ECI Independence | భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ముందుచూపుతో నిష్పక్షపాతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘానికి కల్పించిన `స్వయం ప్రతిపత్తి`కి తూట్లు పడ్డాయి. పార్టీలూ నేతలకతీతంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఓటర్ల ప్రత్యేక సవరణ (సర్) పుణ్యమా? అని రాజ్యాంగంలో ఎన్నికల సంఘానికి కల్పించిన స్వయం ప్రతిపత్తి మంట గలిసింది.
రాజ్యాంగ నిర్మాతల ముందు చూపు
భారత రాజ్యాంగ నిర్మాతలు 80 ఏళ్ల క్రితమే `భవిష్యత్తు` పట్ల ముందు చూపుతో వ్యవహరించారు. రాయబరేలీలో అక్రమాలకు పాల్పడి ఎన్నికల్లో విజయం సాధించారని ప్రత్యర్థి రాజ్ నారాయణ్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన అలహాబాద్ హైకోర్టు.. పార్లమెంట్ సభ్యురాలిగా ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని తీర్పు చెప్పడంతో ఆమె దేశంలో ఎమర్జెన్సీ విధించారు. తత్ఫలితంగా నియంతృత్వంగా వ్యవహరించారని చెడ్డ పేరు తెచ్చుకున్నారు కానీ, ఎన్నికల సంఘం అధికారాల్లో గానీ, న్యాయస్థానాల అధికారాల్లో గానీ ఏనాడూ జోక్యం చేసుకోలేదు. మాజీ ప్రధానిగా తనను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసు అధికారికి సహకరించారు కూడా. కానీ, అభివృద్ధి, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు తదితర హామీలతో 2014లో కేంద్రంలో గద్దెనెక్కిన నరేంద్ర మోదీ సర్కార్.. పాలన వ్యవస్థలోని మూడు విభాగాల మధ్య విభజన రేఖలను చెరిపేయ బూనుకున్నది.
న్యాయవ్యవస్థ నియంత్రణకు మోదీ సర్కార్ యత్నం
నాటికే, కేంద్రంతోపాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపైనా, అవినీతి చర్యలకు వ్యతిరేకంగా స్పందిస్తున్న న్యాయ వ్యవస్థను తన ఆధీనంలోకి తీసుకోవాలని మోదీ సర్కారు తలపోసింది. ప్రజా ప్రయోజనాల రీత్యా ప్రజల నుంచి భూముల సేకరణకు 2013లో నాటి మన్మోహన్ సింగ్ సర్కారు ఆమోదించిన భూసేకరణ చట్టాన్ని నీరు గార్చేందుకు మోదీ సర్కారు తెచ్చిన ఆర్డినెన్సులను ప్రతిసారీ సుప్రీంకోర్టు కొట్టేసింది. దరిమిలా కొలీజియం వ్యవస్థ ద్వారా `ఉన్నత న్యాయస్థానాల (హైకోర్టు, సుప్రీంకోర్టు)లో న్యాయమూర్తుల` నియామకాలను అడ్డుకునేందుకు `జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టం` తీసుకొచ్చింది మోదీ సర్కారు. దీన్ని ఔదాలిస్తే న్యాయ వ్యవస్థ, సుప్రీంకోర్టు, రాష్ట్రాల హైకోర్టులకు ఉన్న స్వయం ప్రతిపత్తిని వదులుకోవడమే.
శాసన, న్యాయ, కార్య నిర్వాహక వ్యవస్థల మధ్య విభజన ఇలా
భారత రాజ్యాంగ నిర్మాతలు కూడా రాజ్యాంగంలోని శాసన వ్యవస్థ, కార్య నిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల మధ్య స్పష్టమైన విభజన రేఖలు గీశారు. శాసన వ్యవస్థ అధికారాలను న్యాయవ్యవస్థ.., న్యాయవ్యవస్థ అధికారాలను శాసన వ్యవస్థ వ్యతిరేకించరాదు. శాసన వ్యవస్థ తీసుకున్న నిర్ణయాలను సమీక్షించే అధికారం న్యాయవ్యవస్థకు ఉంది కానీ, అందులో ప్రజా ప్రయోజనాలు ఉన్నాయా? అన్న విషయం పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే శాసన వ్యవస్థ చట్టాలు చేయడానికి పరిమితం. కానీ న్యాయ వ్యవస్థ అధికారాల్లోకి చొరబడే హక్కు లేదు. ఒకవేళ ఒక వ్యవస్థ అధికారాల్లోకి మరొక వ్యవస్థ చొరబడితే రాజ్యాంగ మౌలిక సూత్రాలకే విఘాతం కలిగనట్లవుతుంది.
