16.3.17

గతంలో ఇలా...: పారికర్ ప్రభుత్వం ఏర్పాటు నైతికమా...

న్యూఢిల్లీ: గోవా నూతన సీఎంగా మనోహర్ పారికర్ ప్రమాణ స్వీకారాన్ని నిలువరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడం ఊహించిన పరిణామమే. కానీ గురువారమే సభలో విశ్వాస పరీక్షలో నెగ్గాలని మనోహర్ పారికర్‌ను దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించడం ఇప్పటివరకు అనుసరిస్తూ వచ్చిన సంప్రదాయాలు, రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే తప్ప మరొకటి కాదు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ రాకుంటే గతంలో గవర్నర్లు అనుసరిస్తూ వచ్చిన పలు సంప్రదాయాలను పరిగణనలోకి తీసుకుని సరైన నిర్ణయం తీసుకోవడమే పరిష్కార మార్గంగా కనిపిస్తున్నది.గవర్నర్ ముందు తమకు గల మెజారిటీ సభ్యుల మద్దతుతో కూడిన అఫిడవిట్లను ఎందుకు సమర్పించలేదని కాంగ్రెస్ పార్టీని సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది.
గతంలో 1989లో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజీవ్ గాంధీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ముందుగా నాటి రాష్ట్రపతి వెంకట్రామన్ ఆహ్వానించారు. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు రాజీవ్ గాంధీ గౌరవంగా తిరస్కరించారు. కానీ తర్వాత 1996లోనూ అతిపెద్ద పార్టీగా ఎన్నికైన బీజేపీ నేత ఎబి వాజ్ పేయిని తొలుత ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నాటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ ఆహ్వానించడమూ సబబే. అయితే 13 రోజుల్లో సభా విశ్వాసం పొందలేక వాజ్ పేయి ప్రభుత్వం రాజీనామా చేసింది అది వేరే సంగతి.  

13 రోజులకే వాజ్‌పేయి సర్కార్ పతనం
 1996లో వాజ్‌పేయి ప్రభుత్వం 13 రోజుల పాటు మాత్రమే మనుగడ సాధించడంతో విధాన నిర్ణేతలు తదుపరి ప్రభుత్వాల ఏర్పాటుకు తాజా విధానాలు, మార్గాలపై ద్రుష్టి సారించారు. మద్దతునిచ్చే ఎమ్మెల్యేల అఫిడవిట్లు సమర్పించాలన్న సంప్రదాయం ఇక్కడ నుంచే వచ్చింది. 
కేఆర్ నారాయణన్ నెలకొల్పిన సంప్రదాయం ఇదీ 
తదనుగుణంగా 1998లో వాజ్‌పేయి సారథ్యంలోని ఎన్డీయే కూటమికి మిత్రపక్షాల నుంచి మద్దతు లేఖలు సమర్పించాలన్న విధానాన్ని నాటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ నెలకొల్పారు. జాతీయ స్థాయిలో సరైన చర్యను అనుసరించడమే రాష్ట్రాలకూ ఆనవాయితీ. అయితే గవర్నర్లు తమ విచక్షణాయుతమైన నిర్ణయాలు తీసుకుంటున్నా తరుచుగా వివాదాస్పదం అవుతున్నారు.  

కాంగ్రెస్ పిటిషన్ పై సుప్రీం ఇలా 
తాజాగా గోవా ప్రజలు స్పష్టమైన తీర్పునివ్వక త్రిశంకు సభ ఏర్పడటంతో ప్రాంతీయ పార్టీల మద్దతు సంపాదించుకున్న బీజేపీ నేత మనోహర్ పారికర్‌ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గోవా గవర్నర్ మ్రుదులా సిన్హా తీసుకున్న నిర్ణయమూ అలాగే వివాదాస్పదమైంది. కానీ గోవా గవర్నర్ నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలు.. మణిపూర్ గవర్నర్ నజ్మా హెప్తుల్లా పని తేలిక చేసింది.  

