Revant Reddy | ఏడేండ్ల క్రితం పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకంపై అంతా ఊహించినట్లు నిర్ణయం తీసుకున్నా ఏఐసీసీ అధిష్ఠానం ఒకింత సాహసమే చేసింది. 2017లో అనివార్య కారణాలతో తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డికి అనతి కాలంలోనే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు దక్కింది.
2018 ఎన్నికల్లో కొడంగల్‌లో ఇలా పరాభవం
2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెర వెనుక రాజకీయం.. బాబుతో కేసీఆర్ వైరం.. ఓటుకు నోటు కేసులో చిక్కుకున్న రేవంత్ రెడ్డిని ఓడించేందుకు అధికార టీఆర్ఎస్ పన్నిన వ్యూహం సక్సెస్ అయ్యింది. అటుపై 2019 ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయమని అధిష్ఠానం ఆదేశించడం ఆయనకు కలిసి వచ్చింది.
2019లో మల్కాజిగిరిలో గెలుపు ఇలా
సీమాంధ్ర ఓటర్ల మద్దతు, వ్యక్తిగతంగా ఉన్న ఫాలోయింగ్.. రేవంత్ రెడ్డికి అనుకూలంగా మారాయి. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం.. ప్రత్యేకించి 2018 ఎన్నికల్లో విజయం తర్వాత తనతోపాటు కేవలం డిప్యూటీ సీఎం కం హోంమంత్రిగా మహమూద్ అలీని నియమిస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం.. ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించింది.
ఇమేజ్ నిర్మాణంలో పలఫ్రదం
ఏఐసీసీ ఆదేశం మేరకు మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసిన రేవంత్‌రెడ్డి ఎట్టకేలకు ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. టీఆర్ఎస్ ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నా.. తనకంటూ ఇమేజ్‌ను నిర్మించుకోవడంలో పలఫ్రదం అయ్యారు.
నాటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలోనూ, రాష్ట్ర ప్రజల్లోనూ ప్రత్యేకించి యువతలోనూ తనకంటూ ఫాలోయింగ్ పెంచుకున్నారు. సీఎం కేసీఆర్, మున్సిపల్-ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌లకు వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టడంలో ముందున్నారు.
హుజూర్ నగర్ ఉప ఎన్నిక తర్వాత టీపీసీసీపై చర్చ
హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థాన ఉప ఎన్నిక తర్వాత టీపీసీసీ నియామకంపై చర్చ తీవ్రమైంది. ఉత్తమ్‌కుమార్ రెడ్డికి మద్దతుగా సీనియర్లు గళం విప్పారు. మరోవైపు కోమటి రెడ్డి బ్రదర్స్ గట్టిగా పోటీ ఇచ్చారు. జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారు పోటీ పడ్డా.. చివరకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ.. రేవంత్ వైపే మొగ్గారు.
రేవంత్‌పై సీనియర్ల వ్యతిరేకత
పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకంపై పలువురు సీనియర్లు నేరుగానే తమ వ్యతిరేకత వ్యక్తం చేశారు. అయితే, ఆయన నియామకాన్ని వ్యతిరేకించిన వారందరినీ వివిధ కమిటీల్లో నియమించి సమ న్యాయం చేయడానికి ప్రయత్నించింది కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం.
ఈ కమిటీల్లో కోమటి రెడ్డి బ్రదర్స్‌కు చోటు దక్కకపోవడమే ఆశ్చర్యకరంగా కనిపిస్తున్నది. అయితే, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి.. బీజేపీలో చేరడానికి ఆసక్తి ప్రదర్శించి వివాదాస్పదంగా వ్యవహరించడ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రతికూలంగా మారినట్లు కనిపిస్తున్నది.
కలుపుకుపోతానంటున్న రేవంత్
అందరినీ కలుపుకుని వెళ్తానని, సీనియర్ల సలహాలను స్వీకరిస్తూ ముందుకు సాగుతానని పీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన వెంటనే రేవంత్ రెడ్డి స్పందన. అయితే, ఏడేళ్లుగా తెలంగాణలో ఆధిపత్య రాజకీయాలు చేస్తున్నది అధికార టీఆర్ఎస్. కాంగ్రెస్ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు.. టీఆర్ఎస్‌లో చేరిపోయారు.
ఇలా టీఆర్ఎస్ పట్టు
రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు టీఆర్ఎస్ రాజకీయాలపై పూర్తిగా పట్టు సాధించింది. అయితే, ఉద్యోగ వర్గాల్లో, నిరుద్యోగ యువతలో, విద్యార్థి లోకంలో టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాల పట్ల తీవ్రస్థాయిలో వ్యతిరేకత పెరుగుతున్నది.
