29.11.17

కాషాయకోటలో ముగ్గురు మొనగాళ్ల సవాల్.. మోడీకి యువ నేతల దడ

గాంధీనగర్: గుజరాత్‌లో 22 ఏళ్ల క్రితం ఒకరు బీజేపీ అధికారానికి వచ్చినప్పుడు రెండేళ్ల పసిబాలుడు, మరొకరికి పన్నెండేళ్లు, ఇంకొకరు 18 ఏండ్ల టీనేజ్ యువకుడు. ఆ వయసులో వారికి లోకం పోకడ, రాజకీయాలు తెలియవు. కానీ ఇప్పుడు ఆ ముగ్గురు ప్రజా నాయకులుగా ఎదిగారు. తమ సామాజిక వర్గాలకు నాయకత్వం వహిస్తూ గుజరాత్‌లో అధికార బీజేపీకి దడ పుట్టిస్తూ గంగ వెర్రులెత్తిస్తున్నారు. వారే పాటిదార్ రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు, పాస్ కన్వీనర్ హార్దిక్ పటేల్ (24), దళిత వర్గాల నాయకుడు జిగ్నేశ్ మేవాని (34), ఓబీసీల నేతగా ఎదిగిన అల్పేశ్ ఠాకూర్ (40).  గుజరాత్ రాష్ట్ర రాజకీయాలను శాసించగల మూడు ప్రధాన ఓటు బ్యాంకులకు ప్రాతినిధ్యం వహిస్తున్న వీరికి అపూర్వంగా ప్రజాదరణ లభించడం, పైగా తమకు ప్రత్యర్ధులుగా ఉండటంతో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వారిని ఎదుర్కొని విజయం సాధించేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తున్నది. కాకపోతే ఈ ముగ్గురు యువనేతల కారణంగా కాంగ్రెస్ పార్టీ తన సీట్ల సంఖ్యను పెంచుకోవచ్చుగాని విజయం సాధించడం కష్ట సాధ్యమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 
పాటిదార్ల ఆందోళనపై ఉక్కుపాదం మోపిన గుజరాత్ సర్కార్
‘స్ప్రింగ్ కో బహుత్ దబాయా హై (స్ప్రింగ్‌ను చాలాకాలంగా నొక్కి పెట్టారు). గత 25 ఏళ్లలో రైతులు, వ్యాపారులు సహా ప్రజలకు ఏ మేలూ జరుగలేదు. నిరసన తెలిపిన వారిని భయపెడుతున్నారు, జైళ్లకు పంపుతున్నారు. వ్యాపారులు నిరసన గళం వినిపిస్తే వారిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు జరుగుతున్నాయి. అవినీతి భారీగా పెరిగిపోయింది. ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే లక్షల రూపాయలు చెల్లించాల్సి వస్తున్నది. ఈ పరిస్థితి మారాలి. ఇందుకు సానుకూలమైన రాజకీయ ప్రత్యామ్నాయం ఏర్పడితే, పరిస్థితులు తప్పకుండా మారుతాయి' అని హార్దిక్ పటేల్ ఇటీవల పేర్కొన్నారు. హార్దిక్ సామాజికవర్గమైన పాటిదార్లు రాష్ట్రంలో 12-14 శాతం మధ్య ఉంటారు. వీరికి విద్య, ఉద్యోగాలలో ఓబీసీ రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ రెండేళ్ల క్రితం క్రితం హార్దిక్ పటేల్ ఉద్యమం ప్రారంభించారు. ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో ప్రభుత్వం ఆయనను జైలుపాలుచేసి జాతి వ్యతిరేకి అన్న ముద్ర వేసింది. పాటిదార్ల ఆందోళనపై ఉక్కుపాదం మోపింది.
పాస్ వైఖరి తేల్చని హార్దిక్ పటేల్ వ్యూహం
పాస్ కన్వీనర్ హార్దిక్ పటేల్‌ను గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల పాటు రాష్ట్ర బహిష్కారం చేసి పాటిదార్లలో లేని వ్యతిరేకత కొని తెచ్చుకున్నది. దీంతో గత రెండేళ్లలో అతని ఉద్యమానికి మద్దతు పెరిగిందే తప్ప తగ్గలేదు. వచ్చే నెలలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చిన హార్దిక్ ఏ పార్టీకి మద్దతునిస్తారన్నది మాత్రం ఇప్పటివరకూ వెల్లడించలేదు. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో ఆ పార్టీ న్యాయ విభాగం నాయకుడు కపిల్ సిబాల్ తదితరులతో పాటిదార్ ఉద్యమ నాయకులు చర్చలు జరిపారు. పాటిదార్ నాయకులతో జరిగిన చర్చల్లో కాంగ్రెస్ మూడు ప్రత్యామ్నాయాలు పెట్టినట్లు తెలుస్తోంది. పాటిదార్ నాయకులు కూడా తాము చర్చించుకుని, న్యాయ నిపుణులతో సంప్రదించాక తుది నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీకి చెప్పారు.
తొలి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఓబీసీలు అనుకూలం
‘ఓబీసీల నుంచి వ్యక్తమవుతున్న ప్రభుత్వ వ్యతిరేకతకు బీజేపీ కులం ముద్ర వేసింది. నిజానికి మతం కార్డును ప్రయోగించింది బీజేపీనే. ఇప్పుడు మా పోరాటాలకు కులం రంగు పులుముతున్నది. మేము పేదలు, అభివృద్ధి ఫలాలు అందని వారి తరఫున పోరాడుతున్నాం. బీజేపీ ఆటలు ఇక సాగవు' అని ఓబీసీల నేత అల్పేశ్ ఠాకూర్ చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేకతకు జాతి ద్రోహం ముద్ర వేస్తోంది బీజేపీ సర్కార్. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన అల్పేశ్ రాష్ట్రంలో మద్య నిషేధ చట్టాలను సక్రమంగా అమలు చేయాలని కోరుతున్నారు. గుజరాత్‌లో ఓబీసీలు 40 - 45 శాతం మధ్య ఉన్నారు. గుజరాత్‌లో తొలినుంచి దళితులు, ఓబీసీలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నారు.
ఫాసిస్టు ధోరణులను అరికట్టాలన్న జిగ్నేశ్
‘అభివృద్ధి ఫలాలు అందరికీ అందలేదు. దాదాపు అన్ని వర్గాలకు చెందినవారు ఆందోళనలు చేస్తున్నారు. అంగన్‌వాడీ వర్కర్లు, వ్యాపారులు, దళితులు, పాటిదార్లు, రైతులు పోరాడుతున్నారు. ముఖ్యంగా పెరుగుతున్న ఫాసిజం పోకడలను అరికట్టాల్సి ఉన్నది. ఈ విషయాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు. భిన్న గ్రూపుల వారు తమ వైరుధ్యాలను మరిచి ఈ ఫాసిస్టు ధోరణులను ఓడించేందుకు సమైక్యం అవుతున్నారు. గుజరాత్‌లో బీజేపీని ఓడించడం 2019లో కీలకంగా మారుతుంది. అందుకే సిద్ధాంతాల విషయంలోనూ రాజీపడేందుకు సిద్ధపడ్డాను' అని దళిత నేత జిగ్నేశ్ మేవాని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏడు శాతం ఉన్న దళితులు ఉనా ఘటన తరువాత సంఘటితం అయ్యారు. గోవధపై నిషేధాన్ని అడ్డంపెట్టుకొని జరిగిన దాడులు కూడా దళితులను సంఘటితం చేశాయి. వచ్చే నెల 9, 14 తేదీల్లో రెండు దఫాలుగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.
