24.10.26

Tata Dispute | టాటా స‌న్స్‌లో ర‌త‌న్‌టాటా వార‌స‌త్వానికి చెద‌లు ప‌డుతోందా..?!


Tata Dispute | టాటా స‌న్స్‌.. దేశంలోకెల్లా అతిపెద్ద‌, పురాత‌న కార్పొరేట్ సంస్థ‌. ఏడాది క్రితం ర‌త‌న్ టాటా మృతి చెందే వ‌ర‌కూ టాటా స‌న్స్‌, టాటా ట్ర‌స్ట్స్‌లో ఆయ‌న చెప్పిందే వేదం. చేసిందే చ‌ట్టం. ఆయ‌న మ‌ర‌ణం త‌ర్వాత టాటా స‌న్స్‌, టాటా ట్ర‌స్టుల మ‌ధ్య విభేదాలెందుకు వీధికెక్కాయి. టాటా స‌న్స్ లిస్టింగ్‌పై ర‌త‌న్‌టాటా స‌జీవంగా ఉన్న‌ప్పుడు కిమ్మ‌న‌ని టాటా ట్ర‌స్ట్స్‌ డైరెక్ట‌ర్లు ఎందుకు మాట మార్చారు. ఆర్బీఐ ఆదేశాల మేర‌కు లిస్టింగ్ చేయాల్సిన అవ‌స‌ర‌మేమిటి..?  మిస్త్రీల సార‌థ్యంలో టాటా స‌న్స్‌లోని 18 శాతం వాటాను ఎస్‌పీ గ్రూప్ విక్ర‌యించేందుకు సిద్ధంగానూ ఉంది.. ఆ వాటా పెట్టుబ‌డి మొత్తం టాటా స‌న్స్ చెల్లించేస్తే ఎస్పీ గ్రూపుతో సంబంధ బాంధ‌వ్యాలుండ‌వ్.. వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు చెల్లించేస్తే టాటా స‌న్స్‌ను లిస్టింగ్ చేయాల్సిన ప‌రిస్థితి రానేరాదు. 

టాటా స‌న్స్ ఆధీనంలోని వివిధ సంస్థ‌లు సంపాదించే లాభాల‌న్నీ దాతృత్వానికే ఖ‌ర్చు చేస్తున్నాయి టాటా ట్ర‌స్టులు. ఈ సంగ‌తి తెలియ‌క ఆర్బీఐ... టాటా స‌న్స్ అనే సంస్థ బ్యాంకింగేత‌ర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ) స్థాయిని మించింద‌ని.. లిస్టింగ్ చేసి ప‌బ్లిక్ లిమిటెడ్ సంస్థ‌గా మార్చాల‌ని ప‌ట్టుబట్ట‌డానికి కార‌ణాలేమిటి..? అంతుబ‌ట్ట‌ని ర‌హ‌స్యంగానే ఉంది. కొద్దిమొత్తం మాత్ర‌మే కార్పొరేట్ సోష‌ల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్‌) కింద దాతృత్వ కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్న ఇత‌ర కార్పొరేట్ సంస్థ‌ల‌కూ, టాటా స‌న్స్ దాని ఆధ్వ‌ర్యంలోని కార్పొరేట్ సంస్థ‌ల‌కు మౌలిక‌మైన తేడా ఉన్న‌ద‌న్న‌ది నిర్వివాదాంశం. 

టాటా లాభాలు ప్ర‌జా సేవ‌కే

టాటా స‌న్స్‌లో 66 శాతం వాటా గ‌ల టాటా ట్ర‌స్టులు నూటికి నూరుశాతం దాతృత్వ కార్య క‌లాపాలు నిర్వ‌హిస్తుంటాయి. ర‌త‌న్ టాటా మ‌ర‌ణించే వ‌ర‌కూ ఇటు టాటా స‌న్స్‌కు గౌర‌వ చైర్మ‌న్‌గానూ, టాటా ట్ర‌స్టుల చైర్మ‌న్‌గానూ వ్య‌వ‌హరించ‌డంతో ఏ స‌మ‌స్యా త‌లెత్త‌లేదు. అనుభ‌వం, ఆయ‌న ధైర్య సాహ‌సాలు, ముందు చూపు తెలిసిన వారెవ్వ‌రూ ఆయ‌న మాట‌కు ఎదురు చెప్ప‌లేదు. కాని ఆయ‌న మ‌ర‌ణానికి ముందే టాటా స‌న్స్‌లో 66 శాతం వాటా క‌లిగి ఉండ‌టంతోపాటు 100 శాతం దాతృత్వ కార్య‌క్ర‌మాల‌ను టాటా ట్ర‌స్టులు నిర్వ‌హించాల‌ని స్ప‌ష్ట‌మైన నిబంధ‌న‌లు రూపొందించారు. 

ఇప్పుడు టాటా స‌న్స్‌లో 66 % వాటా టాటా ట్ర‌స్టుల‌ది అయిన‌ప్పుడు దాని చైర్మ‌న్‌, ర‌త‌న్‌టాటా స‌వతి సోద‌రుడు నోయ‌ల్ టాటా అభిప్రాయ‌మే ఫైన‌ల్ కావాలి. కానీ, 2024 మార్చిలో టాటా స‌న్స్‌ను స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్‌కు తీసుకెళ్లొద్ద‌ని ర‌త‌న్ టాటా హ‌యాంలో జ‌రిగిన తీర్మానానికి అనుకూలంగా ఓటేసిన టాటా`లో ట్ర‌స్టుల నామినీ డైరెక్ట‌ర్ వేణు శ్రీ‌నివాస‌న్‌, మ‌రొక డైరెక్ట‌ర్ ఎందుకు మాట మార్చారు. టాటా స‌న్స్‌ను లిస్టింగ్ చేయ‌కుండా త‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని యాజ‌మాన్యాన్ని ఆదేశిస్తూ 2025 మే, జూలైల్లో తీర్మానించిన‌ స‌ర్ ర‌త‌న్ టాటా ట్ర‌స్టు, స‌ర్ దొరాబ్జీ టాటా ట్ర‌స్టు బోర్డుల్లో నామినీ డైరెక్ట‌ర్ల నాలుక‌ ఎందుకు మడ‌త ప‌డింది..? వారిలో గ‌ల స్వ‌తంత్ర ఆలోచ‌న‌లు పురి విప్పుతున్నాయా..? అదేమిటో ఇప్ప‌టికైతే ఇత‌మిద్దంగా తెలియ‌దు. 



టాటా స‌న్స్ నామినీ డైరెక్ట‌ర్ల భ‌విత‌వ్యం ఏమిటి..?

టాటా స‌న్స్  భ‌విత‌వ్యం అంతా ఆ సంస్థ యాజ‌మాన్యం రూపొందించిన ఆర్టిక‌ల్ ఆఫ్ అసోసియేష‌న్ (ఏవోఏ), టాటా ట్ర‌స్టుల‌దే తుది నిర్ణ‌యంపైనే ఆధార ప‌డి ఉంటుంది. టాటా కుటుంబ వార‌సుడిగా టాటా ట్ర‌స్టు చైర్మ‌న్ నోయ‌ల్ టాటా నిర్ణ‌యాన్ని నామినీ డైరెక్ట‌ర్లు కాద‌న‌గ‌ల‌రా..? గ‌తంలో సైర‌స్ మిస్త్రీని టాటా స‌న్స్ సీఎండీగా త‌ప్పించ‌డంతోపాటు ఆ సంస్థ‌ను ప్రైవేటు సంస్థ‌గా మార్చ‌డంలో ఏవోఏ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన సంగ‌తి నామినీ డైరెక్ట‌ర్ల‌కు తెలియ‌నిదా..?! లేదా టాటా స‌న్స్ చైర్మ‌న్‌గా ఎన్‌.చంద్ర‌శేఖ‌ర‌న్‌ను ముచ్చ‌ట‌గా మూడో ద‌ఫా కొన‌సాగించేందుకు ఇబ్బందులున్నాయా..? అంటే ఉన్నాయ‌నే చెప్పుకోవాలి.1991లో టాటా స‌న్స్ చైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత ఏడాదికే సంస్థ అనుబంధ సంస్థ‌ల సీఈఓల, డైరెక్ట‌ర్ల‌, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ల ప‌ద‌ద‌వీ కాలాన్ని త‌గ్గిస్తూ ర‌త‌న్ టాటా నిర్ణ‌యం తీసుకోవ‌డంతో సీనియ‌ర్లుగా ఉన్న పలువురు సీఈఓలు స్వ‌చ్ఛందంగా వైదొల‌గ‌క త‌ప్ప‌లేదు. దాన్ని ఉల్లంఘిస్తే టాటా స్టీల్‌, టాటా కెమిక‌ల్స్‌, టాటా ప‌వ‌ర్ సంస్థ‌ల సీఈఓలు 65 ఏళ్ల త‌ర్వాత కొన‌సాగుతామ‌నే డిమాండ్ తెచ్చే అవ‌కాశాల్లేక పోలేదు.

ర‌త‌న్ టాటా సాహ‌సాలిలా..

న‌ష్టాల్లో ఉన్న ఫ్రాన్స్ ఐర‌న్ కంపెనీ.. బ్రిట‌న్ జాగ్వార్ లాండ్ రోవ‌ర్ కంపెనీల‌ను టేకోవ‌ర్ చేయ‌డంలో ర‌త‌న్ టాటా ఎంత సాహ‌సోపేత నిర్ణ‌యాలు తీసుకున్నా.. త‌న సార‌థ్యంలోని సంస్థ ప‌ది కాలాల పాటు స‌మాజానికి సేవ చేయ‌డానికి, సీఈఓలు, డైరెక్ట‌ర్ల ప‌ద‌వీ కాలంపై నిర్ధిష్ట గ‌డువు విధించ‌డ‌మే కాదు.. తాను స్వ‌యంగా ఆ నిబంధ‌న‌ను పాటించినందు వ‌ల్లే చివ‌రి క్ష‌ణం వ‌ర‌కూ బాంబే హౌస్‌లో ఏకగ్రీవ నిర్ణ‌యాలే త‌ప్ప‌.. అభిప్రాయ భేదాల్లేవు. సైర‌స్ మిస్త్రీని సీఎండీగా తొల‌గించిప్పుడు 2016లో మిన‌హాయింపుల్లేవ‌న్న నిబంధ‌న ముందే తీసుకొచ్చారు. 

3వ‌సారి చంద్రాకు ర‌త‌న్ టాటా వ్య‌తిరేక‌మా..?

