30.8.14

నాడు వద్దన్నారు... నేడు ముద్దన్నారు

                                     


                                           గవర్నర్‌కు అధికారాలపై మారిన తెదేపా వైఖరి


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అవశేష ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కొత్త రాజధాని ఎంపిక చేసేవరకు పదేళ్ల పాటు హైదరాబాద్‌ నగరాన్నే రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా విభజన చట్టంలో పేర్కొన్నారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ నగరంలో శాంతిభద్రతలు, సంస్థలు, ఆస్తుల పరిరక్షణపై గవర్నర్‌ పర్యవేక్షణ ఉండాలని కూడా చట్టంలో పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన అధికారాల ప్రకారం ఒక రాష్ట్ర గవర్నర్‌, సంబంధిత రాష్ట్ర మంత్రివర్గం సూచన మేరకు వ్యవహరించాల్సి ఉంటుంది. ఇదే అంశం కూడా విభజన చట్టం 8 సెక్షన్‌లో ఉంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కేంద్రంలో నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కొలువు దీరడం, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ తెలుగుదేశం పార్టీ దశాబ్ధ కాలం తర్వాత తిరిగి అధికార పీఠానికి దగ్గరయ్యాయి. ఇదే కేంద్ర, రాష్ట్ర సంబంధాలకు సరికొత్త నిర్వచనానికి దారితీసే పరిస్థితులు ఏర్పడ్డాయి. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వాన్ని ఇరుకున బెట్టడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ, తన మౌలిక విధానానికి భిన్నంగా వ్యవహరిస్తూ వచ్చింది.

కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఏకఛత్రాధిపత్యానికి వ్యతిరేకంగా... తెలుగు ఆత్మగౌరవ నినాదంతో 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించిన నందమూరి తారక రామారావు 1983లో కాంగ్రెస్‌ పార్టీ కోటలు బద్దలు కొట్టారు. కానీ 1984లో బైపాస్‌ సర్జరీ కోసం అమెరికా వెళ్లిన ఎన్‌టిఆర్‌, తిరిగి భాగ్యనగరానికి చేరుకునేలోపే కొందరు కాంగ్రెస్‌ నేతలు మంత్రాంగం నెరిపారు. దీనికి నాటి ఎన్‌టిఆర్‌ కేబినెట్‌లో ఆర్థికమంత్రిగా ఉన్న నాదెండ్ల భాస్కర రావు సహకరించారు. పూర్వాశ్రమంలో ఆయన కాంగ్రెస్‌ నేతే మరి. ఆగస్టు 15వ తేదీన పరేడ్‌ గ్రౌండ్స్‌లో త్రివర్ణ పతాకావిష్కరణ సజావుగానే సాగిపోయింది. కానీ ఈలోగా గవర్నర్‌ రామ్‌లాల్‌ నుంచి పిలుపు రావడంతో ముఖ్యమంత్రిగా వెళ్లిన ఎన్టీఆర్‌, అధికార వాహనం వదిలి రావడం అందరి మనస్సులు కలచివేసింది.

మెజారిటీ సభ్యుల మద్దతు ఎన్‌టిఆర్‌కు లేదని, నాదేండ్ల భాస్కర రావుకు మద్దతు పలుకుతున్నారని కేంద్రానికి నివేదించిన గవర్నర్‌ రామ్‌లాల్‌, నాదేండ్లను ముఖ్యమంత్రిని చేశారు. ఈలోగా రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం మొదలైంది. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, జనతా పార్టీ, బీజేపీ, కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ఎన్‌టిఆర్‌ ఆధ్వర్యంలో సాగిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమానికి మద్దతునిచ్చాయి. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు తరగతులు బహిష్కరించి రోడ్లమీదకు వచ్చారు. శాసనసభావేదికగా బల నిరూపణకు అవకాశం కల్పించినా విఫలమైన నాదేండ్ల భాస్కర రావు రాజీనామా చేశారు.

ఆ వెంటనే కేంద్రం రామ్‌లాల్‌ను గవర్నర్‌గా వెనక్కు పిలిపించి శంకర్‌ దయాళ్‌శర్మను నియమించింది. తిరిగి ఎన్‌టిఆర్‌ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రతిపక్షాల మద్దతుతో గవర్నర్ల వ్యవస్థకే వ్యతిరేకంగా పోరుబాట పట్టారు. పలుమార్లు ఎన్‌టిఆర్‌ గవర్నర్‌ కేంద్రం ఏజంట్‌ అని వ్యాఖ్యలు కూడా చేశారు. గవర్నర్ల వ్యవస్థకు వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు కూడా జరిగాయి. కేంద్రం కూడా తన తప్పిదం తెలుసుకున్నది. కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సంధానకర్త అవసరమే లేదని చెప్పారు అన్నగారు.

1989లో వీపీ సింగ్‌ ప్రభుత్వ హయాంలో తమిళనాడు గవర్నర్‌గా నియమితులైన ఎస్‌ఎస్‌ బర్నాలా, 1991లో నాటి కరుణానిధి ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయమని కేంద్రానికి నివేదిక సమర్పించకున్నా ముందుగా డిఎంకె సర్కార్‌ను సాగనంపి, బర్నాలాకు ఉద్వాసన పలికిన నేపథ్యం కాంగ్రెస్‌ పార్టీది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రజాప్రభుత్వాలకు ఐదేళ్లపాటు ప్రజలు అధికారం కట్టబెట్టినా, శాంతిభద్రతల సాకుతో మధ్యలోనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఉసురు తీసిన ఘనత కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీది. దీనికి వ్యతిరేకంగా పలు దఫాలు కమ్యూనిస్టులు ముందు పీఠిన నిలిచి పోరాటాలు సాగించినా, ఎన్‌టిఆర్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొలువు దీరిన తర్వాత ఎక్కువ ప్రచారం లభించింది.

కానీ ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం గవర్నర్‌కు అధికారాలు అప్పగించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ శాంతిభద్రతల అంశం గవర్నర్‌కు అప్పగించాలని చంద్రబాబు నాయుడు డిమాండ్‌ చేస్తూ వచ్చారు. విభజన అంతా అవకతవకలుగా జరిగిందీ, కనుకే గవర్నర్‌కు అధికారాలు దఖలు పర్చాలన్నది చంద్రబాబు, ఆయన నేతృత్వంలోని తెలుగు తమ్ముళ్ల ప్రధాన డిమాండ్‌ కూడా. తొలుత జూలైలో ప్రభుత్వ కార్యకలాపాల బిజినెస్‌ రూల్స్‌ మార్చుకోవాలని హైదరాబాద్‌ నగరంలో పోలీసు, కార్య నిర్వాహక అధికారాలు గవర్నర్‌కు దఖలు పరచాలని, లేకపోతే అభ్యంతరాలు ఉంటే తమకు తెలియజేయాలని కేంద్ర హోంశాఖ, తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. అప్పట్లో తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూడా ఘాటుగానే స్పందించారు.

మళ్లీ నెల రోజుల తర్వాత తప్పనిసరిగా తమ ఆదేశాలు పాటించాల్సిందేనంటూ మరో మెలిక పెట్టింది కేంద్ర హోంశాఖ. హైదరాబాద్‌ నగర పాలక సంస్థ, సైబరాబాద్‌, రంగారెడ్డి జిల్లా పరిధిని గవర్నర్‌ నియంత్రణలోకి తేవాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈసారి అమలు చేయాల్సిందేనని నిబంధన కూడా పెట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలను ప్రభావితం చేసే ఈ అంశంపై దేశంలోని ముఖ్యమంత్రులందరినీ కూడగట్టాలని నిర్ణయించుకున్నారు కేసీఆర్‌. మరోవైపు పార్లమెంట్‌ వేదికగా ఆందోళనకు అమీతుమీకి సిద్ధమంటూనే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు జరిపిన రాజీ యత్నాలు ఫలించాయేమో తెలియదు గానీ, క్రమంగా మార్పు వచ్చింది.

కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా పార్లమెంట్‌ వేదికగా విభజన చట్టంలో పేర్కొన్నవే అమలు చేస్తున్నామని నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే ఇది కేంద్రం సలహా మాత్రమేనని, తెలంగాణ ప్రభుత్వం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముక్తాయింపునిచ్చారు. తర్వాత వెసులుబాటు చేసుకుని తెరాస ఎంపీలతో రాజ్‌నాథ్ సింగ్ సమావేశమైనప్పుడు తెలంగాణ రాష్ట్ర హక్కులు హరించే పని చేయబోమని ఆందోళన చెందాల్సిన పని లేదని ఊరడించారు. అయితే మున్ముందు తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్లకుండా అడ్డుకట్ట వేయడానికి వేసిన వ్యూహంలో భాగంగానే కేంద్ర హోంశాఖ నోటీసు జారీ చేసింది. ఆ నోటీసుకు అనుగుణంగానే తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లతో కమిటీని నియమిస్తుంది. ఈ కమిటీ మున్ముందు హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల నిర్వహణను పర్యవేక్షిస్తుంది. కేంద్రం జారీ చేసిన నోటీసు ఉపసంహరణ ఉండదు. అలాగాని అమలు ఉండదు. యధాతథ పరిస్థితి కొనసాగుతుందన్న మాట.