పట్టణ యువతపైనే కమలనాథుల ఆశలు
గుజరాత్‌లో గత 22 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీకి ఇప్పుడు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఓవైపు ప్రభుత్వ వ్యతిరేకత, మరోవైపు పుంజుకుంటున్న ప్రతిపక్ష కాంగ్రెస్, ఇంకోవైపు ముగ్గురు యువ నేతల వెనుకనున్న వర్గాలను తమవైపునకు తిప్పుకోవడం.. ఈ మూడు అంశాలకు బీజేపీ వేర్వేరు వ్యూహాలు రచిస్తున్నది. ఎన్ని ప్రతికూల అంశాలు ఉన్నా బీజేపీ మరోసారి 10 శాతం ఓట్ల తేడాతో అధికారానికి వస్తుందని ముందస్తు సర్వేలు పేర్కొంటున్నాయి. అసెంబ్లీలో 182 సీట్లుండగా, ఈ ఎన్నికల్లో కనీసం 150 స్థానాలు గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నది. ఇటీవల కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రకటించడం, కనీసం 50 బహిరంగ సభల్లో ప్రధాని మోదీ పాల్గొననుండటం తమకు కలిసి వస్తుందని బీజేపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. అధిక సంఖ్యలో ఉన్న పట్టణ, నగరాల ఓటర్లు మరోసారి తమకే పట్టం కడుతారని ఆ నాయకులు ఆశలు పెట్టుకున్నారు.
Saturday, November 11, 2017, 15:14 [IST]

జవాబులు లేని ప్రశ్నలు?: ‘మేధోమథన’ సంస్థలో డైరెక్టర్లు కేంద్ర మంత్రులు: ఇండియా ఫౌండేషన్ దూకుడు

న్యూఢిల్లీ : అది ఒక చిన్న సంస్థ. కేరళలో అతివాద ఇస్లాం, ఆదివాసీల బలవంతపు మత మార్పిళ్లు తదితర అంశాలపై దాదాపు 2009 నుంచి మోనాగ్రాఫులు రూపొందిస్తూ వచ్చిన చిన్నపాటి స్వచ్చంధ సంస్థ.. దాని పేరు ఇండియన్ ఫౌండేషన్. అటువంటి చిన్న సంస్థ 2014 తర్వాత అనతికాలంలోనే ఊహించనంత బడా సంస్థగా మారిపోయింది. ప్రస్తుతం భారతదేశంలోనే అత్యంత ప్రభావశీలమైన 'మేథో మథన' వేదికల్లో ఒకటిగా ఆ సంస్థగా నిలిచింది. విదేశీ, స్వదేశీ కార్పొరేట్ పారిశ్రామిక పెద్దలు, కేంద్ర మంత్రులు చర్చల ద్వారా తమకు అనువైన ప్రభుత్వ విధానాలను రూపొందించుకొనేందుకు వీలైన వేదికగా ఎదిగింది. చిన్నపాటి సంస్థ స్వల్పకాలంలోనే అంత ఉన్నత స్థానానికి ఎలా ఎగబాకింది? దీనివెనుక ఎవరున్నారు? ఈ ప్రశ్నలకు జవాబులు అన్వేషిస్తూ 'ద వైర్‌' అనే వెబ్ సైట్ సాగించిన పరిశీలనలో ఆశ్చర్యపోయే అంశాలు వెలుగు చూశాయి. 
డైరెక్టర్లుగా కేంద్ర మంత్రులు నైతికతకు విరుద్ధం 
ఇండియా ఫౌండేషన్‌ సంస్థ జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ దోవల్‌ తనయుడు శౌర్య దోవల్‌కు చెందింది కావడం ఒక విశేషమైతే, కేంద్ర మంత్రులు ఇందులో డైరెక్టర్లుగా ఉండటం మరో ఆసక్తికర పరిణామం. ఒక జాతీయ భద్రతా సలహాదారు తనయుడిగా భారత రాజకీయాల్లో నూతన వారసత్వం నెరిపేందుకు పూనుకున్నారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వేతర సంస్థల్లో డైరెక్టర్ స్థాయి పదవులను కేంద్ర మంత్రులు నిర్వహించడం నైతికతకు విరుద్ధం. ఒక రాజకీయ పార్టీ కానీ, ప్రధానకార్యదర్శి పదవుల్లో ఉన్నవారు వ్యక్తిగతంగా కానీ విదేశాల నుంచి నిధులు తీసుకోవడం నిబంధనలకు విరుద్ధం. 
ఇండియా ఫౌండేషన్ డైరెక్టర్లుగా మంత్రుల సమాధానమే కరువు 
గతంలో సోనియాగాంధీ అధికార యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ (యూపీఏ) చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు విపక్షంలో బీజేపీ చేసిన నానా యాగీ అంతా ఇంతా కాదు.. దీంతో ఆమె తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసి, మళ్లీ గెలిచారు. ఫైనాన్షియల్‌ సేవలందించే బడా వాణిజ్య సంస్థ 'జెమినీ ఫైనాన్షియల్‌ సర్వీ సెస్‌' కంపెనీలో భాగస్వామి శౌర్య దోవల్‌. ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న స్వచ్చంధ సంస్థ ఇండియా ఫౌండేషన్‌లో డైరెక్టర్లు కేంద్ర మంత్రులు సురేశ్ ప్రభు, నిర్మలా సీతారామన్, జయంత్ సిన్హా, ఎంజె అక్బర్‌లతోపాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్. గతంలో సోనియాపై విమర్శలకు సారథ్యం వహించిన బీజేపీ నేతలుగా వారు రాజీనామా చేసేందుకు సిద్ధమేనా? అంటే సమాధానమే కరువవుతోంది. 