కొలీజియం స్థానే న్యాయ నియామకాల కమిషన్.. ఇలా డిస్మిస్
కొలీజియం వ్యవస్థను పక్కకు తప్పించే లక్ష్యంతో జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టం తేవడంతో సుప్రీంకోర్టు అప్రమత్తమైంది. ఆ కమిషన్ చట్టం ప్రకారం న్యాయమూర్తుల నియామక కమిటీలో లబ్ధ ప్రతిష్టులైన న్యాయ కోవిదులు ఉంటారు. కానీ, దానికి సరైన నిర్వచనం లేదు. అంటే, కేంద్ర ప్రభుత్వానికి నచ్చిన వారు న్యాయ కోవిదులుగా నియామక కమిటీలోకి వస్తే న్యాయమూర్తుల నియామకం ప్రభుత్వానికి అనుకూలంగా మారుతుంది. ఇది రాజ్యంగ మౌలిక స్వరూపానికే విరుద్దం. అందుకే దీనిపై అప్రమత్తమైన సుప్రీంకోర్టు ఆగమేఘాల మీద రాజ్యాంగ విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడంతోపాటు వెంటవెంటనే విచారించి `జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టా`న్ని కొట్టేసింది. ఆ సమయంలో కేంద్రం, సుప్రీంకోర్టు మధ్య సత్సంబంధాల్లో కొంత ఉద్రిక్తతలుండేవి. న్యాయమూర్తులు కూడా తర్వాతీ కాలంలో కేంద్ర నిర్ణయాలపై చూసీ చూడనట్లు వ్యవహరిస్తూ వచ్చారు.
ఈసీఐ నియామకంపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కేంద్రం ఇలా
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, ఇద్దరు కమిషనర్ల నియామక కమిటీలో ప్రధాని, విపక్ష నేతతోపాటు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సభ్యులుగా ఉండాలని సుప్రీంకోర్టు 2023లో తీర్పు చెప్పిన తర్వాతే మోదీ సర్కారు.. పార్లమెంటు ఉభయసభల్లో తనకు గల మెజారిటీని ఉపయోగించుకుని ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, ఇతర కమిషనర్ల నియామక కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పించి.. కేంద్ర మంత్రిని చేర్చారు. ఈ చట్టం ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తిని ప్రశ్నార్థకం చేస్తుందని అనూప్ బరన్వాల్, జయా ఠాకూర్ అనే వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్లు ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పరిశీలనకు ఉన్నాయి. వీటిపై విచారించిన ద్విసభ్య ధర్మాసనం.. దీన్నివిస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి సిఫారసు చేసింది. ఇక ఇదే చట్టంలో ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ పదవీ విరమణ తర్వాత కేసులు పెట్టకుండా కేంద్రం సరికొత్తగా భద్రతలు కల్పించడం ఆశ్చర్య చకితంగా ఉంది. 2023 చట్టంపై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగానే.. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ నియామకంపై నిర్ణయం తీసుకోరాదని కమిటీలో సభ్యుడిగా ఉన్న రాహుల్ గాంధీ అసమ్మతి నోటు రాశారు. కానీ, మోదీ సర్కారు వెనక్కి తగ్గక పోగా, తమకు కావాల్సిన వ్యక్తి జ్ఞానేశ్ కుమార్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌గా నియమించుకున్నది. ఆయన నియామకాన్ని రీకాల్ చేయాలని దాఖలైన పిటిషన్ తదుపరి విచారణను వచ్చే ఏడాది మే నెలకు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం వాయిదా వేసింది.
న్యాయ సమీక్ష కోసం ప్రజా బాహుళ్యం కదిలితేనే మనుగడ
తమ పరిధిలోని అధికారాలకు `అంటకత్తెర` వేస్తూ కేంద్రం తీసుకొచ్చిన జాతీయ న్యాయ మూర్తుల నియామక కమిషన్` చట్టంపై ఆగమేఘాలపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఆ చట్టాన్ని కొట్టి పారేసింది. కానీ, తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, ఇతర కమిషనర్ల నియామకానికి కేంద్రం చేసిన చట్టంతో కేంద్ర ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తిని దెబ్బ తీసిందన్నది వాస్తవం. ఇది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్దమైనా.. న్యాయ సమీక్షలోనే తేలాలి. అయితే, కేంద్రంలో సమర్థవంతమైన సర్కారు అధికారంలో ఉండటంతో న్యాయ వ్యవస్థ సైతం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో దేశ ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా మారిన కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ `సర్` ప్రక్రియను రద్దు చేయాలన్నా.. ఎన్నికల కమిషనర్ నియామక చట్టాలను రద్దు చేయాలన్న న్యాయ సమీక్షే సరైన పరిష్కార మార్గం. అందుకు అసేతు హిమాచలం అప్రమత్తమై ప్రజా బాహుళ్యాన్ని చైతన్య పరిచి.. ఆందోళనల బాట పడితేనే దేశంలో ప్రజాస్వామ్యం బతికి బట్టగట్టగలుగుతుంది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి