్యాంకు మార్కెట్‌ విలువ ఏకంగా రూ. 8,077 కోట్ల మేర కరిగిపోయింది. ఇది పీఎన్‌బీ వార్షిక లాభానికి ఆరు రెట్లు పైగా కావడం గమనార్హం. షేరు రెండు రోజుల పతనంతో గురువారం పీఎన్‌బీ మార్కెట్‌ విలువ రూ. 31,132 కోట్లకు పడిపోయింది. మరోవైపు, పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు కూడా క్షీణించాయి. గురువారం బీఎస్‌ఈలో 4.30 శాతం తగ్గి రూ. 1,199 వద్ద ముగిశాయి. పీఎన్‌బీ నుంచి పొందిన లెటర్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్‌ (ఎల్‌వోయూ)ని అడ్డం పెట్టుకుని బ్యాంకులను రూ. 11,400 కోట్ల మేర బిలియనీర్‌ నీరవ్‌ మోదీ బురిడీ కొట్టించిన సంగతి తెలిసిందే. స్కాం బైటపడిన బుధవారం షేర్లలో అమ్మకాలతో ప్రభుత్వ రంగ బ్యాంకుల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ దాదాపు రూ. 20,000 కోట్ల మేర క్షీణించింది.నీరవ్‌ మోదీతో లింకుల వల్ల గీతాంజలి జెమ్స్‌ సంస్థ షేర్లు కూడా భారీగా క్షీణిస్తున్నాయి. కుంభకోణం బైటపడిన తర్వాత గీతాంజలి జెమ్స్‌ షేర్లలో రెండు రోజులుగా అమ్మకాలు వెల్లువెత్తాయి. ఒక దశలో సుమారు రూ. 130 కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద కరిగిపోయింది. ఫిబ్రవరి 12న దాదాపు రూ. 745 కోట్లుగా ఉన్న కంపెనీ మార్కెట్‌ విలువ గురువారం ఉదయం సెషన్లో రూ. 612 కోట్ల స్థాయికి పడిపోయింది.