మ్రుదులా సిన్హా తీరు ఇదీ
గోవా గవర్నర్ ఈ చట్ర పరిధిలోనూ తీసుకున్న నిర్ణయమైనా నైతికత, అనైతికత అనే అంశాలు చర్చనీయాంశాలుగా మారాయి. చట్టబద్ధంగా గవర్నర్ మ్రుదులా సిన్హా నిర్ణయం తీసుకున్న నిర్ణయం తనకు గల విచక్షణాధికారాల పరిధిలోనిది. అది రాజ్యాంగ బద్ధంగా సరైనదైనా నైతిక ప్రమాణాలు మాత్రం విభిన్నంగా ఉన్నాయి. గోవాలో ఇంతకుముందు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించలేక పతనమైంది. ఇదే అంశం నైతిక విలువల ప్రాధాన్యాన్ని లేవనెత్తింది. సదరు ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించిన సీఎం ఓటమి పాలవ్వడమే కాక.. తిరిగి అధికారంలోకి రావడానికి అవసరమైన సీట్లు గెలుచుకోవడంలో విఫలమైన పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడమే సందిగ్ధావస్థలో పడేసింది. 
అధికారం కోసం మళ్లీ స్నేహం
ఎన్నికలకు ముందు మిత్ర పక్షంగా ఉన్న మహారాష్ట్ర వాదీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ), ఎన్నికల్లో మరో పార్టీతో కూటమిగా పోటీ చేసింది. కానీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రచారంలో చేసిన ఆరోపణలను పక్కనబెట్టి అదే పార్టీతో జత కట్టడం పూర్తిగా వ్యతిరేకం. అలాగే బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కీలక విమర్శలు చేస్తూ ఎన్నికల ప్రచారం సాగించిన గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్‌పీ) కూడా జట్టు కట్టడం మరో విచిత్రం. 

గోవాలో బీజేపీ రాజకీయాలు ఇలా.. 
ఇప్పటివరకు నిబద్ధత గల పార్టీగా, నైతిక విలువలకు పట్టం కడతామని చెప్పుకుంటూ వచ్చిన బీజేపీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఎటువంటి జిమ్మిక్కులకు పాల్పడుతుందనే విషయం గోవా రాజకీయాలు విశద పరుస్తాయి. ఇక మణిపూర్‌లోనూ ప్రజా తీర్పులో వెల్లడయిందీ ప్రభుత్వ వ్యతిరేక ఓటేనని స్పష్టంగా ఎన్నికల ఫలితాలు చెప్తున్నాయి. కానీ సకాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం స్పందించి ప్రభుత్వ ఏర్పాటు కోసం కదలకపోవడమే ఈ పరిస్థితికి మరో కారణమని చెప్పకనే చెప్తున్నది.  

1989లో రాజీవ్ లాగే... 
వరుసగా మూడు దఫాలు అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించడానికి కొద్ది దూరంలో నిలిచింది. ఈ పరిస్థితి 1989లో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ విపక్షంలో కూర్చోవడానికి ప్రాదాన్యం ఇచ్చిన నేపథ్యం గుర్తుకు తెస్తున్నది. మణిపూర్‌లో ఇబోబిసింగ్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు చెప్పినా.. కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ ఒబోబీ సింగ్ నాయకత్వం పట్ల నాగా యునైటెడ్ కౌన్సిల్, నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్ పిపి) తదితర సంస్థలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నాయి. ఆ పార్టీలు, సంస్థలు కూడా ఎన్నికల్లో పోటీ చేశాయి. కాంగ్రెస్, బీజేపీ తర్వాత మిగతా పార్టీలు, సంస్థలకు పది స్థానాల వరకూ వచ్చాయి. దాని ఫలితంగా బీజేపీ నేత రాం మాధవ్, అసోం మంత్రి హిమంత బిశ్వా శర్మ ఎడతెరపిలేని చర్చలతో తొలిసారి మణిపూర్ లో బిజెపి ప్రభుత్వం ఏర్పాటైంది. 