దుబ్బాక, జీహెచ్ఎంసీల్లో బీజేపీ దూకుడు
మల్లన్న సాగర్ ముంపు నిర్వాసితుల అసంత్రుప్తి.. గతేడాది జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దూకుడు రాజకీయం బీజేపీకి కలిసి వచ్చింది. దీంతో టీఆర్ఎస్ నాయకత్వం అప్రమత్తమైంది. అటుపై జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించింది.
దీంతో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా సిట్టింగ్ రామచంద్రరావు ఓటమి పాలయ్యారు. అలాగే ఖమ్మం-వరంగల్-నల్గొండ స్థానం నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించుకోవడంలో విజయం సాధించింది టీఆర్ఎస్.
సాగర్‌లో వెటరన్ జానారెడ్డి ఓటమి
నోముల నర్సింహయ్య మరణంతో జరిగిన నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ వెటరన్ జానారెడ్డి నిలిచినా టీఆర్ఎస్ విజయం సాధించింది. కానీ ఇటీవల జరిగిన పరిణామాల్లో క్యాబినెట్‌లో ఆరోగ్య మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌పై భూకబ్జా ఆరోపణలతో బయటకు పంపేసింది టీఆర్ఎస్.
వ్యూహాత్మకంగా బీజేపీలోకి ఈటల
ఈ పరిణామాన్ని ముందే ఊహించిన ఈటల రాజేందర్ వ్యూహాత్మకంగా బీజేపీలో చేరారు. ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది. అటు అధికార టీఆర్ఎస్.. ఇటు బీజేపీ ప్రత్యేకించి ఈటల రాజేందర్ ఇప్పటి నుంచే వ్యూహా ప్రతి వ్యూహాల్లో నిమగ్నమయ్యారు.
రేవంత్‌కు నల్లేరు మీద నడకేం కాదు..
ఈ క్రమంలో తెలంగాణ పీసీసీ పీఠాన్ని రేవంత్‌రెడ్డికి కట్టబెడుతూ ఏఐసీసీ నిర్ణయం తీసుకోవడం ఊహించిందే అయినా సాహసోపేతమే. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం రేవంత్ రెడ్డికి నల్లేరు మీద నడకేం కాదు.. సీనియర్లందరినీ కలుపుకుని ముందుకు వెళ్లడం సవాలే.
సమస్యల పరిష్కారానికి ఆందోళనలే మార్గం
రాష్ట్రంలో విభిన్న వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఆందోళన బాట పట్టడం.. ప్రజలకు చేరువ కావడం రేవంత్ రెడ్డి ముందు ఉన్న మార్గాలు.. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించినా.. ఆచరణలో సాధ్యమేనా? అనుమతులు లభిస్తాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మోదీ, అమిత్‌షా చాణక్య వ్యూహం
ఇదిలా ఉంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ప్రధాని నరేంద్రమోదీ.. హోంమంత్రి అమిత్ షా వ్యూహరచనలో అభినవ చాణక్యులే. ఇక తమ ప్రత్యర్థులను లొంగదీసుకోవడానికి సీబీఐ, ఈడీ, ఆదాయం పన్ను శాఖ దాడులు కేంద్రానికి వెన్నతో పెట్టిన విద్య.
ప్రత్యర్థులపై టీఆర్ఎస్ ఇలా
రాష్ట్రంలో రెండోసారి అధికారంలో ఉన్న టీఆర్ఎస్.. తన రాజకీయ ప్రత్యర్థులను కలుపుకోవడానికి ప్రాధాన్యం ఇస్తుంది. లేదంటే అన్ని విధాల నిర్వీర్యం చేయడానికి అవకాశాలను వాడుకుంటుంది. కేంద్రం మాదిరిగానే రాజకీయ ప్రత్యర్థులను ముప్పేట కట్టడి చేస్తున్నది.
రేవంత్‌కు టీఆర్ఎస్‌కు వైరం
అసలే రేవంత్ రెడ్డి అంటే టీఆర్ఎస్‌కు మంట. టీపీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యాక కూడా ఇలాగే అధికార టీఆర్ఎస్ వ్యవహరిస్తుందా.. లేదా.. సందేహాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఇటు టీఆర్ఎస్‌నూ, అటు బీజేపీని ఎదుర్కోవడం.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయ తీరాల వైపు నడిపించడం అంత తేలికేం కాదు.
ఓటుకు నోటు బయటపడతారా..!
కేంద్రంలోని అధికార బీజేపీ మాదిరిగానే.. టీఆర్ఎస్ కూడా కళంకిత రాజకీయ నాయకులపై కేసులను వెలికి తీసే అవకాశాలు ఉన్నాయి. 2015లో వెలుగు చూసిన ఓటుకు నోటు కేసు.. రేవంత్ రెడ్డి రాజకీయ భవితవ్యంపై ఒక మచ్చ వంటిదే.