వివరణకు, వాస్తవాలకు పొంతన కరువు 
తమ ఫౌండేషన్, అందులో డైరెక్టర్లకు వాణిజ్య ప్రయోజనాలతోగాని, వ్యక్తిగత ప్రయోజనాలతో గానీ సంబంధం లేదని ఇండియా ఫౌండేషన్ డైరెక్టర్ శౌర్య దోవల్ వివరణ ఇచ్చారు. ఈశాన్య భారతంలో ప్రగతి, భారతదేశంలో పెట్టుబడుల వాతావరణం, భౌగోళిక రాజకీయాలు, సంస్క్రుతి తదితర అంశాలపై సమావేశాలు ఏర్పాటు చేయడమే తమ ఫౌండేషన్ ఎజెండా అని సెలవిచ్చారు శౌర్య దోవల్. విదేశీ విరాళాలు స్వీకరించడం లేదని కూడా చెప్పారు. తమ సంస్థ పూర్తిగా పారదర్శకంగా పని చేస్తున్నదని పేర్కొన్న శౌర్య దోవల్.. తనకు సదరు వెబ్ సైట్ పంపిన ప్రశ్నావళిపై స్పందించేందుకు నిరాకరించడం గమనార్హం. ఇక మంత్రులుగా ఉన్న వారిలో నిర్మలా సీతారామన్, సురేశ్ ప్రభు తదితరులు స్పందించిన పాపాన పోలేదు. శౌర్య దోవల్ వివరణకు, వాస్తవాలకు పొంతన లేకుండా ఉన్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 
ప్రధాని మోదీ ప్రకటనకు.. ఆచరణకు భిన్నమైన వైనం 
ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ కో ఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఒఇసిడి) సభ్య దేశాలకు, ఆసియా దేశాలకు మధ్య వాణిజ్య లావాదేవీలు, పెట్టుబడుల రాక వంటి విషయాల్లో జెమిని ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కంపెనీ 'లాబీయింగ్‌' వంటి ప్రత్యేక సేవలు అందిస్తుంది. 'శక్తి కేంద్రాలను (పవర్‌ కారిడార్స్‌) పూర్తిగా తుడిచేస్తాం' అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన హామీని శౌర్య దోవల్‌ నిర్వహిస్తున్న పాత్ర నీరు గార్చేలా ఉన్నది. జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ దోవల్‌ తనయుడుగా శౌర్య దోవల్‌ అత్యంత రాజకీయ ప్రభావం చూపగలగడం 'యాధృచ్చికం'గానే భావించినా మొన్న సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రా భాగస్వామిగా ఉన్న ఒక ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సంస్థ సౌదీ రాజుతో రక్షణ ఒప్పందాల ద్వారా అయాచిత లబ్ది పొందిందన్న ఆరోపణలు, నిన్న అమిత్‌ షా తనయుడు జయ్‌షా కంపెనీల బాగోతంగా, ఇప్పుడు శౌర్య దోవల్‌ వ్యవహారం దేశంలో రాజకీయ, ప్రభుత్వ వ్యవహారాల సమ్మిళితంగా 'కొత్తరకం వారసత్వ దోపిడి పోకడ'గా మారనున్నదని రాజకీయ విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు. 
సంస్థ కార్యక్రమాలకు జాతీయ, అంతర్జాతీయ సంస్థల స్పాన్షర్షిప్ 
ఇండియా ఫౌండేషన్‌లో ఏకంగా నలుగురు కేంద్ర మంత్రులు, ఆరెస్సెస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ప్రధాన కార్యదర్శి డైరెక్టర్లుగా ఉండి, ప్రధానమంత్రి కార్యాలయంలో అత్యంత ప్రభావశీల పదవిలో తండ్రిని కలిగి ఉన్న ఒక వ్యాపారవేత్త నిర్వహణలో 'ఇండియా ఫౌండేషన్‌' దేశంలోనే అత్యంత ప్రభావశీల మేధో మథన సంస్థగా మారడం వెనుక ఏం జరిగి ఉంటుందో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సంస్థ నిర్వహించిన ప్రతి కార్యక్రమానికీ ఆయా రంగాల్లోని కీలక నిర్ణయాలు తీసుకునే నాయకులు, ఉన్నతాధికారులతోపాటు దేశ, విదేశాలకు చెందిన ప్రయివేటు కంపెనీల ప్రతినిధులు హాజరౌతారు. కేవలం హాజరు కావడమే కాదు.ఇండియా ఫౌండేషన్‌ కార్యక్రమాలకు పోషకులు (స్పాన్షర్‌షిప్‌)గా ఉంటారు. ఇంతటి 'గొప్ప విజయం', గొప్ప బలహీనత వెనుక పలు అంశాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. 
వ్యాపార కార్యకలాపాల నిర్వహణకు అనుమతించని నిబంధనలు 
ఒకటి ఆయాచిత లబ్ది, లాయిబీంగ్‌ చేసి ప్రభుత్వం నుంచి ప్రాజెక్టులు దక్కేలా చేసినందుకు గాను స్వదేశీ, విదేశీ బడా కంపెనీలు ఫౌండేషన్‌ 'కార్యక్రమాల'కు స్పాన్షర్‌షిప్‌ పేరుతో ప్రోత్సాహం అందిస్తున్నారు. వాస్తవానికి ఇండియా ఫౌండేషన్‌ స్వచ్ఛంద సంస్థగా ఉన్నందున వ్యాపార కార్యకలాపాలు నిర్వహించరాదు. ఆదాయ వ్యయాల పత్రాలను కూడా ఒక ట్రస్టుగా బహిర్గతం చేయాలి. నలుగురు కేంద్ర మంత్రులు డైరెక్టర్లుగా ఉన్న ఈ సంస్థ ఆదాయ వనరులపై 'ద వైర్‌' అడిగిన ప్రశ్నలకు కనీసం సమాధానం ఇచ్చేందుకు కూడా నిరాకరించింది. ఈ సంస్థలోని ఆరుగురు డైరెక్టర్లకు ప్రశ్నావళి పంపితే డైరెక్టర్లుగా ఉన్న మంత్రులెవ్వరూ కనీసం స్పందించలేదు. బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌ మాత్రం 'తగిన వ్యక్తి స్పందిస్తారని' మాత్రమే బదులిచ్చారు. 
పార్టీ, పార్టీ నేతలు విదేశీ నిధుల నిరాకరణ కుదరదు  
వాస్తవంగా ప్రజాప్రతినిధులుగా ఉన్న వారు ఆదాయం వచ్చే పదవుల్లో కొనసాగరాదు. కానీ ఇక్కడ కేంద్ర మంత్రులే డైరెక్టర్లుగా ఉన్నారు. మరో ముఖ్యమైన అంశం ‘విదేశీ విరాళాల నియంత్రణ చట్టం -2010'లోని సెక్షన్‌ 3 ప్రకారం ఏ రాజకీయ పార్టీ కానీ, దాని ఆఫీస్‌ బేరర్లు కానీ విదేశీ నిధులు స్వీకరించరాదు. ఇండియా ఫౌండేషన్‌ డైరెక్టర్లలో ఒకరిగా ఉన్న రామ్‌ మాధవ్‌ బిజెపి ప్రధానకార్యదర్శిగా కొనసాగుతున్నారు. అందువల్ల ఇదంతా కచ్చితంగా నేరమే అవుతుందని, దీనిపై విచారణ చేపట్టాలని నిపుణులు చెబుతున్నారు. ఆదాయ వనరులపై ప్రశ్నించగా శౌర్య దోవల్‌ మాత్రం 'సదస్సులు, ప్రకటనలు, జర్నల్‌' ద్వారా లభించినట్లు చెప్పారు. అయితే ట్రస్టుగా నమోదైన సంస్థ రోజువారీ వ్యాపారాలు ఎలా నిర్వహిస్తుంది? అసలు ఎవ్వరెవ్వరు ఎంతెంత ఇచ్చారు? ట్రస్టు కార్యాలయాన్ని ఎలా అద్దెకు ఇస్తారు? ఇలాంటి ప్రశ్నావళికి మాత్రం బదులివ్వలేదు. 
