పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో త్రునమూల్ విజయంతో ప్రశాంత్ కిశోర్ రాజకీయ వ్యూహానికి ప్రాధాన్యం పెరిగింది.. మరాఠా యోధుడు.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ.. ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌తో పలు దఫాలు భేటీ అయ్యారు..
అటుపై విపక్ష పార్టీల నేతలు.. పవార్‌తో సమావేశమై భవిష్యత్ రాజకీయ పరిస్థితులపై మధనం గావించారు. మధ్యలో పవార్- ప్రశాంత్ కిశోర్ సమావేశమవుతూ ఉండటం.. ప్రజల్లో ఆసక్తిని పెంపొందించింది.
పవార్‌తో భేటీ తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతోనూ ప్రశాంత్ కిశోర్ గంటల తరబడి మంతనాలు సాగించారు. ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూడా వీడియో లింక్ ద్వారా చర్చల్లో పాల్గొన్నట్లు వార్తలొచ్చాయి..
తొలుత పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలను పరిష్కరించడానికి అని ఊహాగానాలు వ్యక్తం అయినా.. అసలు టార్గెట్ 2024 లోక్‌సభ ఎన్నికలేనని తేటతెల్లమైంది. కాంగ్రెస్ పార్టీ లేకుండా విపక్షాలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని, దానికి సారధ్యం వహిస్తున్న ప్రధాని నరేంద్రమోదీని ఎదుర్కోవడం సాధ్యం కాదని పవార్.. ప్రశాంత్ కిశోర్.. ఇతర సీనియర్ ప్రతిపక్ష నేతలు తేల్చేశారు..
ఈశాన్య రాష్ట్రాలు.. యూపీ, బీహార్ మినహా సగం రాష్ట్రాల్లో బీజేపీకి ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికీ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ అంటే విశ్వాసం ఉందంటే అతిశయోక్తి కాదు.. కనుక బీజేపీని నేరుగా ఢీకొట్టాలంటే విపక్ష పార్టీలతో కాంగ్రెస్ పార్టీ జత కట్టక తప్పనిసరి పరిస్థితి..
ఈ నేపథ్యంలో రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్.. బయట నుంచి కాంగ్రెస్ పార్టీకి సలహాలు సూచనలు ఇస్తుంటారా.. లేక పార్టీలో చేరి వ్యూహ రచనలో కీలకంగా వ్యవహరిస్తారా? అన్నది తేలాలి..
కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత్ కిశోర్ చేరిక దాదాపు ఖాయంగా కనిపిస్తున్నది. ఇప్పటి వరకు రాజకీయ వ్యూహరచనలో ముందుండి వ్యవహరించిన ప్రశాంత్ కిశోర్.. కాంగ్రెస్ పార్టీలో తెర వెనుక నుంచి రాహుల్ గాంధీకి అండగా నిలుస్తారా.. లేదా తెర ముందుకు వచ్చి గైడ్ చేస్తారా? అన్నది అనుమానమే..
ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటే.. ప్రశాంత్ కిశోర్‌ను సీనియర్‌లు, సీనియర్లను ప్రశాంత్ కిశోర్ కాన్ఫిడెన్స్‌లోకి తీసుకోవాలి.. ఇవ్వాళ కొత్త జనరేషన్ వచ్చినా.. సీనియర్ల హవా ఇంకా తగ్గలేదు..
దానికి నిదర్శనం.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టిన మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ చతికిల పడింది. చివరకు గుణ స్థానం నుంచి గ్వాలియర్ సంస్థాన వారసుడు జ్యోతిరాదిత్య సింధియాను ఓడించడంలో సీనియర్లు సక్సెస్ అయ్యారు. చివరకు ఆయన పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకునే పరిస్థితి క్రియేట్ చేశారు. ఇవ్వాళ్ల ఆయన కేంద్ర మంత్రి కూడా..
మున్ముందు మధ్యప్రదేశ్‌లో తనతోపాటు పని చేసిన కాంగ్రెస్ పార్టీ నేతలకు వ్యతిరేకంగా పని చేయాల్సిన దుస్థితి జ్యోతిరాదిత్య సింధియాది. రాజస్థాన్‌లో యువ కెరటం సచిన్ పైలట్ రాజీ పడినా.. సీఎం గెహ్లాట్ సెగబెట్టారు.. తట్టుకోలేక విడిపోయేందుకు సిద్ధ పడినా.. రాహుల్-ప్రియాంక జోక్యంతో ప్రస్తుతానికి గెహ్లాట్-పైలట్ మధ్య సయోధ్య కుదిరింది.
ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్.. ఈశాన్య రాష్ట్రాల్లో నేరుగా బీజేపీని ఢీకొట్టాల్సిన కాంగ్రెస్ శ్రేణులు రోజురోజుకు నిర్వీర్యం అవుతున్నాయి. ఈ తరునంలో సీనియర్లు, జూనియర్ల మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రశాంత్ కిశోర్ ముందుకొచ్చినా ఆయనను సీనియర్లు స్వీకరిస్తారా? అన్నది అనుమానమే.
ఈనాడు ఒక రాజకీయ నేత చట్టసభకు ఎన్నికైతే.. తదుపరి తమ వారసుడ్ని ముందుకు తెచ్చే కల్చర్ నడుస్తున్నది. ఈ పరిస్థితుల్లో సీనియర్లు ప్రశాంత్ కిశోర్ వ్యూహాలను అమలు చేయనిస్తారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే..
2014 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కావడంలో.. ప్రత్యేకించి బీజేపీకి పూర్తి మెజారిటీ సంపాదించి పెట్టడంలో కీలక పాత్ర పోషించారు. క్షేత్రస్థాయిలో ప్రజల నాడి.. కుల, మత, ప్రాంత సమీకరణాలను కలగలిపి రాజకీయ పరిస్థితులను అంచనా వేయడంలో అందె వేసిన చేయి ఆయనది..
అందుకే 2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీని గెలిపించినా.. ఏడాది తిరిగే సరికి రూట్ మార్చుకున్నారు.. బీహార్‌లో అప్పటి రాష్ట్రీయ జనతాదళ్- యునైటెడ్ జనతాదళ్-కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని మహా కూటమికి అవసరమైన మెజారిటీ సాధించి పెట్టడంలో కీలకంగా వ్యవహరించారు.
తర్వాత పంజాబ్‌లో కాంగ్రెస్, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్, ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ నేత జగన్, తమిళనాట ఎంకే స్టాలిన్‌ను అధికారంలోకి తేవడంలో కీలకం అయ్యారు.





