24.11.26

parent land- home loan | తండ్రి స్థ‌లంలో ఇల్లు.. కొడుకు హోంలోన్ అప్రూవ‌ల్‌కు ఇవీ చిక్కులు..!

``తండ్రి పేరుపై గ‌ల స్థ‌లంలో కొడుకు ఇల్లు క‌ట్టుకోవ‌చ్చు. కానీ, హోంలోన్‌కెళితే మాత్రం తండ్రిని స‌హ‌-ద‌ర‌ఖాస్తు దారుడిగా చేరిస్తే బ్యాంకులు అనుమ‌తినిస్తాయి. అలాగే రుణ గ్ర‌హీత ఆదాయం, ఇప్ప‌టికే ఆయ‌న రుణ వాయిదా చెల్లింపులు, లోన్ రీ పేమెంట్ హిస్ట‌రీ చూడ‌టంతోపాటు కీల‌క ప‌త్రాల‌న్నీ త్వ‌రిత‌గ‌తిన స‌బ్మిట్ చేస్తేనే గృహ రుణం మంజూరు అవుతుంది``

parent land- home loan | ప్ర‌తి ఒక్క‌రికి సొంతిల్లు కావాల‌న్న కోరిక ఉంటుంది. త‌మ ఇష్టానికి అనుగుణంగా ఇంటిని నిర్మించుకోవాల‌ని త‌ల పోస్తుంటారు. అందుకు ప్ర‌తి కుటుంబ య‌జ‌మాని తొలి నుంచి కొంత సొమ్ము పొదుపు చేస్తూ ఉంటాడు. ఉమ్మ‌డి కుటుంబాలున్న‌ప్పుడు కుటుంబ పెద్ద నిర్ణ‌యం మేర‌కు ఇల్లు రూపుదిద్దుకుంటుంది. ప్ర‌స్తుతం అంత‌టా యూనివ‌ర్శ‌ల్ ఫ్యామిలీలే.. అయినా పిల్ల‌ల‌కు వారి త‌ల్లిదండ్రులు అండ‌దండ‌ల‌నిస్తారు. 

తొలి నుంచి పొదుపుగా జీవించే త‌ల్లిదండ్రులు.. త‌మ పిల్ల‌ల సొంతింటి క‌ల సాకారం చేయ‌డానికి సర్వం సిద్ధం చేస్తారు. తండ్రి పేరు మీద గ‌ల ఆ స్థ‌లంలో ఇప్పుడు క‌ల‌ల సౌధం నిర్మించుకోవాలంటే మాట‌లా..?! కానే కాదు.. ప్ర‌తిదీ డ‌బ్బుతో ముడి ప‌డి ఉంది. 

ప్ర‌స్తుతం ఇంటి నిర్మాణానికి అవ‌స‌ర‌మ‌య్యే ముడి స‌రుకు ధ‌ర‌లు, భ‌వ‌న నిర్మాణ కార్మికుల వేత‌నాలు భారీగానే పెరిగాయి. ఈ క్ర‌మంలో సొంతింటి క‌ల సాకారం చేసుకోవాలంటే బ్యాంకు రుణ‌మే శ‌ర‌ణ్యం.. మ‌రి, తండ్రి పేరుపై గ‌ల భూమిలో కొడుకు సులువుగానే ఇల్లు నిర్మించుకోగ‌ల‌రా..?! అందుకు ఎదుర‌య్యే ఆటంకాలేమిటో ఓ సారి ప‌రిశీలిద్దాం..!

రుణ గ్ర‌హీత సిబిల్ స్కోర్ త‌నిఖీ ఇలా

ఇప్పుడు కేంద్ర ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు, బ్యాంకింగేత‌ర ఆర్థిక సంస్థ‌లు (ఎన్‌బీఎఫ్‌సీ)లు ఇల్లు క‌ట్టుకునేందుకు ముందుకు వ‌చ్చే వారికి ఇబ్బ‌డి ముబ్బ‌డిగా రుణాలిస్తున్నాయి. అలా ఇంటి రుణాలిచ్చే బ్యాంక‌ర్ ద‌గ్గ‌రికి వెళ్లి ద‌ర‌ఖాస్తు స‌బ్ మిట్ చేసేస్తాం. అంత‌టితో ఆగిపోలేదు. హోంలోన్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న వ్య‌క్తి ఆదాయం, కుటుంబ ఖ‌ర్చులు.. ఆయ‌న సిబిల్ స్కోర్‌పై త‌నిఖీలు చేస్తాయి. 

ఈఎంఐ.. లోన్ రీ పేమెంట్ మీదా న‌జ‌ర్‌

ఇప్ప‌టికే వివిధ అవ‌స‌రాల రీత్యా తీసుకున్న రుణాల‌పై నెల‌స‌రి వాయిదా (ఈఎంఐ)లు, రుణం రీపేమెంట్ చ‌రిత్ర ఆధారంగా వేత‌న జీవుల‌కు ఇంటి రుణం ఇవ్వాలా..?! లేదా?! అన్న నిర్ణ‌యానికి వ‌స్తుంది ఏ బ్యాంకైనా స‌రే. ఆదాయం క‌న్నా ఎక్కువ‌గా ఈఎంఐలు ఉన్నా.. సొంతింటిలో జీవ‌నం సాగించాల‌న్న క‌ల సాకారం కావాలంటే సిబిల్ స్కోర్‌తోపాటు మొత్తం ఆదాయంలో 30 శాతానికి మించ‌కుండా ఈఎంఐ చెల్లింపులు, ఈఎంఐ చెల్లింపుల్లో గ‌డువు మిస్ అయిన‌టువంటి అంశాలు పెద్ద అడ్డుగోడ‌గా నిలుస్తాయి.

తండ్రి స్థ‌లంలో కొడుకు ఇంటికి లోన్ సంక్లిష్టం ఇలా

తండ్రి యాజ‌మానిగా ఉన్న స్థ‌లంలో ఇల్లు క‌ట్టుకోవ‌డానికి అవ‌స‌ర‌మైన హోంలోన్‌కు అప్రూవ‌ల్ రావ‌డం సంక్లిష్టంగా మారుతుంది. ఇటువంటి ప‌రిస్థితుల్లో తండ్రి కూడా త‌న కొడుకు సొంతింటి వాడు కావాలంటే.. రుణం కోసం స‌హ ద‌ర‌ఖాస్తు దారుగా కొడుకుతో క‌లిసి సంయుక్త ఇంటి రుణ ఒప్పందంలో చేరాల్సిన అవ‌స‌రం ఉండొచ్చు. అలా కాకుండా కొడుక్కి యాజ‌మాన్య హ‌క్కుల‌ను బ‌దిలీ చేసినా స‌ద‌రు ద‌ర‌ఖాస్తు దారుకు తేలిగ్గానే రుణం అప్రూవ‌ల్ అవుతుంది.

వేత‌నం మాత్ర‌మే కాదు.. ఆస్తి యాజ‌మాన్య హ‌క్కు కీల‌కం

ప్ర‌భుత్వ‌, ప్రైవేటు రంగ సంస్థ‌ల్లో వేత‌న జీవిగా ఉన్న వృత్తి నిపుణుడికి ఇంటి రుణం పొంద‌డం ఈజీగా క‌నిపించొచ్చు. కానీ ఆ స్థ‌లం త‌న రిటైర్డు తండ్రి పేరు మీద ఉన్నా, ఆస్తి యాజ‌మాన్యం, రుణ వ్య‌వ‌స్థీక‌ర‌ణకు అడ్డుగోడ‌గా నిలుస్తుంద‌ని బ్యాంక‌ర్లు చెబుతున్నారు. ఇప్ప‌టికే తీసుకున్న రుణాల రీపేమంట్‌, ఈఎంఐ చెల్లింపుల చ‌రిత్ర ఆధారంగానే ఇంటి రుణం మంజూర‌వుతుందా? లేదా? అన్న విష‌యం ఆధార ప‌డి ఉంటుంది.

తండ్రి కూడా స‌హ‌- ద‌ర‌ఖాస్తు దారుగా చేరితే తేలిక‌

భూమి రిజిస్ట్రేష‌న్ తండ్రి పేరు మీద ఉంటే.. రుణ ద‌ర‌ఖాస్తులో ద‌ర‌ఖాస్తు దారుడితోపాటు తండ్రిని భాగ‌స్వామి కావాల్సిందిగా బ్యాంక‌ర్లు కోర‌తారు. త‌ద్వారా ఆస్తికి భ‌ద్ర‌త కూడా ల‌భిస్తుంది. తండ్రి వ‌య‌స్సు కూడా రుణ చెల్లింపు గ‌డువుకు ప‌రిమితిగా మారుతుంది.

తండ్రి స్థ‌లాన్ని మోర్ట‌గేజ్ చేసుకోవాలిలా..

`హోంలోన్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న వ్య‌క్తి వేత‌నం మాత్ర‌మే స‌రిపోదు. ఇప్ప‌టికే తీసుకున్న రుణాల ఈఎంఐలు, రీపేమెంట్ హిస్ట‌రీతోపాటు ఆస్తిపై యాజ‌మాన్య హ‌క్కు త‌దితర అంశాలు రుణ గ్ర‌హీత ఆదాయం కంటే ప్ర‌ధాన స‌వాళ్లుగా నిలుస్తాయి. తండ్రి పేరు మీద ఉన్న ఇంటి స్థ‌లాన్ని త‌న పేరు మీద మోర్ట‌గేజ్ చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. అంటే త‌న తండ్రిని రుణ ద‌ర‌ఖాస్తులో స‌హ‌-ద‌ర‌ఖాస్తుదారుగా చేర్చుకుంటే బేష్షుగ్గా ఉంటుంది. ఆయ‌న వ‌య‌స్సు.. రుణ చెల్లింపు గ‌డువును నిర్దేశిస్తుంది. క‌నుక ఆదాయం కంటే స్థ‌లంపై యాజ‌మాన్య హ‌క్కులే రుణానికి అప్రూవ‌ల్ పొంద‌డంలో కీల‌కం అవుతుంది` అని బ్యాంకు బ‌జార్ సీఈఓ అధిల్ శెట్టి తెలిపారు. 

నిర్మాణంలో ఉన్న ఇళ్ల‌కే అత్య‌ధిక రుణాలు

నిర్మాణంలో ఉన్న ఇంటిపైనే రుణ‌దాత‌లు అత్య‌ధికంగా రుణాలిస్తారు. ల్యాండ్ టైటిల్ హ‌క్కుల గ‌ల తండ్రి త‌న కొడుకుతో క‌లిసి స‌హ ద‌ర‌ఖాస్తుదారుగా చేర‌డం వ‌ల్ల ఆ భూమిని మార్ట‌గేజ్ చేసిన‌ట్ల‌వుతుంది. కొన్ని కుటుంబాలు భూమి బ‌దిలీ చేయ‌డానికి బ‌దులు తండ్రి ప్ర‌ధాన ద‌ర‌ఖాస్తుదారుడిగా, కొడుకును స‌హ ద‌ర‌ఖాస్తు దారుగా చేర్చి ఇంటి రుణం తీసుకుంటార‌ని అధిల్ శెట్టి వివ‌రించారు. 

ఆస్తి ప‌న్ను ర‌శీదులు కూడా స‌బ్‌మిట్ చేయాలి

రుణ దాత‌లు త‌మ ద‌ర‌ఖాస్తుదారుడి తండ్రి ఆస్తి టైటిల్ డీడ్ లేదా సేల్ డీడ్‌, మ్యుటేష‌న్ రికార్డులు స‌బ్మిట్ చేయ‌మ‌ని అడుగుతారు. ప్ర‌త్యేకించి స‌ద‌రు ఆస్తి యాజ‌మాన్యం హ‌క్కును ధ్రువీక‌రించుకునేందుకు ఆస్తిపై ఆదాయం ప‌న్ను ర‌శీదులు కూడా అంద‌జేయాల‌ని కోర‌తారు. అలాగే కొడుకు ఆదాయం ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు, బ్యాంకు స్టేట్‌మెంట్స్‌, ఇప్ప‌టికే క‌డుతున్న రుణ వాయిదాల వివ‌రాల‌ను అంద‌జేయాల‌ని సూచిస్తారు. 

తండ్రి చ‌నిపోతే వార‌స‌త్వ రుజువు కోసం అద‌న‌పు ప‌త్రాలివ్వాలి

ఒక‌వేళ తండ్రి మ‌ర‌ణిస్తే.. ఆయ‌న వార‌స‌త్వ ఆస్తి అని తెలిపేందుకు అద‌న‌పు స‌ర్టిఫికెట్లు స‌బ్‌మిట్ చేయాల్సి ఉంటుంది. వార‌స‌త్వ స‌ర్టిఫికెట్‌తోపాటు భ‌వ‌న నిర్మాణ ప్ర‌ణాళిక‌, నిర్మాణ వ్య‌యం అంచ‌నా త‌దిత‌ర వివ‌రాల‌న్నీ స‌బ్ మిట్ చేస్తే గానీ హోంలోన్ అప్రూవ‌ల్ కాదు. నిధుల విడుద‌ల ద‌శ‌లోనూ భ‌వ‌న నిర్మాణానికి మునిసిప‌ల్ శాఖ ఆమోదం త‌ప్ప‌నిస‌రి.