అసలు హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారాలు దఖలు పర్చాలన్న డిమాండ్‌ ఎందుకు వచ్చింది? విభజన బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందక ముందు భాగ్య నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని పదేపదే సీమాంధ్ర నేతలు ఎందుకు డిమాండ్‌ చేశారు? తాజాగా గవర్నర్‌కు అధికారాలు దఖలు పరిచే విషయంలో కాంగ్రెస్‌ పార్టీ తరహాలోనే జాతీయ పార్టీ అయిన భిన్నమైన సిద్ధాంతాలు కలవని చెప్పుకునే బీజేపీ వ్యవహరించడానికి కారణాలేమిటి? విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉన్నది.

తెలంగాణలో ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు కొలువు దీరగానే హైదరాబాద్‌ నగరంలో అక్రమ కట్టడాలపై కొరడా ఝుళిపించడం సీమాంధ్రులకు ప్రత్యేకించి భూకబ్జాలకు పాల్పడిన వారి వల్లు జల్లుమన్నది. తెర వెనక నుంచి ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడుతో లాబీయింగ్‌ నడిపారు. ఆ వెంటనే కేంద్రానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సారధిగా లేఖ రాయడం, దానికి స్పందనగా కేంద్ర హోంశాఖ తెలంగాణ సర్కార్‌కు హుకుం జారీ చేయడం. ఇదీ అసలు కథ.

నిజాం నవాబ్‌ హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసినప్పుడు లక్షల ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించారు. ఇప్పుడు ఆ లెక్కలు ఎక్కడా దొరకడం లేదు. అంటే అంతా మెక్కేసారన్నమాట. ఇటువంటి వారికందరికీ ఇప్పుడు అండదండలనిచ్చేది చంద్రబాబే. ఒకప్పటి సీనియర్ కాంగ్రెస్ వాదీ ప్రస్తుత బీజేపీ నేత కావూరి సాంబశివరావు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు చేసిన ప్రయత్నం విఫలం కావడంతో కాషాయం కండువా కప్పుకున్నారు. తాజాగా ఆ బాటలోనే మరికొందరు తమ సామాజిక వర్గం నేతలను తరలించేందుకు భారీ ప్రయత్నాలు సాగుతున్నాయి.

ఇటువంటి వారికి హైదరాబాద్‌లో ఉన్న ఆస్తులు రక్షించుకునేందుకు భాగ్యనగరం అధికారాలను గవర్నర్‌ పరిధిలోకి అంటే పరోక్షంగా కేంద్రం పాలన అమలులోకి తేవాలన్న దూరాలోచన సాగించారు. విభజన చట్టానికి అనుగుణంగా వ్యవహరిస్తే అన్ని రాజకీయ పార్టీలు సహకరిస్తాయి. అందుకు భిన్నంగా కేంద్ర హోంశాఖ ప్రతిపాదించిన నిబంధనలు పరిశీలిస్తే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదానికి దారి తీసే పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ ఆ నిబంధనలు అమలు చేయాల్సి వస్తే తెలంగాణ ప్రభుత్వం, ఇతర రాష్ట్రాల సీఎంలతో కలిసి కేంద్రంతో ఘర్షణ పడాల్సి వచ్చేది. ఇది కేంద్రానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది కాదు. ఇరు పక్షాలు సంయమనంతో వ్యవహరించడంతో గాలిలో బుడగలా తప్పిపోయింది. అయితే ముప్పు తొలగిపోలేదు. కేంద్రంలో మోడీ సర్కార్‌ కొలువు దీరిందే తడవుగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో నీట మునిగే ఖమ్మం జల్లాలోని ఏడు మండలాలను తమ మెజారిటీతో కేంద్రం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కలిపేస్తూ విభజన చట్టానికి సవరణలు తీసుకు వచ్చింది.

ఒక రాష్ట్రంలో కొంత భూభాగంపై గవర్నర్‌కు అధికారాలు కల్పించాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి. అయితే దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపితేనే అది సాధ్యం. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏ పార్టీ ఈ వివాదంలో తల దూర్చేందుకు సాహసిస్తుందని చెప్పడం కష్టమే. కాంగ్రెస్‌ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ వంటి పార్టీలు సహకరిస్తే రాజ్యాంగ సవరణ తేలికే. ఈ మొత్తం ఎపిసోడ్‌లో గమ్మత్తేమిటంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలకు సరికొత్త నిర్వచనం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు గవర్నర్‌కు అధికారాలు దఖలు పర్చాలని కోరడం. 1996లో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వ కూటమి కన్వీనర్‌గా చంద్రబాబు నాయుడు కేంద్ర రాష్ట్ర సంబంధాల బలోపేతానికి సర్కారియా కమిషన్ల సిఫార్సుల అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు.

తర్వాత 1999లో వాజపేయి ప్రభుత్వ హయాంలో మెజారిటీ సర్కారియా కమిషన్‌ సిఫార్సులకు కేంద్రం ఆమోద ముద్ర వేయించడంలో కీలక భూమిక పోషించారు చంద్రబాబు నాయుడు. అనూహ్యంగా 2004 నుంచి 2014 వరకూ విపక్షంలో ఉండడం, రాష్ట్ర విభజనతో హైదరాబాద్‌ నగరంలో నివసిస్తున్న సీమాంధ్ర పెద్దల ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా చంద్రబాబు వైఖరిలో మార్పు వస్తున్నది. అందరికీ ఆదర్శప్రాయమైన రాజకీయాలు నడిపి మన్ననలు పొందిన ఎన్‌టిఆర్‌, గవర్నర్ల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడితే, ఆయన రాజకీయ వారసుడిగా చంద్రబాబు నాయుడు కొన్ని పాక్షిక ప్రయోజనాల కోసం గవర్నర్‌కు అధికారం అప్పగించాలని డిమాండ్‌ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో వైచిత్రి. 

5.8.14

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ కనుమరుగు




చితికిన 'చేయి'
జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పొందగల స్థాయిలో లోక్‌సభ సీట్లు గెలుచుకోలేక పోయిన కాంగ్రెస్‌ పార్టీ ఘోర పతనానికి ఆ పార్టీ నేతలే కారణం తప్ప, మోడీని కానీ, బిజెపిని గానీ విమర్శించి ప్రయోజనం లేదన్నది నిష్ఠూర సత్యం. విధానాల అమలులో గానీ, ప్రజలకు సానుకూల సంకేతాలివ్వడంలో గానీ కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నాయకత్వం గత పదేళ్ల కాలంలో విఫలమైందని చెప్పడానికి 16వ లోక్‌సభ ఎన్నికల ఫలితాలే చక్కని ఉదాహరణ.
సరిగ్గా 23 ఏళ్ల క్రితం బంగారాన్ని ప్రపంచ బ్యాంకు వద్ద తాకట్టు పెట్టుకుని రుణాలు తెచ్చుకోవాల్సిన పరిస్థితుల్లో 1991లో దేశ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆర్థిక వేత్త మన్మోహన్‌ సింగ్‌, 2004లో అనూహ్య పరిస్థితుల్లో యుపిఎ ప్రభుత్వ సారధిగా బాధ్యతలు స్వీకరించారు. యావత్‌ ప్రపంచం మెచ్చిన ఆర్థిక వేత్త అన్న సంగతి కాంగ్రెస్‌ పార్టీ నేతలు విస్మరించారు.1996 నుంచి 2004 అధికారానికి దూరంగా ఉన్న 'హస్తం పార్టీ' నేతలు 2004లో ప్రభుత్వ సారధ్యం తొలి రోజుల్లో బాగానే వ్యవహరించినట్లు కనిపించారు. కానీ కాల క్రమేణా ప్రజలకు దూరమవుతూ వచ్చారు. దీనికి తోడు సోనియా గాంధీపై 1999 - 2004 మధ్య లేవనెత్తిన విదేశీయత కూడా ఆమె సారధ్యానికి సానుకూలంగా మారింది. పార్టీ శ్రేణులు కూడా వివిధ రాష్ట్రాల్లో అధికారాన్ని చేపట్టేందుకు ఐకమత్యంగా పని చేశాయి కూడా.

2004లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ నేతల వ్యవహార శైలి క్రమంగా మారింది. ఒకవైపు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటూ, మరోవైపు ప్రభుత్వ పథకాల ఫలాలు ప్రజల దరికి చేర్చాల్సిన బాధ్యత అధికార పార్టీది. కానీ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఎప్పటికప్పుడు అవసరాలకు అనుగుణంగా వ్యూహాలు మార్చుకుంటూ వచ్చారు. క్రమంగా ప్రజలకు, నేతలకూ దూరం అయ్యారు. అధికార లాలసత్వం వంట బట్టిన తర్వాత ఒకింత అహంకార పూరిత వ్యవహార శైలి ప్రదర్శించారు.