అవకాశ వాద రాజకీయాలతో ప్రతిష్టకు దెబ్బ 
మ్యాజిక్ ఫిగర్ దాటేందుకు అవసరమైన సంఖ్యాబలం మద్దతు సంపాదించుకుంటే బీజేపీ సారథ్యంలోని కూటమి (బీజేపీ ఆధ్వర్యంలోని ఆ కూటమిలోకి సదరు మిత్రపక్షాలు రావడానికి సాగిన బేరసారాలపై పలు నైతిక విలువలతో కూడిన ప్రశ్నలు, సందేహాలు సహజంగా రేకెత్తుతాయి) కి ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు అనుమతినిచ్చి తర్వాత విశ్వాస పరీక్షలో నెగ్గాలని ఆదేశించవచ్చు ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో స్పష్టమైన మెజారిటీ రాని గోవా, మణిపూర్ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం ఎలా? అన్న అంశంపై పలు ముఖ్యమైన చట్టబద్ధమైన ప్రశ్నలు, సందేహాలు తలెత్తాయి. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం అవకాశ వాద కూటములు ఏర్పడతాయన్నదీ కూడా చర్చనీయాంశంగానే మారుతున్నది. 

10.3.17

యూపీ అంతా కప్పల తక్కెడే: హంగ్ అసెంబ్లీ కొత్తేం కాదు

దేశంలోకెల్లా అతిపెద్దదైన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ రాష్ట్రంలో గత 25 ఏళ్లకు పైగా ప్రజలు అస్పష్ట తీర్పునివ్వడం సహజ పరిణామం.

న్యూఢిల్లీ: దేశంలోకెల్లా అతిపెద్దదైన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ రాష్ట్రంలో గత 25 ఏళ్లకు పైగా ప్రజలు అస్పష్ట తీర్పునివ్వడం సహజ పరిణామం. 2012లో అఖిలేశ్ యాదవ్, అంతకుముందు 2007లో మాయావతి మినహా ఏ సీఎం కూడా ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయలేదు. దీనివల్లే 25 ఏళ్లకు పైగా రాష్ట్ర ప్రజలు ఇస్తున్న అస్పష్ట తీర్పు ఇస్తూనే ఉన్నారు. రాష్ట్రంలోని అత్యంత సంక్లిష్టమైన రాజకీయ పరిణామాల నేపథ్యానికి తోడు తొలి నుంచి ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో అనిశ్చితి కొనసాగుతూనే వచ్చింది. 1951లో గోవింద్ వల్లబ్ పంత్ మొదలు చరణ్ సింగ్ వరకూ యంగ్ టర్క్‌లు, సోషలిస్టుల మద్దతుతో ఏర్పాటైన పలు ప్రభుత్వాల మనుగడ కొద్ది కాలమే సాగింది. తొలిసారి 1967లో జన్ సంగ్, సీపీఎం మద్దతుతో కాంగ్రెసేతర ప్రభుత్వానికి అధినేతగా చరణ్ సింగ్ బాధ్యతలు చేపట్టారు. 1977లో జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటైనా మూణ్ణాళ్ల ముచ్చటే అయింది. 

1980లో తిరిగి కేంద్రంలో ఇందిరాగాందీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వీపీ సింగ్ కూడా ఎక్కువ కాలం సాగలేదు. అనునిత్యం సీఎంలు మారుతూనే వచ్చారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు సీఎంగా పని చేసిన నారాయణ్ దత్ తివారీ.. 1989లో యూపీలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైనప్పుడు సీఎంగా ఉన్నారు. నాటి నుంచి యూపీలో కాంగ్రెస్ పార్టీ కోలుకోలేదు. తాజాగా ఎస్పీతో జత కట్టిన కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోసం తహతహాలాడుతున్నది. గురువారం ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో త్రిశంకు సభ ఏర్పడుందన్న అంచనాల మధ్య శనివారం మరోసారి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల చరిత్రను ఒకసారి పరిశీలిద్దాం.. 