ర‌త‌న్ టాటా ఉన్నంత వ‌ర‌కూ స‌వ‌తి సోద‌రుడి వెనుకే నిలిచిన నోయ‌ల్ టాటా నాయ‌క‌త్వానికి ఇత‌ర నామినీ డైరెక్ట‌ర్ల నుంచి వ్య‌తిరేక‌త‌కు కార‌ణాలేమిటన్న‌ది అర్థం కాకపోయినా టాటా స‌న్స్ ఆర్టిక‌ల్ ఆఫ్ అసోసియేష‌న్ నిబంధ‌న‌ల ప్ర‌కారం టాటా ట్ర‌స్ట్స్ చైర్మ‌న్‌దే తుది నిర్ణ‌యాధికారం. టాటా స‌న్స్ లిస్టింగ్‌, మూడో ద‌ఫా చైర్మ‌న్‌గా ఎన్‌.చంద్ర‌శేఖ‌ర‌న్ కొన‌సాగింపు వివాదంగా మార‌కుండా ఉండాలంటే నోయ‌ల్ టాటా వైఖ‌రికే నామినీ డైరెక్ట‌ర్లు క‌ట్టుబడి ఉండాల్సి ఉంటుంది. ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్సు కొన‌సాగించ‌డానికి నిరాక‌రించిన ఆర్బీఐ నిర్ణ‌యాన్ని కేంద్ర ప్ర‌భుత్వం ముందే టాటా స‌న్స్ పెట్టి తుది నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంటుంది. త‌మ ఆర్టిక‌ల్ ఆఫ్ అసోసియేష‌న్ (ఏవోఏ) ప్ర‌కారం లిస్టింగ్‌కు వ్య‌తిరేక‌మ‌ని టాటా స‌న్స్ స్ప‌ష్టంగా చెప్పే స్వేచ్ఛ ఉంది.  చంద్ర‌శేఖ‌ర‌న్‌ను కొన‌సాగించాల‌ని ర‌త‌న్‌టాటా భావించి ఉంటే 1992 టాటా స‌న్స్ తీర్మానాన్ని కాద‌ని నిర్ణ‌యం తీసుకోవాలి. కానీ, అందుక‌నుకూలంగా లేరు క‌నుకే ఆ ప‌ని చేయ‌లేదు. అంటే, అనుభ‌వ‌జ్ఞుడైనా చంద్ర‌శేఖ‌ర‌న్ ప‌క్క‌కు త‌ప్పుకోవాల‌నే ర‌త‌న్ టాటా భావించారా..? అన్న అనుమానం వ‌స్తోంది. 

లిస్టింగ్ అయితే లాభాల‌పైనే అంద‌రికీ మోజు

ఒక‌వేళ‌, ఆర్బీఐ ఆదేశాల మేర‌కు టాటా స‌న్స్ లిస్టింగ్ అయితే, స్టాక్ మార్కెట్‌లో ఒడిదొడుకుల‌కు గురి కావాల్సి వ‌స్తుంది. అటువంట‌ప్పుడు టాటా స‌న్స్‌లో పెట్టుబ‌డులు పెట్టే ఇన్వెస్ట‌ర్లు.. ఆ సంస్థ ఆధ్వ‌ర్యంలోని ట్ర‌స్టుల ద్వారా ప్ర‌జా సేవ చేసుకోవ‌చ్చునంటారా..? లాభాల‌కే మొగ్గు చూపుతారా..? అంటే లాభాల‌కే ప్రాధాన్యం ఇస్తారు. ప్ర‌స్తుతం 158 వసంతాలుగా సేవ‌లందిస్తున్న సంస్థ‌.. ఎన్ చంద్ర‌శేఖ‌ర‌న్‌ను టాటా స‌న్స్ చైర్మ‌న్‌గా కొన‌సాగించ‌డ‌మా, లిస్టింగ్‌తో భ‌విష్య‌త్ లో దాతృత్వ కార్య‌క‌లాపాల‌ను ప్ర‌భావితం చేయ‌డ‌మా? లేదా ర‌త‌న్ టాటా వార‌స‌త్వాన్ని ప‌రిర‌క్షించుకోవ‌డ‌మా..? అన్న అంశాల‌పైనే వివాదం కొన‌సాగుతోంది. ర‌త‌న్ టాటా ఏనాడు వ్య‌క్తుల‌ను చూడ‌లేదు. విజ‌న్‌తో ఒక మిష‌న్‌, ఒక ల‌క్ష్యం, ఒక సంస్థ అభ్యున్న‌తిపైనే దృష్టిపెట్టారాయ‌న‌. 

17.10.26

ECI-SIR-Gen Z | స‌ర్కారు మార్పును కోరుకోవ‌డం త‌ప్పిద‌మా..?!



ECI-SIR-Gen Z | సాధార‌ణ భార‌తీయ పౌరులు గౌర‌వ ప్ర‌దంగా త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగుర‌వేయ‌డం నేర‌మా..? ప్ర‌భుత్వ మార్పును కోరుకోవ‌డం త‌ప్పిద‌మా..? ఆందోళ‌న‌కు దిగ‌డం పొర‌పాటా..? అంటే కానే కాద‌ని రాజ్యాంగంలోని (19)(1)(ఏ) అధిక‌ర‌ణం చెబుతోంది. 2002కు ముందు వ‌ర‌కూ త్రివ‌ర్ణ ప‌తాకావిష్క‌ర‌ణ‌పై ఆంక్ష‌లున్నా.. `ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002` ప్ర‌కారం సాధార‌ణ పౌరులు త‌మ ఇళ్లు, కార్యాల‌యాలు, సంస్థ‌ల‌పై ఎప్పుడైనా త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగురేయ‌వ‌చ్చు. కానీ,  `స‌ర్‌` పేరుతో కేంద్ర ఎన్నిక‌ల సంఘం  భారీగా ఓట్ల తొల‌గింపు చేప‌ట్ట‌డాన్ని యువ‌త‌రం మొద‌లు సామాజిక కార్య‌క‌ర్త‌లు, విద్యార్థి యువ‌జ‌న సంఘాలు, పౌర స‌మాజ ప్ర‌తినిధులు, ప్ర‌తిప‌క్ష రాజ‌కీయ పార్టీలు వ్య‌తిరేకిస్తూ ఆందోళ‌న బాట ప‌ట్టిన‌ప్పుడు `త్రివ‌ర్ణ ప‌త‌కా`న్ని చేబూని దూసుకెళుతున్నారు. స‌ర్‌కు సూత్ర‌దారి, కేంద్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ జ్ఞానేశ్ కుమార్‌ల‌కు వ్య‌తిరేకంగా జెన్‌-జీ త‌రం దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. దాదాపు కొన్నేళ్లుగా కెరీర్‌కే ప్రాధాన్యం ఇచ్చిన యువ‌త‌రం.. దేశ భ‌విత‌వ్యం, ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ కోసం వీధుల్లోకి దూసుకొస్తున్నారు. త‌మ దేశం ప‌ట్ల భ‌క్తి ప్ర‌ప‌త్తుల‌ను నిర్భ‌యంగా, నిర్మొహ‌మాటంగా ప్ర‌క‌టిస్తున్నారు. త‌మ భ‌విష్య‌త్ భార‌తం ప‌ట్ల ఆందోళ‌న‌తో నిర‌స‌న తెలుపుతున్నారు. 2024 మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల నుంచి ఓట్ చోరీపై విప‌క్ష నేత రాహుల్‌గాంధీ ఊరూవాడా తిరుగుతూ ప్ర‌చారం చేస్తూంటే ప‌ట్టించుకోని కేంద్రం, కేంద్ర ఎన్నిక‌ల సంఘం.. ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ ప‌త్రిక‌లో వార్త‌లొచ్చాక అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. త్రిస‌భ్య ఎన్నిక‌ల సంఘం స‌మావేశ‌మై తాము ఏక‌గ్రీవ నిర్ణ‌యాలు తీసుకున్నామ‌ని ఫొటోకు ఫోజులిచ్చినంత మాత్రాన స‌మ‌స్య ప‌రిష్కారం కాలేదు. ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌రిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నిక‌ల్లోపే 13 కోట్ల ఓట్లు తొల‌గింపున‌కు గురి కావ‌డం అన్ని వ‌ర్గాల‌ను ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. ఈ అంశ‌మే జెన్ జీ త‌రం వీధుల్లోకి దూసుకు రావ‌డానికి నేప‌థ్యం. గ‌తంలో ఆందోళ‌న‌లు అంటే ఆమ‌డ‌దూరం ఉండే యువ‌త‌రం ఇప్పుడు జాతీయ జెండాను చేత‌బ‌ట్టి.. కేంద్రం, ఎన్నిక‌ల సంఘానికి వ్య‌తిరేకంగా ఉత్సాహంగా నినాదాలిస్తూ ఉద్య‌మాల‌కు కొత్త ఊపిరి పోస్తున్నారు. 

దూకుడుగా యువ‌త‌రం ఆందోళ‌న‌

నీట్‌లో అవ‌క‌త‌క‌వ‌ల‌కు వ్య‌తిరేకంగా కాక్రోజ్ జ‌న‌తా పార్టీ (సీజేపీ) వ్య‌వ‌స్థాప‌కులు అభిజిత్ దీప్కే ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన నిర‌స‌న‌లోనూ యువ‌త‌రం దూకుడుగా పాల్గొన్నారు. పోలీసుల నిర్బంధాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆంక్ష‌ల‌ను తోసి రాజ‌న్నారు.  త‌మ‌కు అత్యంత ఇష్ట‌మైన నేత ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌తో ప్ర‌ధాని మోదీ రాజీనామా చేయించ‌డం సాధార‌ణ‌మేమీ కాదు. గ‌త 12 ఏళ్ల కాలంలో ఏనాడూ మోదీ నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌ల‌ను ప‌ట్టించుకున్న దాఖ‌లాలు లేవు. కానీ, మొద‌టిసారి `నీట్‌` నిర‌స‌న వేడి గ‌ట్టిగానే తాకింది. ప్ర‌జ‌ల్లోకి వెళ్లింది కూడా. యువ‌త‌రానికి ఇష్ట‌మైన ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లాల‌ని త‌న స‌హ‌చ‌ర మంత్రుల‌కు ప్ర‌ధాని మోదీ హిత‌వు ప‌లికారంటే.. జెన్‌జీ ప్ర‌భావం ఎలా ఉంటుందో ఆయ‌న‌కు అర్థ‌మైన‌ట్లుంది. కానీ, గోటిపై రోక‌టి పోటు మాదిరిగా రెండేళ్లుగా త‌మ అనుకూల అధికారితో అమ‌లు చేస్తున్న `స‌ర్‌`లో లోపాల‌పై వార్త‌లు రావ‌డంతో ప్ర‌భుత్వ వ్య‌తిరేక ప‌క్షాలు ఒక్క‌ట‌వుతున్నాయి. ఈ నెల 10న జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద భారీ ధ‌ర్నాకు సీజేపీ ప్లాన్ చేస్తే.. అప‌ర చాణ‌క్యుడిగా పేరొందిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. ఢిల్లీలోనే తిష్ట‌వేసి చ‌క్రం తిప్పారు. రాష్ట్రాల నుంచి పారా మిలిట‌రీ బ‌ల‌గాల‌ను మోహ‌రించి.. 144 సెక్ష‌న్ అమ‌లు చేసి.. ఎక్క‌డిక‌క్క‌డ యువ నేత‌ల‌ను క‌ట్ట‌డి చేయ‌డం.. ప్ర‌భుత్వ పెద్ద‌ల్లో ఆందోళ‌న‌ను తెలియ‌జేస్తోంది. సుప్రీంకోర్టు నిషేధాజ్ఞ‌ల‌ను ఎత్తేయాల‌ని ఆదేశించినా హోంశాఖ వెన‌క్కు త‌గ్గ‌లేదు. అయినా రోజు రోజుకు నిర‌స‌న‌లు పెరుగుతూనే ఉన్నాయి. జంత‌ర్ మంత‌ర్ ఆందోళ‌న‌కు వేదిక‌గా ఉంటే త‌మ ప్ర‌భుత్వ మ‌నుగ‌డ‌కు ముప్పు అని ప‌రిగ‌ణించిన పాల‌కులు.. ఆందోళ‌న వేదిక‌గా జంత‌ర్‌మంత‌ర్‌ను తొల‌గించ‌డం యువ‌త‌రం ఆగ్ర‌హానికి కార‌ణ‌మైంది. 