రంగంలోకి మోడీని దించిన పరివార్
మరోవైపు 1998 - 2004 మధ్య అధికారంలో ఉన్న బిజెపి, దాని మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా అంతర్మధనంలో పడ్డాయి. ప్రజలకు దగ్గర కావడంలో ఎక్కడ విఫలం అయ్యామన్న విషయం నిర్థారించుకున్న సంఘ్‌ పరివార్‌ నేతలు పార్టీని అధికారంలోకి తీసుకు రాగల సామర్థ్యం గల నేత కోసం దేశమంతా జల్లెడ పట్టాయి. ఈ క్రమంలోనే 2002లో గోధ్రా సబర్బతి ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగీ తర్వాత జరిగిన మారణ కాండపై వచ్చిన విమర్శలను ఎదుర్కొంటూనే పార్టీని గుజరాత్‌ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి తీసుకు వచ్చిన ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ కనిపించారు. 2009 వరకూ మోడీ పేరు బయటకు రాకున్నా, ఆ తర్వాత బిజెపి పగ్గాలు క్రమంగా కొత్త తరం నేతలకు అప్పగించాలని సంఘ్‌ పరివార్‌ నిర్ణయించింది.
బిజెపిలో సంస్థాగతంగా సీనియర్లు చురుకైన పాత్ర పోషిస్తున్నా, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వం, క్రమంగా మోడీని జాతీయ నేతగా ముందుకు తేవడానికి కసరత్తు మొదలెట్టింది. అందులో భాగంగా పార్టీ ఎన్నికల కమిటీ సభ్యత్వం, ఆ తర్వాత ఎన్నికల ప్రచార సారధిగా ప్రకటించారు. కురు వృద్ధుడు లాల్‌కృష్ణ అద్వానీ, సీనియర్‌ నేతలు సుష్మా స్వరాజ్‌, మురళీ మనోహర్‌ జోషి, యశ్వంత్‌ సిన్హా వంటి సీనియర్ల అసంతృప్తిని పక్కన బెడుతూనే మోడీకి అన్ని రకాల వెసులుబాటు కల్పించారు. సరిగ్గా గతేడాది నుంచే ఎన్నికల కురుక్షేత్రానికి నరేంద్ర మోడీ సమర శంఖారావం పూరించి, సామెతలు, నర్మగర్భ వ్యాఖ్యలతో ప్రజలను సమ్మోహితులను చేయగలిగారు.

ముస్లిం మైనారిటీలపైనే కాంగ్రెస్ ఆశలు
ఈ విషయం గమనించని కాంగ్రెస్‌ పార్టీ వ్యూహకర్తలు, మోడీ పట్ల ముస్లిం మైనారిటీలు, క్రైస్తవుల వ్యతిరేకత తమకు లాభిస్తుందని అంచనాలు వేసుకున్నారు. బయటకు గంభీర ప్రకటనలు చేసినా అంతర్గతంగా మోడీ తమపై దండెత్తుతారని కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వానికి స్పష్టంగానే తెలుసు. ఈ విషయాలన్నీ తెలిసినా అనవసర తప్పిదాలకు పాల్పడింది కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం.
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన విషయంలో గానీ, నేర చరితులకు రక్షించేందుకు జారీ చేసిన ఆర్డినెన్స్‌ విషయంలో గానీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ స్పందించిన తీరు ప్రజల్లో ఏహ్యా భావాన్ని పెంపొందించాయని చెప్పవచ్చు. ప్రధానిగా మన్మోహన్‌ సింగ్‌ విదేశీ పర్యటనలో ఉండగా, అకస్మాత్‌గా మీడియా ముందుకు వచ్చి నేర చరితులకు పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని ప్రతిపాదించిన ఆర్డినెన్స్‌ను చించి పారేయాలని సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రతికూల సంకేతాలు పంపింది. ప్రభుత్వ సారధిగా మన్మోహన్‌ సింగ్‌ పాత్ర పరిమితం అన్నే తప్పుడు సంకేతాలు రాహుల్‌ గాంధీ యావత్‌ భారతావనికి పంపారు.
తొలిసారి ప్రధానిగా మన్మోహన్‌ సింగ్‌ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కాంగ్రెస్‌ చోటా మోటా నాయకులు మొదలు ఎఐసిసి పరిశీలకులు, కేంద్ర మంత్రులు సైతం రాహుల్‌ భజన మొదలు పెట్టారు. ఇక 2009లో రెండోసారి యుపిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార కాంగ్రెస్‌ పార్టీ నేతల్లో 'రాహుల్‌ భజన' మరింత పెరిగింది.
పలు దఫాలు తన కేబినెట్‌లోకి తీసుకుంటానని మన్మోహన్‌ సింగ్‌ ప్రతిపాదించినా, తిరస్కరించడం రాహుల్‌ గాంధీ చేసిన వ్యూహాత్మక పొరపాట్లలో మొదటిదని ఘంటాపథంగా చెప్పడానికి అభ్యంతరాలు లేవు. రాహుల్‌ గాంధీ, మన్మోహన్‌ సింగ్‌ కేబినెట్‌లో సభ్యుడిగా ఉంటే ప్రభుత్వ బాధ్యతల నిర్వహణలో సాధక బాధకాలు తెలిసి ఉందేవి. ఆయన నానమ్మ దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి కోటరీ సలహాలు ఇచ్చినా తొలి నుంచి రాజకీయాల్లో క్రియాశీలంగా ఉండడం వల్ల సొంత అభిప్రాయానికే విలువనిచ్చింది.
సోనియా కూడా తొలుత ఏకపక్షంగా వ్యవహరించినా 1999 నుంచి ధోరణి మారింది. 2004 ఎన్నికల్లో పార్టీ విజయం తర్వాత ఫోర్బ్స్‌ జాబితాలో సోనియా చోటు దక్కించుకున్నారంటే ఎంత పరిణతి సాధించారో తెలుసుకోవచ్చు. ఇటు సోనియా, అటు రాహుల్‌ గాంధీలకు నేతల కోటరీలు మొదలయ్యాయి. రాహుల్‌ యూత్‌ బ్రిగేడ్‌ దేశవ్యాప్తంగా పుక్కిటి పురాణాల వంటి సర్వేలతో ఊదర గొట్టాయి. కొన్ని సంస్థాగత కార్యక్రమాలు చేపట్టినా, సీనియర్ల వ్యూహాల ముందు రాహుల్‌ ఎత్తులు ఫలించలేదు.
ప్రస్తుత తరం నేతల అభిప్రాయాలకు విలువనిస్తూనే, భవిష్యత్‌ తరం నేతలను తయారు చేసుకోవడం అధినాయకత్వం ప్రధాన లక్షణం. కానీ రాహుల్‌ గాంధీలో అది లోపించిందన్న విషయం స్పష్టంగా కాన వస్తోంది. 16వ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయం పాలవ్వడానికి మరో కారణం. అది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన ప్రక్రియ. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రిగా సోనియా గాంధీ, నాటి కరీంనగర్‌ ఎన్నికల ప్రచార సభలో స్థానికుల ఆకాంక్షలేమిటో తనకు తెలుసు, తమ కూటమిని గెలిపిస్తే వాటిని నెరవేరుస్తామని హామీనిచ్చి ప్రజల మనస్సులు చూరగొంది.

ఒకవైపు హామీ... మరోవైపు పార్టీకి నష్టమని తెలిసినా...
కానీ 2004లో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడంలో వైఎస్‌ రాజశేఖర రెడ్డి కీలక భూమిక పోషించారు. అంతకు ముందు చంద్రబాబు నాయుడు విధానాలపై నేతలంతా మూకుమ్మడిగా పోరాటం జరిపినా వైఎస్‌ రాజశేఖర రెడ్డి పాదయాత్ర గణనీయ ప్రభావం చూపింది. దీంతో పార్టీ విజయం సాధించిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్‌ రాజశేఖర రెడ్డి 2004 ఎన్నికల్లో ఇచ్చిన హామీ, 2009 డిసెంబర్‌ తొమ్మిదో తేదీన కేంద్ర హోంమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు చేసిన ప్రకటన, కాంగ్రెస్‌ పార్టీ అధి నాయకత్వాన్ని నిత్యం వెంటాడాయి.
2013 - 14 సంవత్సర బడ్జెట్‌ సమావేశాలు ముగిసిన తర్వాత నాలుగేళ్లుగా అటకెక్కించిన తెలంగాణ అంశాన్ని దుమ్ము దులిపి 2013 జూలై 30వ తేదీన బయటకు తీసింది కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం. ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్‌ పార్టీ, ఆ పార్టీ నేతృత్వం వహిస్తున్న అధికార యుపిఎ కూటమి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు అనుకూలమని తీసుకున్న నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తమకు ప్రతికూల పరిస్థితులు తెచ్చి పెడుతుందని తెలుసు గానీ, మూలాలే లేకుండా పెరికి వేస్తుందని కాంగ్రెస్‌ పార్టీ వ్యూహకర్తలు ఊహించనే లేదు.
తొలి నుంచి రాష్ట్ర విభజనకు వ్యతిరేకిస్తూ వచ్చిన సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు చివరి క్షణం వరకూ అదే జోరు కొనసాగించారు. బెదిరింపులకు దిగారు. బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు నడిపారు. జాతీయ స్థాయి పార్టీలు సూత్రప్రాయంగా తీసుకున్న నిర్ణయం నుంచి వెనక్కు తగ్గితే జాతీయంగానే కాదు అంతర్జాతీయంగానూ ప్రతిష్ట దెబ్బ తింటుంది. ఆ విషయం తెలిసి కూడా సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలంతా వ్యతిరేక ధోరణి ప్రదర్శించారు. ఇది కాంగ్రెస్‌ పార్టీ అధి నాయకత్వానికి ఆగ్రహం తెప్పించడానికి కారణమైంది. ఇక వారి మాటలు, బెదిరింపులు పట్టించుకోకుండా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్‌ పార్టీ, యుపిఎ ప్రభుత్వం.