తొలి సీఎం గోవింద్ వల్లబ్ పంత్
1952లో తొలి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఏర్పాటైనప్పుడు 346 స్థానాలకు అదనంగా 83 నియోజకవర్గాల్లో జంట సీట్లు కేటాయించారు. 1951లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 388 స్థానాల్లో విజయం సాధించింది. తొలి సీఎంగా పండిట్ గోవింద్ వల్లభ్ పంత్ సీఎంగా బాధ్యతలు చేపట్టి 1954 వరకు కొనసాగారు. కేంద్ర హోంమంత్రిగా పంత్ ప్రమోషన్ పై హస్తినకు వెళ్లిన తర్వాత వారణాసికి చెందిన సంస్క్రుతి స్కాలర్ సంపూర్ణానంద్ బాధ్యతలు స్వీకరించారు. నాటి నుంచి 1957లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత 1960 వరకు సంపూర్ణానంద్ సీఎంగా కొనసాగారు. తర్వాత కమలాపాఠి త్రిపాఠి నుంచి సమస్యలు తలెత్తడంతో సంపూర్ణానంద్ స్థానే చంద్రబాను గుప్తా బాధ్యతలు స్వీకరించారు. తిరిగి 1963లో గుప్తాకు బదులు ఆచార్య జేబీ క్రుపాలానీ భార్య సుచేతా క్రుపాలానీ రాష్ట్ర తొలి మహిళా సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 

చరణ్ సింగ్ ఇలా సీఎం అయ్యారు.. 
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి 1967లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి కాంగ్రెస్ పార్టీ బలం 199 స్థానాలకు పడిపోయింది. 425 స్థానాలు గల అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సాధారణ మెజారిటీ సాధించేందుకు మరో 14 మంది మద్దతు కావాల్సి ఉంటుంది. ప్రస్తుత భారతీయ జనతా పార్టీకి పూర్వ రూపం భారతీయ జన సంఘ్ 98 స్థానాలు గెలుచుకున్నది. సుచేతా క్రుపలానీ లోక్‌సభకు తరలి వెళ్లే కాగా మాజీ సీఎం చంద్రభాను గుప్తా.. రాణిఖేట్ అసెంబ్లీ స్థానం నుంచి 72 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి భారతీయ క్రాంతిదళ్ పార్టీ స్థాపించిన చరణ్ సింగ్.. ఛాప్రొలీ స్థానంలో 52 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. 
ఇలా లెఫ్ట్ టూ రైట్ మద్దతు
సోషలిస్టు నాయకులు రాం మనోహర్ లోహియా, రాజ్ నారాయణ్‌లతోపాటు భారతీయ జన్ సంఘ్ కు చెందిన నానాజీ దేశ్ ముఖ్ తదితరులు 1967లో చరణ్ సింగ్ కు మద్దతు తెలిపింది. సంయుక్త విధాయక్ దళ్ (ఎస్వీడీ) సంకీర్ణ కూటమి తరఫున సీఎంగా చరణ్ సింగ్ ప్రమాణం చేశారు. నాడు సీపీఎం, బీజేఎస్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, స్వతంత్ర పార్టీ, ప్రజా సోషలిస్టు పార్టీలతోపాటు 22 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు చరణ్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన వారిలో ఉన్నారు.   
అధికారం శక్తి తెలుసుకున్న జనసంఘ్ 