23.11.26

gold sales- narendra moodi | మోదీ స‌ల‌హాకు హ్యాట్సాప్‌.. బంగారం ఎందుకు దిగి వ‌స్తోందో తెలుసా..?!

gold sales- narendra modi | `` ఇరాన్‌-ఇజ్రాయెల్‌-అమెరికా యుద్ధంతో మ‌దుప‌ర్లు స్వ‌ర్గ‌ధామంగా భావించిన బంగారం ధ‌ర‌కు రెక్క‌లొచ్చాయి. ద్ర‌వ్యోల్బ‌ణ ఒత్తిళ్ల నేప‌థ్యంలో వ‌చ్చే ద్ర‌వ్య ప‌ర‌ప‌తి స‌మీక్ష‌లో వ‌డ్డీరేట్లు త‌గ్గిస్తామ‌న్న యూఎస్ ఫెడ్ రిజ‌ర్వు సంకేతాల మ‌ధ్య దేశీయ బులియ‌న్ మార్కెట్‌లో తులం బంగారం ధ‌ర రూ.1.83 ల‌క్ష‌ల నుంచి దిగి వ‌చ్చి రూ.1.23 ల‌క్ష‌ల‌కు చేరుకుంది. దంతేరాస్‌, దీపావ‌ళి పండుగ‌ల సంద‌ర్భంగా లైట్ వెయిట్ డిజైన్లు, త‌క్కువ క్యార‌ట్ల బంగారం కొనుగోళ్ల‌కు మ‌గువ‌లు మొగ్గు చూపారు.``

gold sales- narendra modi | బంగారం అంటే భార‌తీయుల‌కు.. అందునా బామ‌ల‌కు ఎంతో ఇష్టం. అవ‌కాశం ఉంటే ప్ర‌తి శుభ కార్యానికి పిస‌రంత బంగారం కొన‌డానికే మొగ్గు చూపుతారు. ధ‌ర‌లు పెరిగినా.. దిగుమ‌తి సుంకాలు ఇబ్బ‌డి ముబ్బ‌డిగా పెంచేసినా మ‌గువ‌లు కించిత్ కూడా వెన‌క్కి త‌గ్గ‌లేదు. మాన‌వాళిని గ‌డ‌గ‌డ‌లాడించిన క‌రోనా మ‌హ‌మ్మారి స‌మ‌యంలోనూ బంగారం ఆభ‌ర‌ణాల విక్ర‌యాలు జోరుగా సాగాయి. ప్ర‌స్తుతం తులం బంగారం ధ‌ర గ‌త జ‌న‌వ‌రిలో రూ.1.80 ల‌క్ష‌ల‌తో ఆల్‌టైం గ‌రిష్టాన్ని తాకి.. రూ.1.26 ల‌క్ష‌ల‌కు దిగొచ్చింది. 

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఏమ‌న్నారంటే..!

`అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప బంగారం కొనుగోలు చేయొద్ద‌ని నేను ఇచ్చిన పిలుపును దేశ ప్ర‌జ‌లు పాటించారు. దాని వ‌ల్ల బంగారం ధ‌ర త‌గ్గ‌డంతోపాటు డ‌బ్బు ఆదా అయింది` అని ఈ నెల 21న ల‌క్నోలో జ‌రిగిన ఐదో కౌశ‌ల్ దీక్షాంత్ స‌మారోహ్‌లో మాట్లాడిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చెప్పారు. ఈ క్రెడిట్‌ను ప్ర‌జ‌ల‌కే ఇచ్చారు. ఈ విష‌య‌మై చాంబ‌ర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండ‌స్ట్రీ (సీటీఐ) అధ్య‌క్షులు బ్రిజేశ్ గోయ‌ల్.. ప్ర‌ధాని మోదీకి ధ‌న్య‌వాదాలు తెలుపుతూ లేఖ రాశారు. అయితే, ప్ర‌ధాని పిలుపు వ‌ల్లే దేశీయ బులియ‌న్ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌లు త‌గ్గాయా..? ఇత‌ర కార‌ణాలేమైనా ఉన్నాయా...?! ఈ విష‌య‌మై ఓ లుక్కేద్దాం..

డాల‌ర్‌, యూఎస్ బాండ్ల విలువ పెరుగుద‌ల వ‌ల్లే.. 

అమెరికాలో తుమ్ములు వ‌స్తే భార‌త్‌లో జ‌లుబు చేస్తుందంటారు పెద్ద‌లు. అమెరికాలో జ‌రిగే ప‌రిణామాలు భార‌త్ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేస్తూనే ఉంటాయి. ఇరాన్‌-ఇజ్రాయెల్‌- అమెరికా, ఉక్రెయిన్‌-ర‌ష్యా మ‌ధ్య సాగుతున్న యుద్ధం.. అంత‌ర్జాతీయంగా అనిశ్చిత ప‌రిస్థితుల‌ను తెచ్చి పెట్టింది. దీనికి తోడు క్రూడాయిల్ ధ‌ర పెర‌గ‌డంతో పైపైకి దూసుకెళ్లిన ద్ర‌వ్యోల్బ‌ణాన్ని క‌ట్ట‌డి చేయ‌డానికి అమెరికా ఫెడ్ రిజ‌ర్వు సిద్ధ‌మైంది. దీని ఫ‌లితంగానే గ‌త నెల నుంచి దేశీయ బులియ‌న్ మార్కెట్‌లో క్ర‌మంగా బంగారం ధ‌ర‌లు దిగి వ‌స్తున్నాయి. 

ఫెడ్ సమీక్ష వైపే మ‌దుప‌ర్ల చూపు

మ‌దుప‌ర్లు కూడా నిత్యం లాభాల వైపే మొగ్గు చూపుతుంటారు. వ‌చ్చే నెల‌లో జ‌రిగే ద్ర‌వ్య ప‌ర‌ప‌తి స‌మీక్ష‌లో ఫెడ్ వ‌డ్డీరేట్లు త‌గ్గిస్తామ‌ని సంకేతాలివ్వ‌డంతోనే డాల‌ర్‌, యూఎస్ ట్రెజ‌రీ బాండ్ల విలువ అమాంతం పెరుగుతోంది. త‌క్ష‌ణ లాభాల‌కు ప్రాధాన్యం ఇచ్చే మ‌దుప‌ర్లు  బంగారం వ‌దిలించుకుని డాల‌ర్లు, యూఎస్ ట్రెజ‌రీ బాండ్ల కొనుగోలుపైనే దృష్టి పెడ‌తారని ప్ర‌పంచ స్వ‌ర్ణ మండ‌లి (డ‌బ్ల్యూజీసీ) అంచ‌నా వేసింది. 

త‌క్కువ క్యార‌ట్లూ... లైట్ వెయిట్ ఆభ‌ర‌ణాల‌పై మ‌గువ‌ల మోజు

ప్ర‌తి ఏడాది మాదిరిగానే ఈఏడాది పండుగ‌ల సీజ‌న్‌లో బంగారం ఆభ‌ర‌ణాల‌కు గిరాకీ ఏమాత్రం త‌గ్గ‌లేదు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో బంగారం ఆభ‌ర‌ణాలు, నాణాలు, బార్ల‌కు విస్తృత స్థాయిలో కొనుగోళ్లు జ‌రిగాయ‌ని, ఆరోగ్య క‌ర వాతావ‌ర‌ణం నెల‌కొంద‌ని (డ‌బ్ల్యూజీసీ) అంచ‌నా వేసింది. గ‌త అక్టోబ‌రులో వ‌రుస‌గా ఐదో నెల భార‌త గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్స్ రికార్డు నెల‌కొల్పాయి. ఇదే ఒర‌వ‌డి న‌వంబ‌రులోనూ కొన‌సాగుతుంద‌ని డ‌బ్ల్యూజీసీ తెలిపింది. త‌క్కువ క్యార‌ట్లు, లైట్ వెయిట్ ఆభ‌ర‌ణాల కొనుగోలుకు వినియోగ‌దారులు మొగ్గు చూపారు. 

క‌రోనా త‌ర్వాత మ‌దుపుకు స్వ‌ర్గ‌ధామం ప‌సిడి

పిల్ల‌ల పెళ్లిళ్ల కోసం అందునా పెళ్లి కూతురు కోసం బంగారం కొనాల‌ను కునే వారికి బంగారం ధ‌ర త‌గ్గితే.. ఓవ‌రాల్‌గా ఆభ‌ర‌ణాల కొనుగోలు ఖ‌ర్చు త‌గ్గుతుంది. హెవీ బ్రైడ‌ల్ సెట్స్‌, నెక్లెస్‌లు, గాజుల కొనుగోళ్ల‌కు ప్ర‌జ‌లు ప్రాధాన్యం ఇస్తుంటారు. కొవిడ్ త‌ర్వాత బంగారం ప‌ట్ల మ‌దుప‌ర్ల విజ‌న్ కూడా మారిపోయింది. అప్ప‌టి వ‌ర‌కూ ఆభ‌ర‌ణాల‌కే ప్రాధాన్యం ఇచ్చే కుటుంబ పెద్ద‌లు.. క‌రోనా త‌ర్వాత డిజిట‌ల్ బంగారం (ఈటీఎఫ్‌) మార్కెట్ల‌లో కొన‌డానికి.. ఇత‌ర పెట్టుబ‌డి మార్గాల‌ను అన్వేషిస్తున్నారు. కొవిడ్ త‌ర్వాతే డిజిట‌ల్ బంగారానికి, భౌతిక బంగారానికి గిరాకీ పెరిగింది. 

ఆంక్ష‌ల నేప‌థ్యంలో డిజిట‌ల్ గోల్డ్‌కు డిమాండ్‌

అంత‌ర్జాతీయ అనిశ్చితి వ‌ల్ల 2018-19లో  వివిధ దేశాల సెంట్ర‌ల్ బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేసి నిల్వ పెట్టుకున్నాయి. క‌రోనా నియంత్ర‌ణ‌కు ప్ర‌భుత్వాలు ప్ర‌క‌టించిన ఉద్దీప‌న‌లు, లాక్‌డౌన్లు, ద్ర‌వ్యోల్బ‌ణ ఒత్తిళ్లు బంగారం ధ‌ర‌పై ప్ర‌భావం చూపాయి. బంగారం కొనుగోళ్ల‌పై కేంద్ర ఆంక్ష‌ల నేప‌థ్యంలో ఆన్‌లైన్ బంగారం కొనుగోళ్లు, డిజిట‌ల్ గోల్డ్ వాలెట్ల కొనుగోళ్లు, గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబ‌డులకు దారి తీశాయి. వినియోగ‌దారులు బంగారం దుకాణాల ముందు బారులు తీరేందుకు కార‌ణ‌మ‌య్యాయి. 

క‌రోనా త‌ర్వాత బంగారం పై చూపులే

2020లో తులం బంగారం ధ‌ర గ‌రిష్టంగా రూ.48,723 ప‌లికితే.. ఏడాది త‌ర్వాత రూ.47,999ల‌కు చేరుకుని 2022లో 52,731, 2023లో రూ.60,624, 2024లో రూ.75,842, 2025లో రూ.1,03,870- 1,23,195 మ‌ధ్య (డిసెంబ‌రు 19న రూ.1,36,570 ప‌లికింది. ఈ ఏడాది జ‌న‌వ‌రి 29న రూ.1,83,050ల‌కు చేరిన తులం బంగారం ధ‌ర తాజాగా రూ.1,26,421ల‌కు చేరుకుంది. 

దీపావ‌ళి-దంతేరాస్ సేల్స్ దూకుడు ఇలా

2020-2026 మ‌ధ్య ప్ర‌తి ఏటా దీపావ‌ళి, దంతేరాస్ ప‌ర్వ‌దినాల సంద‌ర్భంగా బంగారం ధ‌ర‌ల‌తోపాటు దాని కొనుగోలు విలువ పెరుగుతూనే ఉంది. ధ‌ర పెరిగినా కొద్దీ పాత బంగారం మార్పిడి, లైటర్ డిజైన్లు, త‌క్కువ క్యార‌ట్ల బంగారం కొనుగోళ్ల‌కు భార‌తీయ మ‌హిళ‌లు ప్రాధాన్యం ఇస్తున్నారు. 2020లో తులం బంగారం ధ‌ర రూ.48651 ప‌లికితే.. క‌రోనా ఆంక్ష‌ల మ‌ధ్య చిన్న చిన్న వ‌స్తువుల కొనుగోళ్లు, డిజిట‌ల్‌/ అడ్వాన్సు బుకింగ్స్ న‌మోద‌య్యాయి. 

రూ.50 వేలు దాటిన బంగారం ధ‌ర‌

2021లో రూ.48,720 ప‌లికిన ప‌ది గ్రాముల బంగారం.. దంతేరాస్ సంద‌ర్భంగానే 42 ట‌న్నుల బంగారం అమ్ముడైంది. 2022లో క‌రోనా త‌ర్వాత పెళ్లిళ్లు, పండుగ‌ల సీజ‌న్‌ల‌లో షాపుల్లో కొనుగోళ్ల‌కు మొగ్గు చూపారు. ఆ ఏడాది తులం ధ‌ర రూ.50,062. 2023లో ఫెస్టివ్ సీజ‌న్‌లోనే బంగారం, వెండి కొనుగోళ్లు రూ.30 వేల కోట్లు దాటాయి. 

రూ.75 వేల కోట్ల‌కు బంగారం బిజినెస్‌

2024లో రూ.78,745ల‌కు చేరుకున్న బంగారం ధ‌ర నేప‌థ్యంలో దంతేరాస్ వేళ రూ.20,000-23,000 కోట్ల (25-30 ట‌న్నుల బంగారం)  కొనుగోళ్లు జ‌రిగాయి. 2025లో తులం బంగారం ధ‌ర రూ.ల‌క్ష దాటి రూ.1,29,584ల‌కు చేరుకోవ‌డంతో దంతేరాస్ సంద‌ర్భంగా రూ.60 వేల కోట్ల లావాదేవీలు జ‌రిగాయి. 2024తో పోలిస్తే 25 శాతం ఎక్కువ‌. ఈ ఏడాది దంతేరాస్‌, దీపావ‌ళి ప‌ర్వ దినాల సంద‌ర్భంగా తులం బంగారం ధ‌ర రూ.1,40,054 ప‌లికినా కొనుగోళ్లు రూ.75 వేల కోట్ల పై చిలుకు మాటే. 2025తో పోలిస్తే విలువ ప‌రంగా బంగారం కొనుగోళ్లు 15-25 శాతం పెరిగాయి.

22.11.26

dollar dreams- h1b visa | డాల‌ర్ల మోజు.. పిల్ల‌ల బేజారు.. అమెరికాలో అల్లాడుతున్న భార‌తీయులు


dollar dreams- h1b visa |``డాల‌ర్ల మోజులో అమెరికాకెళ్లిన భార‌త సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ల‌లో అంత‌ర్మ‌థ‌నం మొద‌లైంది. హెచ్‌-1బీ వీసా కావాలంటే రూ.ల‌క్ష రుసుము చెల్లించాలి. అక్క‌డ స్థిర‌ప‌డిన 12 ల‌క్ష‌ల మంది ఐటీ నిపుణులంద‌రికీ గ్రీన్ కార్డు రావాలంటే ద‌శాబ్దాలు ప‌డుతుంది. ఒక్కో దేశానికి ఏడు శాతానికి మించ‌కుండా ఏటా 1.4 ల‌క్ష‌ల  మందికి మాత్ర‌మే గ్రీన్ కార్డు జారీ చేయాల‌న్న ట్రంప్ అడ్మినిస్ట్రేష‌న్ నిర్ణ‌యం..భార‌త టెకీల‌ను ఆలోచింప చేస్తోంది.``

dollar dreams- h1b visa | డాల‌ర్ల‌లో జీతం.. కావాల్సినంత ల‌గ్జ‌రీ జీవితం.. ఇదీ స‌గ‌టు భార‌తీయ ఇంజ‌నీరు క‌ల‌. కానీ.. ఇప్పుడు ఆ క‌ల క‌రిగి పోతోంది. అస‌లు అమెరికాలో ఉండ‌ట‌మే గ‌గ‌నంగా మారుతుందా.. అంటే అవున‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. 
తొలుత ఎంఎస్‌.. త‌దిత‌ర ఉన్న‌త విద్యాకోర్సులు అభ్య‌సించి.. అటుపై అమెరికాలో ఆప్ష‌న‌ల్ ట్రైనింగ్ పీరియ‌డ్ (ఓటీపీ) కింద కొంత కాలం..  ఆ త‌ర్వాత హెచ్‌-1 బీ వీసాపై మ‌రి కొన్నేళ్లు.. మ‌రి కొంత కాలానికి గ్రీన్ కార్డు పొందొచ్చున‌ని ఏళ్ల త‌ర‌బ‌డి ఆశ‌లు పెట్టుకున్న భార‌త టెకీల‌పై డొనాల్డ్ ట్రంప్ నీళ్లు చల్లారు. దీంతో భార‌తీయ టెక్కీలు అమెరికాలో కంటే.. స్వ‌దేశంలో గానీ.. బ్రిట‌న్‌, ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కొలువుల కోసం పాట్లు ప‌డుతున్నారు. 

క‌న్న వారికి దూరంగా ఏళ్ల త‌ర‌బ‌డి అమెరికాలోనే

ఆ ఆలోచ‌న లేని టెకీలు.. భార‌త్‌కు రావాలంటే భ‌య ప‌డే ప‌రిస్థితులున్నాయి. అమెరికాను వీడితే వీసా స్టాంపింగ్‌కు ఫీజు క‌ట్టాల్సి రావ‌చ్చు.. మ‌రే కార‌ణం చేత‌నైనా అమెరికాకు రావొద్ద‌ని ట్రంప్ అడ్మినిస్ట్రేష‌న్ ఆంక్ష‌లు పెట్టే అవ‌కాశాలు ఉన్నాయి. దీని ఫ‌లితంగానే డాల‌ర్ల మోజులో అక్క‌డే ఉంటున్న భార‌తీయులు.. క‌న్న వారు.. అయిన వారికి దూరంగా ఉంటూ అల్లాడిపోతున్నారు. గ‌తంలో ఇంట్లో.. కుటుంబ స‌భ్యుల‌.. బంధు మిత్రుల ఇళ్ల‌లో శుభ కార్యాల‌కు వ‌చ్చి వెళ్లే వారు. అయినా వారి ఆరోగ్యం మీద ఆరా తీసి.. అత్య‌వ‌స‌ర‌మైతే వ‌చ్చి పోయే వారు.. కానీ.. ఈ ఆరాల‌కు చెల్లు చీటి ఇచ్చి ఏళ్ల త‌ర‌బ‌డి అక్క‌డే ఉండాల్సి వ‌స్తోంద‌ని భార‌తీయ టెకీలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. 

తొలిసారి ట్రంప్ ఆంక్ష‌లు ఇలా

తొలిసారి అమెరికా అధ్య‌క్షుడిగా ప‌ని చేసిన‌ప్పుడూ దేశంలోని ఐటీ కంపెనీల్లోకి విదేశీ నిపుణుల‌కు వీసా జారీ చేయ‌డానికి ఆంక్ష‌లు విధించారు. ఐటీ, సాఫ్ట్‌వేర్‌, టెక్నాల‌జీ రంగంలో భార‌త్ స‌హా అమెరికాలోని వివిధ దేశాల కంపెనీల్లో స్థానికుల‌కు ఉద్యోగాల కోసం తొలిసారి డొనాల్డ్ ట్రంప్ ప‌ట్టుబ‌ట్టారు. త‌ర్వాత కొంత ప‌ట్టు స‌డ‌లించినా.. మ‌ళ్లీ మ‌లి ద‌ఫా అధ్య‌క్షుడిగా ట్రంప్‌.. ఐటీ నిపుణులకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నారు. 

హెచ్‌-1 వీసా ప్ల‌స్ ఓటీపీతో కొంత కాలం గ‌డువు పొడిగింపు

హెచ్‌1-బీ వీసాపై అమెరికాకు వ‌చ్చే వారికి రూ.ల‌క్ష వీసా ఫీజు చెల్లించాల‌ని డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం పెట్టిన ష‌ర‌తుల్లో ఒక‌టి. చ‌చ్చీ చెడీ అప్పు చేసి అమెరికాలో ఉన్న‌త విద్యాభ్యాసం చేసి.. ఉద్యోగం సంపాదించుకున్నా.. ప్ర‌తి ఏటా హెచ్‌1-బీ వీసా మీద భార‌తీయులే ర‌మార‌మీ 87 వేల మంది ఉంటారు. అలా హెచ్‌1-బీ వీసాపై వెళ్లిన భార‌తీయులు.. ఆప్ష‌న‌ల్ ట్రైనింగ్ (ఓటీపీ) కింద కొంత‌కాలం ఉండొచ్చు. 

గ్రీన్ కార్డుపై 12 ల‌క్ష‌ల మందికి ఆశ‌ల ప‌ల్ల‌కి

అలా అమెరికాకు వెళ్లి అక్క‌డ స్థిర ప‌డిన ఎన్నారైల‌లో దాదాపు 12 ల‌క్ష‌ల మంది టెకీలు.. గ్రీన్ కార్డు కోసం వేచి చూస్తున్నార‌ని నేష‌న‌ల్ ఫౌండేష‌న్ ఫ‌ర్ అమెరికా పాల‌సీ (ఎన్ఎఫ్ఏబీ) అంచ‌నా వేసిందని బీబీసీ క‌థ‌నం. వారిలో 79 శాతం మంది టెక్కీలు.. అమెరికాలో ఉద్యోగం పెండింగ్‌లో ఉన్న వారేన‌ని గ‌తేడాది డిసెంబ‌రులో ఎన్ఎఫ్ఏపీ చెప్పింది. అడ్వాన్సుడ్ డిగ్రీ పూర్తిచేసిన ఈబీ-2 కు చెందిన 7,31,566 మంది ఉంటే.. బ్యాచ్‌ల‌ర్ డిగ్రీ పూర్తి చేసిన ఈబీ-3 వారు సుమారు 2,13,414 మంది టెకీలు గ్రీన్ కార్డు కోసం వేచి చూస్తున్నార‌ని అంచ‌నా.. 

గ్రీన్ కార్డు కోసం ఇలా ఇండియ‌న్స్ ఎదురుచూపులు

భార‌తీయ టెక్కీలకు గ్రీన్ కార్డు రావాలంటే ఈబీ-1 క్యాట‌గిరీ వారు 4-5 ఏళ్లు, ఈబీ-3 విభాగానికి చెందిన టెక్కీలు 38 ఏళ్లు, ఈబీ-2 కేట‌గిరీ వారు 179ఏళ్లు వేచి చూడాల్సి వ‌స్తుంద‌ని ఎన్ఎఫ్ఏపీ గ‌త జ‌న‌వ‌రిలో అంచ‌నా వేసింది. ప్ర‌తి ఏటా విదేశీ టెక్కీల్లో 1.40 ల‌క్ష‌ల మందికి మాత్ర‌మే గ్రీన్ కార్డు జారీ చేయాల‌ని ట్రంప్ అడ్మినిస్ట్రేష‌న్ నిర్ణ‌యించింది. అదీ ఒక్కో దేశం నుంచి ప‌ని చేస్తున్న టెకీల్లో ఏడు శాతానికి మించ‌రాదు. అంటే .. ప్ర‌స్తుతం అమెరికాలో ఉన్న భార‌త టెక్కీలు దాదాపు 12 ల‌క్ష‌లు.. అంటే వారంద‌రికీ గ్రీన్ కార్డు రావాలంటే ఏండ్లు పూండ్లు ప‌డుతుంది.. ఇక ట్రంప్ వంటి పాల‌కులు.. అధికారంలోకి వ‌స్తే.. అదీ గుటుక్కుమ‌నొచ్చు.. క‌నుక భార‌తీయ టెకీల్లో అత్య‌ధికులు ఇత‌ర దేశాల‌కు వ‌ల‌స బాట ప‌డుతున్నారు. 

హెచ్‌-1 బీ వీసా నిబంధ‌న‌ల్లో మార్పులు.. గ్రీన్ కార్డు కోసం ఎడ‌తెగ‌ని వెయిటింగ్‌

హెచ్‌-1బీ వీసా నిబంధ‌న‌ల్లో త‌రుచుగా చేస్తున్న మార్పులు, గ్రీన్ కార్డు పొంద‌డంలో అంతులేని వెయిటింగ్‌.. వంటి అంశాలు అమెరికాలో మంచి ఉద్యోగం, భారీ వేత‌నం.. టెక్నాల‌జీ రంగంలో ఉన్న‌త‌స్థాయి కెరీర్‌ను వ‌దుల‌కుకుని.. భ‌విష్య‌త్ మీద భ‌రోసా కోసం బ్రిట‌న్‌, జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా త‌దిత‌ర దేశాల‌కు త‌ర‌లి పోతున్నారు మ‌నాళ్లు. ప్ర‌స్తుతం మంచి ఉద్యోగాల్లో కొన‌సాగుతున్నా.. ఫ్యూచ‌ర్ మీద బెంగ ఎక్కువైంది. ఆరేడు ఏళ్లుగా హెచ్‌-1 బీ వీసాపై ప‌ని చేస్తున్నా.. స‌మీప భ‌విష్య‌త్‌లో గ్రీన్ కార్డు పొందే అవ‌కాశాలు త‌గ్గిపోవ‌డం.. వీసా నిబంధ‌న‌ల్లో మార్పుల‌తో ఆందోళ‌న‌కు గుర‌వుతున్నామ‌ని గ్లోబ‌ల్ టెక్ దిగ్గ‌జం గూగుల్‌లో ప‌ని చేస్తున్న‌ సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ ఒక‌రు తెలిపారు. 

విలాస జీవితానికీ చెల్లు చీటి.. యూర‌ప్ దేశాల వైపు ఇండియ‌న్స్ చూపు

శాన్‌ఫ్రాన్సిస్కోలో టాప్ టెక్ కంపెనీలో కొలువు.. విలాస‌వంత‌మైన జీవితం ఇష్ట‌మైనా.. త‌మ‌కు అమెరికా `బంగారు పంజ‌రం`గానే మారిపోయింద‌ని సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్లు చెబుతున్నారు. గ్రీన్ కార్డు కోసం భారీ నిరీక్ష‌ణ త‌ప్ప‌క పోవ‌డంతో ఏడాదిన్న‌ర కాలంగా అమెరికాను వీడ‌లేద‌ని మ‌రో ప్ర‌వాస భార‌తీయుడు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కుటుంబ స‌భ్యుల‌ను, స్నేహితుల‌ను క‌ల‌వ‌డంతోపాటు ఉద్యోగ సంబంధిత స‌మావేశాలకూ వెళ్ల‌లేక దూరంగా ఉంటున్నామ‌ని ర‌వీంద‌ర్ అనే ఇంజ‌నీర్ పేర్కొన్నారు. చివ‌ర‌కు అసాధార‌ణ ప్ర‌తిభావంతుల‌కు ఇచ్చే వీసా కోసం చేసిన ప్ర‌య‌త్నాలు తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌య్యాయ‌ని.. బ్రిట‌న్ నుంచి గ్లోబ‌ల్ టాలెంట్ వీసా ల‌భించినందున అక్క‌డికే వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలిపాడు.

ఇండియ‌న్ల‌కు భారంగా హెచ్‌-1 బీ వీసా ఫీజు

అక్ర‌మ వ‌ల‌స‌ల నియంత్ర‌ణ పేరిట డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేష‌న్ ప్రారంభించిన చ‌ర్య‌లు.. చ‌ట్ట‌బ‌ద్ద వ‌ల‌స‌ల మీద కూడా ప్ర‌భావం చూపుతున్నాయి. మంచి నైపుణ్యం గ‌ల విదేశీ ఉద్యోగుల‌ను అనుమ‌తించే హెచ్‌1-బీ వీసాల జారీ విష‌యంలోనూ ట్రంప్ తీరు ఇబ్బందులు తెచ్చి పెడుతోంది. కొత్త‌గా హెచ్‌-1 బీ వీసాకు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు రూ.ల‌క్ష ఫీజు చెల్లించాల‌న్న నిబంధ‌న పెట్ట‌డం.. అమెరిక‌న్ల‌కే ఉద్యోగాలివ్వాల‌ని కంపెనీల‌పై ఒత్తిళ్లు తేవ‌డం వంటి అంశాలు భార‌త ఐటీ నిపుణుల‌పై బాగానే ప్ర‌భావం చూపుతున్నాయి. 

విదేశీ నిపుణుల‌కు వీసాపై యూఎస్ కంపెనీలూ వెనుకంజే

ట్రంప్ స‌ర్కారు విధానాల‌తో అమెరికాలోనే దిగ్గ‌జ సంస్థ‌లు సైతం విదేశీ ఉద్యోగుల నియామ‌కం విష‌యంలో త‌మ వ్యూహాల‌ను మార్చుకుంటున్నాయి. విదేశీ ఉద్యోగుల నియామ‌కంలో చిన్న ఉల్లంఘ‌న జ‌రిగింద‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చినా వీసా నిషేధంతోపాటు క్రిమిన‌ల్ విచార‌ణ‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుందేమోన‌ని ఆయా సంస్థ‌లు ఆందోళ‌న చెందుతున్నాయి. వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా స్టీఫెన్ మిల్ల‌ర్‌కు ట్రంప్ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం, విదేశీ ఉద్యోగుల‌కు గ్రీన్ కార్డు స్పాన్స‌ర్‌షిప్‌పై ఉపాధ్య‌క్షుడు జేడీ వాన్స్ విచార‌ణ‌కు ఆదేశించిన ఘ‌ట‌న‌లు భార‌త నిపుణుల్ని ఆందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. ఇక విదేశీ ఉద్యోగుల‌కు శాశ్వ‌త నివాస హోదా క‌ల్ప‌న‌పైనా అమెరికా కార్మిక‌శాఖ క‌ఠిన నిబంధ‌న‌ల‌ను ప్ర‌తిపాదించింది. 

అమెరికాకెళ్లే విద్యార్థులూ.. ఓటీపీ అప్లికెంట్లూ త‌గ్గారు

ట్రంప్ అడ్మినిస్ట్రేష‌న్ అమ‌లు చేస్తున్న వ‌ల‌స విధానాల ప్ర‌భావం ఉద్యోగాల‌కే కాక అమెరికాలోని విశ్వ‌విద్యాల‌యాల్లో ఉన్న‌త విద్యాభ్యాసం కోసం వెళ్లే భార‌తీయ విద్యార్థుల మీదా ప్ర‌తికూల వాతావ‌ర‌ణం ప‌డింది. ఏడాది కాలంగా యూఎస్ యూనివ‌ర్సిటీల్లో చేరిన విదేశీ విద్యార్థులు 15 శాతం త‌గ్గార‌ని అమెరికా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎడ్యుకేష‌న్ అంచ‌నా వేసింది. అమెరికాలో తాత్కాలికంగా ప‌ని చేసే అవ‌కాశం క‌ల్పించే ఆప్ష‌న‌ల్ ప్రాక్టిక‌ల్ ట్రైనింగ్ (ఓటీపీ) కోసం పేర్లు న‌మోదు చేసుకున్న భార‌త విద్యార్థులు ఆరు శాతం త‌గ్గారని.. గ‌త ఐదేళ్ల‌లో ఇలా జ‌ర‌గ‌డం ఇదే తొలిసారి అని టెక్కీలు చెబుతున్నారు. 

15.11.26

gold sales-dhanteras | కొండెక్కిన బంగారం.. అయినా త‌గ్గ‌ని గిరాకీ.. లైట్ వెయిట్ జ్యువెల్ల‌రీపై మోజు

gold sales-dhanteras | ``బంగారం ధ‌ర‌లు కొండెక్కినా ఆభ‌ర‌ణాల కొనుగోలుదారుల నుంచి గిరాకీ త‌గ్గ‌లేదు. 24 క్యార‌ట్ల బంగారం తులం ధ‌ర రూ.1.8 ల‌క్ష‌ల‌తో ఆల్‌టైం గ‌రిష్టానికి చేరుకుని.. తిరిగి రూ.1.42 ల‌క్ష‌ల‌కు దిగి రావ‌డంతో దంతేరాస్‌-దీపావ‌ళి స‌హా పండుగ‌ల సీజ‌న్‌లో అతివ‌లు స్వ‌ర్ణాభ‌ర‌ణాల దుకాణాల‌కు ప‌రుగులు తీస్తున్నారు. పెళ్లిళ్ల సీజ‌న్ కూడా ఇందుకు జ‌త క‌లిసింది. విలువ ప‌రంగా 30 శాతం సేల్స్ పెరిగాయి. లెయిట్ వెయిట్‌, క‌ల‌ర్ జెమ్ స్టోన్ల‌తో కూడిన ఆభ‌ర‌ణాల‌కూ డిమాండ్ పెరుగుతోంది.``

gold sales-dhanteras | ప్ర‌తి ఏటా ఫెస్టివ్ సీజ‌న్‌.. ప్ర‌త్యేకించి ధంతేరాస్‌-దీపావ‌ళి సంద‌ర్భంగా భార‌తీయులు పిస‌రంత బంగారం కొనుగోలు చేస్తుంటారు. జ‌న‌వ‌రి 29న‌ ప‌ది గ్రాముల బంగారం సుమారు రూ.1.8 ల‌క్ష‌ల ఆల్‌టైం గ‌రిష్టానికి చేరుకుని తాజాగా రూ.1.42 ల‌క్ష‌ల‌కు దిగి వ‌చ్చింది. ధంతేరాస్‌- దీపావ‌ళి, అక్ష‌య తృతీయ పర్వ‌దినాల సంద‌ర్భంగా బంగారం కొంటే క‌లిసొస్తుంద‌ని భార‌తీయులు.. అందునా మ‌గువ‌ల విశ్వాసం. క‌నుకే తులం బంగారం ధ‌ర రూ.1.42 ల‌క్ష‌లు ప‌లుకుతున్నా.. ఆభ‌ర‌ణాల కోసం జ్యువెల్ల‌రీ షాపుల‌కు మ‌హిళ‌లు ప‌రుగులు తీస్తున్నారు.

52 ట‌న్నుల బంగారం విక్ర‌యం

గ‌తేడాదితో పోలిస్తే ఈ ఏడాది పండుగ‌ల సీజ‌న్‌లో బంగారం కొనుగోళ్లు 30 శాతం పెరిగాయి. సుమారు రూ.72వేల కోట్ల విలువైన 52 ట‌న్నుల బంగారం కొనుగోలు జ‌రిగింద‌ని ఇండియా బులియ‌న్ అండ్ జ్యువెల్ల‌ర్స్ అసోసియేష‌న్ (ఐబీజేఏ) ప్ర‌క‌టించింది. ధ‌ర ప్రియంగా ఉన్నా..రోజువారీ జీవ‌న‌మే క‌ష్టంగా ఉన్నా.. పండుగ సీజ‌న్‌లో బంగారానికి వినియోగ‌దారుల నుంచి గిరాకీ కొన‌సాగుతూనే ఉంది. 

దంతేరాస్‌, దీపావ‌ళితోపాటు పెళ్లిళ్ల సీజ‌న్ కూడా న‌డుస్తుండ‌టంతో సంప్ర‌దాయంగా బంగారం ఆభ‌ర‌ణాల కొనుగోళ్లకు ప్రాముఖ్య‌త ఉంద‌ని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్ట‌ర్ హిమాంక్ శ‌ర్మ పేర్కొన్నారు. పండుగ‌ల‌తోపాటు మ‌రో కొన్ని వారాల పాటు కొన‌సాగ‌నున్న‌ పెళ్లిళ్ల సీజ‌న్ నేప‌థ్యంలో స‌గ‌టున 25 శాతం బంగారం ఆభ‌ర‌ణాల కొనుగోళ్లు పెరిగాయ‌ని చెబుతున్నారు. 

సంప్ర‌దాయ బంగారం కొనుగోళ్ల‌కు డిమాండ్‌

లైట్ వెయిట్ ఎవ్రీ డే క‌లెక్ష‌న్స్‌, గోల్డ్ కాయిన్స్‌తోపాటు సంప్ర‌దాయ బంగారం ఆభ‌ర‌ణాల‌కు గిరాకీ పెరుగుతోంద‌ని జోయ‌లుక్కాస్ పేర్కొంది. ఓవ‌రాల్ సేల్స్ 25# పెరిగాయ‌ని జోయ‌లుక్కాస్ గ్రూప్ చైర్మ‌న్ డాక్ట‌ర్ జాయ్ అలుక్కాస్ తెలిపారు. బంగారం ఆభ‌ర‌ణాల‌తోపాటు క‌ల‌ర్డ్ జెమ్ స్టోన్స్ గ‌ల జ్యువ‌ల్ల‌రీ వైపు క‌స్ట‌మ‌ర్లు మ‌ళ్లుతున్నారు. 


గ‌తేడాది సెప్టెంబ‌రు సేల్స్‌తో పోలిస్తే సెన్‌కో గోల్డ్ కొనుగోళ్లు 25% పెరిగాయని ఆ సంస్థ ఎండీ కం సీఈఓ సువంక‌ర్ సేన్ వెల్ల‌డించారు. దంతేరాస్ త‌మ‌కు ఎంతో స్పెష‌ల్ అని పేర్కొన్నారు. క‌ల‌ర్డ్ జెమ్ స్టోన్ జ్యువెల్ల‌రీ విక్ర‌యాలు 35-40 శాతం పెరిగాయి. ఈనెల 20న దేవ్ ఉథానీ ఏకాద‌శి త‌ర్వాత శీతాకాల పెళ్లిళ్ల సీజ‌న్ మొద‌ల‌వుతుంది. ఇది జ్యువెల్ల‌రీ షాపుల‌కు ఫెస్టివ్ + బ్రైడ‌ల్ డిమాండ్ ఉంటుంద‌ని భావిస్తున్నారు. 

బంగారం కొనుగోళ్ల విలువ 30 % ఎక్కువే

ధంతేరాస్ సంద‌ర్భంగా స్పాట్ బంగారం కొనుగోళ్ల‌తోపాటు అడ్వాన్స్ బుకింగ్స్ న‌మోద‌య్యాయి. బంగారం కొనుగోలు దారుల్లో అత్య‌ధికులు లెయిట్ వెయిట్ జ్యువెల్ల‌రీ, స్మాల్ కాయిన్స్‌, లోయ‌ర్ క్యార‌ట్ డిజైన్స్ వైపు మ‌ళ్లుతున్నారు. సాధ్య‌మైనంత మేర‌కు స‌ర‌స‌మైన కొనుగోళ్ల‌కే మొగ్గు చూపుతున్నారు. గ‌తేడాది (2025)తో పోలిస్తే ప‌రిమాణం రూపేణా ఈ ఏడాది కొనుగోళ్లు దాదాపు స‌మాన‌మైనా.. విలువ మాత్రం ఎక్కువ అని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెల్ల‌రీ డొమెస్టిక్ కౌన్సిల్ (జీజేసీ) చైర్మ‌న్ రాజేశ్ రొక్డే చెప్పారు. ప‌రిమాణం రూపంలో 10%, విలువ రూపేణా 30 శాతం ఎక్కువ ఉంటుంద‌ని జీజేసీ అంచ‌నా వేస్తోంది. 

ఈ న‌గ‌రాల్లో ఫ‌స్ట్ టైం కొనుగోళ్ల‌తో గిరాకీ

జైపూర్‌, డెహ్ర‌డూన్, సూర‌త్‌, బెల్గాం, ఆరా, రాయ్‌పూర్ వంటి ద్వితీయ‌, తృతీయ శ్రేణి న‌గ‌రాల్లోనూ ఫ‌స్ట్ టైం కొనుగోళ్ల‌తో బంగారానికి గిరాకీ పెరుగుతోంది. చిన్న ప‌ట్ట‌ణాల్లో పాత బంగారం మార్పిడితో కొత్త బంగారం ఆభ‌ర‌ణాల కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయి. ఆకాశాన్నంటే రీతిలో పుంజుకున్న బంగారం ధ‌ర నేప‌థ్యంలో అంద‌రూ 14 క్యార‌ట్లు, తొమ్మిది క్యార‌ట్ల డిజైన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక పెళ్లిళ్ల కోసం 1-5 గ్రాముల బంగారం నాణేలు కొనుగోలు చేస్తున్నారు. 

డిజిట‌ల్ గోల్డ్ కొనుగోళ్ల‌పై కుర్రాళ్ల చూపు

అధిక ధ‌ర నేప‌థ్యంలో క‌స్ట‌మ‌ర్లు బంగారం ఆభ‌ర‌ణాల కొనుగోళ్ల విష‌యంలో సెలెక్టివ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కుర్రాళ్లు డిజిట‌ల్ గోల్డ్ కొనుగోళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. జెన్‌-జీ త‌రం సంప్ర‌దాయ అధిక విలువ గ‌ల క్యాట‌గిరీ బంగారం కొనుగోళ్ల‌కు ప్రాధాన్యం ఇస్తూ ఉంటే వ‌జ్రాభ‌ర‌ణాలు, ఇన్వెస్ట్‌మెంట్ ప్రొడ‌క్ట్స్‌కూ గిరాకీ ఎక్కువ‌గానే ఉంది. పెండెంట్స్‌, గాజులు, చైన్స్‌తోపాటు చిన్న బంగారం, వెండి ఆభ‌ర‌ణాల‌కు డిమాండ్ పెరుగుతోంది. 

మీరు ఈ వార్త‌లు కూడా చూడండి :

Sundar Pichai-Satya Nadella | దూకుడుగా మైక్రోసాఫ్ట్ పెట్టుబ‌డులు.. కానీ, టాప్‌లో సుంద‌ర్ పిచ్చాయ్-ఆల్పాబెట్‌


Gold ETFs | ఆక‌ర్ష‌ణీయంగా గోల్డ్ ఈటీఎఫ్స్‌.. 2026 తొలి ప‌ది నెల‌ల్లోనే రికార్డు.. ఎలాగంటే..?!

13.11.26

Gold ETFs | ఆక‌ర్ష‌ణీయంగా గోల్డ్ ఈటీఎఫ్స్‌.. 2026 తొలి ప‌ది నెల‌ల్లోనే రికార్డు.. ఎలాగంటే..?!

Gold ETFs | ``బంగారం అంటే భార‌తీయుల‌కు ఎంతో మోజు. ధ‌ర పెరిగినా బంగారం కొన‌డం ఆప‌ట్లేదు. ఆ కోవ‌లోకే వ‌స్తాయి గోల్డ్ ఈటీఎఫ్‌లు. నిరుడంతా వ‌చ్చిన పెట్టుబ‌డుల‌తో పోలిస్తే 2026లో జ‌న‌వ‌రి నుంచి గ‌త నెల వ‌ర‌కే 15% ఎక్కువ మ‌దుపు చేశారు ఇన్వెస్ట‌ర్లు. గ‌త ప‌ది నెల‌ల్లో వ‌చ్చిన గోల్డ్ ఈటీఎఫ్ పెట్టుబ‌డుల‌లో సింహ భాగం జ‌న‌వ‌రిలోనే న‌మోద‌య్యాయి. అక్టోబ‌రులో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో మ‌దుపులు మోస్త‌రుగా ఉన్నా.. సిల్వ‌ర్ ఈటీఎఫ్‌ల్లో గ‌ణ‌నీయ పెట్టుబ‌డులు న‌మోద‌య్యాయి. అక్టోబ‌రులో గోల్డ్‌, సిల్వ‌ర్ ఈటీఎఫ్‌ల్లో క‌లిపి పెట్టుబ‌డులు రూ.6,566 కోట్లు కాగా, వాటిల్లో సిల్వ‌ర్ ఈటీఎఫ్‌ల వాటా రూ.3,092 కోట్లు``

బంగారం అంటే ఎవ‌రికైనా ఇష్ట‌మే.. భార‌తీయులు.. అందునా బామ‌లు బంగారం ఆభ‌ర‌ణాలంటే మ‌న‌స్సు పారేసుకుంటారు. బంగారం ప‌ట్ల ప్ర‌జ‌ల్లో మోజు, దానికి ఉన్న విలువ‌ను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్ర‌భుత్వం `గోల్డ్ ఈటీఎఫ్‌`ల‌ను అందుబాటులోకి తెచ్చింది. గోల్డ్ ఈటీఎఫ్‌లంటే గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అన్న మాట‌.

కొవిడ్‌తో దూసుకెళ్లిన బంగారం ధ‌ర‌లు

2019 చివ‌ర్లో డ్రాగ‌న్‌లో వెలుగు చూసిన కొవిడ్‌-19 మ‌హ‌మ్మారి ప్ర‌భావంతో బంగారంతోపాటు వెండి వంటి ముఖ్య‌మైన లోహాల ధ‌ర‌ల‌కు రెక్క‌లొచ్చాయి. ఇన్వెస్ట‌ర్లు కూడా స్టాక్ మార్కెట్ల‌లో పెట్టుబ‌డుల‌తోపాటు ప్ర‌త్యామ్నాయంగా బంగారం, వెండి వంటి అమూల్య‌మైన లోహాల‌పైనా పెట్టుబ‌డులు పెడుతూ వ‌స్తున్నారు.

ధ‌ర పెరిగినా బంగారంపై త‌గ్గ‌ని మోజు

అటువంటి కోవ‌లోకే వ‌స్తాయి గోల్డ్ ఈటీఎఫ్‌లు. తులం బంగారం ధ‌ర రూ.1.37 ల‌క్ష‌ల పైచిలుకు ప‌లుకుతోంది. కానీ, భార‌తీయుల్లో బంగారం ప‌ట్ల మోజు ఎంత మాత్ర‌మూ త‌గ్గ‌ట్లేదు. ఇక గోల్డ్ ఈటీఎఫ్‌ల సంగ‌తి స‌రేస‌రి. ఏయేటికాయేడు ఈటీఎఫ్‌ల‌పై పెట్టుబ‌డులు గ‌ణ‌నీయంగా పెరుగుతున్న‌ట్లే ఈ ఏడాదీ పెరిగాయి. గ‌త నెల‌లో మోస్త‌రుగా ఉన్నాగ‌తేడాది (2025) కంటే ఈ ఏడాది గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి తొలి 10 నెల‌ల్లోనే అత్య‌ధిక పెట్టుబ‌డులు వ‌చ్చాయి.

తొలి 10 నెలల్లోనే 15 శాతం పెరిగిన ఈటీఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌

2026 జ‌న‌వ‌రి నుంచి అక్టోబ‌రు వ‌ర‌కూ రూ.49,399 కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చాయి. ఇవి గ‌తేడాది పొడ‌వునా వ‌చ్చిన రూ.42,961 కోట్ల కంటే ఎక్కువ అని మార్నింగ్ స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ ఇండియా చెబుతోంది. అంటే నిరుడంతా గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి వ‌చ్చిన పెట్టుబ‌డులతో పోలిస్తే ఈ ఏడాది తొలి ప‌ది నెల‌ల్లోనే రూ.6,438 కోట్లు ఎక్కువ‌. ఇన్వెస్ట‌ర్లు 15 శాతం అధికంగా పెట్టుబ‌డులు పెట్టార‌న్న మాట‌.

అక్టోబ‌రులో మంద‌గించినా గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబ‌డుల వ‌ర‌ద‌

ఈ ఏడాది ప్రారంభంలో బులియ‌న్ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌లు దూసుకెళ్ల‌డంతో ఇన్వెస్ట‌ర్లు లాభాల స్వీక‌ర‌ణ‌కు ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో గ‌త నెల‌లో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబ‌డులు మోస్త‌రుగా వ‌చ్చాయి. కానీ, వైవిధ్య భ‌రిత‌మైన‌, మ‌ల్టీ అసెట్ పోర్ట్ ఫోలియోల్లో పెట్టుబ‌డులు పెట్ట‌డానికే ఇన్వెస్ట‌ర్లు ఆస‌క్తి క‌న‌బ‌రిచారు. ప్ర‌త్యేకంచి బంగారాన్ని దీర్ఘ‌కాలిక పోర్ట్‌ఫోలియోగా భావిస్తున్న మ‌దుప‌ర్లు సుముఖ‌త చూపారు.

జ‌న‌వ‌రిలోనే స‌గం పెట్టుబ‌డుల వ‌ర‌ద‌..

నెల వారీ పెట్టుబ‌డుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకంటే గోల్డ్ ఈటీఎఫ్‌ల‌కు జ‌న‌వ‌రి అసాధార‌ణ‌మైంది. వివిధ పంట‌ల దిగుబ‌డులు రావ‌డంతోపాటు చేతికి డ‌బ్బు వ‌స్తుంది. అలా వ‌చ్చిన డ‌బ్బును విశ్వ‌స‌నీయ‌మైన మార్గాల్లో పెట్టుబ‌డిగా పెట్ట‌డానికి ప్రాధాన్యం ఇస్తారు. అలా పోలిస్తే.. గ‌త జ‌న‌వ‌రిలోనే గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.24,040 కోట్ల విలువైన పెట్టుబ‌డులు వ‌చ్చాయి. 2026 తొలి ప‌ది నెల‌ల్లో వ‌చ్చిన పెట్టుబ‌డుల్లో 49 శాతం. ఫిబ్ర‌వ‌రిలో రూ.5,255 కోట్లు, సెప్టెంబ‌రులో రూ.4,451 కోట్లు వ‌చ్చాయి. ఇక గ‌త ప‌ది నెల‌ల్లో మే నెల‌లో మాత్ర‌మే గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి ఇన్వెస్ట‌ర్లు న‌గ‌దు ఉప‌సంహ‌రించుకున్నారు.

గోల్డ్‌లోనే పెట్టుబ‌డులు ఎందుకంటే..

ఉక్రెయిన్‌-ర‌ష్యా యుద్ధం, ప‌శ్చిమాసియాలో ఇరాన్‌పై ఇజ్రాయెల్‌-అమెరికా దాడులు, ప్ర‌తి దాడుల‌తో యావ‌త్ ప్ర‌పంచ దేశాలు త‌ల్ల‌డిల్లుతున్నాయి. దీనికి తోడు ఎల్‌నినో ప్ర‌భావం ఉండ‌నే ఉంది. ఫ‌లితంగా అంత‌ర్జాతీయ ఆర్థిక వృద్ధిరేటుపై నెల‌కొన్న అనిశ్చితి.. వివిధ దేశాల ద్ర‌వ్య ప‌ర‌ప‌తి విధానంపై అంచ‌నాల‌తో ఇన్వెస్ట‌ర్లు బంగారంపై పెట్టుబ‌డులు పెట్ట‌డానికే మొగ్గు చూపుతున్నార‌ని మార్నింగ్ స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ ఇండియా అన‌లిస్టు మెష్రాం పేర్కొన్నారు. షార్ట్ ట‌ర్మ్ ఇన్వెస్ట్ మెంట్ అవ‌కాశాల‌కంటే వైవిధ్య భ‌రిత‌మైన డెఫినెటివ్ అసెట్‌గా రూపాంత‌రం చెందిన బంగారంపైనే ఇన్వెస్ట‌ర్లు పెట్టుబ‌డులు పెట్ట‌డానికి మోజు పెంచుకుంటార‌ని తెలిపారు.

గోల్డ్ ఈటీఎఫ్‌ల‌కు త‌గ్గినా జోరుగా సిల్వ‌ర్ ఈటీఎఫ్‌లు

ఇన్వెస్ట‌ర్లు అక్టోబ‌రులో మోస్త‌రుగా గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబ‌డులు వ‌చ్చినా.. సిల్వ‌ర్ ఈటీఎఫ్‌ల‌లో జోరుగా ఇన్వెస్ట్‌మెంట్స్ పెరిగాయి. దేశీయ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌ల‌ను బ‌ట్టే గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబ‌డులను పెట్ట‌డానికే ఇన్వెస్ట‌ర్లు మొగ్గు చూపుతుంటారు. అక్టోబ‌రులో గోల్డ్ అండ్ సిల్వ‌ర్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబ‌డులు రూ.6,566 కోట్లు కాగా, వాటిల్లో సిల్వ‌ర్ ఈటీఎఫ్‌ల వాటా రూ.3,092 కోట్లు. అమూల్య‌మైన లోహాల్లో పెట్టుబ‌డులు సుస్థిరంగా పెరుగుతాయ‌ని ఇన్ క్రెడ్ మ‌నీ మ్యూచువ‌ల్ ఫండ్స్ సీఈఓ నితిన్ అగ‌ర్వాల్ తెలిపారు.

12.11.26

Sundar Pichai-Satya Nadella | దూకుడుగా మైక్రోసాఫ్ట్ పెట్టుబ‌డులు.. కానీ, టాప్‌లో సుంద‌ర్ పిచ్చాయ్-ఆల్పాబెట్‌


``టాప్‌-5 సంస్థ‌ల విలువ 9.1 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల‌కు పెర‌గ‌డంలో భా ర‌త సంత‌తికి చెందిన కొద్ది మంది టెక్నాల‌జీ లీడ‌ర్ల సార‌థ్యమే దానికి కార‌ణం.సుంద‌ర్ పిచ్చాయ్‌, స‌త్య నాదెళ్ల‌, సంజ‌య్ మ‌ల్హోత్రా త‌ర్వాత యూ-ట్యూబ్ నీల్ మోహ‌న్‌, ఐదో స్థానంలో గూగుల్ క్లౌడ్‌  థామ‌స్ కురియ‌న్ నిలిచారు``

Sundar Pichai-Satya Nadella | నాలుగైదేళ్ల నాటి వ‌ర‌కూ మ‌న‌కు తెలియ‌ని అంశ‌మేదైనా ఉంటే `గూగుల్ త‌ల్లి`, `గూగుల‌మ్మ‌`ను అడిగే వాళ్లం.. కానీ కృత్రిమ మేధ (ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌) వ‌చ్చాక‌.. దాని చాట్ బోట్‌ల సేవ‌లు విస్తృత‌మ‌య్యాక ఏఐ చాట్‌బోట్‌ల‌దే ఆధిప‌త్యమైంది. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ మీద ప‌ట్టు సాధించిన వారే ముందుకు దూసుకెళ్ల‌గ‌ల‌ర‌ని తాజా ప‌రిణామాలు చెబుతున్నాయి. 

గూగుల్‌-ఆల్పాబెట్ కంటే ముందు ఏఐ చాట్‌బోట్ చాట్ జీపీటీని తీసుకొచ్చిన ఓపెన్ ఏఐలో పెట్టుబ‌డులు పెట్టింది మైక్రోసాఫ్ట్‌. అటుపై మైక్రోసాఫ్ట్‌తో పోటీ ప‌డ్డ గూగుల్‌-అల్పాబెట్ ఇప్పుడు కృత్రిమ మేధ‌లోనే కాదు ఆదాయం, లాభాలార్జ‌న‌లోనే మైక్రోసాఫ్ట్‌ను తోసి రాజ‌ని మొద‌టి వ‌రుస‌లోకి దూసుకొచ్చింది. 

స‌త్య నాదెళ్ల‌ను దాటేసిన పిచ్చాయ్‌

ఇక మైక్రోసాఫ్ట్ సీఈఓ కం చైర్మ‌న్ స‌త్య నాదెళ్ల‌ను గూగుల్ - ఆల్పాబెట్ సీఈఓ సుంద‌ర్ పిచ్చాయ్ కూడా దాటేశారు. 2026 హెచ్ఎస్‌బీసీ హురున్ గ్లోబ‌ల్ ఇండియ‌న్స్ జాబితాలో స‌త్య నాదెళ్ల‌ను దాటి సుంద‌ర్ పిచ్చాయ్ మొద‌టి స్థానంలో నిలిచారు దానికి కార‌ణం ఈ ఏడాది గూగుల్‌-ఆల్పాబెట్ విలువ 98% పెరిగి 4.2 ల‌క్ష‌ల డాల‌ర్ల‌కు చేరుకుంది. గ్లోబ‌ల్ కార్పొరేట్ రంగం రూపురేఖ‌ల‌ను ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తోపాటు క్లౌడ్ కంప్యూటింగ్‌, డిజిట‌ల్ అడ్వ‌ర్టైజింగ్ మార్చేశాయి. 

అత్యంత విలువైన కంపెనీ ఆల్పాబెట్‌

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌, క్లౌడ్ కంప్యూటింగ్‌, డిజిట‌ల్ అడ్వ‌ర్టైజింగ్ విభాగాలపై ప‌ట్టు సాధించ‌డంతో హెచ్ఎస్‌బీసీ హురున్ గ్లోబ‌ల్ ఇండియ‌న్స్ జాబితాలో సుంద‌ర్ పిచ్చాయ్‌కు ప్ర‌థ‌మ ర్యాంకు ద‌క్కితే.. మైక్రోసాఫ్ట్‌ను దాటేసిన గూగుల్‌-ఆల్పాబెట్.. ప్ర‌పంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా తొలి ర్యాంకును సొంతం చేసుకుంది. 

ఆల్పాబెట్ ఇలా .. మైక్రోసాఫ్ట్ అలా..

హెచ్ఎస్‌బీసీ హురున్ గ్లోబ‌ల్ ఇండియ‌న్స్ జాబితా-2026 ప్ర‌కారం సుంద‌ర్ పిచ్చాయ్ సార‌థ్యంలో సాగుతున్న‌ ఆల్పాబెట్ విలువ 98 % పుంజుకుని 4.2 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల‌కు పెరిగితే.. స‌త్య నాదెళ్ల నేతృత్వంలో న‌డుస్తున్న మైక్రోసాఫ్ట్ విలువ 17% త‌గ్గి 2.6 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల‌కు ప‌డిపోయింది. 2024లో టాప్ పొజిష‌న్‌లో నిలిచిన మైక్రోసాఫ్ట్ ఇప్పుడు తిరోగ‌మ‌న స్థితికి చేరుకుంది. 

ఏఐ బిజినెస్‌లో టాప్‌-5 భార‌త సంత‌తి వారిదే సార‌థ్యం

సుంద‌ర్ పిచ్చాయ్‌, స‌త్య నాదెళ్ల త‌ర్వాత మ‌రో భార‌త సంత‌తికి చెందిన సంజ‌య్ మ‌ల్హోత్రా.. జాబితాలో మూడో ర్యాంకు పొందారు. ప్రెసిడెంట్ కం సీఈఓగా సంజ‌య్ మ‌ల్హోత్రా సార‌థ్యం వ‌హిస్తున్న మైక్రాన్ టెక్నాల‌జీ 1.4 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల సంప‌ద‌ను కూడ‌బెట్టుకుంది. ఇక ఈ జాబితాలోని టాప్‌-5 సంస్థ‌ల విలువ 9.1 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల‌కు పెర‌గ‌డంలో భా ర‌త సంత‌తికి చెందిన కొద్ది మంది టెక్నాల‌జీ లీడ‌ర్ల సార‌థ్యమే దానికి కార‌ణం కావ‌డం మ‌రో విశేషం. నాలుగో స్థానంలో యూ-ట్యూబ్ నీల్ మోహ‌న్‌, ఐదో స్థానంలో గూగుల్ క్లౌడ్‌కు చెందిన థామ‌స్ కురియ‌న్ నిలిచారు. వీరంతా భార‌త సంత‌తి టెక్నాల‌జీ లీడ‌ర్స్ కావ‌డం ఇండియ‌న్స్‌కు గ‌ర్వ కార‌ణం. 

ఆల్పాబెట్ వృద్ధికి కార‌ణ‌మేమిటంటే..

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌, క్లౌడ్ కంప్యూటింగ్‌, డిజిట‌ల్ అడ్వ‌ర్టైజింగ్ రంగాల్లో విస్త‌ర‌ణ ఆల్పాబెట్ ఎదుగుద‌ల‌ను ప్ర‌తిబింబిస్తోంది. ఏఐ-ప‌వ‌ర్డ్ సెర్చ్, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌, టెక్నాల‌జీ ప్లాట్‌ఫామ్స్ మీద సుంద‌ర్ పిచ్చాయ్ నాయ‌క‌త్వం పెట్టుబ‌డులు కొన‌సాగిస్తూ వ‌చ్చింది. ఏఐ స‌ర్వీసుల‌కు అంత‌ర్జాతీయంగా ఉన్న డిమాండ్‌ను ఏంచ‌క్కా సొమ్ము చేసుకుంది.

మైక్రోసాఫ్ట్ దూకుడుగా దూసుకెళ్లినా..

స‌త్య నాదెళ్ల సార‌థ్యంలో మైక్రోసాఫ్ట్ కూడా దూకుడుగా ఏఐ ఆధారిత పెట్టుబ‌డుల వ్యూహాన్ని అమ‌లు చేసింది. ఎంట‌ర్ ప్రైజెస్ సాఫ్ట్ వేర్ గా ఆర్టిపిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌ను ఇంటిగ్రేటింగ్ చేయ‌డంతోపాటు క్లౌడ్ కంప్యూటింగ్‌, ప్రొడ‌క్టివిటీ అప్లికేష‌న్స్ మీద దృష్టి పెట్టినా ఆల్పాబెట్ శ‌క్తిమంతంగా త‌న విలువ‌ను పెంచుకుంది. అలాగ‌ని ఆల్పాబెట్ వృద్ధిలో దాని వ్య‌క్తిగ‌త బిజినెస్ సెగ్మెంట్ల‌ను హురున్ గ్లోబ‌ల్ రిచ్ జాబితా నివేదిక వ‌దిలేయ‌లేదు. 

హురున్ గ్లోబ‌ల్ ఇండియా జాబితాలో టాప్‌లో ఏఐ

ఏఐ ఆధారిత కంపెనీల విలువ‌ 10.7 ల‌క్ష‌ల కోట్ల‌ డాల‌ర్ల మార్కుకు చేరుకున్నది. హెచ్ఎస్‌బీసీ హురున్ గ్లోబ‌ల్ ఇండియ‌న్స్ లిస్టు-2026లో ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ నిర్ణ‌యాత్మ‌కంగా మారింది. ఈ జాబితాలో చోటు ద‌క్కించుకున్న 200 సంస్థ‌ల్లో 103 సంస్థ‌లు ఏఐ- డ్రైవెన్ లేదా ఏఐ- ఇంటిగ్రేటెడ్ సంస్థలు కాగా, వాటి విలువ 10.7 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్లు కాగా, మొత్తం 200 సంస్థ‌ల విలువ 15 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల‌లో 71 శాతం. 

హురున్ ఇండియా ఫౌండ‌ర్ అండ్ చీఫ్ రీసెర‌చ‌ర్ అనాస్ రెహ్మాన్ జునాయిద్ మాట్లాడుతూ `ఈ జాబితాలో 71 శాతానికి పైగా కంపెనీల విలువ ఏఐ ఆధారితం` అని వ్యాఖ్యానించారు. ప్ర‌వాస భార‌తీయులు కేవ‌లం ఏఐ విప్ల‌వంలో భాగ‌స్వాములే కాదు.. దానికి సార‌థ్యం వ‌హిస్తున్నార‌ని ప్ర‌శంసించారు. 

లాభాల్లోనూ ఆల్పాబెట్‌-గూగుల్‌దే పైచేయి

ఆదాయంతోపాటు లాభాల్లోనూ మైక్రోసాఫ్ట్‌ను ఆల్పాబెట్‌-గూగుల్ అధిగ‌మించింది. 2025లో ఆల్పాబెట్ నిక‌ర లాభం 132.2 బిలియ‌న్ డాల‌ర్లైతే.. మైక్రోసాఫ్ట్ 101.8 బిలియ‌న్ డాల‌ర్లతో స‌రి పెట్టుకుంది. రెండు కంపెనీలు క‌లిసి సుమారు 234 బిలియ‌న్ డాల‌ర్ల లాభాలు సృష్టించాయి. 

ఇక ఆల్పాబెట్ ఆదాయం 402.8 బిలియ‌న్ల డాల‌ర్ల‌కు చేరుకుంటే, మైక్రోసాఫ్ట్ 281.7 బిలియ‌న్ డాల‌ర్లు. సుంద‌ర్ పిచ్చాయ్‌.. కార్పొరేట్ విలువ ఆధారిత ర్యాంకుల్లో ముందు ఉంటే.. లింక్డ్ ఇన్‌లో స‌త్య నాదెళ్ల క‌మాండ్ సాధించారు. స‌త్య నాదెళ్ల‌కు 12.1 మిలియ‌న్ల ఫాలోవ‌ర్లు ఉంటే.. సుంద‌ర్ పిచ్చాయ్‌కు 4.7 మిలియ‌న్ల అభిమానులే ఉన్నారు. 

200 గ్లోబ‌ల్ కంపెనీల‌కు 236 మంది ఎన్నారైల సార‌థ్యం

236 మంది భార‌త సంత‌తి కార్పొరేట్ అధిప‌తులు.. ఇండియా ఆవ‌ల ప్ర‌పంచంలోకెల్లా అత్యంత విలువైన 200 కంపెనీల‌కు సార‌థులుగా ఉన్నారు. 2024లో 9.9 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్లుగా ఉన్న ఈ కంపెనీల విలువ 2026లో 15 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల‌కు దూసుకెళ్లింది. 

ఒక కంపెనీ క‌నీస విలువ రెట్టింపుకు పైగా పెరిగి 1.2 బిలియ‌న్ డాల‌ర్ల నుంచి 2.5 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరుకుంది. టెక్నాల‌జీ ప్ర‌పంచ చ‌రిత్ర‌లోనే ఏఐ ఆధారిత 18 కంపెనీల విలువ 227 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరుకోవ‌డం ఇదే మొద‌టి సారి. 

కంపెనీల్లో అమెరికా టాప్‌

అమాన్ సంగ‌ర్ కో ఫౌండ‌ర్ గా ఉన్న స్టార్ట‌ప్ క‌ర్స‌ర్ విలువ‌ 60 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరుకోగా త‌ర్వాత 41 బిలియ‌న్ డాల‌ర్ల‌తో ప్రొమెథియాస్‌, 20 బిలియ‌న్ డాల‌ర్ల‌తో ప‌ర్‌ప్లెక్సిటీ నిలిచాయి. కంపెనీల జాబ‌తాలో అమెరికా ఆధిపత్యం ప్ర‌ద‌ర్శిస్తే.. మ‌హిళ‌ల ప్రాతినిధ్యం మ‌రోమారు త‌క్కువే. 177 అమెరికా కంపెనీలు, యూఏఈ, యూకే చెరో 15 కంపెనీలు ఈ జాబితాలో చోటు ద‌క్కించుకున్నాయి. 

శాన్ ఫ్రాన్సిస్కో 40, కాలిఫోర్నియా నుంచి 91 సంస్థ‌లు జాబితాలో చేరాయి. 236 మంది కార్పొరేట్ అధిప‌తుల్లో మ‌హిళ‌లు 16 మందే. 208 బిలియ‌న్ డాల‌ర్ల‌తో ఆర్టిస్టా నెట్‌వ‌ర్క్‌కు జ‌య‌శ్రీ వి ఉల్లాల్ సార‌థ్యం వ‌హిస్తున్నారు. 

58 శాతం మంది ఇండియాలో అండ‌ర్ గ్రాడ్యుయేట్సే

వీరిలో 58 శాతం మంది భార‌త్‌లో అండ‌ర్ గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసిన వారే. అందునా ఐఐటీ ఢిల్లీ విద్యార్థులే ఎక్కువ‌. ఈ కంపెనీల‌న్నీ 53 ల‌క్ష‌ల మందికి ఉద్యోగాలు క‌ల్పించి 2025లో 2.5 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల ఆదాయం, 416 బిలియ‌న్ డాల‌ర్ల లాభాలు గ‌డించాయి. 


మీరు ఈ వార్త‌లు కూడా చూడండి:

Satya Nadella- Microsoft | భాగ్య‌న‌గ‌రం టూ సిలికాన్ వ్యాలీ.. మైక్రోసాఫ్ట్ సీఈవో స‌త్యనాదెళ్ల ఎవ‌రో తెలుసా..?!

bill gates- satya nadella | యుగంధ‌ర్ త‌న‌యుడే స‌త్య‌నాదెళ్ల‌.. మైక్రోసాఫ్ట్‌లో ఆయ‌నే స‌ర్వాంత‌ర్యామి..

11.11.26

Smart Phones below Rs.20,000 | రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే..!



Smart Phones below Rs.20,000 | గ‌తంలో పుస్త‌కం హ‌స్త‌భూష‌ణం అని అన్నారు. ప్ర‌స్తుతం ఒక స్మార్ట్ ఫోన్ హ‌స్త‌భూష‌ణం అన్న నానుడి ఏర్ప‌డింది. అనునిత్యం అభివృద్ధి చెందుతున్న టెక్నాల‌జీ ప్ర‌పంచంలో అర‌చేతిలోనే అన్ని ర‌కాల సేవ‌లు అందుబాటులో ఉంటున్నాయి. స్మార్ట్ ఫోన్‌లో వాట్సాప్‌తోపాటు క్రెడిట్ కార్డు, గూగుల్ పే, ఫోన్‌పే త‌దిత‌ర పేమెంట్‌ యాప్స్, జియో హాట్‌స్టార్‌, నెట్‌ఫ్లిక్స్‌, ఆహా వంటి ఎంట‌ర్‌టైన్‌మెంట్ యాప్స్‌, ఐఆర్‌సీటీసీ, టీజీఎస్ఆర్టీసీ గ‌మ్యం వంటి ట్రావెల్ యాప్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్ (ఎక్స్‌) వంటి సోష‌ల్ మీడియా యాప్స్‌తో మ‌నం ఎక్క‌డున్నా స్మార్ట్‌ఫోన్‌లో మ‌న ప‌ని మనం సాఫీగా చేసేయొచ్చు.

అన్నిర‌కాల యాప్స్‌, ఫీచ‌ర్స్ తోపాటు వైవిధ్య భ‌రిత‌మైన యూజ‌ర్ల‌ మ‌నీ ఆప్ష‌న్స్‌కు అనుగుణంగా బాగా ప‌ని చేసే సామ‌ర్థ్యం, కెమెరాలు, బ్యాట‌రీ లైఫ్‌, డిస్‌ప్లేలు, దీర్ఘ‌కాల సాఫ్ట్‌వేర్ మ‌ద్ద‌తు గ‌ల స్మార్ట్ ఫోన్లూ.. రూ.20వేల లోపు ధ‌ర‌కు అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్ల కోసం భార‌తీయులు చూస్తున్నారు. 

యూజ‌ర్ల రోజువారీ వాడ‌కానికి అనుకూల సెగ్మెంట్‌

ఇత‌ర సెగ్మెంట్ల కంటే రూ.20 వేల లోపు ధ‌ర గ‌ల స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌లో మ‌రింత‌గా పోటీ ప‌డుతున్నాయి. ఈ రేంజ్ లో కొనుగోలు దారులు త‌మ అత్య‌వ‌స‌ర సేవ‌ల గురించి రాజీ ప‌డ‌కుండా.. అమోలెడ్ డిస్‌ప్లేస్‌, క్యాప‌బుల్ ప్రాసెస‌ర్లు, పొడ‌వైన బ్యాట‌రీలు, ఓఐఎస్ ఎనేబుల్డ్ కెమెరా, దీర్ఘ‌కాల సాఫ్ట్‌వేర్ మ‌ద్ద‌తు  గ‌ల స్మార్ట్ ఫోన్లు రెడీగా ఉన్నాయి. గేమింగ్‌, ఫొటోగ్ర‌ఫీ, ఎంట‌ర్‌టైన్‌మెంట్ స‌హా రోజువారీ వాడ‌కానికి అనుకూలంగా ప‌లు ఆప్ష‌న్లు గ‌ల స్మార్ట్ ఫోన్లు మార్కెట్‌లోకి వ‌చ్చేశాయి. ఈ సెగ్మెంట్‌లో అత్య‌వ‌స‌ర సేవ‌ల‌కు రోజువారీగా ఉప‌యోగించుకునే స్మార్ట్ ఫోన్ల‌పై ఓ లుక్కేద్దాం..!


మీడియా టెక్‌డైమెన్సిటీ7400 ట‌ర్బో చిప్‌తో ఐక్యూ జ‌డ్‌11ఎక్స్ 5జీ ( iQOO Z11x 5G)

ప‌నితీరుకు, బ్యాట‌రీ లైఫ్‌కు ప్రాధాన్యం ఇచ్చే యూజ‌ర్ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని మార్కెట్‌లోకి వ‌చ్చిందే ఐక్యూ 11ఎక్స్ 5జీ (iQOO 11x 5G) ఫోన్‌. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ట‌ర్బో చిప్‌సెట్ (MediaTek Dimensity 7400 Turbo chipset)తోపాటు ఎంత భారీగా వాడినా సౌక‌ర్య‌వంతంగా ఉండేలా పొడ‌వైన 7200 ఎంఏహెచ్ బ్యాట‌రీ (7,200mAh battery)తో వ‌స్తోంది. బ్యాట‌రీ బ్యాక‌ప్‌, గేమింగ్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చే వారికి బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఇది. స‌మ‌ర్థ‌వంత‌మైన ప‌నితీరుతోపాటు సుదీర్ఘ బ్యాట‌రీ, స్టీరియో స్పీక‌ర్లు ఐపీ68/ఐప‌ఈ 69 ప్రొటెక్ష‌న్.. ఐక్యూ 11ఎక్స్ 5జీ ఫోన్ సొంతం.

ముఖ్య‌మైన ఫీచ‌ర్లు ఇవే  

6.76 అంగుళాల ఫుల్ హెచ్డీ + 120 హెర్ట్జ్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (6.76-inch FHD+ 120Hz LCD display)

మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ట‌ర్బో ప్రాసెస‌ర్ (MediaTek Dimensity 7400 Turbo processor)

50 ఎంపీ సోనీ ప్రైమ‌రీ కెమెరా (50MP Sony primary camera)

44 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌తోపాటు 7200 ఎంఎహెచ్ బ్యాట‌రీ (7,200mAh battery with 44W fast charging)

ఆండ్రాయిడ్ 16 (Android 16)

పెద్ద బ్యాటరీతోపాటు విశ్వ‌స‌నీయ‌త‌కు ఒప్పో కే14ఎక్స్ 5జీ (Oppo K14x 5G)

ప్ర‌తి రోజూ వాడ‌కంతోపాటు పెద్ద బ్యాట‌రీ, స్మూత్ డిస్‌ప్లే, విశ్వ‌స‌నీయ‌త‌కు మారు పేరుగా నిలిచిందే ఒప్పో కె14ఎక్స్ 5జీ (Oppo K14x 5G). సాధార‌ణ వాడ‌కం దారుల‌తోపాటు విద్యార్థుల‌కు అవ‌స‌ర‌మైన లాంగ్ బ్యాట‌రీ లైఫ్‌, స్మూత్ స్క్రోలింగ్‌, స్టోరేజీ విస్త‌ర‌ణ సామ‌ర్థ్యం క‌లిగి ఉన్న ఫోన్ ఇది. 

ఇవే కీల‌క ఫీచ‌ర్లు 

6.75 అంగుళాల హెచ్‌డీ + 120 హెర్ట్జ్ డిస్‌ప్లే (6.75-inch HD+ 120Hz display)

మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్ సెట్ (MediaTek Dimensity 6300 chipset)

50 ఎంపీ డ్యుయ‌ల్ రేర్ కెమెరా (50MP dual rear camera)

45వాట్ల చార్జింగ్‌తోపాటు 6500 ఎంఏహెచ్ బ్యాట‌రీ (6,500mAh battery with 45W charging)

ఆండ్రాయిడ్ 15 బేస్డ్ క‌ల‌ర్ ఓఎస్‌15 (Android 15-based ColorOS 15)

క్లీన్ సాఫ్ట్‌వేర్ అనుభ‌వం, పార‌ద‌ర్శ‌క డిజైన్ లాంగ్వేజ్‌కి మారు పేరు న‌థింగ్ ఫోన్ 3ఏ లైట్ (Nothing Phone 3a Lite)

పార‌దర్శ‌క డిజైన్ లాంగ్వేజ్‌, క్లీన్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియెన్స్‌, ఆచ‌ర‌ణాత్మ‌క సౌంద‌ర్యం, హార్డ్‌వేర్ గ‌ల ఫోన్ న‌థింగ్ ఫోన్ 3ఎ లైట్ (Nothing Phone 3a Lite)

కీల‌క ఫీచ‌ర్లు ఇవే

120 హెర్ట్స్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.77 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే 6.77-inch AMOLED display with 120Hz refresh rate). క్ల‌ట్ట‌ర్ ఫ్రీ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియ‌న్స్‌, వైబ్రంట్ అమోలెడ్ డిస్ ప్లే, రిల‌య‌బుల్ కెమెరాల‌తోపాటు సంప్ర‌దాయ స్మార్ట్ ఫోన్ల డిజైన్‌ల‌కు భిన్నంగా ఉంటుంది. 

మీడియా టెక్ డైమెన్సిటీ 7300 ప్రో ప్రాసెస‌ర్ (MediaTek Dimensity 7300 Pro processor)

50 ఎంపీ ఓఐఎస్ మెయిన్ కెమెరా విత్ 8 ఎంపీ ఆల్ట్రా వైడ్ సెన్స‌ర్ (50MP OIS main camera with 8MP ultra-wide sensor)

33 వాట్ల చార్జింగ్‌తో 5000 ఎంఏహ‌చ్ బ్యాట‌రీ (5,000mAh battery with 33W charging)

న‌థింగ్ ఓఏస్ 3.5 బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 15 (Nothing OS 3.5 based on Android 15)

మ‌ల్టీ మీడియా వాడ‌కం, ఫొటోగ్ర‌ఫీ ఎంజాయ్ చేసే వారికి వివో టీ4ఆర్ 5జీ (Vivo T4R 5G)

ఇవీ కీల‌క ఫీచ‌ర్లు 

6.77 అంగుళాల క‌ర్వుడ్ అమోలెడ్ డిస్‌ప్లే (6.77-inch curved AMOLED display)

మీడియా టెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెస‌ర్ (MediaTek Dimensity 7400 processor)

50 ఎంపీ ఓఐఎస్ రేర్ కెమ‌రా విత్ 32 ఎంపీ సెల్ఫీ కెమెరా (50MP OIS rear camera and 32MP selfie camera)

5700 ఎంఏహెచ్ బ్యాట‌రీ (5,700mAh battery)

ఆండ్రాయిడ్ 15 (Android 15)

హై ఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో రెడ్ మీ 15 5జీ (Redmi 15 5G)

రెడ్‌మీ 15 5జీ (Redmi 15 5G) ఫోన్‌లో బ్యాట‌రీ లైఫ్ అత్యంత ప్ర‌ధాన అంశం. హై రీఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, భారీ బ్యాట‌రీతో షియోమీ తీసుకొస్తున్న ఫోన్ ఇది. అద్భుత‌మైన బ్యాట‌రీ లైఫ్, స్టొరేజీ విస్త‌రించుకునే సామ‌ర్థ్యం, డొల్బీ ఆట్మోస్ స‌పోర్ట్‌, స్ట్రీమింగ్ అండ్ గేమింగ్ కోసం లార్జ్ డిస్ ప్లే క‌ల ఫోన్ ఇది. 

ముఖ్య‌మైన ఫీచ‌ర్లు ఇవే

6.9 అంగుళాల ఫుల్ హెచ్‌డీ + 144 హెర్ట్జ్ డిస్ ప్లే (6.9-inch FHD+ 144Hz display)

స్నాప్ డ్రాగ‌న్ 6ఎస్ జెన్ 3 ప్రాసెస‌ర్ (Snapdragon 6s Gen 3 processor)

50 ఎంపీ రేర్ కెమెరా (50MP rear camera)

7,000ఎంఏహెచ్ బ్యాట‌రీ (7,000mAh battery)

హైప‌ర్ ఓఎస్ 2తోపాటు ఆండ్రాయిడ్ 15 (Android 15 with HyperOS 2)

ప‌లు ప్రీమియం ఫీచ‌ర్ల‌తో మోట‌రోలా మోటో జీ96 (Motorola Moto G96)

స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియ‌న్స్‌తోపాటు పొలెడ్ డిస్‌ప్లే, ప‌లు ప్రీమియం ఫీచ‌ర్ల‌తో మార్కెట్లోకి వ‌చ్చిన ఫోన్ మోట‌రోలా మోటో జీ96 (Motorola's Moto G96). క్లీన్ సాఫ్ట్‌వేర్‌, సామ‌ర్థ్యం గ‌ల స్నాప్ డ్రాగ‌న్ ప్రాసెస‌ర్‌, క‌ర్వ్‌డ్ డిస్‌ప్లే, డిపెండ‌బుల్ కెమెరా సెట‌ప్‌తో వ‌స్తున్న మోస్ట్ బ్యాలెన్స్‌డ్ స్మార్ట్ ఫోన్ ఇది. 

ఇందులో కీల‌క ఫీచ‌ర్లు

144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.67 అంగుళాల క‌ర్వుడ్ పొలెడ్ డిస్‌ప్లే (6.67-inch curved pOLED display with 144Hz refresh rate)

స్నాప్ డ్రాగ‌న్ 7ఎస్ జెన్ 2 చిప్ సెట్ (Snapdragon 7s Gen 2 chipset)

50 ఎంపీ ఓఐఎస్ రేర్ కెమెరా (50MP OIS rear camera)

5500 ఎంఏహెచ్ బ్యాట‌రీ (5,500mAh battery)

ఆండ్రాయిడ్ 15 (Android 15)

మ‌ల్టీ మీడియా ఫీచ‌ర్ల‌తో పొకో ఎక్స్‌7 5జీ (POCO X7 5G)

మ‌ల్టీ మీడియాకు సంబంధించిన సుసంప‌న్న ఫీచ‌ర్ల‌తో డిజైన్ చేసిన, గేమింగ్ కోసం తీసుకొచ్చిన ఫోన్ పొకో ఎక్స్ 7 5జీ (POCO X7 5G). షార్ప్ అమోలెడ్ డిస్‌ప్లే, స‌మ‌ర్థ‌వంత‌మైన గేమింగ్ పెర్ఫార్మెన్స్‌, స్టీరియోస్పీక‌ర్లు, ఫాస్ట్ స్టోరేజీ ఆప్ష‌న్ల‌తో నిండిన ఫోన్ ఇది. 

కీల‌క ఫీచ‌ర్లు ఇవే  

6.67 అంగుళాల 1.5కె క‌ర్వుడ్ అమోలెడ్ డిస్ ప్లే (6.67-inch 1.5K curved AMOLED display)

మీడియా టెక్ డైమెన్సిటీ 7300 ఆల్ట్రా ప్రాసెస‌ర్ (MediaTek Dimensity 7300 Ultra processor)

50 ఎంపీ ఓఐఎస్ ట్రిపుల్ రేర్ కెమెరా (50MP OIS triple rear camera)

స్టీరియో స్పీక‌ర్లు (Stereo speakers)

హైప‌ర్ ఓఎస్ బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ (HyperOS based on Android)

బ్యాలెన్స్‌డ్ హార్డ్‌వేర్ ప్యాకేజీతో శామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్‌36 (Samsung Galaxy F36)

స‌మ‌తుల్య‌మైన హార్డ్‌వేర్ ప్యాకేజీతోపాటు సుదీర్ఘ సాఫ్ట్‌వేర్ స‌పోర్ట్ గ‌ల స్మార్ట్ ఫోన్ల‌లో శామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్‌36 (Samsung's Galaxy F36) ఒక‌టి. సూప‌ర్ అమోలెడ్ డిస్ ప్లే, ఓఐఎస్ కెమెరా, స్టోరేజీ విస్త‌ర‌ణ‌, ఎకో సిస్ట‌మ్‌, సాఫ్ట్‌వేర్ మ‌న్నిక క‌లిగిన ఫోన్ ఇది. 

ఇవే ముఖ్యాంశాలు

6.7 అంగుళాల సూప‌ర్ అమోలెడ్ 120 హెర్ట్జ్ డిస్ ప్లే (6.7-inch Super AMOLED 120Hz display)

ఎక్సినోస్ 1380 ప్రాసెసర్ (Exynos 1380 processor)

50 ఎంపీ ఓఐఎస్ ట్రిపుల్ రేర్ కెమెరా (50MP OIS triple rear camera)

5,000 ఎంఏహెచ్ బ్యాట‌రీ (5,000mAh battery)

వ‌న్ యూఐ 7తోపాటు ఆండ్రాయిడ్ 15 (Android 15 with One UI 7)

cibil score | పేమెంట్స్ ఆల‌స్య‌మైనా.. మీ క్రెడిట్ స్కోర్ మెరుగు ప‌ర్చుకోవ‌డం ఎలా..?!


`ప్ర‌తి ఒక్క‌రూ త‌మ ఆదాయంలో 30 శాతానికి మించి రుణాలు తీసుకోవ‌డాన్ని నివారించ‌మ‌ని మేం చెబుతాం. అధిక రుణ వినియోగం మీ క్రెడిట్ స్కోర్‌ను దెబ్బ తీస్తుంది.మీరు ప్ర‌తి నెలా మీ సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవాలి.  మీ సిబిల్ స్కోర్ 900 ఉంటే ప‌ర్‌ఫెక్ట్ స్కోర్ అది ` అని బ్యాంకు బ‌జార్ సీఈఓ అదిల్ శెట్టి తెలిపారు. 

cibil score | మీరు హోం లోన్ తీసుకోవాల‌ని భావిస్తున్నారా..! ఇప్ప‌టికే గృహ రుణం కోసం బ్యాంక‌ర్‌ని సంప్ర‌దించారా..! అయితే.. ఏ బ్యాంక‌రైనా స‌రే మీకు రుణం ఇవ్వాలంటే ముందుగా మీ సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉందా..?! లేదా..?! అని చెక్ చేస్తారు. క్రెడిట్ (సిబిల్‌) స్కోర్ చెక్ చేసుకోవ‌డానికి సంబంధిత మీ పాన్ కార్డు డిటైల్స్ అప్‌లోడ్ చేస్తే.. సిబిల్ స్కోర్ ఎంతుందో తెలిసిపోతుంది. సిబిల్ స్కోర్ మీ ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ‌ను తెలియ‌జేస్తుంది. ఇంత‌కు ముందు మీరు తీసుకున్న రుణ బ‌కాయి చెల్లింపుల‌ను బ‌ట్టి సిబిల్ స్కోర్ కొన‌సాగుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు ఒక నెల క్రెడిట్ కార్డు బిల్లు గానీ, ప‌ర్స‌న‌ల్ లోన్ వాయిదా చెల్లించ‌క పోయినా మీ క్రెడిట్ స్కోర్ మీద ప్ర‌తికూల ప్ర‌భావం చూపుతుంది.

క్రెడిట్ స్కోర్ అంటే ఏమిటి..?

క్రెడిట్ కార్డు బిల్లు, రుణ నెల‌స‌రి వాయిదా (ఈఎంఐ) చెల్లింపు మిస్ అయినా, ఆల‌స్యంగా చెల్లించినా మీ క్రెడిట్ రిపోర్టులో ప్ర‌తిబింబిస్తుంది. భ‌విష్య‌త్తులో మీరు రుణం తీసుకోవాల‌నుకున్నా.., క్రెడిట్ కార్డు తీసుకోవాల‌నుకున్నా.. ఇటువంటి ప‌రిణామాల‌కు దూరంగా ఉండ‌డానికి జాగ్ర‌త్త‌లు తీసుకోంది. `క్రెడిట్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సిబిల్‌) స్కోర్ మూడంకెలు.  బ్యాంకులు, ఇత‌ర రుణ దాత‌లు మీరు రుణం కోసం పెట్టుకున్న ద‌ర‌ఖాస్తుపై సానుకూల నిర్ణ‌యం తీసుకోవ‌డానికి మీ రుణ ప‌ర‌ప‌తి సామ‌ర్థ్యాన్ని స‌రిగ్గా అంచ‌నా వేయ‌డానికి ఈ మూడంకెల సిబిల్‌ స్కోర్ కీల‌క‌మ‌వుతుంది.

బ్యాంకులు రుణాలివ్వ‌డానికి గీటురాయి సిబిల్ స్కోర్‌

2021-22 ఆర్థిక సంవ‌త్స‌రంలో భార‌తీయుల స‌గ‌టు సిబిల్ స్కోర్ 715. సాధార‌ణంగా బ్యాంక‌ర్లు, ఇత‌ర రుణ దాత‌లు త‌మ ఖాతాదారులూ, రుణ గ్ర‌హీత‌ల సిబిల్ స్కోర్ 750, అంత‌కంటే ఎక్కువ‌గా ఉండాల‌ని కోరుకుంటారు. మీరు రుణం చెల్లించ‌గ‌ల‌రా..? ! లేదా..?! అన్న విష‌యాన్ని బ్యాంకులు, బ్యాంకింగేత‌ర ఆర్థిక సంస్థ‌లు (ఎన్‌బీఎఫ్‌సీ)లు అంచ‌నా వేయ‌డానికి సిబిల్ స్కోర్ స‌హాయ కారిగా ఉంటుంది. మీ రుణ వాయిదాలు గానీ, క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపు గ‌డువు మిస్ అయితే.. క్రెడిట్ కార్డు రుణం కోసం మీరు పెట్టుకున్న ద‌ర‌ఖాస్తుకు ఆమోదం ల‌భించ‌డానికి అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి.

ఒక‌వేళ మీరు ఆల‌స్యంగా ఈఎంఐ గానీ, క్రెడిట్ కార్డు బిల్లు గానీ చెల్లిస్తే ఏమ‌వుతుందో తెలుసుకుందామా..!

నెల‌వారీ రుణ వాయిదా (ఈఎంఐ), క్రెడిట్ కార్డు బిల్లు నిర్ణీత గ‌డువు త‌ర్వాత 30 రోజుల్లో చెల్లిస్తే.. ఆల‌స్య రుసుము చెల్లింపుతో సెట్ అవుతుంది. కానీ, త‌రుచుగా గ‌డువు త‌ర్వాత 30 రోజులు ఆల‌స్యంగా చెల్లిస్తే మాత్రం మీ సిబిల్ స్కోర్ మీద ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డుతుంది. ఒక చెల్లింపున‌కు గ‌డువు త‌ర్వాత 30 రోజుల టైం తీసుకుంటే మీ సిబిల్ స్కోర్ 100 పాయింట్లు ప‌డిపోతుంది సుమా..!

ఒక‌సారి ఆల‌స్య‌మైతే.. లేట్ పేమెంట్‌తో స‌రి.. కానీ..

త‌రుచుగా ప్ర‌తి నెలా ఈఎంఐ, క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులు 30 రోజులు ఆల‌స్యంగా చేస్తే మీ సిబిల్ స్కోర్ 100 పాయింట్లు ప‌త‌నం అవుతుంది. 90 రోజులు ఆల‌స్య‌మైతే దాని ప్ర‌భావం ఏడేళ్ల పాటు మీ క్రెడిట్ స్కోర్‌పై ఉంటుంది. ఒక‌సారి మీరు మీ ఈఎంఐ చెల్లింపు ఆల‌స్యం చేశార‌నుకోండి. మ‌ళ్లీ మ‌ళ్లీ చేయాల‌నిపించినా.. క్రెడిట్ స్కోర్ దెబ్బ తింటుంది. ఇక 120 రోజుల‌కు పైగా ఆల‌స్య‌మైతే మిమ్మ‌ల్ని మొండి బ‌కాయి (ఎన్‌పీఏ) కింద జ‌మ క‌డ‌తారు. మీకు రుణం ఇచ్చిన బ్యాంక‌రు, ఎన్‌బీఎఫ్‌సీ ప్ర‌తినిధి నేరుగా మిమ్మ‌ల్ని క‌లిసి ఈఎంఐ వ‌సూలు చేసుకోవ‌డం గానీ, థ‌ర్డ్ పార్టీ క‌లెక్ష‌న్ సంస్థ‌కు గానీ మీ ఖాతాను అప్ప‌గిస్తారు.

మైన‌ర్‌, మేజ‌ర్ డిఫాల్ట్స్‌లో తేడాలిలా

క‌స్ట‌మ‌ర్లు త‌ప్ప‌నిస‌రిగా త‌మ మైన‌ర్‌, మేజ‌ర్ డిఫాల్ట్స్‌లో తేడాల‌ను అర్థం చేసుకోవాలి. గ‌డువులోపు పేమెంట్స్ మిస్సింగ్‌కు కార‌ణాల‌తోపాటు దానివ‌ల్ల వ్య‌క్తిగ‌తంగా క్రెడిట్ స్కోర్‌పై ప్ర‌భావం ఎలా ఉంటుందో  మెరుగ్గా అర్ధం చేసుకోవాలి. గ‌డువుకు 90 రోజుల్లోపు ఈఎంఐ, క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపులు మైన‌ర్ డిఫాల్ట్ కింద‌కు వ‌స్తాయి. ఇటువంటి సంద‌ర్భాల్లో మీ క్రెడిట్ స్కొర్ పై దీర్ఘ‌కాలికంగా ప్ర‌తికూల ప్ర‌భావం చూపినా అది తాత్కాలికమే అవుతుంది. ఈఎంఐ చెల్లింపులు 90 రోజుల‌కు పైగా ఆల‌స్య‌మైతే.. మీ రుణ ఖాతాను మొండి బ‌కాయి (ఎన్‌పీఏ) జాబితాలో చేరుస్తారు. మీ రుణ చెల్లింపుల చ‌రిత్ర పేల‌వంగా ఉంటే మాత్రం.. బ్యాంక‌ర్లు రుణం మంజూరు చేయ‌డానికి వెనుకాడ‌తారు. మొహ‌మాటం లేకుండా రుణం ఇవ్వ‌లేమ‌ని తేల్చి చెప్పేస్తారు. 

తిరిగి ఆర్థిక స్ఙిర‌త్వం సాధించ‌డం ఇలా

ఆల‌స్యంగా రుణ వాయిదా చెల్లింపులు మీ క్రెడిట్ స్కోర్‌పై ప్ర‌భావం చూపుతాయి. త‌ద్వ‌రా మీరు రుణాలు పొంద‌డం స‌వాల్‌గా మారుతుంది. ఒక‌వేళ రుణం తీసుకున్నా.. వ‌డ్డీరేట్లు పెరుగుతాయి. ఒక్క‌సారి రుణ వాయిదా చెల్లింపు ఆల‌స్య‌మైనా మీ క్రెడిట్ వ‌ర్తీనెస్‌ను చురుగ్గా స్పందిస్తూ చ‌ర్య‌లు తీసుకుంటే బ‌లోపేతం చేసుకోవ‌చ్చు. తిరిగి మీ సిబిల్ స్కోర్‌ను పునః నిర్మించుకోవ‌చ్చు. మీ క్రెడిట్ స్కోర్ నివేదిక‌ను స‌మీక్షిస్తే.. మీ లేట్ పేమెంట్ ఎంట్రీని ఐడెంటిఫై చేయొచ్చు. త‌ద్వారా మీ క్రెడిట్ స్కోర్ మీద ప‌డే ప్ర‌భావం, మీ రుణ ప‌ర‌ప‌తి సామ‌ర్థ్యంపై ప్ర‌తికూల ప్ర‌భావాన్ని అంచ‌నా వేయొచ్చు. ఇది మీ క్రెడిట్ స్కోర్‌కు మ‌ర‌మ్మ‌త్తు చేసుకునేందుకు ఉప‌క‌రిస్తుంది. క‌నుక మీ క్రెడిట్ కార్డు బిల్లు లేదా ఇత‌ర రుణాల నెల‌స‌రి వాయిదా (ఈఎంఐ) చెల్లించ‌డానికి ప్ర‌థ‌మ ప్రాధాన్యం ఇవ్వండి. 

చెల్లింపు గ‌డువుల‌ను పాటించ‌డంతో ఆర్థిక కార్య‌క‌లాపాల ప‌ట్ల మీ వ్య‌వ‌హార‌శైలి, మీ బాధ్య‌త తెలుస్తుంది. చెల్లింపు తేదీ మిస్ కాకుండా ఉండేందుకు ఆటోమేటిక్ చెల్లింపుల వ్య‌వ‌స్థ‌, రిమైండ‌ర్ల వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసుకోవాలి. బ్యాంకులు సైతం రుణ ఈఎంఐ, క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల విష‌య‌మై నిత్యం మీకు మీ బ్యాంకు ఆన్‌లైన్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్‌, మీ బ్యాంకు యాప్ ద్వారా రిమైండ‌ర్లు పంపిస్తూనే ఉంటాయి.

మీ ఆదాయంలో 30 శాతానికి మించి రుణాలు తీసుకోవ‌ద్దు

మీ రుణ చెల్లింపుల‌పైనే మీ క్రెడిట్ స్కోర్ పూర్తిగా ఆధార ప‌డి ఉంటుంది. మీరు ఇప్ప‌టికే తీసుకున్న క్రెడిట్ అకౌంట్ల నిర్వ‌హ‌ణ‌లో బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రిస్తూ పాజిటివ్ క్రెడిట్ ట్రాక్ రికార్డు నిర్మాణంపైనే దృష్టి సారించాలి. నెల వారీ మీ రుణ వాయిదాల ప్ర‌కారం స‌రైన స‌మ‌యానికి రుణాలు చెల్లించ‌డంతోపాటు మీకు ల‌భించే క్రెడిట్‌లో 30 శాతానికంటే త‌క్కువగా వినియోగించుకోవాలి. ఒక‌వేళ అనివార్య కార‌ణాల వ‌ల్ల ఎప్పుడైనా ఆల‌స్య‌మైతే.. మీ బ్యాంక‌రును క‌లిసి కొంత స‌మ‌యం ఇవ్వ‌మ‌ని రిక్వెస్ట్ చేస్తే స‌ర్దుబాటు చేయ‌డానికి రుణ దాత‌లు ప్రాధాన్యం ఇస్తుంటారు.

నిత్యం సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవ‌డం మంచిది.. ఎందుకంటే..

`ప్ర‌తి ఒక్క‌రూ త‌మ ఆదాయంలో 30 శాతానికి మించి రుణాలు తీసుకోవ‌డాన్ని నివారించ‌మ‌ని మేం చెబుతాం. అధిక రుణ వినియోగం మీ క్రెడిట్ స్కోర్‌ను దెబ్బ తీస్తుంది.మీరు ప్ర‌తి నెలా మీ సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవాలి.  మీ సిబిల్ స్కోర్ 900 ఉంటే ప‌ర్‌ఫెక్ట్ స్కోర్ అది ` అని బ్యాంకు బ‌జార్ సీఈఓ అదిల్ శెట్టి తెలిపారు. 

`ప్ర‌తి రుణ దాత‌, క్రెడిట్ కార్డు యాజ‌మాన్యం కూడా త‌మ రుణ గ్ర‌హీత‌ల‌ను ఆటో డెబిట్ ఫెసిలిటీ ఏర్పాటు చేసుకోమ‌ని స‌ల‌హా ఇస్తాయి. నిత్యం నిర్దిష్ట గ‌డువులోపు క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకుంటూ ఉండ‌టం వ‌ల్ల.. సిబిల్ స్కోర్ మీద‌ ప్ర‌తికూల ప్ర‌భావం చూపే అంశాలున్నాయేమో తెలుసుకోవ‌చ్చు` అని వింట్ హెల్త్ కో-ఫౌండ‌ర్ కం సీఈఓ అజింక్యా కుల‌క‌ర్ణి చెప్పారు.