కిరణ్ కుమార్ రెడ్డి ‘శల్య’ పాత్ర
పార్టీ అధినాయకత్వం నిర్ణయాన్ని ప్రశ్నించలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నాటి కిరణ్‌ కుమార్‌ రెడ్డిది. అయినా అధి నాయకురాలిని ఎదిరించారని సమాచారం. దీంతో సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారని, ఆ తర్వాత కిరణ్‌ కుమార్‌ రెడ్డితో నేరుగా మాట్లాడేందుకు ఆమె ముందుకు రాలేదు. తొలుత తన వైఖరి బయట పెట్టకుండా 10 రోజుల పాటు బేగంపేట క్యాంపు కార్యాలయానికి పరిమితమైన కిరణ్‌ కుమార్‌ రెడ్డి, విభజనకు వ్యతిరేకంగా తన స్వరం వినిపించారు. నాటి నుంచి పార్లమెంట్‌ ఉభయ సభలు 'ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్వవస్థీకరణ బిల్లు'కు ఆమోదం తెలిపే వరకూ ప్రజల్లోకి బలంగా తన వాణి తీసుకెళ్లారు కిరణ్‌ కుమార్‌ రెడ్డి. బిల్లు శాసనసభ ఆమోదం పొందిన తర్వాత కూడా చట్టం కాదని ప్రజల్లో ఆశలు కల్పించిన నేపథ్యం కిరణ్‌ కుమార్‌ రెడ్డిది.
పార్టీ నాయకత్వం పట్ల విధేయత కనబరుస్తూనే, చాపకింద నీరులా తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు కిరణ్‌ కుమార్‌ రెడ్డి. మరోవైపు ప్రజల్లోనూ ఇమేజ్‌ సృష్టించుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రిగా వ్యతిరేకించడంతో సహజంగానే ప్రజలు ఆయనకు మద్దతు పలికారు కూడా. కానీ పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందడం, తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్రతో చట్టంగా రూపుదిద్దుకోవడం, సుప్రీంకోర్టు పూర్తిగా అధ్యయనం చేయడానికి మాత్రమే ప్రాధాన్యతనిచ్చింది.
ఎన్నికల ఫలితాల తర్వాతే విభజనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లు విచారిస్తామని తేల్చడంతో విభజనను అడ్డుకోవడం కష్టమని సాధారణ ప్రజలకూ అరటి పండు వలిచి పెట్టినంత తేలిగ్గా అర్థమైంది. కానీ కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం, యుపిఎ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకతను పెంపొందించడంలో కిరణ్‌ కుమార్‌ రెడ్డి సఫలీకృతులయ్యారనడంలో సందేహం లేదు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్‌ పార్టీకి పుట్టగతుల్లేకుండా చేయడమే లక్ష్యంగా కిరణ్‌ కుమార్‌ రెడ్డి వ్యూహాత్మకంగా ప్రజల్లో ద్వేష పూరిత భావాన్ని పెంపొందించారు.

చంద్రబాబుతో జట్టు కట్టిన బిజెపి
నాటి ప్రధాన ప్రతిపక్షమైన బిజెపి నేరుగా, రాష్ట్రంలో ప్రధాన విపక్షం తెలుగుదేశం పార్టీ పరోక్షంగా విభజనకు మద్దతు పలికినా, సొంత పార్టీ నేతలే వ్యతిరేక స్వరం వినిపించడం కాంగ్రెస్‌ పార్టీ పుట్టి ముంచింది. పార్టీ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూనే, మరోవైపు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ కిరణ్ కుమార్ రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరించినందుకు ఆ పార్టీ నేతలంటే ప్రజల్లో ఆగ్రహావేశాలను రగిల్చింది.

కాంగ్రెస్ హైకమాండ్ ఆశలపై కిరణ్ నీళ్లు
ప్రస్తుత తమిళనాడు గవర్నర్‌ రోశయ్య స్థానంలో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించడానికి అధినాయకత్వం ఆశీస్సులే పని చేసినా, అదే అధినాయకత్వాన్ని ధిక్కరించడమే కాదు మరో అవకాశం లేకుండా వ్యవహరించిన తీరు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని నామరూపాల్లేకుండా తుడిచి పెట్టేసింది. విభజనను వ్యతిరేకించిన కిరణ్‌ కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలుగుతారేమోనని ఎదురు చూసిన కాంగ్రెస్‌ అధినాయకత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసుకుంది.
అదే కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న అతి స్వేచ్ఛ కూడా విభజనపై నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు సీమాంధ్ర నేతలు వ్యతిరేకించడానికి కారణం. సూత్రప్రాయంగా వ్యతిరేకించినా, రాష్ట్రంలో పార్టీని కాపాడుకోవాలన్న తపన, విపక్షాల ఆరోపణలు ఎదుర్కోవడానికి బదులు వారికంటే మిన్నగా విభజన వ్యతిరేక స్వరం వినిపించడం తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలకు, బిజెపికి అంది వచ్చిన వర ప్రదాయిని అయింది.

కిరణ్ కుమార్ రెడ్డితో తీరని లోటు : కాంగ్రెస్ నేతలు
విభజన ప్రక్రియ సూత్రప్రాయంగా పూర్తయిన తర్వాత మీడియా ముందుకు వచ్చిన ఆనం రామ నారాయణ రెడ్డి, నీలకంఠం రఘువీరారెడ్డి వంటి వారు చేసిన వ్యాఖ్యలతో కిరణ్‌ కుమార్‌ రెడ్డి వల్ల పార్టీకి కోలుకోలేని నష్టం జరిగిందని స్పష్టమైంది. నాడు కేంద్రంలో మంత్రులుగా ఉన్న వారు గానీ, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కిరణ్‌ కుమార్‌ రెడ్డి, ఇతర మంత్రులు చివరి క్షణం వరకూ కొత్తగా ఏర్పాటయ్యే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఫలానా వసతులు కావాలన్న ప్రతిపాదనలు చేయనే లేదు. ఒకవైపు అసమ్మతి స్వరం వినిపిస్తూనే కాంగ్రెస్‌ పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు తమ రాజకీయ భవితవ్యంపై దృష్టి సారించారు.
అటువంటి వారిలో ముందు పీఠిన నిలుచున్న వారు ఏరాసు ప్రతాప రెడ్డి, టి జి వెంకటేష్‌, గంటా శ్రీనివాసరావు, కొలుసు పార్థ సారధి వంటి వారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన తర్వాత కొలుసు పార్థ సారధితోపాటు శత్రుచర్ల విజయ రామరాజు, సీనియర్‌ నేతలు జె సి దివాకర్‌ రెడ్డి, తొలి నుంచి కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగిన గల్లా అరుణ కుమారి, ఆమె తనయుడు - అమర్‌ రాజా బ్యాటరీస్‌ చైర్మన్‌ గల్లా జయదేవ్‌, రాయపాటి సాంబశివరావు తదితరులు 'సైకిల్‌' ఎక్కేశారు.

కావూరి మొదలు సీనియర్లంతా వలస బాట
మరో సీనియర్‌ నేత కావూరి సాంబశివరావు కార్యకర్తల మనోగతం పేరుతో పచ్చ జెండా కప్పుకునేందుకు సిద్ధమైనా మాగంటి వెంకటేశ్వర రావు (బాబు) వర్గీయులు గండి కొట్టారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికల ప్రచారంలో బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. అంతకు ముందే నందమూరి ఆడబడుచుగా దగ్గుబాటి పురందేశ్వరి కేంద్ర మంత్రిగా కార్యకలాపాల్లో పాల్గొంటూనే బిజెపిలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. విభజన ప్రక్రియ పూర్తి కాగానే బిజెపిలో చేరిన దగ్గుబాటి పురందేశ్వరి, రామాయం పేట వద్ద పోర్టు నిర్మించాలని జైరామ్‌ రమేష్‌ వంటి వారు విమర్శలు గుప్పించారు. దీనికి ప్రతిగా సమాధానం చెప్పిన పురందేశ్వరి పార్టీ మారడానికి కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం అనాలోచిత ధోరణే కారణం.
ఎన్నికల షెడ్యూల్‌ వెల్లడైన తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి సోదరుడు - పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ 'జనసేన' పేరుతో పార్టీ స్థాపించారు. కేంద్రంలో బిజెపికి, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించడమే కాదు అనుకూలంగా ప్రచారం సాగించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగానూ, కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగానూ, పవన్‌ కల్యాణ్‌ చేసిన ప్రచారం కూడా తెలుగుదేశం పార్టీ పుంజుకోవడానికి కారణమైంది.