తిరంగ‌యాత్ర‌తో ఉలిక్కి ప‌డ్డ పోలీసులు

జంత‌ర్ మంత‌ర్ నిర‌స‌న వేదిక‌ను ర‌ద్దు చేయ‌డానికి వ్య‌తిరేకంగా క‌న్నాట్‌ప్లేస్‌లోని ఢిల్లీ సెంట్ర‌ల్ పార్కు వ‌ద్ద తిరంగా యాత్ర ప్ర‌ద‌ర్శ‌న‌కు పిలుపునిచ్చినా పోలీసు యంత్రాంగం ఉలిక్కి ప‌డింది. ఎక్క‌డిక‌క్క‌డ యువ నేత‌ల‌ను అరెస్టు చేసినా వేలాది మంది యువ‌త‌రం త‌ర‌లి రావ‌డంతో తిరంగా యాత్ర విజ‌య‌వంత‌మైంది. దీన్ని నివారించ‌డానికి యువ‌త‌రం నేత‌ల ఇళ్ల‌కు వెళ్లి మ‌రీ హాజ‌రు కావ‌ద్ద‌ని పోలీసులు నోటీసులు ఇస్తున్నారంటే వారికి మార్గ‌ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న పాల‌కుల్లో ఎంత భ‌యం గూడుక‌ట్టుకున్న‌దో అవ‌గ‌త‌మ‌వుతూనే ఉంది. విమ‌ర్శ‌లు వ‌స్తాయ‌ని తిరంగా యాత్ర‌కు తాము వ్య‌తిరేకం కాద‌ని, ప్ర‌జ‌లు ఎక్కువ‌గా గుమి కూడొద్ద‌ని నిషేధాజ్ఞ‌లు అమ‌ల్లో ఉన్నందునే అరెస్టు చేశామ‌ని చెబుతున్నారు పోలీసులు. 

స‌ర్‌, పాల‌కుల తీరుపై విస్తృత చ‌ర్చ అవ‌శ్యం

కేంద్ర ఎన్నిక‌ల సంఘం (ఈసీఐ) అమ‌లు చేస్తున్న `స‌ర్‌` ముప్పుపై దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల్లో విస్తృత స్థాయిలో చ‌ర్చ జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉంది. ప్ర‌జ‌ల‌కు ప్రాథ‌మిక అవ‌గాహ‌న ల‌భిస్తేనే స‌ర్‌కు వ్య‌తిరేకంగా.. పాల‌కుల కుటిల నీతికి వ్య‌తిరేకంగా దేశ ప్ర‌జ‌లు నిల‌బ‌డ‌గ‌లుగుతారు. అందుకోస‌మే నిత్యం ఆందోళ‌నా కార్య‌క్ర‌మాలు రూపుదిద్దుకుంటున్నాయి. యోగేంద్ర యాద‌వ్ వంటి సామాజిక కార్య‌క‌ర్త మ‌రో అడుగు ముందుకేసి.. విద్యార్థి యువ‌జ‌న సంఘాలు, ప్ర‌తిప‌క్షాలు, సామాజిక కార్య‌క‌ర్త‌లు వేర్వేరుగా ఆందోళ‌న చేసినా ప‌ర్వాలేదని. అందరి ల‌క్ష్యం ఒక్క‌టే కావాలి.. స‌ర్ ర‌ద్దు.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా లేదా.. ఆయ‌న్ను అభిశంసించాల‌న్న నినాదంతో ఆందోళ‌న ఉధృతం కావాల‌న్న‌ది సామాజిక కార్య‌కర్త‌ల ఆలోచ‌న‌. `స‌ర్‌` వ్య‌తిరేక ఉద్య‌మం ఎంత విస్త‌రిస్తే.. దేశ భ‌విష్య‌త్‌కు అంత మేలు జ‌రుగుతుంద‌న్న‌ది నిజం.

బీజేపీ, కేంద్రం విమ‌ర్శ‌ల‌కు కార‌ణ‌మిదే

`స‌ర్‌` వ్య‌తిరేక ఉద్య‌మం, ఆందోళ‌న ఉధృతమై దేశ‌వ్యాప్తంగా విస్త‌రిస్తే త‌మ మ‌ద్ద‌తు కొడిగ‌ట్టి పోతుంద‌ని క‌మ‌ల‌నాథులు క‌నిపెట్టినందునే ఆందోళ‌న‌కు దిగిన వారిపై అధికార బీజేపీ, కేంద్ర మంత్రులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.. ఉదాహ‌ర‌ణ‌కు ఏఐఎస్ఓ అధ్య‌క్షురాలు నేహాబోరా మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ త‌ర‌హా ఉద్య‌మం రావాల‌ని పిలుపునిచ్చారు. సీనియ‌ర్ ప్ర‌శాంత్ భూష‌ణ్‌ది అదే బాణి. ప్ర‌భుత్వ మార్పును కోరుకోవ‌డం ప్ర‌జాస్వామిక హ‌క్కే కానీ, చ‌ట్ట వ్య‌తిరేకం కాదు. దీనిపై ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ త‌దిత‌రులు స్పందిస్తూ కుట్ర పూరితం అనే నినాదం ఎత్తుకున్నారు. కానీ, సీజేపీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజిత్ దీప్కే త‌మ డిమాండ్ ఎన్నిక‌ల సంస్క‌ర‌ణ‌లు తేవ‌డం మాత్ర‌మేన‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.

కానీ, అస‌లు వాస్త‌వ‌మేమిటంటే.. 12 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. క్ర‌మంగా అన్న వ్య‌వ‌స్థ‌ల‌ను త‌న ఆధీనంలోకి తీసుకున్న‌ది. తీసుకుంటున్న‌ది. రాజ్యాంగంలోని 324 అధిక‌ర‌ణం ప్ర‌కారం స్వ‌యం ప్ర‌తిప‌త్తి గ‌ల ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ల నియామ‌క ప్ర‌క్రియ‌లో మార్పులు చేర్పులు చేసింది కూడా అందుకే.  అస‌లు స్వ‌యం ప్ర‌తిప‌త్తి గ‌ల‌ ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ల నియామ‌క ప్ర‌క్రియలో మార్పులపై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నా.. కేంద్రం త‌న ప‌ని తాను చేసుకుంటూ పోయింది.  కేంద్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌గా జ్ఞానేశ్ కుమార్ ఎంపిక క‌మిటీ స‌మావేశంలో విప‌క్ష నేత రాహుల్ అస‌మ్మ‌తిని తోసిరాజ‌ని 2/1 మెజారిటీతో ఆమోద ముద్ర వేయ‌డంలో మ‌త‌ల‌బు ఇదేన‌ని అనిపిస్తోంది. ఇప్పుడు వాస్త‌వాలు క్ర‌మంగా బ‌య‌ట‌కు రావ‌డంతో మ‌సిపూసి మారేడు గాయ చేయ‌డానికి కేంద్రం, అధికార బీజేపీ, ఎన్నిక‌ల సంఘం శ‌త‌విధాల ప్ర‌య‌త్నిస్తున్నాయి. 

విప‌క్షాలు, సామాజిక కార్య‌క‌ర్త‌లిలాగే ఉంటారు..

ప్ర‌తిప‌క్షంలో ఉన్న వారు, విద్యార్థి యువ‌జ‌న స‌మ‌స్య‌ల కోసం ప‌ని చేస్తున్న సంఘాలు, పౌర స‌మాజం స‌హ‌జంగానే నిత్యం ప్ర‌భుత్వ మార్పును కోరుకుంటాయి. ఇప్ప‌టి నుంచి వాస్త‌వాల ప్రాతిప‌దిక‌న నిరంత‌రం ఆందోళ‌న‌, ప్ర‌చారోద్య‌మం సాగితే, దేశ‌వ్యాప్తంగా ఎదో ఒక రూపంలో ఆందోళ‌న విస్త‌రిస్తే కేంద్రంలోని మోదీ స‌ర్కారుకు ప్ర‌మాద ఘంటిక‌లు మోగుతున్న‌ట్లే. కానీ, ఇప్ప‌టికిప్పుడు మోదీ ప్ర‌భుత్వానికి వ‌చ్చిన భ‌య‌మేమీ లేదు. పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల్లో బీజేపీ, దాని ఎన్‌డీఏ కూట‌మికి అవ‌స‌ర‌మైన మెజారిటీ ఉంది. ఆ మెజారిటీ ఉన్నంత కాలం కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఎవ‌రూ ఏమీ చేయ‌లేర‌న్న‌ది నిష్ఠూర స‌త్యం. హిందూత్వ‌ను జాతీయ‌వాదంగా ప్ర‌చారం చేస్తున్న పాల‌క పార్టీ త‌న వ్య‌తిరేకుల‌పై దేశ‌ద్రోహుల ముద్ర వేస్తూ వ‌చ్చింది. ఇటువంటి ప‌రిణామం గ‌తంలో ఎన్న‌డూ చోటు చేసుకోలేదు. తాజాగా త‌మను వ్య‌తిరేకిస్తున్న వారంతా జాతి వ్య‌తిరేకుల‌ని, కుట్ర‌దారుల‌ని విష ప్ర‌చారం చేస్తోంది. స‌ర్‌కు వ్య‌తిరేకంగా దేశ రాజ‌ధానిలో ఇంట‌ర్నెట్ వినియోగం ర‌ద్దు, మెట్రో రైలు స్టేష‌న్ల మూసివేత‌, ఢిల్లీకి వ‌చ్చే ప‌లు రైళ్ల ర‌ద్దు వంటి నిర్ణ‌యాలు అసాధార‌ణ చ‌ర్య‌లే కావడంతోపాటు అప్ర‌క‌టిత ఎమ‌ర్జెన్సీని త‌ల‌పించాయి.