కంపెనీల విరాళాలు ఎంతో వెల్లడికి నిరాకరణ 
'స్మార్ట్‌ బోర్డర్‌ మేనేజ్‌మెంట్‌' పేరుతో ఇండియా ఫౌండేషన్‌ నిర్వహించిన రెండు కార్యక్రమాల్లో ఇదొకటి. వేదిక పోస్టర్లపై చూడండి ఈ కార్యక్రమాలను స్పాన్షర్‌ చేస్తున్న కంపెనీల పేర్లు చూడండి. అన్నీ కూడా బోయింగ్‌, ఇజ్రాయెల్‌ కంపెనీ మేగల్‌ వంటి విదేశీ రక్షణ, వైమానిక కంపెనీలే. డిబిఎస్‌ వంటి విదేశీ బ్యాంకులు కూడా ఇండియా ఫౌండేషన్‌ స్పాన్షర్‌షిప్‌ల్లో ఉన్నాయి. భారత్‌కు చెందిన అనేక కార్పొరేట్‌ కంపెనీలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. అయితే ఈ కార్యక్రమాల నిర్వహణకు ఈ కంపెనీలు ఎంత చెల్లించాయి? ఎవరికి చెల్లించాయి? అనే ప్రశ్నలకు మాత్రం ఇండియా ఫౌండేషన్‌ బదులివ్వడం లేదు. 
మంత్రులు రాజీనామా చేయాల్సిందే 
ఇండియా ఫౌండేషన్‌పై ద వైర్ లేవనెత్తిన పలు ప్రశ్నలకు కేంద్ర మంత్రులు గానీ, శౌర్య దోవల్‌ కానీ సమాధానాలు ఇవ్వక పోవడంతో కేంద్ర ప్రభుత్వంపై విపక్ష పార్టీలు చెరిగాయి. జవాబు చెప్పలేని మంత్రులు పదవులకు రాజీనామా చేయాల్సిందేనని సిపిఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్‌ చేశారు. ఇండియా ఫౌండేషన్‌ డైరెక్టర్లు మంత్రులను తక్షణమే మంత్రి పదవుల నుంచి తొలగించాలని కాంగ్రెస్‌ పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని డిమాండ్‌ చేసింది. 'సమాధానాలు చెప్పలేని ప్రశ్నలు చాలా మిగిలిపోయాయి. అయాచిత లబ్దికి ఇదే నిదర్శనం. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న మంత్రులు ఇంకా పదువుల్లోనే కొనసాగుతున్నారు. వారంతా కచ్చితంగా రాజీనామా చేయాలి' అని ఏచూరి డిమాండ్‌ చేశారు. 
ఆయాచిత లబ్దికి నిదర్శనమన్న కాంగ్రెస్ 
కేంద్ర మంత్రి పదవుల్లో ఉన్నవారు ప్రభుత్వేతర సంస్థకు డైరెక్టర్లుగా ఎలా ఉంటారనీ, ఇదే అయాచిత లబ్దికి ప్రత్యక్ష నిదర్శనమని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ విమర్శించారు. డైరెక్టర్లుగా వారి ప్రయోజనాలు వారు పొందుతుంటారనీ, అందువల్ల ఇది కూడా పదవిని అడ్డుపెట్టుకొని లాభాలు గడించడమే అవుతుందని ఆయన అన్నారు. జాతీయ సలహా మండలి (ఎన్‌ఏసి) ఛైర్‌పర్సన్‌ పదవి చేపట్టిన సమయంలో పార్లమెంటు సభ్యత్వానికి తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రాజీనామా చేశారనీ ఆయన గుర్తు చేశారు. ఆమె కనీసం కేంద్ర మంత్రి కూడా కాదని, అయినా పార్లమెంటులో బిజెపి వాళ్లు రభస చేశారనీ, వారంతా ఇప్పుడేమంటారనీ సిబల్‌ నిలదీశారు.  
Story first published: Tuesday, November 7, 2017, 11:37

వైద్య విద్యపై ఆశలు: పిల్లలపై మానసిక ఒత్తిళ్లు..అశాస్త్రీయ బోధన

హైదరాబాద్: వైద్యో నారాయణో హరి అన్నది నానుడి. కానీ వైద్య విద్యలో సీటు వస్తుందో రాదోనని విద్యార్థినీ విద్యార్థులు తమకు 'ఎ' కేటగిరీ సీటు దక్కకుంటే భవిష్యత్ లేదన భావన వారిలో పెరిగిపోతున్నది. కలతతో ఉన్న విద్యార్థులపట్ల కార్పొరేట్‌ కళాశాలల యాజమాన్యాలు అవలంబించే అశాస్త్రీయ విధానాలతో తీవ్ర మానసిక ఒత్తిడికిలోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గతానికి భిన్నంగా ఈసారి జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) దీర్ఘకాలిక శిక్షణ పొందుతున్న వారి ఆత్మహత్యలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అందులోనూ కార్పొరేట్‌ కళాశాలల్లో చదువుతున్న వారే ఆత్మహత్యకు పాల్పడుతుండటం గమనార్హం.  ఈ ఏడాది ఆగస్టు నుంచి ఇంటర్ చదువుతున్న, పూర్తై శిక్షణ పొందుతున్న నలుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అందులో ఇద్దరు బాలురు బాలురు, ఇద్దరు బాలికలు. బాలురిద్దరు ఇంటర్‌ ఎంపీసీ చదువుతుండగా, బాలికలిద్దరూ నీట్‌ దీర్ఘకాలిక శిక్షణ పొందుతున్న వారు కావడం గమనార్హం. ఇంటి నుంచి అదృశ్యమైన సాయి ప్రజ్వల కూడా నీట్‌ లాంగ్‌టర్మ్‌ విద్యార్థినే కావడం గమనార్హం. ఎంబీబీఎస్‌ సీటు రాదనే భయంతో ఒత్తిడికి లోనై ఆత్మహత్యకు పాల్పడినట్లు నీట్‌ విద్యార్థుల ఆత్మహత్య లేఖలను బట్టి తెలుస్తోంది. 
ఇలా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆకాంక్షలు 
వాస్తవంగా కళాశాలల యాజమాన్యాల ఒత్తిడి ఒకలా ఉంటే విద్యార్థుల తల్లిదండ్రుల ఆశలు, ఆకాంక్షలు కూడా పిల్లలను మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నాయి. పిల్లల ఇష్టానికి వదిలేస్తే సమస్యలు తలెత్తవు. వైద్య విద్య ఎంత ఉత్క్రుష్టమైనదో అంతకంటే ఎక్కువ విలువైన జీవితం. ఆ విషయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పరిగణనలోకి తీసుకుని తమ ఆశలు, ఆకాంక్షలకు తావు లేకుండా ఒత్తిళ్లకు అతీతంగా, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఇష్టంగా ముందుకెళ్లిన విద్యార్థులు మాత్రమే విజయం సాధించగలరని పరిణామాలు చెప్తున్నాయి. తల్లిదండ్రుల ఒత్తిళ్ల మేరకు చేరిన విద్యార్థుల మానసిక పరిస్థితి విభిన్నంగా ఉంటోంది. దీనికి తోడు కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు కూడా విద్యార్థులపై (ఇప్పుడిప్పుడే మనోవికాసం పెరుగుతున్న వేళ) బలవంతపు ఆజమాయిషీ చేయడం కూడా ఇబ్బందులకు కారణమవుతున్నది. ఈ వైఖరికి భిన్నంగా వ్యవహరించగలిగితే పరిస్థితులు మెరుగ్గా ఉంటాయని విద్యావేత్తలు, మానసిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 
సీ కేటగిరీ సీట్ల ఫీజు తడిసి మోపెడు 
గత ఏడాది నుంచి ఎంబీబీఎస్‌ బీ, సి కేటగిరీ సీట్ల ఫీజులు భారీగా పెరిగాయి. కన్వీనర్‌ కోటా (ఎ కేటగిరీ) సీటు దక్కకుంటే బీ కేటగిరీ లేదా సీ కేటగిరీకి వెళ్లాల్సిందే. బి కేటగిరీ సీటు వార్షిక ఫీజు రూ.11 లక్షలు, ఇక సి కేటగిరీ దానికి రెట్టింపు ఉంది. దాంతో అసలే తక్కువ సీట్లు ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. కన్వీనర్‌ సీటు రాకుంటే భారీ ఫీజులు చెల్లించి వైద్య విద్యను అభ్యసించలేమని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కళాశాలల యాజమాన్యాలు వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి మనోస్థైర్యం కోల్పోకుండా చర్యలు తీసుకోవడానికి బదులు ర్యాంకుల కోసం మరింత ఒత్తిడి పెంచుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. నీట్‌ ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయిస్తుండటం.. అందులో మైనస్‌ మార్కులు ఉండటం కూడా విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. 