వైఎస్‌ జగన్‌తోనే కాంగ్రెస్‌ శ్రేణులు మమేకం
రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ కుదేలవ్వడానికి మరో కారణం 2009లో వైఎస్‌ హఠాన్మరణం తర్వాత ఆయన తనయుడు - ప్రస్తుత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన రెడ్డి పట్ల అధినాయకత్వం ధోరణి మరొకటి. వైఎస్‌ పట్ల వ్యతిరేకతను రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ నేతలు సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించి చివరకు పార్టీ అడ్రస్సు గల్లంతవ్వడానికి కారకులు అయ్యారని చెప్పక తప్పదు.
ఒకవైపు పార్టీ నాయకత్వం పట్ల విధేయత ప్రకటించినా, ప్రజల మనస్సుల్లో చోటు దక్కించుకున్న వైఎస్‌, రెండుసార్లు పార్టీని రాష్ట్రంలోకి అధికారంలోకి తేవడానికి ఆయన వ్యూహ చతురతను భవిష్యత్‌ పార్టీ బలోపేతానికి వినియోగించుకోవాలన్న చతురత ప్రస్తుత కాంగ్రెస్‌ పార్టీ నేతలకు వంటబట్టలేదు. కొందరు నేతలు వైఎస్‌ మరణం తర్వాత ఇక అంతా తామేనన్నట్లు వ్యవహరించారే తప్ప, వారిలో పార్టీని ఎన్నికల సమరంలో ముందుకు నడిపించే సామర్థ్యం ఉన్న వారే లేరు. అందుకే ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ కర్ణాటక సీనియర్‌ నేత వీరప్ప మొయిలీ తామే జగన్‌ను బయటకు తరిమేశామని, తమది స్వయంకృతమని చెప్పడం గమనార్హం.
వయస్సు వేడిలో ఉన్న వైఎస్‌ జగన్మోహన రెడ్డి, వైఎస్‌ఆర్‌ మరణం తర్వాత ఒకింత దూకుడుగానే వ్యవహరించారని చెప్పక తప్పదు. అధికారం చేతిలో ఉన్నప్పుడు సహజంగానే చుట్టూ భజన బృందం చేరతారు. మూడు దశాబ్ధాల పాటు రాజకీయాల్లో తలపండిన నేతగా వైఎస్‌ రాజశేఖర రెడ్డికి, ఎఐసిసి నేతలతో, అధినేతలతో ఎలా వ్యవహరించాలన్న సంగతి స్పష్టంగానే తెలుసు.
అంతర్గత సమావేశాల్లో వైఎస్‌, అధి నాయకత్వానికి ఏం చెబుతున్నారనే విషయం బయటకు లీకయ్యేదే కాదు. కానీ మీడియా ముందు మాత్రం పార్టీ అధి నాయకురాలి పట్ల విధేయత ప్రదర్శించారు వైఎస్‌. దీనికి తోడు పాదయాత్రలో స్వయంగా చూసిన చేదు జ్ఞాపకాలను తన మదిలో ఉంచుకుంటూనే మరోవైపు వాటిని పునరావృతం కాకుండా చేయడానికి కృత నిశ్చయంతో ముందుకు సాగారు. ఆ క్రమంలోనే ప్రజలకు మరింత దగ్గరయ్యే విధంగా ప్రజాకర్షక పథకాలు అమలు చేయడంలో వైఎస్‌ తర్వాతే ఎవరైనా కూడా.
ఈ ధోరణే ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతాల్లో ఆయనకు ఎనలేని పేరు, కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టింది. ఆయన మరణ వార్త వినగానే బలవన్మరణాలకు పాల్పడిన వారు వందల్లోనే ఉన్నారు యావత్‌ ఆంద్రావనిలో. వైఎస్‌ రాజశేఖర రెడ్డి పట్ల విశ్వసనీయతను సొమ్ము చేసుకోవడానికి ఓదార్పు యాత్ర చేపట్టిన జగన్మోహన రెడ్డి తర్వాత పార్టీని వీడడం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ స్థాపించడం చకచకా జరిగి పోయాయి.

1978 తర్వాత 1999లో శాసనసభకు వైఎస్ఆర్ ఎన్నిక
1978లో ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాదు మంత్రిగా పని చేసిన వైఎస్‌ రాజశేఖర రెడ్డి తిరిగి 1999లో గానీ శాసనసభలో అడుగు పెట్టలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 1999 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఎవరికి వారు సిఎం బరిలో ఉన్న వారే. అందుకే వారు ఒకరినొకరు ఓడించుకోవడానికే ప్రయత్నించారు తప్ప, పార్టీని అధికారంలోకి తేవాలన్న ధ్యాస వారికి లేదు. ఉచిత విద్యుత్‌ నినాదంతో వైఎస్‌ రాజశేఖర రెడ్డి వంటి వారు ముందుకెళ్లాలని భావించినా, ప్రత్యర్థులు అడ్డుకున్నారు.
నాటి ఎన్నికల తర్వాత శాసనసభలో విపక్ష నేతగా ఎన్నికవ్వడంతో రాజశేఖర రెడ్డి ఖాళీ చేసిన పిసిసి అధ్యక్ష పదవిని కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఎమ్మెస్సార్‌కు అప్పగించారు. ఎమ్మెస్సార్‌ కూడా చివరి వరకూ వైఎస్‌కు అండగానే ఉన్నారు. వైఎస్సే ముఖ్యమంత్రి అభ్యర్థి అని బహిరంగంగా ప్రకటించి కొందరు నేతలకు కంటగింపుగా కూడా మారారంటే అతిశేయోక్తి కాదు.
నాటి నుంచి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ, మరోవైపు అసెంబ్లీ బయట జరిగే ఉద్యమాలతో మమేకమై ప్రజలకు దగ్గరయ్యారు వైఎస్‌. ఇక 2003లో ఆయన నిర్వహించిన పాదయాత్రలో ప్రజల బాధలు కళ్లకు కట్టినట్లు కనిపించాయి. ఎక్కడికక్కడ ఆయా ప్రదేశాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న నిర్థిష్ట సమస్యలు అకళింపు చేసుకున్న వైఎస్‌, 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి పరిష్కారానికి శ్రద్ధాసక్తులతోనే పని చేశారు.

జలయజ్ఞం, తదితర పథకాలతో జననేతగా మారిన వైఎస్
ఆరోగ్య శ్రీ, జలయజ్ఞం, అభయ హస్తం తదితర పథకాలతో జనానికి చాలా సన్నిహితంగా మారారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అంటే వైఎస్‌, వైఎస్‌ అంటే కాంగ్రెస్‌ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. ఉన్నత విద్యను అభ్యసించాలని ఆకాంక్షించే పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేయడం సాహసోపేతం. అప్పట్లోనూ, ఇప్పట్లోనూ ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసమే కొన్ని వృత్తివిద్యా కళాశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయనే విమర్శ కూడా ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
2004 ఎన్నికల్లో ఇతర కాంగ్రెస్‌ పార్టీ నేతలందరికీ నాయకత్వం వహిస్తూ, వారిలో ఒకడిగా  తెరాస - వామపక్షాల మద్దతుతో అధికారానికి చేరువైతే, 2009 ఎన్నికల్లో ఒకవైపు తెదేపా - వామపక్షాలు - తెరాస నేతృత్వంలోని మహా కూటమి, మరోవైపు మెగాస్టార్‌ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని ఎదుర్కొని పార్టీ విజయానికి బాటలు వేశారు వైఎస్‌.
పార్టీ అధినాయకత్వం కూడా 2009లో రెండోసారి పార్టీ విజయం సాధించిన తర్వాత స్వేచ్ఛనిచ్చింది. 2004, 2009 ఎన్నికల్లో అత్యధిక లోక్‌సభ స్థానాలు గెలిపించడం వైఎస్‌ రాజశేఖర రెడ్డికి, తర్వాత ఆయన తనయుడు వైఎస్‌ జగన్మోహన రెడ్డికి ఫ్లస్‌ పాయింట్‌గా మారింది. హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన తర్వాత వైఎస్‌ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల ఫలాలు అనుభవించిన పేదలు అల్లాడిపోయారు.