ఇందిరాగాంధీ విధించిన ఎమ‌ర్జెన్సీకి కొడుకు రాజీవ్ గాంధీ, మ‌నుమ‌డు రాహుల్ గాంధీ కూడా క్ష‌మాప‌ణ చెప్పుకోవాల్సిన దుస్థితి నెల‌కొంది. నాడు స్వ‌ర్ణ దేవాల‌యంపై సైనిక చ‌ర్య‌కు ఇందిరాగాంధీ ఆదేశిస్తే.. ఆమె కోడ‌లు సోనియా.. మ‌న్మోహ‌న్ సింగ్‌ను ప్ర‌ధానిని చేయ‌డం ద్వారా సిక్కుల మ‌న‌స్సు చూర‌గొనేందుకు ప్ర‌య‌త్నించారు. కానీ, మిత‌వాద శ‌క్తులు సంద‌ర్భం దొరికిన‌ప్పుడ‌ల్లా `ఎమ‌ర్జెన్సీ` అంశాన్ని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఇప్పుడు నేరుగా ఎమ‌ర్జెన్సీ విధిస్తే ప్ర‌జాగ్ర‌హం పెల్లుబుకుతుంద‌ని కేంద్రంలోని పాల‌కుల‌కు తెలుసు క‌నుకే ప‌రోక్షంగా ఆందోళ‌న‌ల‌ను క‌ట్ట‌డి చేయ‌డానికి శ‌త విధాల ప్ర‌య‌త్నిస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగా ఆందోళ‌న‌లు జ‌ర‌గ‌కుండా ఆంక్ష‌లు విధించ‌డంలో ఆంత‌ర్య‌మిదే. కానీ, ఇప్ప‌టికైనా ప‌రిస్థితులు మ‌రింత విష‌మించ‌క ముందే కేంద్రం, కేంద్ర ఎన్నిక‌ల సంఘం దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్ట‌క‌పోతే ప‌రిస్థితి మ‌రింత విష‌మిస్తుంది. ప్ర‌ధాని మోదీ, అధికార బీజేపీకి ఉన్న ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గుతుంది. అది జ‌ర‌క్కుండా ఉండాలంటే ప్ర‌జాస్వామ్య‌యుతంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌లు స్వ‌తంత్రంగా ప‌ని చేసేందుకు అనుమ‌తినిస్తే ఏ స‌మ‌స్యా ఉండ‌దు. ఇక అదే ప‌నిగా అభిజిత్ దీప్కేతో ష‌ర‌తుల బాండ్ల‌పై సంత‌కాలు చేయించుకోవ‌డం కూడా ఆయ‌న దూకుడు ప‌ట్ల పాల‌కుల‌కు ఉన్న భ‌యాన్ని ప‌ట్టిస్తోంది త‌ప్ప మ‌రొక‌టి కాదు. 

9.10.26

ECI Independence | మంట గ‌లిసిన `నిర్వాచన్` స్వ‌యంప్ర‌తిప‌త్తి



ECI Independence | భార‌త రాజ్యాంగ రూప‌శిల్పి డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్క‌ర్ ముందుచూపుతో నిష్ప‌క్ష‌పాతంగా, స్వేచ్ఛాయుత వాతావ‌ర‌ణంలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ కోసం ఎన్నిక‌ల సంఘానికి క‌ల్పించిన `స్వ‌యం ప్ర‌తిప‌త్తి`కి తూట్లు ప‌డ్డాయి. పార్టీలూ నేత‌ల‌క‌తీతంగా నిష్ప‌క్ష‌పాతంగా వ్య‌వ‌హ‌రించాల్సిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ జ్ఞానేశ్ కుమార్ ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న ఓట‌ర్ల ప్ర‌త్యేక స‌వ‌ర‌ణ (స‌ర్‌) పుణ్య‌మా? అని రాజ్యాంగంలో ఎన్నిక‌ల సంఘానికి క‌ల్పించిన స్వ‌యం ప్ర‌తిప‌త్తి మంట గ‌లిసింది.

రాజ్యాంగ నిర్మాత‌ల ముందు చూపు

భార‌త రాజ్యాంగ నిర్మాత‌లు 80 ఏళ్ల క్రిత‌మే `భ‌విష్య‌త్తు` ప‌ట్ల ముందు చూపుతో వ్య‌వ‌హ‌రించారు. రాయ‌బరేలీలో అక్ర‌మాల‌కు పాల్ప‌డి ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించార‌ని ప్ర‌త్య‌ర్థి రాజ్ నారాయ‌ణ్ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను విచారించిన అల‌హాబాద్ హైకోర్టు.. పార్ల‌మెంట్ స‌భ్యురాలిగా ఇందిరాగాంధీ ఎన్నిక చెల్ల‌ద‌ని తీర్పు చెప్ప‌డంతో ఆమె దేశంలో ఎమ‌ర్జెన్సీ విధించారు. త‌త్ఫ‌లితంగా నియంతృత్వంగా వ్య‌వ‌హ‌రించార‌ని చెడ్డ పేరు తెచ్చుకున్నారు కానీ, ఎన్నిక‌ల సంఘం అధికారాల్లో గానీ, న్యాయ‌స్థానాల అధికారాల్లో గానీ ఏనాడూ జోక్యం చేసుకోలేదు. మాజీ ప్ర‌ధానిగా త‌న‌ను అరెస్టు చేయ‌డానికి వ‌చ్చిన పోలీసు అధికారికి స‌హ‌క‌రించారు కూడా. కానీ, అభివృద్ధి, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు త‌దిత‌ర హామీల‌తో 2014లో కేంద్రంలో గ‌ద్దెనెక్కిన న‌రేంద్ర మోదీ స‌ర్కార్‌.. పాల‌న వ్య‌వ‌స్థ‌లోని మూడు విభాగాల మ‌ధ్య విభ‌జ‌న రేఖ‌ల‌ను చెరిపేయ బూనుకున్న‌ది.

న్యాయ‌వ్య‌వ‌స్థ నియంత్ర‌ణ‌కు మోదీ స‌ర్కార్ య‌త్నం

నాటికే, కేంద్రంతోపాటు వివిధ రాష్ట్ర ప్ర‌భుత్వాల విధానాల‌పైనా, అవినీతి చ‌ర్య‌ల‌కు వ్య‌తిరేకంగా స్పందిస్తున్న న్యాయ వ్య‌వస్థ‌ను త‌న ఆధీనంలోకి తీసుకోవాల‌ని మోదీ స‌ర్కారు త‌ల‌పోసింది. ప్ర‌జా ప్ర‌యోజ‌నాల రీత్యా ప్ర‌జ‌ల నుంచి భూముల సేక‌ర‌ణ‌కు 2013లో నాటి మ‌న్మోహ‌న్ సింగ్ స‌ర్కారు ఆమోదించిన భూసేక‌ర‌ణ చ‌ట్టాన్ని నీరు గార్చేందుకు మోదీ స‌ర్కారు తెచ్చిన ఆర్డినెన్సుల‌ను ప్ర‌తిసారీ సుప్రీంకోర్టు కొట్టేసింది. ద‌రిమిలా కొలీజియం వ్య‌వ‌స్థ ద్వారా `ఉన్న‌త న్యాయ‌స్థానాల (హైకోర్టు, సుప్రీంకోర్టు)లో న్యాయ‌మూర్తుల‌` నియామ‌కాలను అడ్డుకునేందుకు `జాతీయ న్యాయ నియామ‌కాల క‌మిష‌న్ చ‌ట్టం` తీసుకొచ్చింది మోదీ స‌ర్కారు. దీన్ని ఔదాలిస్తే న్యాయ వ్య‌వ‌స్థ‌, సుప్రీంకోర్టు, రాష్ట్రాల హైకోర్టుల‌కు ఉన్న స్వ‌యం ప్ర‌తిప‌త్తిని వ‌దులుకోవ‌డ‌మే. 

శాస‌న‌, న్యాయ‌, కార్య నిర్వాహ‌క వ్య‌వ‌స్థ‌ల మ‌ధ్య విభ‌జ‌న ఇలా

భార‌త రాజ్యాంగ నిర్మాత‌లు కూడా రాజ్యాంగంలోని శాస‌న వ్య‌వ‌స్థ‌, కార్య నిర్వాహ‌క వ్య‌వ‌స్థ‌, న్యాయ వ్య‌వ‌స్థ‌ల మ‌ధ్య స్ప‌ష్ట‌మైన విభ‌జ‌న రేఖలు గీశారు. శాస‌న వ్య‌వ‌స్థ అధికారాల‌ను న్యాయ‌వ్య‌వ‌స్థ‌.., న్యాయ‌వ్య‌వ‌స్థ అధికారాల‌ను శాస‌న వ్య‌వ‌స్థ వ్య‌తిరేకించ‌రాదు. శాస‌న వ్య‌వ‌స్థ తీసుకున్న నిర్ణ‌యాల‌ను స‌మీక్షించే అధికారం న్యాయ‌వ్య‌వస్థ‌కు ఉంది కానీ, అందులో ప్ర‌జా ప్ర‌యోజ‌నాలు ఉన్నాయా? అన్న విష‌యం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి. అలాగే శాస‌న వ్య‌వ‌స్థ చ‌ట్టాలు చేయ‌డానికి ప‌రిమితం. కానీ న్యాయ వ్య‌వ‌స్థ అధికారాల్లోకి చొర‌బ‌డే హ‌క్కు లేదు. ఒక‌వేళ ఒక వ్య‌వ‌స్థ అధికారాల్లోకి మ‌రొక వ్య‌వ‌స్థ చొర‌బ‌డితే రాజ్యాంగ మౌలిక సూత్రాల‌కే విఘాతం క‌లిగ‌న‌ట్ల‌వుతుంది. 

కొలీజియం స్థానే న్యాయ నియామ‌కాల క‌మిష‌న్‌.. ఇలా డిస్మిస్‌

కొలీజియం వ్య‌వ‌స్థ‌ను ప‌క్క‌కు త‌ప్పించే ల‌క్ష్యంతో జాతీయ న్యాయ నియామ‌కాల క‌మిష‌న్ చ‌ట్టం తేవ‌డంతో సుప్రీంకోర్టు అప్ర‌మ‌త్త‌మైంది. ఆ క‌మిష‌న్ చ‌ట్టం ప్ర‌కారం న్యాయ‌మూర్తుల నియామ‌క క‌మిటీలో ల‌బ్ధ ప్ర‌తిష్టులైన న్యాయ కోవిదులు ఉంటారు. కానీ, దానికి స‌రైన నిర్వ‌చ‌నం లేదు. అంటే, కేంద్ర ప్ర‌భుత్వానికి న‌చ్చిన వారు న్యాయ కోవిదులుగా నియామ‌క క‌మిటీలోకి వ‌స్తే న్యాయ‌మూర్తుల నియామ‌కం ప్ర‌భుత్వానికి అనుకూలంగా మారుతుంది. ఇది రాజ్యంగ మౌలిక స్వ‌రూపానికే విరుద్దం. అందుకే దీనిపై అప్ర‌మ‌త్త‌మైన సుప్రీంకోర్టు ఆగ‌మేఘాల మీద రాజ్యాంగ విస్తృత ధ‌ర్మాస‌నాన్ని ఏర్పాటు చేయ‌డంతోపాటు వెంట‌వెంట‌నే విచారించి `జాతీయ న్యాయ నియామ‌కాల క‌మిష‌న్ చ‌ట్టా`న్ని కొట్టేసింది. ఆ స‌మ‌యంలో కేంద్రం, సుప్రీంకోర్టు మ‌ధ్య స‌త్సంబంధాల్లో కొంత ఉద్రిక్త‌త‌లుండేవి. న్యాయ‌మూర్తులు కూడా త‌ర్వాతీ కాలంలో కేంద్ర నిర్ణ‌యాల‌పై చూసీ చూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చారు. 