ఓసీ విద్యార్థులకు 450 మార్కులు దాటితేనే.. 
కళాశాలలు పెట్టే పరీక్షల్లో 720 మార్కులకు 450కి తగ్గితే ఇక సీటు రావడం (ఓసీలకు) కష్టమేనని విద్యార్థులు అంచనాకు వస్తున్నారు. మార్కుల స్థాయి పెరగకుంటే ఇక లాభం లేదని ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ర్యాంకుల కోసం కార్పొరేట్‌ కళాశాలలు విద్యార్థులపై మరింత ఒత్తిడి పెంచుతున్నాయి. ఉదయం ఐదు గంటలకు నిద్రలేస్తే రాత్రి 10 గంటల వరకు ఊపిరి సలపకుండా బోధించడం, చదివించడం చేస్తున్నారు. నిద్ర సరిపోక.. సమయం లేక పలువురు విద్యార్థులు ప్రతిరోజూ స్నానాలు కూడా చేయని పరిస్థితి నెలకొంది. స్టడీ అవర్‌లోనూ యాజమాన్యాలు చెప్పిందే చదవాలి. తాను ఒక సబ్జెక్టులో వెనకబడి ఉన్నానని.. దాన్ని చదువుకుంటానన్నా వీల్లేదు. ఎంబీబీఎస్‌ సీట్లు తక్కువ.. పోటీ ఎక్కువ ఉన్నందున ఒత్తిడి తీవ్రంగా ఉంటుందనే విషయం యాజమాన్యాలకు తెలిసినా ఏ మాత్రం ఆటలు, వినోదానికి సమయం కేటాయించడం లేదు. ‘జైల్లో ఖైదీలనైనా కాస్సేపు గాలి మార్పు కోసం ప్రాంగణంలోకి వదులుతారు గానీ.. కళాశాలలల్లో విద్యార్థులను మాత్రం వదలడం లేదు' అని గతంలో కార్పొరేట్‌ కళాశాలలో పనిచేసిన అధ్యాపకుడు వ్యాఖ్యానించడం గమనార్హం. 
కళాశాలల్లో సమస్యల వల్లే బలవన్మరణాలని ఇలా 
ఆగస్టు రెండో తేదీన ఆత్మహత్యకు పాల్పడిన ఓ విద్యార్థి తన తండ్రి లేఖ రాస్తూ ‘నాన్న.. నాకు అన్నయ్య మాదిరిగా మార్కులు రావడం లేదు. మెడిసిన్ సీటు రాదు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా.. క్షమించండి' అని సూసైడ్ నోట్ పెట్టారు. ఈ నెల 12న మాదాపూర్ శ్రీ చైతన్య కళాశాలలో నీట్ శిక్షణ పొందుతున్న సంయుక్త అనే విద్యార్థిని తన తల్లిదండ్రులకు చెడ్డ పేరు తీసుకొస్తానని భయంగా ఉన్నదని, ఇప్పుడు బాగా చదవలేకపోతున్నానని, ఈ తరుణంలో చావే తనకు శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తూ సూసైడ్ నోట్ రాసి పెట్టి మరీ బలవ్మరణానికి పాల్పడ్డారు. ఇక ఈ నెల 15వ తేదీన అద్రుశ్యమైన సాయి ప్రజ్వల ‘అందరినీ మిస్ అవుతున్నా. ఈ కళాశాల వేస్ట్. అక్కడి సమస్యలతోనే విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు' అని బండ్లగూడ నారాయణ కాలేజీలో పరిస్థితులను వివరించారు. 
ఇంటర్ గురుకుల విధాన నిబంధనలే లేవు 
ఇంటర్‌బోర్డు కేవలం కళాశాలలకు మాత్రమే అనుమతులు ఇస్తోంది. అసలు రెసిడెన్షియల్‌ కళాశాలల విధానమే బోర్డు నిబంధనల్లో లేకపోవడం గమనార్హం. దానివల్ల కార్పొరేట్‌ రెసిడెన్షియల్‌ కళాశాలలపై ప్రభుత్వ నియంత్రణ దాదాపు శూన్యం. బోర్డు అధికారులు తనిఖీ చేయబోతే అవి విద్యార్థులు నిర్వహించుకుంటున్న వసతిగృహాలు (స్టూడెంట్స్‌ మేనేజ్‌మెంట్‌ హాస్టళ్లు) అని యాజమాన్యాలు బుకాయిస్తున్నాయి. అందుకే కార్పొరేట్‌ కళాశాలలు కూడా ఎక్కడా దొరకకుండా కేవలం కళాశాల అని మాత్రమే బోర్డులపై రాస్తున్నాయి. ఇప్పటికైనా రెసిడెన్షియల్‌ కళాశాలలకు నిబంధనలు రూపొందించి ఆ మేరకు అనుమతులు ఇస్తే చర్యలు తీసుకోవడానికి, తనిఖీలకు అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. స్థానిక సంస్థలు, ఆర్‌అండ్‌బీ, ప్రజారోగ్యం, రెవెన్యూ, పోలీసు యంత్రాంగాలతో బృందాలను నియమించి తరచూ తనిఖీలు చేసేలా చర్యలు తీసుకోవాలని విద్యావేత్తలు కోరుతున్నారు. ఆచార్య నీరజారెడ్డి కమిషన్‌ సూచించినట్లుగా ఉదయం ఏడు గంటల లోపు, రాత్రి తొమ్మిది గంటల తర్వాత విద్యాబోధన గానీ, స్టడీ అవర్లు గానీ ఉండకూడదు. కానీ, ఈ అంశాన్ని ఇంటర్‌బోర్డు పట్టించుకోవడం లేదు. ప్రైవేట్‌ పాఠశాలలకు వెయ్యి చదరపు మీటర్ల ఆట స్థలం తప్పనిసరనే నిబంధన ఉంది. విపరీతమైన ఒత్తిడితో చదువును కొనసాగించే కార్పొరేట్‌ కళాశాలలు మాత్రం ఈ నిబంధనలను పాటించకపోవడం గమనార్హం. 