వైఎస్ హఠాన్మరణంతో కకావికలం
అప్పటికే పార్టీలో తమకంటూ ప్రత్యేక వర్గాన్ని కొనసాగిస్తూ వచ్చిన వైఎస్‌ అనుచర ఎమ్మెల్యేలు జగన్‌కు అనుకూలంగా మారారు. వైఎస్‌ జగన్‌కు మద్దతు పలికినా అధిష్టానం కరిగిపోలేదు. అయినా ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణ చూసేందుకు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు, ఎఐసిసి నాయకత్వం గుర్తించి, సరిదిద్దేందుకు ప్రయత్నించిన దాఖలాల్లేవు. ఒకవేళ ప్రయత్నించిన వారినే ప్రశ్నించిన పరిస్థితులు ఉన్నాయి.

అంజయ్యకు అండగా నిలిచినా...
తొలి సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్టులు గట్టిపోటీనిచ్చినా విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీ 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించే వరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లో ఏకఛత్రాధిపత్యం వహించింది. 1978లో పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చిన మర్రి చెన్నారెడ్డిని సొంత పార్టీలోని వ్యతిరేకులే ఇంటికి పంపారు. ఆయన స్థానంలో కార్మిక నేత టంగుటూరి అంజయ్యను సిఎంగా ఇందిరా గాంధీ ఎంపిక చేశారు.
అప్పటికే ప్రజాదరణ గల నేతగా ఉక్కు మహిళగా ఇందిరా గాంధీ ఒకానొక దశలో ప్రధాని హోదాలోనే నేరుగా హైదరాబాద్‌ నగరానికి చేరుకుని ఆఘమేఘాల మీద సిఎల్పీ సమావేశం నిర్వహించి అంజయ్య వ్యతిరేకులకు ప్రతికూల సంకేతం పంపారు. కానీ బేగంపేట అంతర్జాతీయ విమానాశ్రయంలో రాజీవ్‌ గాంధీ, సిఎంగా అంజయ్యను అవమానించడం అప్పుడు అక్కడే ఉన్న నందమూరి తారక రామారావు వంటి వారిని కలచివేసింది.

తెలుగు ఆత్మగౌరవం పేరుతో కూకటి వేళ్లతో కాంగ్రెస్ పెకలింపు
తెలుగు ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించిన నందమూరి తారక రామారావు 1982 ఫిబ్రవరిలో తెలుగుదేశం పార్టీని స్థాపించి, రాష్ట్ర పర్యటన మొదలు పెట్టారు. ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్న సంగతి చూసి కాంగ్రెస్‌ పార్టీ నేతల్లో గంగవెర్రులెత్తించింది. ముందస్తుగా ఎన్నికలు జరిపి విజయం సాధించాలని ఇందిరా గాంధీ చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి.
అప్పటికే ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చి కర్నూల్‌ పెద్దాయనగా పేరొందిన కోట్ల విజయ భాస్కర రెడ్డి మొదటిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. నిత్యం అసమ్మతి, ముఖ్యమంత్రుల మార్పిడి, అశ్రిత పక్షపాతం, అవినీతి లీలల పట్ల ప్రజల్లో వ్యతిరేకత, జన కథా నాయకుడిగా ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి దగ్గర చేసింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన మూడు దశాబ్దాల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని కూకటివేళ్లతో పెకలించి వేశారు ఎన్టీఆర్‌. 1983 - 89 మధ్య ఎన్టీఆర్‌ పాలన సాగింది.

1989 - 94 మధ్య కాంగ్రెస్ అహంకార పూరిత ధోరణి
1989 - 94 మధ్య కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నా మళ్లీ అదే ధోరణి. మధ్య నిషేధం నినాదంతో మూడోసారి ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా 1994లో బాధ్యతలు స్వీకరించారు. 1995లో ఎన్టీఆర్‌ స్థానంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిస్థితి మారిపోయింది. కార్గిల్‌ పోరు - బిజెపి పొత్తుతో 1999లో చంద్రబాబు నాయుడు రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

జగన్‌పై విచారణ పట్ల అనుమానాలు
మళ్లీ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి దశాబ్ధ కాలం పట్టింది. చంద్రబాబు నాయుడు వంటి రాజకీయ చాతుర్యం గల నేతను ఎదుర్కోవడం కాంగ్రెస్‌ పార్టీకి అంత తేలికేం కాదు. అయినా 2009 ఎన్నికల్లో విజయం సాధించడంతో వైఎస్‌ పట్ల, కాంగ్రెస్‌ పార్టీ పట్ల ప్రజలు ఉన్న నమ్మకం ఏమిటో తేలిపోయింది. కానీ వైఎస్‌ రాజశేఖర రెడ్డి హఠాన్మరణం తర్వాత మారిన ఆయన తనయుడి పట్ల 10, జనపథ్‌ అనుసరించిన తీరు ప్రజల్లో అనుమానాలు, సందేహాలు రేకెత్తించింది.
దీనికి తోడు వైఎస్‌ సిఎంగా ఉన్న సమయంలో జరిగిన లావాదేవీల్లో అవకతవకలపై రోశయ్య సిఎంగా ఉన్నప్పుడే జగన్‌కు వ్యతిరేకతంగా సిబిఐ కేసు దర్యాప్తు చేపట్టింది. జగన్‌ను కట్టడి చేయడానికే కేసులు నమోదు చేశారన్న అనుమానం ప్రజల్లోకి వెళ్లింది. వైఎస్‌ రాజశేఖర రెడ్డి మరణంతో పార్టీకి నాయకత్వం వహించగల శక్తి, సామర్థ్యాలు ఉన్న నేత కాంగ్రెస్‌ పార్టీలో నాడూ నేడూ లేరంటే అతిశేయోక్తి కాదు.
ప్రస్తుతం నేతలంతా అధినాయకత్వం నిర్ణయానికి అనుగుణంగా నడుచుకోవడమే తప్ప, వ్యక్తిగత ఛరిస్మా ఉన్న నేతలే కరువు. అటు ఆంధ్రప్రదేశ్‌, ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ కాగడా పెట్టి వెతికినా శక్తి సామర్థ్యాలున్న నేతలు దొరకరంటే సందేహమేమీ లేదు. ఇక విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్‌ పార్టీ, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను మెప్పించడంలో పూర్తిగా విఫలమైంది.

మౌలిక వసతుల కల్పన వైఫల్యమే...
2009 డిసెంబర్‌లో ప్రకటన చేసినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కేంద్రీయ ఉన్నత విద్యా సంస్థలు ఏర్పాటు చేయడానికి ప్రాధాన్యత చూపలేదు. ఈ మౌలిక వసతుల కల్పనకు మొగ్గు చూపి ఉంటే పరిస్థితి మరోవిధంగా ఉండేది. అటు అధిష్టానం, ఇటు ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ నేతలు తమ వైఖరులకే కట్టుబడి ఉండడం పరిస్థితిలో మార్పు లేక పోవడానికి కారణం. అధి నాయకత్వం నిర్ణయాన్ని మీడియా ముందు వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించడం, మరోవైపు అధికారంలో ఉండడానికి ప్రాధాన్యతనిచ్చారు సీమాంధ్ర నేతలు.
విభజన జరిగితే తమ వ్యక్తిగత ప్రయోజనాలేమిటని ఆలోచించారే తప్ప, దశాబ్దాల తరబడి అండగా నిలిచిన పార్టీ భవిష్యత్‌ గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. విభజన ప్రక్రియ జరుగుతుండగానే సీమాంధ్ర నేతలంతా బిజెపి వైపు చూడడం మొదలెట్టారు. అందుకే ప్రస్తుత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ముప్పవరపు వెంకయ్య నాయుడు పదేపదే చెబుతూ వచ్చారు విభజన విషయంలో కాంగ్రెస్‌ పార్టీ ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని. అది నిజం కూడా.
అధినేత సోనియా గాంధీ ఢిల్లీకి పరిమితం. ద్వితీయ శ్రేణి నాయకత్వం కనీసం హైదరాబాద్‌ నగరానికి వచ్చి విభజనకు తీసుకున్న నేపథ్యం ఇది, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవసరాలేంటి, ఏయే వసతులు కల్పించాలని అడిగిన వారే లేరు. బిల్లు రూపకల్పనకు పూనుకున్న మంత్రుల బృందమూ 'హస్తిన'కే పరిమితమైంది. ఇది ఆంధ్రుల్లో వ్యతిరేకతను పెంచి పోషించింది. విభజనకు ముందస్తుగానే నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్‌ పార్టీ అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వసతుల కల్పనకు చర్యలు తీసుకోలేదనే వెంకయ్య నాయుడు వాదన అక్షరాల సత్యం.
విభజనతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పునాదులు బలోపేతం చేసుకోవాలని భావించిన కమలనాథులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఒకవైపు విభజన బిల్లుకు మద్దతునిచ్చి, మరోవైపు సమన్యాయం పేరుతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అవరోధాలు సృష్టించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో పొత్తుకు వెనుకాడలేదు.