ఈసీఐ నియామ‌కంపై సుప్రీంకోర్టు తీర్పు త‌ర్వాత కేంద్రం ఇలా

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌, ఇద్ద‌రు క‌మిష‌న‌ర్ల నియామ‌క క‌మిటీలో ప్ర‌ధాని, విపక్ష నేత‌తోపాటు సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ స‌భ్యులుగా ఉండాల‌ని సుప్రీంకోర్టు 2023లో తీర్పు చెప్పిన త‌ర్వాతే మోదీ స‌ర్కారు.. పార్ల‌మెంటు ఉభ‌య‌స‌భ‌ల్లో త‌న‌కు గ‌ల మెజారిటీని ఉప‌యోగించుకుని ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌, ఇత‌ర క‌మిష‌న‌ర్ల నియామ‌క క‌మిటీలో సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిని త‌ప్పించి.. కేంద్ర మంత్రిని చేర్చారు. ఈ చ‌ట్టం ఎన్నిక‌ల సంఘం స్వ‌యం ప్ర‌తిప‌త్తిని ప్ర‌శ్నార్థ‌కం చేస్తుంద‌ని అనూప్ బ‌ర‌న్వాల్‌, జ‌యా ఠాకూర్ అనే వ్య‌క్తులు దాఖ‌లు చేసిన పిటిష‌న్లు ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ ప‌రిశీల‌న‌కు ఉన్నాయి. వీటిపై విచారించిన ద్విస‌భ్య ధ‌ర్మాస‌నం.. దీన్నివిస్తృత రాజ్యాంగ ధ‌ర్మాస‌నానికి సిఫార‌సు చేసింది. ఇక ఇదే చ‌ట్టంలో ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత కేసులు పెట్ట‌కుండా కేంద్రం స‌రికొత్త‌గా భ‌ద్ర‌త‌లు క‌ల్పించ‌డం ఆశ్చ‌ర్య చ‌కితంగా ఉంది. 2023 చ‌ట్టంపై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండ‌గానే.. ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ నియామ‌కంపై నిర్ణ‌యం తీసుకోరాద‌ని క‌మిటీలో స‌భ్యుడిగా ఉన్న రాహుల్ గాంధీ అస‌మ్మ‌తి నోటు రాశారు. కానీ, మోదీ స‌ర్కారు వెన‌క్కి త‌గ్గ‌క పోగా, త‌మ‌కు కావాల్సిన వ్య‌క్తి జ్ఞానేశ్ కుమార్‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌గా నియ‌మించుకున్న‌ది. ఆయ‌న నియామ‌కాన్ని రీకాల్ చేయాల‌ని దాఖ‌లైన పిటిష‌న్ త‌దుప‌రి విచార‌ణ‌ను వ‌చ్చే ఏడాది మే నెల‌కు చీఫ్ జ‌స్టిస్ సూర్య‌కాంత్ ధ‌ర్మాస‌నం వాయిదా వేసింది. 

న్యాయ స‌మీక్ష కోసం ప్ర‌జా బాహుళ్యం క‌దిలితేనే మ‌నుగ‌డ‌

త‌మ ప‌రిధిలోని అధికారాల‌కు `అంట‌క‌త్తెర‌` వేస్తూ కేంద్రం తీసుకొచ్చిన జాతీయ న్యాయ మూర్తుల నియామ‌క క‌మిష‌న్‌` చ‌ట్టంపై ఆగ‌మేఘాల‌పై విచార‌ణ జ‌రిపిన సుప్రీంకోర్టు.. ఆ చ‌ట్టాన్ని కొట్టి పారేసింది. కానీ, తాజాగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్, ఇత‌ర క‌మిష‌న‌ర్ల నియామ‌కానికి కేంద్రం చేసిన చ‌ట్టంతో కేంద్ర ఎన్నిక‌ల సంఘం స్వ‌యం ప్ర‌తిప‌త్తిని దెబ్బ తీసింద‌న్న‌ది వాస్త‌వం. ఇది రాజ్యాంగ మౌలిక స్వ‌రూపానికి విరుద్ద‌మైనా.. న్యాయ స‌మీక్ష‌లోనే తేలాలి. అయితే, కేంద్రంలో స‌మ‌ర్థ‌వంత‌మైన స‌ర్కారు అధికారంలో ఉండ‌టంతో న్యాయ వ్య‌వ‌స్థ సైతం చూసీ చూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో దేశ ప్ర‌జాస్వామ్యానికి గొడ్డ‌లి పెట్టుగా మారిన కేంద్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ `స‌ర్‌` ప్ర‌క్రియ‌ను ర‌ద్దు చేయాల‌న్నా.. ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నియామ‌క చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌న్న న్యాయ స‌మీక్షే స‌రైన ప‌రిష్కార మార్గం. అందుకు అసేతు హిమాచ‌లం అప్ర‌మ‌త్త‌మై ప్ర‌జా బాహుళ్యాన్ని చైత‌న్య ప‌రిచి.. ఆందోళ‌న‌ల బాట ప‌డితేనే దేశంలో ప్ర‌జాస్వామ్యం బ‌తికి బ‌ట్ట‌గ‌ట్ట‌గ‌లుగుతుంది. 

8.10.26

Nirvachan Sadan - SIR | నిర్వాచ‌న్ స‌ద‌న్ క‌ప్ప‌దాట్లు..!



Nirvachan Sadan - SIR | ఎస్ఐఆర్ (స‌ర్‌) పేరిట దేశ‌వ్యాప్తంగా 13 కోట్ల మంది ఓటు హ‌క్కును కాల‌రాసిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం (ఈసీఐ).. క‌ప్పదాట్ల‌కు పాల్ప‌డుతోంది. గ‌త 10 నెల‌ల్లో 14 సార్లు తాము అభ్యంత‌ర పెట్టినా కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ జ్ఞానేశ్ కుమార్ ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యాలు తీసుకుని అమ‌లు చేస్తున్నార‌ని సుఖ్‌బీర్ సింగ్ సంథూ, వివేక్ జోషి కేంద్ర క్యాబినెట్ కార్య‌ద‌ర్శికి రాసిన లేఖ మీడియాలో రావ‌డంతో తేనెతుట్టెను క‌దిలించిన‌ట్ల‌యింది. ప్ర‌ధానంగా స‌ర్‌కు అనుసంధానంగా గ‌తంలో త‌ల్లిదండ్రులు/ నాన‌మ్మ తాత‌య్య‌లు ఓటేసిన వివ‌రాల‌పై డిక్ల‌రేష‌న్ ఇవ్వాల‌ని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ సార‌థ్యంలోని ఈసీఐ పౌరుల‌కు సూచించ‌డం ప్ర‌ధానంగా వివాదానికి హేతువైంది. అలాగే ఈఆర్ఓల‌కు ఎన్నిక‌ల సంఘం వెబ్‌సైట్‌లో మార్పులు చేర్పులు చేయ‌డానికి సాఫ్ట్‌వేర్ అనుమ‌తించ‌డం లేదు. దీనివ‌ల్లే గోవాలో స‌ర్‌లో తొల‌గించిన సుమారు 95 మంది పేర్ల‌ను ఓట‌రు జాబితాలో చేర్చ‌డాని సాఫ్ట్‌వేర్ అడ్డంకిగా మారింది. ఆన్‌లైన్‌లోనే న‌వ వ‌యోజ‌నులు ఓటరు గుర్తింపు కార్డు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకుంటూ ఉంటే.. ఎన్నిక‌ల సంఘం ఆధ్వ‌ర్యంలో ప‌ని చేసే ఈఆర్‌వోల‌కు అందుబాటులో లేక‌పోవ‌డం అనుమానాల‌కు తావిస్తోంది. దీనికి తోడు ఫామ్‌-7 ద్వారా త‌మ‌కు న‌చ్చ‌ని ఓట‌ర్ల పేర్లు తొల‌గించ‌మ‌ని ఈసీఐని ఏవ‌రైనా కోర‌వ‌చ్చు. అయితే ఫామ్‌-7 పై చేతితో రాసి.. బూత్ లెవ‌ల్ ఆఫీస‌ర్ (బీఎల్‌వో)కు ద‌ర‌ఖాస్తు స‌మ‌ర్పించాలి. తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్‌లోని ముషీరాబాద్‌, బ‌హ‌దూర్‌పురా, గోషా మ‌హాల్ అసెంబ్లీ సెగ్మెంట్ల ప‌రిధిలో కొంద‌రి ఓట్లు తొల‌గించాల‌ని భారీగా `ఫ్రీ ప్రింటెడ్ ఫామ్‌-7` ప‌త్రాల‌ను బీఎల్ఓల‌కు అంద‌జేయ‌డం కూడా అనుమానాల‌కు తెర తీస్తోంది.

స‌ర్‌ను విప‌క్షాలు వ్య‌తిరేకిస్తూ ఇండియా కూట‌మి పార్టీలు, కాక్రోజ్ జ‌న‌తా పార్టీ (సీజేపీ) వంటి సంస్థ‌లు ఈ నెల రెండో తేదీ నుంచి ఆందోళ‌న‌కు శ్రీ‌కారం చుట్ట‌డంతో అస‌లు సంగ‌తి బ‌య‌ట ప‌డింది.  `స‌ర్‌` మీద అనుమానాలు ఉన్న‌ప్పుడు ప్ర‌జ‌లు, పౌర స‌మాజ ప్ర‌తినిధులు, రాజ‌కీయ పార్టీలు ఆందోళ‌న‌కు దిగ‌డం స‌హ‌జ ప‌రిణామ‌మే. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లో వెలుగు చూసిన ప్రీ ప్రింటెడ్ `ఫామ్‌-7` ప‌త్రాల‌పై రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి (సీఈఓ), రాష్ట్ర డీజీపీ, హైద‌రాబాద్ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ ల‌కు టీపీసీసీ, కాంగ్రెస్ నేత‌లు ఫిర్యాదు చేయ‌డంతో సీఈఓ అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ప్రీ ప్రింటెడ్ న‌కిలీ ఫామ్‌-7 ప‌త్రాల పంపిణీపై విచార‌ణ‌కు ఆదేశించారు. ఎన్నిక‌ల సంస్క‌ర‌ణ‌ల‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మాట్లాడుతూ.. చొర‌బాటు దారుల్ని ఏరివేయ‌డ‌మే త‌మ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని, ఎవ‌రేమ‌న్నా వెన‌క్కు త‌గ్గేది లేద‌ని చెప్పారు. కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా నిర్ణ‌యాన్ని గౌర‌వించ‌వ‌ల్సిందే. కానీ, 12 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న‌ది ఎన్డీఏ ప్ర‌భుత్వం. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ స‌హా దాదాపు అన్ని రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌లు ప్ర‌భుత్వం గుప్పిట్లో ఉన్నాయ‌న్న‌ది నిష్ఠూర సత్యం. ఈ వ్య‌వ‌స్థ‌ల స‌హ‌కారంతో దేశంలో ఉన్న చొర‌బాటు దారుల‌ను గుర్తించ‌డం  సాధ్యం కానిదేమీ లేదు. 

`స‌ర్‌`ను ఉప‌సంహ‌రించాల‌ని, ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల‌ని పౌర స‌మాజం స‌హా ప్ర‌తిప‌క్ష ఇండియా కూట‌మి ఆందోళ‌న‌కు శ్రీ‌కారం చుట్ట‌గా, మ‌రోవైపు స‌ర్‌`లో మార్పుల‌పై సుప్రీంకోర్టు క‌న్నెర్ర చేసింది. చ‌ట్ట‌బ‌ద్ధం గానీ `స‌ర్‌` నిబంధ‌న‌ల‌ను అనుమ‌తించేది లేద‌ని, చ‌ట్ట‌బ‌ద్ధం కాకుంటే ఏం చేయాలో కోర్టుకు తెలుసున‌ని న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్యలు చేసింది. అలా స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం వ్యాఖ్య‌లు చేసిన గంట‌ల్లో ప‌రిస్థితి మారిపోయింది. ఓటు హ‌క్కును ర‌ద్దు చేయ‌డం ప్రాణం పోవ‌డంతో స‌మానం అని సుప్రీంకోర్టు సీనియ‌ర్ న్యాయ‌మూర్తి వ్యాఖ్యానించారు. ప్ర‌ప్ర‌థ‌మంగా బీహార్‌లో `స‌ర్‌` ప్రారంభించిన‌ప్పుడే `నాన‌మ్మా తాత‌య్య‌, త‌ల్లిదండ్రుల ఓటు హ‌క్కు`పై డిక్ల‌రేష‌న్ స‌మ‌ర్పించాల‌ని మెలిక పెట్టి ల‌క్ష‌ల మంది ఓట‌ర్ల ఓటుహ‌క్కు ఉసురు తీసిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం.. స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం త‌మ నిర్ణ‌యానికి ఆమోదం తెలిపింద‌ని బుకాయించింది. దీనిపై విచార‌ణ సంద‌ర్భంగా ప్ర‌తిస్పందించిన సుప్రీంకోర్టు.. స‌ర్‌కు సంబంధించిన చ‌ట్ట విరుద్ధ స‌వ‌ర‌ణ‌ను ఆమోదించ‌డం లేద‌ని తేల్చి చెప్పిన కొన్ని గంట‌ల్లోనే ఆన్‌లైన్ నుంచి డిక్ల‌రేష‌న్ ఫామ్‌ను తొల‌గించేసింది నిర్వాచ‌న్ స‌ద‌న్‌. `స‌ర్` అమ‌లైన రాష్ట్రాల్లో ఓటు కోల్పోయిన వారి ఓటు హ‌క్కు పున‌రుద్ధ‌ర‌ణ కోసం ఎన్యూమ‌రేట‌ర్లు ఇంటింటికి తిరిగి ఓటు హ‌క్కు క‌ల వారి పేర్లు న‌మోదు చేసుకోవాల‌ని ఈసీఐ ఆదేశించింది. 

అంత‌కు ముందు మ‌హారాష్ట్ర‌, హ‌ర్యానా, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లో ఓట్ల తొల‌గింపుపై `లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ.. అనునిత్యం `ఓట్ చోరీ`పై ప్ర‌జంటేష‌న్లు ఇస్తూనే ఉన్నారు. తొలిసారి మ‌హారాష్ట్ర‌పై రాహుల్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చిన‌ప్పుడు ఆగ‌మేఘాల మీద స్పందించిన ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ జ్ఞానేశ్ కుమార్‌.. మీడియాతో మాట్లాడుతూ.. 48 గంట‌ల్లో త‌న‌కు క్ష‌మాప‌ణ చెప్పాలి లేదంటే ఓట్ చోరీకి సంబంధించిన ఆధారాలు త‌న‌కు స‌మ‌ర్పించాల‌ని డిమాండ్ చేశారు. కానీ, ఇప్పుడు ఇద్ద‌రు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ల అభ్యంత‌రాల‌ను బ‌య‌ట పెట్ట‌డంతో బ‌య‌టికి వెళ్లాలంటేనే వెనుకాడుతున్నారాయ‌న‌. యూపీ త‌దిత‌ర రాష్ట్రాల్లో ఆయ‌న ప‌ర్య‌ట‌న వాయిదా వేసుకుంటే.. తాజాగా ఛ‌త్తీస్‌గ‌ఢ్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ఆయ‌న‌కు జ‌డ్‌ప్ల‌స్ కేట‌గిరీ భ‌ద్ర‌త‌ను కేంద్రం ప‌టిష్ఠం చేయ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం. 

ఓట‌రు గుర్తింపు కార్డుతో ఆధార్‌ను అనుసంధానించాల‌న్న డిమాండ్ ఎంతోకాలంగా ఉన్న‌దే. బ్యాంకుల్లో ఆర్థిక లావాదేవీల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానించాల‌ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ‌శాఖ నిర్ణ‌యించింది. అదే పౌరుడి ఓటు హ‌క్కును నిర్ణ‌యించ‌డానికి ఆధార్‌, పాన్ కార్డులు స‌రైన డాక్యుమెంట్లు కాద‌ని ఎన్నిక‌ల సంఘం మెలిక పెట్ట‌డం గ‌మ‌నార్హం. 

4.10.26

Gnanesh Kumar - SIR-ECI | జ్ఞానేశ్ కుమార్‌కు ఎందుకీ `స‌ర్‌`స‌వాళ్లు..!


Gnanesh Kumar - SIR-ECI |  చైత‌న్య‌వంత‌మైన‌, విజ‌య‌వంత‌మైన ప్ర‌జాస్వామ్యానికి స్వేచ్ఛాయుత, నిష్ప‌క్ష‌పాత ఎన్నిక‌లు కీల‌కం. 326వ రాజ్యాంగ అధిక‌ర‌ణం ద్వారా వ‌యోజ‌నుల‌కు ఓటుహ‌క్కు క‌ల్పించ‌డం ప్ర‌జాస్వామ్యానికి పునాది. కానీ, ఆధునిక‌, భావోద్వేగాల‌ భార‌త్‌లో ప్ర‌స్తుతం పౌరుడి `ఓటుహ‌క్కు`ను తొల‌గించ‌డానికి `స‌ర్‌` తేలిక మార్గం. ఓటు హ‌క్కు క‌ల్పించే ప్ర‌జాస్వామ్య పునాదిని చెరిపేస్తూ ఏ ర‌క‌మైన విధాన‌ప‌ర‌మైన అక్ర‌మాల‌కు పాల్ప‌డినా ఓటుహ‌క్కు యోగ్య‌త‌ను, ప‌విత్ర‌త‌ను దెబ్బ తీయ‌డ‌మే. ఇటీవ‌లి కాలంలో ప‌లు కార‌ణాల వ‌ల్ల భార‌త్‌లో నిష్పాక్షిక ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్ర‌శ్నార్థ‌కంగా మారుతోంది. జ్ఞానేశ్ కుమార్ సార‌థ్యంలోని కేంద్ర ఎన్నిక‌ల సంఘం తీసుకొచ్చిన ఓట‌ర్ల ప్ర‌త్యేక స‌వ‌ర‌ణ (స‌ర్‌) దీనికి హేతువ‌వుతోంది. వివిధ రాష్ట్రాల్లో దాదాపు 13 కోట్ల మంది ఓట‌ర్ల‌ను తొల‌గించింది. బీహార్ స‌హా ప‌లు రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నిక‌ల సంఘం అమ‌లు చేసిన స‌మ‌గ్ర ఓట‌ర్ల స‌వ‌ర‌ణ (స‌ర్‌) ప్ర‌క్రియ‌లో భాగంగా ఓట‌ర్ల జాబితాలో అవ‌క‌త‌వ‌క‌లకు పాల్ప‌డ‌టంతోపాటు `ఓట్ చోరీ` జ‌రిగింద‌న్న ఆరోప‌ణ‌లు వివాదాల‌కు కేంద్ర‌మ‌య్యాయి. 

స‌ర్ భారీ అక్ర‌మాలు

మైనారిటీలు, విప‌క్షాల మ‌ద్ద‌తుదారులైన ఓట‌ర్ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఓట‌ర్ల జాబితాలో భారీ అక్ర‌మాల‌కు ఎన్నిక‌ల సంఘం (ఈసీ) అనుమ‌తించింద‌న్న ఆరోప‌ణ‌లున్నాయి. మైనారిటీల‌ను ల‌క్ష్యంగా చేసుకుని బీహార్‌లో ట‌ర్ల పేర్ల‌ను తొల‌గించ‌డానికే `స‌ర్‌` అమ‌ల్లోకి తెచ్చార‌ని అభియోగం. `స‌ర్‌` ప్ర‌క్రియ‌లో బీహార్‌లో దాదాపు 65 ల‌క్ష‌ల ఓట‌ర్ల పేర్లు తొల‌గించడాన్ని స‌వాల్‌చేస్తూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. పార్ల‌మెంటులో చ‌ట్ట స‌వ‌ర‌ణ చేయ‌కుండా.. కొత్త ఓట‌రు న‌మోదు కోసం రూపొందించిన `ఫామ్‌-6`లో మార్పులు చేయ‌డాన్ని ఇద్ద‌రు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్లు వ్య‌తిరేకించారు. ఇది చ‌ట్ట విరుద్ధం కూడా.  గ‌త 10 నెల‌ల్లో 14 సార్లు సీఈసీ తీసుకున్న నిర్ణ‌యాలు త‌మ‌కు అంగీకారం కాద‌ని ఈసీలోని ఇద్ద‌రు క‌మిష‌న‌ర్లు తేల్చి చెప్ప‌డంతో `సంక్లిష్ట‌.. స‌మ‌స్య‌ల సుడిగుండమైన స‌ర్‌పై ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హావేశాలు క‌ట్ట‌లు తెంచుకుంటున్నాయి.