దేశ రాజకీయాల్లో బారతీయ జన సంఘ్ (బీజెఎస్)కు అధికారం ఫలాలు చవిచూసేందుకు వచ్చిన తొలి అవకాశం. అయితే సీఎంగా చరణ్ సింగ్ బాధ్యతలు స్వీకరించే నాటికి రెండుసార్లు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన, నలుగురు సీఎంల పాలనను చవి చూశారు. ఉత్తర భారత రైతులకు నాయకుడిగా ఎదిగిన చరణ్ సింగ్.. జాట్లు, యాదవ్‌లు, గుజ్జర్లు, కుర్మీలు తదితర సామాజిక వర్గాలతోపాటు ముస్లింల నుంచి విమర్శలు, సమస్యలు ఎదుర్కొన్నారు. ఎస్వీడీ మిత్రపక్షం సంయుక్త సోషలిస్టు పార్టీ (ఎస్సెస్పీ) అంగ్రేజీ హఠావో నినాదాన్ని చేపట్టడంతో ఇద్దరు క్యాబినెట్ మంత్రులను పోలీసులు అరెస్ట్ చేశాక వారు రాజీనామా చేశారు. కొన్ని పార్టీలు సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించడంతో 1968 ఫిబ్రవరిలో సీఎంగా తన పదవికీ రాజీనామా చేసిన చరణ్ సింగ్ శాసనసభ రద్దుకు సిఫారసు చేశారు. ఏడాది కాలం రాష్ట్రపతి పాలన సాగిన తర్వాత 1969లో జరిగిన ఎన్నికల్లో చరణ్ సింగ్ సారథ్యంలోని బీకేడీ 98, జన్ సంఘ్ 49, కాంగ్రెస్ పార్టీ 211 స్థానాలను గెలుచుకున్నాయి. తిరిగి చంద్రభాను గుప్తా సీఎంగా పగ్గాలు చేపట్టినా మూణ్ణాళ్ల ముచ్చటే అయ్యింది. ఏడాదిలోపే కాంగ్రెస్ పార్టీలో చీలిక రావడంతో చంద్రబాను గుప్తా మైనారిటీలో పడిపోవడంతో పదవికి రాజీనామా చేశారు. ఇందిరాగాంధీ సారథ్యంలోని కాంగ్రెస్ (ఆర్) సహకారంతో బీకేడీ నేత చరణ్ సింగ్ తిరిగి 1970 ఫిబ్రవరిలో రాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
కమలాపాఠి త్రిపాఠితో విభేదాల వల్ల ఇలా.. 
నెలల్లోపు తాజాగా తలెత్తిన సమస్యలతో కాంగ్రెస్ (ఆర్) పార్టీ నుంచి మంత్రివర్గంలో ఉన్న 14 మంది మంత్రులను రాజీనామా చేయాలని చరణ్ సింగ్ జారీ చేసిన ఆదేశాలు కమలాపాటి త్రిఫాఠి అమలు చేసేందుకు నిరాకరించారు. దీంతో సదరు 14 మంది మంత్రులకు ఉద్వాసన పలుకాలన్న చరణ్ సింగ్ అభ్యర్థనకు బదులు గవర్నర్ బెజవాడ గోపాల్ రెడ్డి. సీఎంగా తప్పుకోవాలని సూచించారు. తర్వాత కొద్ది నెలల రాష్ట్రపతి పాలన అమలైన కొద్ది కాలానికి మళ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఇందిరాగాంధీ వ్యతిరేకులు కాంగ్రెస్ (ఒ) పార్టీ నాయకులంతా కలిసి సంయుక్త విధాయక్ దళ్ అధినేతగా త్రిభువన్ నారాయణ్ సింగ్ ను సీఎంగా నిలబెట్టారు. కానీ కేవలం ఐదు నెలలు మాత్రమే ఆయన ప్రభుత్వంలో కొనసాగారు. దేశ చరిత్రలో తొలిసారి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓడిపోయిన సీఎంగా త్రిభువన్ నారాయణ్ సింగ్ నిలిచారు (1971 మార్చిలో గోరఖ్ పూర్ జిల్లాలోని మణిరం స్థానం నుంచి పోటీ చేశారు). ఎన్నికల్లో ఓటమి పాలవ్వడంతో రాజీనామా చేయాల్సి వచ్చింది.  

1975లో తొలిసారి సీఎంగా ఎన్డీ తివారీ 
త్రిభువన్ నారాయణ్ సింగ్ స్థానే పదవీ బాధ్యతలు చేపట్టిన కమలాపాటి త్రిపాఠి.. ప్రొవిషనల్ ఆర్ముడ్ కానిస్టేబుళ్లు మెరుగైన వేతనాల కోసం డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగడంతో 1973 జూన్ వరకు పదవిలో కొనసాగారు. ఈ ఉద్యమంతోనే పదవికి కమలపాఠి త్రిపాఠి రాజీనామా చేసిన తర్వాత కొద్ది నెలల పాటు రాష్ట్రపతి పాలన అమలులో ఉంది. కొద్ది నెలల రాష్ట్రపతి పాలన తర్వాత గర్హ్వాలీ బ్రాహ్మణుడు హేమవతి నందన్ బహుగుణ 1973 నవంబర్ లో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. కానీ 1975 నవంబర్ లో సంజయ్ గాంధీతో విభేదాల వల్ల రాజీనామా చేశారు. ఆయన స్థానంలో తనకు అత్యంత సన్నిహితుడైన ఎన్డీ తివారీకి సీఎం పదవి అప్పటించారు. 
జనతా పార్టీ హయాంలో ఇద్దరు సీఎంలు 
1977 ఎన్నికల్లో గెలుపొంది కేంద్రంలో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఎన్డీ తివారీ సారథ్యంలోని యూపీ సర్కార్ సహా పలు కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు రద్దయ్యాయి. రాష్ట్రపతి పాలన ముగిసిన తర్వాత 1977 జూన్‌లో జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ 425 స్థానాలకు 352 స్థానాల్లో విజయం విజయం సాధించింది. చంద్రశేఖర్, లాల్ గంజ్ ఎంపీ రాంధన్ మధ్య సీఎం పదవి కోసం పోటీ పడింది. మధ్యేమార్గంగా యంగ్ టర్క్‌లు చరణ్ సింగ్, మధు లిమాయే గ్రూప్ నేతలు రాం బచన్ యాదవ్ ను సీఎంగా నిలబెట్టారు. ఈ ప్రభుత్వం 1977 జూన్ 1979 వరకు ఉన్నది. ప్రస్తుత రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్, పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి, ఎస్పీ వ్యవస్థాపక నేత ములాయం సింగ్ యావ్ రాష్ట్ర క్యాబినెట్ లో మంత్రులు. డియోరియాలో పోలీసుల అక్రుత్యాల నేపథ్యంలో రాం నరేశ్ యాదవ్ రాజీనామా చేశారు. 1979లో వైశ్య సామాజిక వర్గ నేత బెనారసీ దాస్ సీఎంగా నియమితులైనా 1980లో ప్రధానిగా ఇందిరాగాంధీ బాధ్యతలు స్వీకరించాక దాస్ ప్రభుత్వాన్ని రద్దుచేశారు. 

తివారీ హయాంలోనే కాంగ్రెస్ పార్టీ పతనం 
1980 నుంచి 1988 మధ్య కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆరుగురు సీఎంలు మారారు. 1980లో కాంగ్రెస్ పార్టీ 309 స్థానాలు గెలుచుకున్న తర్వాత మండా రాజా వీపీ సింగ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ప్రధాని ఇందిరకు అత్యంత సన్నిహితుడన్న పేరు ఉన్నా వివిధ ఆరోపణల కారణంగా 1981లో పూలన్ దేవి చేతిలో 20 మంది రాజపుత్రుల ఊచకోత.. 1982లో వీపీ సింగ్ సోదరుడు జస్టిస్ చంద్రశేఖర్ ప్రతాప్ సింగ్ ను దొంగలు హత్య చేశాక రాజీనామా చేశారు. సుల్తాన్ పూర్ బ్రాహ్మణుడు శ్రీపాఠి మిశ్రా ఆయన స్థానే సీఎంగా బాద్యతలు స్వీకరించారు. రెండేళ్లు అధికారంలో ఉన్న మిశ్రా 1984 ఆగస్టులో ఉద్వాసనకు గురి కావడం మళ్లీ ఎన్డీ తివారీ సీఎంగా బాద్యతలు చేపట్టారు. తర్వాత ఇందిర దారుణ హత్య దరిమిలా జరిగిన ఎన్నికలకు తివారీ మళ్లీ సీఎంగా బాద్యతలు చేపట్టినా కాంగ్రెస్ సంస్క్రుతికి అనుగుణంగా కొద్ది నెలల్లోనే తివారీ స్థానే వీర్ బహదూర్ సింగ్ సీఎంగా 1985 జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య పని చేశారు. ఆ తర్వాత తిరిగి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తివారీ 1989లో పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూసే వరకు సీఎంగా ఉన్నారు. నాటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ యూపీలో కోలుకోలేదు.

1989లో తొలిసారి సీఎంగా ములాయం 
1988లో ఏర్పాటైన జనతాదళ్ పార్టీలో చేరిన ములాయం సింగ్ యాదవ్, అజిత్ సింగ్ సీఎం పదవి కోసం పోటీ పడినా.. అజిత్ సహకారం, బీజేపీ బయటి మద్దతుతో ములాయం సింగ్ యాదవ్ తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే 1990 అక్టోబర్‌లో ఎల్ కే అద్వానీ రథయాత్రను నాటి బీహార్ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ అడ్డుకోవడంతో కేంద్రంలో వీపీ సింగ్, యూపీలో ములాయం పరభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించుకున్నది. చంద్రశేఖర్ తో కలిసి ముందుకు సాగిన ములాయం సిగ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కొంత కాలం సీఎంగా కొనసాగడంతోపాటు ముస్లింల అనుకూల నేతగా ఆవిర్భవించారు. 1999లో రెండోసారి వాజ్ పేయి ప్రభుత్వం పతనమైన తర్వాత ములాయం తనకు తాను కాంగ్రెసేతర రాజకీయాలకు కీలకమైన శక్తిగా ఎదిగారు.   

ఓబీసీ ములాయం వర్సెస్ ఓబీసీ కల్యాణ్ సింగ్
మండల్, మందిర్ రాజకీయాలు వచ్చిన తర్వాత 1991లో జరిగిన ఎన్నికల్లో లోధ్ నాయకుడు కల్యాణ్ సింగ్ ను బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రతిపాదించింది. దీంతో ములాయం, కల్యాణ్ సింగ్ మధ్య పోరు సాగింది. 1991 ఎన్నికల్లో బీజేపీ 221 స్థానాలతో విజయం సాదించడంతో కల్యాణ్ సింగ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. బాబ్రీ మసీద్ కూల్చివేతతో కల్యాణ్ సర్కార్ ఔట్ బాబరీ మసీద్ కూల్చివేతతో కల్యాణ్ సింగ్ తోపాటు మధ్యప్రదేశ్ లోని సుందర్ లాల్ పట్వా, రాజస్థాన్ లోని బైరాన్ సింగ్ షెకావత్, హిమాచల్ లోని శాంతాకుమార్ ప్రభుత్వాలను కేంద్రం రద్దు చేసింది. 1993లో అగ్ర కుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా దళిత్ - ఓబీసీ కాంబినేషన్ పని చేసింది.   

బీఎస్పీతో కలిసి ఎస్పీ 1992లో పోటీ 
1992లో ఎస్పీ స్థాపించిన ములాయం అగ్రకులాల ఆధిపత్యానికి సవాల్ విసిరారు. 1992లో జరిగిన ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పోటీ చేశారు. రెండు పార్టీలు 109, 67 స్థానాల్లో విజయం సాదించాయి. 1995లో బీఎస్పీ వైదొలగడంతో ప్రబుత్వం మైనారిటీలో పడింది. మాయావతిపై గెస్ట్ హౌస్ లో కొందరు ఎస్పీ కార్యకర్తలు దాడి చేయడంతో రెండు పార్టీల మద్య వైరంగా మారింది.   
1996 - 98 మధ్య పలువురు సీఎంలు  
1995లో తొలిసారి సీఎంగా మాయావతితో నాటి గవర్నర్ మోతీలాల్ ఓరా ప్రమాణం చేయించారు. రాష్ట్రంలో 21 శాతం గల దళితులకు ఆమె ఆరాద్య దైవం అయ్యారు. 1996 - 98 మధ్య పలువురు సీఎంలు మారారు. 1996 ఎన్నికల్లో బీజేపీ 174 స్థానాల్లో గెలుపొందింది. ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేకపోవడంతో 1997 వరకు రాష్ట్రపతి పాలన సాగింది. 67 మంది ఎమ్మెల్యేలు గల బీఎస్పీతో ఒప్పందం కుదిరింది. తొలి ఆరు నెలలు సీఎంగా మాయావతి గద్దె నెక్కారు. తర్వాత ఆరు నెలలకు గద్దెనెక్కిన సీఎం కల్యాణ్ సింగ్ ఒప్పందం ప్రకారం పక్కకు తప్పుకోలేదు. మాయావతి మద్దతు ఉపసంహరించుకున్నా కాంగ్రెస్, బీఎస్పీలను బీజేపీ చీల్చి అధికారాన్ని కాపాడుకున్నది. 1998 ఫిబ్రవరి 21న లోక్ సభ ఎన్నికలు జరుగుతుండగా కల్యాణ్ సింగ్ స్థానే రాష్ట్ర గవర్నర్ రమేశ్ భండారీ.. జగదంబికా పాల్ తో సీఎంగా ప్రమాణం చేయించారు. అలహాబాద్ హైకోర్టు ఆదేశం మేరకు తిరిగి కల్యాణ్ సింగ్ రెండు రోజుల తర్వాత సీఎంగా ప్రమాణం చేశారు. ప్రస్తుతం జగదంబికా పాల్ బీజేపీ ఎంపీగా ఉన్నారు. 1999లో కల్యాణ్ సింగ్ ప్రభ తగ్గి.. లోక్ సభలో బీజేపీ స్థానాలు 58 నుంచి 29కి పడిపోయాయి. ఫలితంగా రాజ్ నాథ్ సింగ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.
2003లోనూ త్రిశంకు సభే
సీఎంగా తప్పించడంతో కల్యాణ్ సింగ్ బీజేపీకి దూరమయ్యారు. ఓబీసీలకు దగ్గరయ్యేందుకు రాజ్ నాథ్ యత్నాలు విఫలమయ్యాయి. 2002లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలుపొందలేకపోయింది. బీజేపీ మద్దతుతో మాయావతి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా 2003లోనే వైదొలగాల్సి వచ్చింది. బీజేపీలో అసమ్మతి వాదులు, బీఎస్పీలోని అసంత్రుప్తుల మద్దతుతో ములాయం 2003 ఆగస్టు నుంచి 2007 వరకు సీఎంగా ఉన్నారు.   

సొంత బలంపై సీఎంగా మాయా 
2007 ఎన్నికల్లో బ్రాహ్మణ్ - దళిత్ - ముస్లిం కాంబినేషన్‌తో సొంత పార్టీకి పూర్తి మెజారిటీ రావడంతో మాయావతి నాలుగోసారి సీఎం అయ్యారు. అయితే ఆమె ఫార్ములాను బీఎస్పీ వ్యవస్థాపకుడు వ్యతిరేకించారు. 1991 తర్వాత తొలిసారి పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత మాయాకే దక్కింది.

దేశంలోనే సీఎంగా అతి పిన్న వయస్కుడు అఖిలేశ్ 

2012 ఎన్నికల్లో సీన్ రివర్సయింది. ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం తనయుడు.. అఖిలేశ్ పార్టీని విజయ తీరాలకు చేర్చారు. బీజేపీ ఉమా భారతిని మధ్యప్రదేశ్ నుంచి యూపీ సీఎం అభ్యర్థిగా తీసుకొచ్చినా ప్రయోజనం లేకపోయింది. ఎస్పీకి 425 స్థానాల్లో 224 స్తానాలు లభించాయి. ములాయం సింగ్ యాదవ్ తన కొడుకు అఖిలేశ్ పట్ల పుత్ర వాత్సల్యంతో సీఎంగా పగ్గాలు అప్పగించారు.