‘కమలా’నికి చేరువైన ప్రధాన సామాజిక వర్గం
మరోవైపు వైఎస్‌ జగన్‌తోపాటు రెడ్డి సామాజిక వర్గం, ముస్లిం మైనారిటీలు, క్రైస్తవులు వెళ్లిపోవడం, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అత్యధిక శాతం జనాభా గల కాపులను దగ్గరకు తీసుకోవాలని కాంగ్రెస్‌ హై కమాండ్‌ చేసిన ఆలోచనతో ఆంధ్రప్రదేశ్‌ వాసుల్లో ప్రత్యేకించి ఓ బలమైన సామాజిక వర్గంలో కాంగ్రెస్‌ పార్టీ అంటే ద్వేషం పెరిగి పోయింది. తమ సామాజిక, ఆర్థిక, ఆధిపత్య అవసరాలు నెరవేర్చుకోవాలంటే ప్రత్యామ్నాయాలు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి.
ఇదే బలమైన సామాజిక వర్గం ప్రభావం గల సినీ రంగం, వ్యాపార వాణిజ్యవేత్తల దన్నుతో రాజకీయాల్లోకి వచ్చిన పవర్‌ స్టార్‌ - జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రచారం కూడా కాంగ్రెస్‌ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత మరింత పెంచింది. శాసనసభా ఎన్నికలు మొదలు జడ్పీ, మండల పరిషత్‌, మునిసిపాలిటీలు, నగర పాలక సంస్థల ఎన్నికల్లోనూ కొన్ని స్థానాల్లో కూడా పాగా వేయలేక కాంగ్రెస్‌ పార్టీ విలవిలలాడుతోంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మునిసిపాలిటీలో మాత్రమే కాంగ్రెస్ పాలక వర్గాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఈ ఆత్మకూర్ సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆనం రామ నారాయణ రెడ్డి సొంత నియోజకవర్గం కావడం గమనార్హం.అధికార పార్టీగా గణనీయంగా ప్రభావితం చేసిన కాంగ్రెస్‌ పార్టీ, ఇప్పుడు చుక్కాని లేని నావ మాదిరిగా తమకు నాయకత్వం వహించే నేత ఎవరా? అని ఎదురు చూస్తోంది.

* 1952 తొలి ఎన్నికల్లో కమ్యూనిస్టులతో గట్టి పోటీనెదుర్కొన్నా, టంగుటూరి ప్రకాశం పంతులు, గౌతు లచ్చన్న, ఎన్‌జి రంగా వంటి వారి మద్దతుతో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
* 1969లో తెలంగాణ ఉద్యమం, 1971 - 72లో జై ఆంధ్రా ఉద్యమం ముందుకు వచ్చినా నిలదొక్కుకున్నది కాంగ్రెస్‌ పార్టీ.
* 1983 - 89 మధ్య, 1994 - 2004 మధ్య అధికారానికి దూరమైనా ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ దూరం కాలేదు.
* 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించి ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ఇందిరా కాంగ్రెస్‌ పార్టీకి 1977లో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు నీరాజనాలు పలికారు. నంద్యాల లోక్‌సభ స్థానం తప్ప, అన్ని సీట్లు కాంగ్రెస్‌ పార్టీ గెలుచుకుంది.
* 1984 లోక్‌సభ ఎన్నికల్లో  ఎన్టీఆర్‌ ప్రభంజనం కాంగ్రెస్‌ పార్టీని ఇబ్బంది పెట్టినా 1989 ఎన్నికల్లో పుంజుకుంది.
* 2004, 2009 ఎన్నికల్లోనూ 33, 35 పార్లమెంట్‌ సీట్లలో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించారు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలు. కానీ వారి మనస్సుల్లో ఏముంది, వారికి ఏం చేయాలనే ఆలోచన ఇటు రాష్ట్ర నేతలకు గానీ, అటు జాతీయ స్థాయి నేతలకు కానీ పట్టక పోవడమే ఆ పార్టీ నేటి దుస్థితికి కారణం. 

11.6.14

ఆయన వద్దంటే... అల్లుడు హత్తుకున్నారు



సరిగ్గా 34 ఏళ్ల తెలుగు ఆత్మ గౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన తెలుగు తెర ఇలవేలుపు నందమూరి తారక రామారావు ఏనాడూ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కు తిరిగి చూడలేదు. ఎన్టీఆర్ తనకు ఉన్న ప్రజాకర్షణే ప్రధాన అస్త్రంగా ఎన్నికల కురుక్షేత్రంలో తల పడితే, ఆయన అల్లుడు- ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా వ్యూహ రచన ద్వారా ముందుకెళుతున్నారు.1990లో విశ్వనాథ ప్రతాప్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించిన బిజెపిని తర్వాత ఎన్టీఆర్, మతతత్వం పేరుతో దూరం పెడితే, చంద్రబాబు మాత్రం అందుకు భిన్నంగా కమలనాథులతో మమేకమవుతూ రాజకీయంగా విజయాలు సాగిస్తూ ముందుకెళుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. నిత్యం ఎన్టీఆర్ యుగ పురుషుడని కీర్తిస్తూనే చంద్రబాబు మామను మించిన రాజకీయ చతురత ప్రదర్శిస్తున్నారని తెలుగు తమ్ముళ్లు పేర్కొంటున్నారు...
1984లో నాదెండ్ల భాస్కరరావు కుట్ర పూరితంగా తొలిసారి అధికారానికి దూరమైన నాటి తెదేపా అధ్యక్షుడు ఎన్టీఆర్‌, ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో ఇతర విపక్షాల మాదిరిగానే బిజెపి కూడా కలిసి వచ్చింది. నాడు పెనవేసుకున్న బంధం తెలుగుదేశం, బిజెపి మధ్య 1990లో నేషనల్‌ ఫ్రంట్‌కు నాయకత్వం వహిస్తున్న విశ్వనాథ ప్రతాప్‌ సింగ్‌ ప్రభుత్వానికి కమలనాథులు మద్దతు ఉపసంహరించే వరకూ సాగింది.
1990లో విశ్వనాథ ప్రతాప్‌ సింగ్‌ 'మండల్‌ కమిషన్‌' నివేదిక దుమ్మదులిపి బిసిల రిజర్వేషన్ల అమలుకు ప్రతిపాదనలు ముందుకు తెస్తే, బిజెపి నేటి అగ్రనేత లాల్‌కృష్ణ అద్వానీ ఆధ్వర్యంలో రామ మందిరం పేరుతో అయోధ్యకు రథ యాత్ర మొదలు పెట్టింది. బీహార్‌లో నాటి సిఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ దాన్ని అడ్డుకున్నందుకు నిరసనగా విపి సింగ్‌ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది బిజెపి.
నాడు తమ భవిష్యత్‌ కోసం ఐదేళ్ల పాటు సాగాల్సిన వి పి సింగ్‌ ప్రభుత్వం ఉసురు తీసిన బిజెపిని తర్వాతి కాలంలో ఏనాడూ ఎన్‌టిఆర్‌ దరి చేరనివ్వలేదు. 1994 ఎన్నికల్లోనూ ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో కలిసి ముందుకు సాగారు ఎన్టీఆర్‌. తొలుత ఆయన పంథానే అనుసరించిన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 1995లో రాష్ట్ర ప్రభుత్వ సారధ్య బాధ్యతలు స్వీకరించిన మూడేళ్లలో వ్యూహం మార్చారు.
వాజ్‌పేయి వ్యక్తిగత ప్రతిష్ట ఆధారంగా ఎన్నికల బరిలోకి దిగిన బిజెపి, 1998 ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినా పూర్తి మెజారిటీకి కొద్ది స్థానాలు తక్కువ పడ్డాయి. ఆ ఎన్నికల్లోనూ ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పోటీ చేసిన చంద్రబాబు, వాజ్‌పేయి సర్కార్‌కు తొలుత షరతులతో కూడిన మద్దతునిచ్చారు. తర్వాత 1999, 2004 ఎన్నికల్లో అధికారిక కూటమిగా మారిపోయింది.
2004 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత భవిష్యత్‌లో బిజెపితో పొత్తు పెట్టుకోబోమని ప్రకటనలు చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత. అవునా అన్నట్లు 2004 తర్వాత ప్రతి ఎన్నికల్లోనూ బిజెపికి, కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా నిలిచారు. 2009 ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టులు, తెరాసతో కలిసి ప్రయాణం సాగించిన చంద్రబాబుకు వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు.
కానీ గత ఏడాది జూలైలో అప్పటి యుపిఎ ప్రభుత్వం, దానికి నేతృత్వం వహించిన కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణకు అనుకూలంగా సూత్రప్రాయ నిర్ణయం తీసుకోవడంతో తెలుగుదేశాధినేత చంద్రబాబు నాయుడు రాజకీయ భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది.
తప్పనిసరి పరిస్థితుల్లోనే కమలనాథులతో కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్న చంద్రబాబు నాయుడు తర్వాతి కాలంలో విభజనను నిలువరించేందుకు అదే పంథా అవలంభించారు.కానీ జాతీయ పార్టీగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్న బిజెపి తన వైఖరి మార్చుకోకుండానే తెదేపాతో జట్టుకు సిద్దమైంది.
2002 నాటి అల్లర్లకు కారణమైన గుజరాత్ సిఎం మోడీని తప్పించాలని డిమాండ్‌ చేసిన చంద్రబాబే, అదే మోడీ మంచి పరిపాలనాదక్షుడని ప్రశంసల జల్లు కురిపించారు. దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం దూసుకెళుతున్న తరుణంలో కమలనాథులతో కలిసి నడవాలని చంద్రబాబు తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయమే ఆయన్ను కాపాడగలిగింది.
2004 ఎన్నికల తర్వాత ఏనాడూ బిజెపితో కలిసి పనిచేయనని పదేపదే ప్రకటనలు చేసిన చంద్రబాబు నాయుడు, పరిస్థితులు తారుమారైతే... నిర్ణయాలను తిరగదోడడంతోపాటు రాజకీయ వ్యూహం మార్చుకోవడానికి మారుపేరుగా నిలిచారు.
దేశవ్యాప్త ప్రభంజనం ఒక కారణమైతే... రాష్ట్ర విభజన పట్ల కోస్తాంధ్రుల్లో నెలకొన్న ద్వేషం, కాంగ్రెస్‌ పార్టీని మట్టి కరిపించింది. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ముందుకు వచ్చిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, తెలుగుదేశం - బిజెపి కూటమి వ్యూహం ముందు కుదేలయ్యింది. విభజన తర్వాత కొత్త ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం తర్వాత జరిగిన అభినందన సభ 'ఎన్‌డిఎ సభ'గా మారిందంటే అతిశయోక్తి కాదు. విజయం సాధించిన వేళ... కూటమి అభినందన సభ సహేతుకమే.
అదే సమయంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్య నాయుడు అభినందన సభలో వ్యాఖ్యాతగా, సంధాన కర్తగా వ్యవహరించారు. కేంద్ర మంత్రివర్గ సభ్యులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను సీమాంధ్రులకు పరిచయం చేయడం ద్వారా వెంకయ్య నాయుడు మీకు తామంతా అండగా ఉన్నామన్న సందేశాన్నిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు దాదాపు అదే స్ఫూర్తినింపినా ఒక్క విషయంలో తన రూటే సెపరేటని నిరూపించుకున్నారు.
మామ - తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టిఆర్‌, మతతత్వ బిజెపిని దూరంగా ఉంచాలని నిర్ణయిస్తే, చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా పొత్తు కుదుర్చుకుని అధికారంలోకి వచ్చారు. తద్వారా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బిజెపి బలోపేతం కావడానికి పరోక్ష సహకారాన్ని అందిస్తున్నారు. దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. పరస్పర అవసరాల కోసం పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం, బిజెపిలు తమ భవిష్యత్‌ కార్యాచరణను వేటికవే అమలు చేయ పూనుకోవడం కొసమెరుపు.