ఇక  స‌వ‌రించిన `ఫామ్‌-6` ప్ర‌కారం కొత్త ఓట‌ర్లుగా పేర్లు న‌మోదు చేసుకునే వారు 2002, అంత‌కు ముందు ఓట‌ర్లుగా ఉన్న త‌మ త‌ల్లిదండ్రులు, నాన‌మ్మ‌, తాత‌య్య వివ‌రాలు పేర్కొనాల్సి ఉంటుంది. దీనిపై ఇద్ద‌రు క‌మిష‌న‌ర్లు వ్య‌తిరేక‌త ప్ర‌క‌టించ‌డంతోపాటు ఇటీవ‌ల ఎన్నిక‌లు జ‌రిగిన ప‌శ్చిమ బెంగాల్‌లో ఓట‌రు జాబితాలో తొల‌గించిన 16.10 ల‌క్ష‌ల మంది ఓటుహ‌క్కును పున‌రుద్ధ‌రిస్తూ రాష్ట్రంలోని కోర్టులు ఇచ్చిన తీర్పుల‌కు వ్య‌తిరేకంగా ఎన్నిక‌ల సంఘం త‌ర‌ఫున అప్పీళ్లు దాఖ‌ల‌య్యాయి. ఇలా అప్పీళ్లు దాఖ‌లైన విష‌యం కేంద్ర ఎన్నిక‌ల సంఘంలోని ఇద్ద‌రు క‌మిష‌న‌ర్ల‌కు తెలుసా? అన్న‌ది అనుమాన‌మే.

కొత్త ఓట‌రు న‌మోదుకూ చిక్కుముడి.

కేంద్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ (సీఈసీ)ని తొల‌గించాల‌ని విప‌క్ష `ఇండియా కూట‌మి` తీర్మానించ‌డంతో ఈ ప‌రిణామాలు పరాకాష్ట‌కు చేరాయి. విప‌క్షాల‌తోపాటు అభిజిత్ దీప్కే సార‌థ్యంలోని కాక్రోజ్ జ‌న‌తా పార్టీ (సీజేపీ) ఆధ్వ‌ర్యంలో ముంబై వేదిక‌గా జ్ఞానేశ్ కుమార్‌ను తొల‌గించాల‌ని నిర‌స‌న తెలియ‌జేయ‌డంతో కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌ళ్లు తెరిచింది. `స‌ర్‌` లో ఓటు కోల్పోయిన వారి కోసం ఇంటింటికి తిరిగి ఓట‌ర్ల పేర్లు న‌మోదు చేసుకోవాల‌ని రాష్ట్రాల ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారుల‌ను ఆదేశించింది. స‌ర్‌`లో ఓటు కోల్పోయిన వారి పేర్లను ఓట‌రు జాబితాలో న‌మోదు చేసుకునేందుకే ఇది వ‌ర్తిస్తుంద‌ని.. కొత్త‌గా ఓట‌రుగా న‌మోదు చేసుకునే వ‌యోజ‌నుల‌కు మాత్రం వారి `త‌ల్లిదండ్రులు, నాన‌మ్మ‌, తాత‌య్య` ఓటు వివ‌రాలు త‌ప్ప‌నిస‌ర‌ని చెబుతోంది. 

వివాదాస్ప‌దంగా ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ల ఎంపిక ప్ర‌క్రియ‌

కేంద్ర ప్రధాన ఎన్నికల క‌మిష‌న‌ర్‌, ఇత‌ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ల నియామ‌కానికి 1991 నుంచి అమ‌ల్లో ఉన్న చ‌ట్టం స్థానే 2023లో కేంద్రం తీసుకొచ్చిన చ‌ట్టం వివాదానికి హేతువైంది. ప్ర‌ధాన‌మంత్రి అధ్య‌క్ష‌త‌న కేంద్ర‌మంత్రి, విప‌క్ష నేత‌తో కూడిన క‌మిటీ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ల‌ను ఎంపిక చేసిన త‌ర్వాత రాష్ట్ర‌ప‌తి నియ‌మిస్తారు. 1991 చ‌ట్టం ప్ర‌కారం ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ల నియామ‌క క‌మిటీలో ప్ర‌ధాని, విప‌క్ష నేత‌, సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి స‌భ్యులుగా ఉంటారు. తాజా చ‌ట్టం ప్ర‌కారం కేంద్ర ప్ర‌భుత్వం మ‌రీ ముఖ్యంగా ప్ర‌ధాని అభిమ‌తానికి అనుగుణంగా ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ల నియామ‌కానికి ఆయ‌న కేబినెట్‌లోని మంత్రి ఓటేస్తార‌న్న విమ‌ర్శ ఉంది. 

ఎంపిక క‌మిటీలో సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్‌తోనే నిష్పాక్షిక‌త‌

విప‌క్ష నేత‌తోపాటు సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి కూడా ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ల ఎంపిక క‌మిటీలో స‌భ్యులుగా ఉంటే కాసింత నిష్పాక్షిక‌త‌కు చోటు ఉండేది. దాని స్వ‌యంప్ర‌తిప‌త్తికి భంగం వాటిల్లే అవ‌కాశం లేదు. కానీ, 2023లో ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ల ఎంపికకు చేసిన చ‌ట్టంలో సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిని త‌ప్పించ‌డంతో ఎన్నిక‌ల సంఘం స్వ‌తంత్ర ప్ర‌తిప‌త్తికి భంగం వాటిల్లింద‌న్న సందేహం త‌లెత్తింది.  2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌డానికి అవ‌స‌ర‌మైన మెజారిటీ ల‌భించ‌క పోగా, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని 80 సీట్ల‌లో బీజేపీ 33 సీట్లు , దాని మిత్ర‌ప‌క్షాలు మ‌రో మూడు స్థానాలు గెలుచుకున్నాయి. యూపీలో ప్ర‌తిప‌క్ష ఇండియా కూట‌మికి సార‌థ్యం వ‌హించిన అఖిలేశ్ యాద‌వ్ సార‌థ్యంలోని స‌మాజ్‌వాదీ పార్టీకి 37, దాని మిత్ర‌ప‌క్షం కాంగ్రెస్ పార్టీ ఆరు చోట్ల గెలుపొందింది. (2014, 2019 ఎన్నిక‌లతో పోలిస్తే బీజేపీ బ‌లం స‌గానికి పైగా త‌గ్గిపోవ‌డం గ‌మ‌నార్హం). అయినా నితీశ్ సార‌థ్యంలోని యునైటెడ్ జ‌న‌తాద‌ళ్‌, చంద్ర‌బాబుకు చెందిన తెలుగుదేశం నాయ‌క‌త్వంలోని కూట‌మి వ‌ల్ల మెజారిటీ మార్కును దాటిన ఎన్డీఏ స‌ర్కారు కొలువు దీరింది. 

మెజారిటీ ద‌న్నుతో సీఈసీగా అనుకూల అధికారి నియామ‌కం

ఇప్ప‌టి వ‌ర‌కూ భావోద్వేగాల‌తోపాటు ఈడీ, సీబీఐ వంటి సంస్థ‌ల‌తో ప్ర‌త్య‌ర్థుల‌ను దెబ్బ తీసి.. మీడియా సంస్థ‌ల‌ను `గోదీ` సంస్థ‌లుగా మార్చి ప్ర‌జాభిప్రాయాన్ని అణ‌చివేసేందుకు పూనుకున్న కేంద్ర పాల‌కులు.. ఇక ముందు అలా కుద‌ర‌ద‌ని.. త‌మ‌ `ప‌ప్పులు` ఉడ‌క‌వని త‌ల‌పోశారు. 2002 నాటికి ఓటేయాల‌న్న నిబంధ‌నతో `స‌ర్‌` అమ‌లుకు తెర తీశారు. అందుకోసం పార్ల‌మెంటులో త‌మ‌కు గ‌ల మెజారిటీ ఆధారంగా సీఈసీ, ఈసీ నియామ‌క చ‌ట్టంలో నిబంధ‌న‌లు మారుస్తూ చ‌ట్ట స‌వ‌ర‌ణ చేశారు. 

ఇక కేర‌ళ క్యాడ‌ర్‌కు చెందిన సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి జ్ఞానేశ్ కుమార్‌.. త‌ర్వాత‌ర్వాత కేంద్ర హోంశాఖ‌లో `జ‌మ్ము క‌శ్మీర్‌కు 370 అధిక‌ర‌ణం ర‌ద్దు`, `అయోధ్య‌లో రామ మందిర నిర్మాణ ట్ర‌స్ట్ ప‌నుల‌` ప‌ర్య‌వేక్ష‌ణ‌తో మోదీ, అమిత్‌షాల‌కు ద‌గ్గ‌ర‌య్యార‌న్న ఆరోప‌ణ‌లున్నాయి. అంతే కాదు 32 ఏళ్ల పాటు వివాదాల‌కు దూరంగా ఐఏఎస్‌గా ప‌ని చేసిన జ్ఞానేశ్‌.. కేంద్ర పెద్ద‌ల అడుగుల‌కు మ‌డుగులొత్తుతూ కేర‌ళంలో బీజేపీ పాగా వేసేందుకు ఆ రాష్ట్ర మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి థామ‌స్‌కు బీజేపీ లోక్‌స‌భ టికెట్ ఆఫ‌ర్ చేయ‌డం, మంత్రి ప‌ద‌వి ఇప్పిస్తామ‌ని హామీ ఇవ్వ‌డం `సివిల్ స‌ర్వీస్ నిబంధ‌న‌ల‌` ఉల్లంఘ‌నే అవుతుంది. అంతే కాదు కేర‌ళంలో ప‌ని చేస్తున్న‌ప్పుడు అవినీతికి పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న కేసును ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం విజిలెన్స్ విచార‌ణ‌కు అప్ప‌గించ‌డం జ్ఞానేశ్‌కు గోటిపై రోక‌టి పోటు వంటిదే. ఇటువంటి వివాదాస్ప‌ద అధికారిని కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధానాధికారిగా నియ‌మించ‌డంతోనే ఆ సంస్థ స్వ‌యం ప్ర‌తిప‌త్తి కొడిగ‌ట్టిపోయిందంటే అతిశ‌యోక్తి కాదు.

కేంద్ర ఎన్నిక‌ల సంఘం స్వ‌యం ప్ర‌తిప‌త్తిని దెబ్బ తీసేలా 2023లో సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిని సెల‌క్ష‌న్ క‌మిటీ నుంచి త‌ప్పిస్తూ కేంద్రం చేసిన చ‌ట్టాన్ని అనూప్ బ‌ర‌న్వాల్, 2024లో జ‌యా ఠాకూర్ అనే వ్య‌క్తి సుప్రీంకోర్టులో స‌వాల్ చేశారు. వీటిని విచారించిన ద్విస‌భ్య ధ‌ర్మాస‌నం తాజాగా ఐదుగురు న్యాయ‌మూర్తుల విస్తృత రాజ్యాంగ ధ‌ర్మాస‌నానికి నివేదించాల‌ని ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి సిఫార‌సు చేసింది. 

ఈసీ రాజ్యాంగ విధి

రాష్ట్ర‌ప‌తి, ఉప‌రాష్ట్ర‌ప‌తిల‌తోపాటు పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌లు, 29 రాష్ట్రాల శాస‌న‌స‌భ‌లు, శాస‌న మండ‌లి స‌భ్యుల ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌ను నిర్దేశించ‌డంతోపాటు ప‌ర్య‌వేక్ష‌ణ‌కు 324వ అధిక‌ర‌ణం ద్వారా  కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి రాజ్యాంగం శాశ్వ‌త అధికారాలు క‌ట్ట‌బెట్టింది. ఈ రాజ్యాంగ ప్రాతిప‌దిక‌, ఎన్నిక‌ల సంఘం శాశ్వ‌త‌త్వానికి స్వ‌తంత్ర నేప‌థ్యం సృష్టించింది. 2023 ఎన్నిక‌ల సంఘం చ‌ట్టం ప్ర‌కారం ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ (సీఈసీ) ప‌ద‌విలో ఆరేళ్లు లేదా 65 ఏళ్ల వ‌య‌స్సు.. ఈ రెంటిలో ఏది ముందైతే అంత వ‌ర‌కూ కొన‌సాగుతారు. ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ (సీఈసీ), ఇతర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ల తొల‌గింపున‌కు పెట్టిన ముఖ్య‌మైన నిబంధ‌నే దాని స్వ‌తంత్ర‌త‌ను తెలియ‌జేస్తోంది. 

124(4) రాజ్యాంగ అధిక‌ర‌ణం ప్ర‌కారం దుష్ప్ర‌వ‌ర్త‌న లేదా అస‌మ‌ర్థ‌త రుజువైతే సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిని తొల‌గించిన ప్ర‌క్రియ‌నే కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ తొల‌గింపున‌కు వ‌ర్తిస్తుంద‌ని 324 అధిక‌ర‌ణంలోని 5 క్లాజ్ చెబుతోంది. అయితే సీఈసీ స‌ల‌హా మేర‌కు ఇత‌ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ల‌ను రాష్ట్ర‌ప‌తి తొల‌గించ‌వ‌చ్చు. అయిన‌ప్ప‌టికీ 1997లో వినీత్ నారాయ‌ణ్ వ‌ర్సెస్ కేంద్ర ప్ర‌భుత్వం కేసులో సీఈసీ సుమోటోగా స‌ల‌హా ఇవ్వ‌కూడ‌ద‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది. త‌ద్వారా ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ల స్వ‌యంప్ర‌తిప‌త్తి/ స్వ‌తంత్ర‌త‌కు, కార్య నిర్వాహ‌క వ‌ర్గ అధికారాల‌కు మ‌ధ్య స‌మ‌తుల్య‌త‌ను ఈ నిబంధ‌న‌ను తెలియ‌చేస్తోంది. 

1995లో బ‌హుళ స‌భ్య సంఘంగా ఎన్నిక‌ల సంఘం

1989లో ఎన్నిక‌ల సంఘాన్ని బ‌హుళ స‌భ్యుల సంస్థ‌గా మార్చినా 1990లో రెండు అద‌న‌పు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ప‌ద‌వుల‌ను ర‌ద్దు చేవారు. కానీ, టి.ఎన్. శేష‌న్ వ‌ర్సెస్ కేంద్ర ప్ర‌భుత్వం మ‌ధ్య 1993 అక్టోబ‌రు ఒక‌టో తేదీన దాఖ‌లైన కేసులో శాశ్వ‌తంగా బ‌హుళ స‌భ్యుల సంస్థ‌గా ఎన్నిక‌ల క‌మిష‌న్‌ను రూపొందించాల‌ని 1995లో సుప్రీంకోర్టు ఆదేశించింది. మ‌రో ఆస‌క్తిక‌ర విష‌య‌మేమిటంటే 324 అధిక‌ర‌ణంలోని మూడో క్లాస్ ప్ర‌కారం మ‌రో ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌ను నియ‌మిస్తే.. సీఈసీ ఎన్నిక‌ల సంఘం చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది. బ‌హుళ స‌భ్య ఎన్నికల క‌మిష‌న్‌లో ఈసీ స‌మావేశాల‌కు అధ్య‌క్ష‌త వ‌హించ‌డంతోపాటు సీఈసీకి కొన్ని ప్ర‌త్యేక అధికారాలు క‌ల్పించింది 324 అధిక‌ర‌ణం. దీని ప్ర‌కారం ప్ర‌జాతంత్ర‌యుతంగా / ఏకాభిప్రాయంతో నిర్ణ‌యాలు తీసుకోవ‌డంతోపాటు ఎన్నిక‌ల సంఘం ఒక అడ్మినిస్ట్రేట‌ర్‌గా ఎన్నిక‌ల‌ను నిర్వ‌హిస్తుంది. రాజ్యాంగ సంస్థ‌గా ఎన్నిక‌ల సంఘానికి ఈ నిబంధ‌న‌లే స్వ‌యంప్ర‌తిప‌త్తి/  స్వ‌తంత్ర‌త ద‌ఖ‌లు ప‌రుస్తున్నాయి. 

ఈసీ చ‌ట్టంలో మార్పులు చేర్పులు

1950, 1951ల్లో రూపుదిద్దుకున్న ప్ర‌జా ప్రాతినిధ్య చ‌ట్టం ప్ర‌కారం ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌, ఓట‌ర్ల న‌మోదు, అభ్య‌ర్థుల అర్హ‌త‌ల‌పై దృష్టి పెడితే.. సీఈసీ, ఇత‌ర క‌మిష‌న‌ర్ల తొల‌గింపు విధానాన్ని 2023లో తెచ్చిన సీఈసీ, ఈసీ (నియామ‌కం, స‌ర్వీసు నిబంధ‌న‌లు, ప‌ద‌వీ కాలం) చ‌ట్టం అమ‌ల్లోకి తెచ్చింది. ఎన్నికల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ (సీఈసీ)ని తొల‌గించే ప్ర‌క్రియ చాలా సంక్లిష్టం. అదొక ఖ్వాసీ జ్యుడిషియ‌ల్ పార్ల‌మెంట‌రీ విధానం. 1968 న్యాయ‌మూర్తుల (విచార‌ణ‌) చ‌ట్టంలోని సెక్ష‌న్ 3 ప్ర‌కారం ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ అస‌మ‌ర్థ‌త‌, దుష్ప్ర‌వ‌ర్త‌న‌పై ద‌ర్యాప్తు చేయొచ్చు. 

సీఈసీ తొల‌గింపున‌కు 100 మంది ఎంపీల సంత‌కంతో నోటీసు

సీఈసీ తొల‌గింపున‌కు లోక్‌స‌భ‌కు నోటీసు ఇవ్వాలంటే క‌నీసం 100 మంది లోక్‌స‌భ స‌భ్యులు సంత‌కం చేయాలి. అదే రాజ్య‌స‌భ‌కు నోటీసివ్వాలంటే 50 మంది స‌భ్యుల‌కు త‌గ్గ‌కుండా సంత‌కాలు చేయాలి. ఈ నోటీసుల‌ను లోక్‌స‌భ స్పీక‌ర్‌, రాజ్య‌స‌భ చైర్మ‌న్ అనుమ‌తించొచ్చు. లేదా అనుమ‌తించ‌వ‌చ్చు. నోటీసును అనుమ‌తిస్తే సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి/  న్యాయ‌మూర్తి, హైకోర్టు చీఫ్ జ‌స్టిస్‌, పేరొందిన న్యాయ కోవిదుడితో ముగ్గురు స‌భ్యుల క‌మిష‌న్‌ను లోక్‌స‌భ స్పీక‌ర్‌/  రాజ్య‌స‌భ చైర్మ‌న్ నియ‌మిస్తారు. పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల‌కూ నోటీసు ఇస్తే ఒకేసారి క‌మిటీ ఏర్పాటు చేస్తాయి అదీ నోటీసును అనుమ‌తిస్తేనే.. ఇక అవ‌స‌ర‌మైతే విచార‌ణ జ‌రిపి ఖ‌చ్చిత‌మైన అభియోగాలు తప్ప‌నిస‌రిగా  న‌మోదు చేయాలి. ఇక సీఈసీకి త‌న వాద‌న వినిపించేందుకు స‌హేతుక‌మైన స‌మ‌యం ఇవ్వాలి. భౌతిక‌, మాన‌సిక ప‌రిస్థితిపై ఆరోప‌ణ‌లు వ‌స్తే.. అవ‌స‌రం అనుకుంటే స్పీక‌ర్‌/ చైర్మ‌న్ నియ‌మించిన మెడిక‌ల్ బోర్డు ప‌రీక్షిస్తుంది. 

రాజ‌కీయ కోణం..

సీఈసీకి వ్య‌తిరేకంగా తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టాల‌ని భావిస్తే విప‌క్షాలు ప్ర‌జాతంత్ర ప‌ద్ద‌లు పాటిస్తాయి. అధికార కూట‌మికి పార్ల‌మెంటులో త‌గినంత బ‌లం ఉంటే ఈ తీర్మానాన్ని ప్ర‌తిస్తంభింప చేయొచ్చు. ఏ ప్రాతిప‌దిక‌తో కూడిన ఆరోప‌ణ‌లనైనా ప్ర‌భుత్వం తిర‌స్క‌రించ‌వ‌చ్చు. ఈ రాజ్యాంగ సంస్థ‌ల‌ను ప్ర‌తిప‌క్షం లేదా అధికార పార్టీ స‌హా పౌరులంతా గౌర‌వించాల్సి ఉంటుంది. లేక‌పోతే స‌మాజానికి త‌ప్పుడు సంకేతాలు పంపిన‌ట్ల‌వుతుంది. రాజ్యంగం పొందుప‌రిచిన నిబంధ‌న‌ల‌కు లోబ‌డి రాజ్యాంగ సంస్థ‌లు ప‌ని చేస్తాయ‌న్న విష‌యం రాజ‌కీయ పార్టీలు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి. ఈ సంస్థ‌ల‌కు వ్య‌తిరేకంగా అస‌మ్మ‌తి వ్య‌క్తం చేయ‌డం త‌ప్పు కాదు. కానీ, రాజ్యాంగాన్ని, రాజ్యాంగ సంస్థ‌లపై రాజ‌కీయం చేయ‌డం భార‌త ప్ర‌జాస్వామ్యానికి హానిక‌రం.  దీన్ని (ఎన్నిక‌ల సంఘాన్ని) ఏ విధంగా బ‌ల‌హీన ప‌రిచినా రాజ‌కీయంగా సున్నిత అంశంగా మార‌డంతోపాటు కేంద్ర ప్ర‌భుత్వం, స్వ‌తంత్ర‌/  విశ్వ‌స‌నీయ ప్ర‌జాతంత్ర సంస్థ‌ల మ‌ధ్య అధికార స‌మ‌తుల్య‌త‌తోపాటు ఎన్నిక‌ల ప్ర‌క్రియ నిర్వ‌హ‌ణ‌లో నిష్పాక్షిక‌త‌పై ప్ర‌భావం ప‌డుతుంది. క‌నుక రాజ్యాంగం క‌ల్పించిన రాజ‌కీయ భ‌ద్ర‌త‌ను ప‌రిర‌క్షించ‌డం అత్య‌వ‌స‌రం.