ప్రభుత్వ కాలేజీల్లో 1000 సీట్లతో పోటీ తీవ్రతరం 
తెలంగాణ నుంచి నీట్‌ రాస్తున్న వారు50 వేల మంది ఉంటే వారిలో నీట్‌ దీర్ఘకాలిక శిక్షణ పొందుతున్న వారు సుమారు 20,000 మంది విద్యార్థులు ఉంటారు. మూడోసారీ శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు దాదాపు 3,000 మంది ఉంటారు. ఇక ఎంబీబీఎస్‌‌లో ఏ కేటగిరీ కింద 2075 సీట్లకు ఏడాది ఫీజు రూ.60 వేలు చెల్లించాలి. బీ కేటగిరీలో 718 సీట్లలో చేరే వారు ఏటా రూ.11 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక మేనేజ్మెంట్ కోటా సి కేటగిరీ 207 సీట్లు ఉన్నాయి. సీ కేటగిరీలో చేరే విద్యార్థులు బీ కేటగిరీ కంటే రెండు రెట్లు అధికంగా రూ.22 లక్షల వరకు ఫీజు చెల్లించాల్సి వస్తుంది. 
Updated: Tuesday, October 17, 2017, 9:40 [IST]

23.11.17

పొత్తుకు కెసిఆర్, చంద్రబాబు సై: ‘వెల్‌కమ్’ సూత్రధారులు వీరే

హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పొత్తుల గురించి అధికార పార్టీల మధ్య చర్చలు మొదలయ్యాయి. ప్రత్యేకించి 'వెలమ', 'కమ్మ' సామాజిక వర్గాల మధ్య ఐక్యత కోసం ఇరు పార్టీల నేతలు ముందడుగు వేశారు. ఇటు తెలంగాణలో అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు అత్యంత విశ్వాసపాత్రుడు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, అటు ఏపీలో అధికార టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు, సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు గరికపాటి మోహనరావు చొరవ చూపారు. తుమ్మల నాగేశ్వర్ రావు, గరికపాటి మోహనరావు అత్యంత సన్నిహిత బంధువులు. 2014లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వరంగల్ జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు గరికపాటి మోహన్‌రావు ఎన్నికయ్యారు. ఇదే గరికపాటి మోహనరావు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడాన్ని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు వ్యతిరేకించడం గమనార్హం. 
వారిద్దరికి అధికారమే ప్రధానమే 
మరో గమ్మత్తేమిటంటే ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్‌కు నమ్మకస్తుడిగా పేరొందిన రాష్ట్రమంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు 1995 - 2014 వరకు టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుల్లో ఒకరు. తెలంగాణ సీఎం కేసీఆర్ మినహా మిగతా వారంతా ‘కమ్మ'టి సామాజిక వర్గ నేతలే కావడం ఆసక్తికర పరిణామం. ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్.. అటు ఏపీ సీఎం చంద్రబాబులకు అధికారం వారి చేతిలో ఉండటమే ప్రధానమని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. 
టీఆర్ఎస్, టీడీపీ మధ్య సుదీర్ఘ చర్చలు 
2015లో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ‘ఓటుకు నోటు' కేసులో చిక్కిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని తెలంగాణ సీఎం కేసీఆర్.. రెడ్ హ్యాండెడ్ ప్రజల ముందు దోషిగా నిలిపిన తర్వాత ఆగమేఘాలపై చంద్రబాబు తన రాజకీయ, పాలనా కార్యకలాపాలను విజయవాడకు మార్చేశారు. ఏడాది అహర్నిశలు కష్టపడి 2016లోనే సచివాలయం, పిమ్మట అసెంబ్లీ భవన నిర్మాణాలు పూర్తి చేసేశారు. తాజాగా పాలనా వ్యవహారాలన్నీ బెజవాడ, అమరావతి కేంద్రంగానే సాగిస్తున్నారు. కానీ రెండేళ్ల తర్వాత హఠాత్‌గా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మధ్య.. వెలమ, కమ్మ సామాజిక వర్గాల కొత్తగా కుదిరిన ‘కొత్త స్నేహా'నికి అర్థమేమిటో, నేపథ్యమేమిటో తెలియడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓటుకు నోటు కేసు తర్వాత టీడీపీ, టీఆర్ఎస్ మధ్య భారీ స్థాయిలోనే తెర వెనుక చర్చలు, సంప్రదింపులు జరిగాయని చెప్తున్నారు. 
ఫిరాయింపులపై హైకోర్టులో ఎర్రబెల్లి పిటిషన్ ఇలా 
ఇరు పార్టీల తరఫున తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఏపీ తరఫున రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహనరావు విస్త్రుత ప్రాతిపదికన భారీగా చర్చలు జరిపారు. ఇదీ కూడా టీడీపీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి ఎమ్మెల్యేల ఫిరాయింపులకు వ్యతిరేకంగా అప్పటి టీడీపీ శాసనసభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాకే జరిగింది. తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ‘టీఆర్ఎస్' పార్టీ ‘కారు' ఎక్కేశారు. ఎర్రబెల్లి స్థానే టీడీఎల్పీ నేతగా ఎన్నికైన రేవంత్ రెడ్డి.. ఫిరాయింపుదార్ల అనర్హత కోసం పిటిషన్ దాఖలు చేయాలని ప్రయత్నించినప్పుడు ఏపీ సీఎం - టీడీపీ అధినేత చంద్రబాబు వద్దని నిలువరించారని సమాచారం. 
ముందు మోత్కుపల్లి.. తర్వాత గరికపాటికి రాజ్యసభ సీటు 
తుమ్మల నాగేశ్వర్ రావు, గరికపాటి మోహన్‌రావు మధ్య కుదిరిన ఒప్పందం మేరకు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 17 స్థానాలు టీడీపీకి కేటాయించేందుకు టీఆర్ఎస్ అంగీకరించినట్లు సమాచారం. 2019లో గెలుపొందితే రాష్ట్ర మంత్రివర్గంలో ఇద్దరికి చోటు కల్పించారని తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చిలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు, 2020లో గరికపాటి మోహన్ రావుకు రెండోసారి రాజ్యసభ సభ్యత్వం కల్పించేందుకు టీఆర్ఎస్ నాయకత్వం సుముఖత వ్యక్తం చేసింది. 
వెల్‌కం ప్రతిపాదనకు రేవంత్ తదితరులు వ్యతిరేకత
 దీనికి ప్రతిగా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా కమ్మ సామాజిక వర్గం ఓటర్లను మళ్లించాలన్నది రాజీ ప్రతిపాదన. ఇప్పటి వరకు టీఆర్ఎస్‌తో అనునిత్యం ఘర్షణకు పడుతున్న రేవంత్ రెడ్డి, ఇతర రెడ్డి సామాజిక వర్గానికి టీడీపీ - టీఆర్ఎస్ మధ్య కుదిరిన అవగాహన ఆగ్రహాన్ని తెచ్చి పెట్టింది. టీడీపీ - టీఆర్ఎస్ పార్టీల పొత్తు ప్రతిపాదనపై మౌనంగా ఉండేందుకు సిద్ధంగా లేక కాంగ్రెస్ పార్టీలో చేరిపోయేందుకు నిర్ణయించుకున్నారని తెలుస్తున్నది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా తిరిగి ఆంధ్రప్రదేశ్‌లో అధికారాన్ని కైవసం చేసుకోవాలన్న సంకల్పంతో ఉన్నందున దాని కోసం వ్యూహాత్మకంగా తెలంగాణలో టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోవాలని అభిలషిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల్లో పొత్తు విషయమై ఎటువంటి ప్రకటన చేయొద్దని తెలంగాణ టీడీపీ నేతలకు చంద్రబాబు హితబోధ చేశారే గానీ పొత్తు ఉండదని మాత్రం ప్రకటించలేదు. తద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ఉంటుందని స్పష్టమైన సంకేతాలిచ్చారు టీడీపీ అధినేత. కేసీఆర్ ద్వారా సీమాంధ్రలో టీడీపీకి మద్దతు? ఇటీవల అనంతపురం జిల్లా వెంకటాపురంలో ఏపీ మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరాం పెళ్లి సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ వేర్వేరు భేటీల సారాంశమే 2019లో ఎన్నికల పొత్తును బయటపెట్టింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారానికి దూరం చేసేందుకు టీఆర్ఎస్ పార్టీకి మద్దతునివ్వడం తప్పనిసరని టీడీపీ భావిస్తున్నది. తెలంగాణ సీఎం కేసీఆర్ సాయంతో సీమాంధ్రలోని తెలంగాణ ప్రజల మద్దతును ఏపీలో టీడీపీకి అనుకూలంగా కూడగట్టాలని చంద్రబాబు తలపోస్తున్నారు. టీడీపీ పొత్తుతో గత్యంతరం లేదని గులాబీ బాస్ ఇలా ఉద్యోగాలు, ప్రొఫెషన్ రీత్యా హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లో జీవిస్తున్న లక్షల మంది ఆంధ్రప్రదేశ్ వాసులే. హైదరాబాద్ నగరం, దాని శివారుల్లో నివసిస్తున్న సీమాంధ్రకు చెందిన లక్షల కుటుంబాల్లో చాలా మంది తమ కుటుంబాలకు చంద్రబాబు మద్దతు కావాలని కోరుతున్నారు. ఎందుకంటే వారంతా ఏపీలో టీడీపీకి ఓటేస్తున్న వారు కావడం గమనార్హం. ఇటు టీఆర్ఎస్ నాయకత్వం కూడా అందుకు అనుకూలంగానే ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టేందుకు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం తప్ప మరో గత్యంతరం లేదని గులాబీ బాస్ నిర్ణయానికి వచ్చారని వినికిడి. కానీ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఇరు రాష్ట్రాల సాధారణ పౌరులను తమ మద్దతుదారులుగా పరిగణించడమే విషాదకరం అంటే అతిశయోక్తి కాదు.
 

కల్వకుర్తి నుంచి జైపాల్ పోటీ: కాంగ్రెస్ సీఎం అభ్యర్థి.. నాగానికి ‘చే’యూత?

హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలకు 18నెలల సమయం ఉంది. కానీ తెలంగాణలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారే సీఎం అభ్యర్థులం అని ప్రచారం చేసుకునే నేతల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇప్పటికే ఆయన పేరు వినిపిస్తున్నా.. తాజాగా అదే పేరు ప్రముఖంగా బయటకు వచ్చింది. ఆయనే ఎస్ జైపాల్ రెడ్డి. 1980వ దశకం వరకు మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి అసెంబ్లీ స్థానానికి ప్రాతినిథ్యం వహించారు. తర్వాత జనతాదళ్ పార్టీ తరఫున.. టీడీపీ మద్దతుతో పార్లమెంట్‌కు ఎన్నికైన జైపాల్ రెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకుడే. 1977లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పార్టీ నుంచి బయటకు వచ్చి జనతా పార్టీలో తర్వాత జనతాదళ్ పార్టీలో కీలక పాత్ర పోషించారు. కానీ 1996 - 98 మధ్య యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేసిన జైపాల్ రెడ్డి 1998లో అనివార్య పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి చేరుకున్నారు. అక్కడ నుంచి మళ్లీ మొదలైన ఆయన రాజకీయ ప్రయాణం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, భువనగిరి, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించారు.మళ్లీ తాజా పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తరపున సొంత అసెంబ్లీ నియోజకవర్గం కల్వకుర్తి స్థానం నుంచి పోటీ చేయాలని సంకల్పిస్తున్నారని వార్తలొచ్చాయి. దీంతో సీఎం అభ్యర్థి జైపాల్ రెడ్డి అన్న ప్రచారం కూడా సాగుతోంది.  
టీడీపీ కనుమరుగు.. కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ 
2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైన తర్వాత తెలంగాణలో కొత్త రాజకీయం మొదలైంది. టీడీపీ కనుమరుగు అవుతుండగా, అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ముఖాముఖీ పోరాటానికి రంగం సిద్ధం అవుతున్నది. టీడీపీలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పని చేసిన ఎనుముల రేవంత్‌రెడ్డి.. సీఎం కేసీఆర్‌కు దీటుగా ‘మాటల తూటాల' సరితూగే నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతల మధ్య అసెంబ్లీ టిక్కెట్ల కోసం గొడవ మొదలైంది. ఈసారి టికెట్‌ తమకే దక్కుతుందని ఎవరికి వారు ప్రచారం చేసుకుంటూ సమరోత్సాహానికి సిద్ధమవుతున్నారు. పార్టీ సీఎం అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి బరిలో ఉంటారని.. ఆయన సొంత నియోజకవర్గం కల్వకుర్తి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. కందనూలులో ప్రత్యర్థులు నాగం జనార్దన రెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఒక్కటయ్యారని, త్వరలో నాగం జనార్దనరెడ్డి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకుంటున్నారని జోరుగా ఉహాగానాలు మొదలయ్యాయి.  
కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రాకతో ఉత్సాహం 
అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో కాంగ్రెస్‌ పార్టీలో ఔత్సాహిక నేతలు ఈసారి టికెట్‌ తమదేనని ప్రచారం చేసుకుంటున్నారు. కొందరు అనూహ్యంగా తెరపైకి వచ్చిన నాయకులు గతంలో ఆయా నియోజకవర్గాల నుంచి పోటీ చేసి పరాజయం పొందిన నేతలతో పాటు గెలిచిన వారికి సైతం చెమటలు పట్టిస్తున్నారు. మరోవైపు రేవంత్‌రెడ్డి రాకతో రాష్ట్ర కాంగ్రెస్‌లో ఉత్సాహం చోటు చేసుకోగా, సొంత జిల్లా కందనూలులోనూ ఆయన ప్రభావం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. 
గ్రూపు రాజకీయాలతో కొంప మునిగిందని హర్షవర్దన్ రెడ్డి 
కొల్లాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై అభ్యంతరాలు లేవనెత్తుతూ హరిత ట్రిబ్యూనల్‌లో కేసులు వేసి, పాలకులను ఇరుకున పెట్టిన నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ హర్షవర్ధన్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందారు. గతంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జూపల్లి కృష్ణారావుపై ఆయన పోటీ చేసి పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్‌లోని గ్రూపు రాజకీయాలే తనకొంప ముంచాయని హర్షవర్ధన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడూ అలాంటి తలనొప్పులే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీలో ఉన్న జగదీశ్వర్‌రెడ్డి నాగం జనార్దన్‌రెడ్డికి ప్రధాన అనుచరుడిగా గుర్తింపు పొందారు. పలుమార్లు జూపల్లి కృష్ణారావుపై జగదీశ్వర్‌రెడ్డి టీడీపీ తరుఫున పోటీ చేసి త్రుటిలో ఎమ్మెల్యే చాన్స్‌ మిస్సయ్యారు.
హర్షవర్దన్ రెడ్డికే టిక్కెట్ వస్తుందని డీకే అరుణ హామీ 
ఈసారి జగదీశ్వర్ రెడ్డి చేస్తున్న ప్రచారం అందరికీ ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం తాను బీజేపీలో ఉన్నా కాంగ్రెస్‌ టికెట్‌ తనకే వస్తుందని ఇటీవల బహిరంగంగా ప్రకటించి వార్తల్లోకెక్కారు. త్వరలో తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరతానని చెప్పుకుంటున్నారు. మరోవైపు మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణను ఆయన ఇటీవల కలిశారు. ఈ సంగతి తెలుసుకుని హర్షవర్ధన్‌రెడ్డి వర్గీయులు మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణను ప్రశ్నించడంతో ఆమె వివరణ ఇచ్చుకున్నారు. హర్షవర్ధన్‌రెడ్డికే కాంగ్రెస్ పార్టీ టికెట్‌ వస్తుందని జగదీశ్వర్‌రెడ్డికి మాటివ్వలేదని, ఆయన పార్టీలో చేరితే ఎలాంటి అభ్యంతరం లేదని డీకే అరుణ చెప్పినట్లు తెలుస్తోంది. కొల్లాపూర్‌లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎత్తులు, జిత్తులతో ఫలితాలు తలకిందులు అవుతూ వస్తున్నాయి. ముందు ఒకరు గెలుస్తారని అంతా భావిస్తున్న తరుణంలో ఇక్కడ ప్రతిసారీ మంత్రి జూపల్లి కృష్ణారావు తన సుదీర్ఘ అనుభవంతో ఏదోలా గట్టెక్కుతున్నారు. ఈసారి కూడా ఆయనే పోటీలో ఉండడంతో తాడోపేడో తేల్చుకుంటామని హర్షవర్ధన్‌రెడ్డి సవాల్‌ విసురుతున్నారు. 
ఒంటెద్దు పోకడలతో అందరికీ దూరమైన వంశీచంద్ రెడ్డి 
కల్వకుర్తి నియోజకవర్గ రాజకీయాలు రసకందాయంగా మారాయి. ఇక్కడ ప్రస్తుతం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా వంశీచంద్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంతో పాటు పలు అంశాలపై ఆయన రాష్ట్రస్థాయిలో మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నారు. కానీ నియోజకవర్గస్థాయిలో మాత్రం ఆయనపై పార్టీ కార్యకర్తల్లో నిరాసక్తత వ్యక్తమవుతోంది. ఒంటెద్దు పోకడలతో వంశీచంద్‌రెడ్డి అందరినీ దూరం చేసుకుంటున్నారని సొంత కాంగ్రెస్ పార్టీ వారే విమర్శిస్తున్నారు. పార్టీకి చెందిన మాజీ ఎంపీపీలు, సర్పంచ్‌లు, మండలస్థాయి నాయకులు ఎమ్మెల్యే తీరు నచ్చకే అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారని చెబుతున్నారు. 
టిక్కెట్‌పై వంశీచంద్ రెడ్డి ధీమా ఇది 
ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి కల్వకుర్తి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తారని ఆ పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. సీఎం అభ్యర్థిగా జైపాల్‌రెడ్డి కల్వకుర్తి నుంచి పోటీలో ఉంటారని, కాంగ్రెస్‌కు తిరిగి పూర్వవైభవం తీసుకొస్తారని ఆయన అభిమానులు సంబురాలు చేస్తున్నారు. జైపాల్‌రెడ్డి కూడా ఇందుకు సంకేతాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా గతంలోనూ వీరంతా వ్యతిరేకించినా తాను కల్వకుర్తి ఎమ్మెల్యేగా టీఆర్‌ఎస్‌ హవా ఉన్న సమయంలోనే గెలిచానని ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కల్వకుర్తిలో కాంగ్రెస్‌ పార్టీ దాదాపు రెండు వర్గాలుగా చీలిందని చెబుతున్నారు. పార్టీని సమన్వయం చేయకపోతే నష్టం తప్పదని పలువురు పార్టీ సీనియర్‌ నేతలు హెచ్చరిస్తున్నారు. 
వంశీకృష్ణకు పోటీగా చారకొండ ? 
ఎస్సీ రిజర్వ్‌ నియోజకవర్గమైన అచ్చంపేట కాంగ్రెస్‌లో రెండు సామాజిక వర్గాల నాయకుల మధ్య ఈసారి టికెట్‌ విషయంలో పోటీ నెలకొంది. మొన్నటి దాకా టికెట్‌ తనకే వస్తుందని భావించిన డాక్టర్‌ వంశీకృష్ణకు పోటీగా ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ప్రధాన అనుచరుడు చారకొండ వెంకటేష్‌ టికెట్‌ ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం అచ్చంపేట. ఈ నియోజకవర్గంలోని వెల్దండ మండలం కొండారెడ్డిపల్లి ఆయన స్వగ్రామం కావడంతో సొంత నియోజకవర్గంలో తన ప్రధాన అనుచరుడికే టికెట్‌ ఇప్పించి తీరుతాడని ప్రచారం జరుగుతోంది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు, నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పీ రాములుకి గట్టిపోటీ ఇవ్వాలంటే వారి సామాజిక వర్గానికి చెందిన వెంకటేష్‌ను రంగంలోకి దింపాలన్న వాదన వినిపిస్తుండడంతో వంశీకృష్ణ ఒకింత ఆవేదనకు గురవుతున్నారు. తనకు నియోజకవర్గంలోని ప్రతి గడపతో సత్సంబంధాలు ఉన్నాయని, ఈసారి తన గెలుపు నల్లేరుపై నడకేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.  
ఎమ్మెల్సీగా దామోదర్ ఎన్నికకు నాగం సహకారం? 
ప్రస్తుతం నాగర్‌కర్నూల్‌ అసెంబ్లీ స్థానంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. బీజేపీ సీనియర్‌ నేత నాగం జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి 1999, 2004, 2009, 2012 (ఉప ఎన్నికల్లో) ప్రత్యర్థులుగా ఢీకొన్నా నాగం గెలుపొందారు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో వీరిద్దరూ ఒక్కటయ్యారన్న ప్రచారం జరుగుతోంది. పరస్పరం సహకరించుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారని, ఇందులో భాగంగానే దామోదర్‌రెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికవ్వడానికి నాగం జనార్దన్‌రెడ్డి తనవంతుగా కృషి చేశారని, నాగర్‌కర్నూల్‌ నగర పంచాయతీలోనూ వీరిద్దరి సఖ్యత వల్లే కాంగ్రెస్, బీజేపీ కలిశాయని ప్రచారం జరుగుతోంది. తామిద్దరం పోటీ పడడం వల్ల మరొకరు లాభపడే అవకాశం ఉందని, అలా జరగకుండా ఈసారి ఎవరో ఒకరే అసెంబ్లీ బరిలో ఉండాలని బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నారని ఇరు పార్టీల నేతలు గుసగుసలాడుతున్నారు. దీంతో నాగం జనార్దన్‌రెడ్డి పార్టీ మారుతారా అన్న ఊహాగానాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.