24.5.14

కెసిఆర్ చతురత ముందు కాంగ్రెస్ విలవిల

తెలంగాణ తెచ్చింది మేము... ఇచ్చింది సోనియా అనే నినాదంతో ఎన్నికల ప్రచారంలోకి దిగారు తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నేతలు. తొలి నుంచి తమ నియోజక వర్గానికే పరిమితమవుతూ వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ నేతలు అనూహ్యంగా తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి సారధ్యం వహించాల్సి రావడంతో ఉక్కిరి బిక్కిరయ్యారు. తెరాస విలీనంపై జరిగిన నర్మగర్భ చర్చల్లో పాల్గొన్న టి. కాంగ్రెస్‌ నేతలు, గులాబీ దళాధిపతి, ఆయన నాయకత్వం విధించిన షరతుల పట్ల మండి పడ్డారు. 
విలీనం అక్కర్లేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడంతో కాంగ్రెస్‌ పార్టీ అనుకూల పవనాలు వీస్తున్నాయని అధిష్టానం వద్ద వాదించడంలో కృతకృత్యులయ్యారు టి. కాంగ్రెస్‌ నేతలు. ఎన్నికల ప్రచారంలో విపక్ష పార్టీల నేతల విమర్శలకు ధాటిగా సమాధానం చెప్పేందుకు విడిగా పార్టీ కమిటీ ఏర్పాటు చేయడంతో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నేతలకు స్వేచ్ఛ లభించినా, ఇతర సమస్యలు వచ్చి పడ్డాయి.కానీ కెసిఆర్ రాజకీయ చతురత ముందు కాంగ్రెస్ నేతల ప్రచారం విలవిలలాడింది.
పలు దఫాలు వరంగల్‌ జిల్లా జనగామ అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి ప్రాతినిధ్యం వహించిన బిసి నేతగా పొన్నాల లక్ష్మయ్యకు టిపిసిసి కిరీటం లభించింది. దీంతో ఉబ్బితబ్బిబైన పొన్నాల, తెరాస - ఆ పార్టీ నాయకత్వంపై వ్యక్తిగత విమర్శలకు ప్రాధాన్యతనిచ్చారే తప్ప, తెలంగాణలో పార్టీ అభ్యర్థులందరికీ దన్నుగా ఎన్నికల ప్రచారం చేయడంలో విఫలమయ్యారని విమర్శకుల మాట. అపూర్వ ప్రజాకర్షక నేతగా కెసిఆర్ వ్యూహాత్మక ప్రచారం ముందు పొన్నాల సహా తెలంగాణ కాంగ్రెస్ నేతలు విలవిల్లాడారు.
ఇక టిపిసిసి పదవిపై ఆశలు పెట్టుకున్న సీనియర్లు డిఎస్‌, గీతారెడ్డి, దామోదర రాజనర్సింహ, జానారెడ్డి వంటి వారు తమ నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితులైన ఎన్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ గట్టి పోటీనిస్తుండడంతో హుజూర్‌ నగర్‌ నియోజకవర్గానికే పరిమిత మయ్యారు. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్‌ వ్యూహకర్తలు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ప్రధాని మన్మోహన్‌ సింగ్‌లను రప్పించారు.
కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు డిగ్గీ రాజా హైదరాబాద్ నగరానికి వచ్చీరాగానే పరిస్థితిని మధించారు. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు హితబోధ చేశారు. తెలంగాణలో పార్టీ ఓటమి పాలైతే, జాతీయ స్థాయిలో అధి నాయకత్వం విమర్శల పాలవుతుందని నేతలకు డిగ్గీరాజా తలంటారని వార్తలు వెలువడ్డాయి. మరోవైపు విభజనతో కీలక నేతలంతా పార్టీకి దూరమైనా అధినాయకత్వం నిర్ణయానికి కట్టుబడి పని చేస్తున్న సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు ఉమ్మడిగా ప్రచార బరిలో దూసుకెళుతు న్నారు.
ప్రజా వ్యతిరేకత, నిరసనలను సహృదయంతో స్వీకరించడం ద్వారా వారి అభిమానాన్ని చూరగొనేందుకు ప్రయత్నిస్తున్నారు మెగాస్టార్‌ చిరంజీవి బృందం. తెలుగుదేశం, బిజెపి నేతల విమర్శలపై ధాటిగానే సమాధానం చెబుతూ మొండిగా సీమాంధ్రలో తమ సహచర నేతలు ఎన్నికల ప్రచారం చేస్తున్న తీరు చూసి, తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నేతలు నేర్చుకోవాల్సింది చాలానే ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
తొలుత పార్టీ పదవుల కోసం ప్రయత్నాలు సాగించిన వారంతా తమకు అవకాశం లభించదని తేలిపోవడంతో వ్యక్తిగతంగా తమ విజయావకాశాలపైనే దృష్టి సారించడం ఆసక్తికర పరిణామం. తెలంగాణ ఉద్యమ సారధిగా కెసిఆర్‌, టి. కాంగ్రెస్‌ నేతలతో పోలిస్తే చమత్కారాలు, చాతుర్యంతో మందుకెళుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్లపై బలమైన అభ్యర్థులను బరిలోకి దించడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన కెసిఆర్‌, ఎన్నికల ప్రచారంలో సమయానుకూలంగా కాంగ్రెస్‌ సహా విపక్ష పార్టీలపై పదునైన ఆరోపణాస్త్రాలు సంధిస్తూ దూసుకెళుతున్నారు.
అయితే ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌, కరీంనగర్‌ జిల్లాల్లో మాత్రమే తెరాసకు సంస్థాగత నిర్మాణం ఉంది. ఈ నేపథ్యంలోనే వరంగల్‌ జిల్లాలో 1983 నుంచి తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో ఉన్న కడియం శ్రీహరి, 1995 స్థానిక సంస్థల ఎన్నికల్లో రంగ ప్రవేశం చేసిన మాజీ కాంగ్రెస్‌ నేత కొండా సురేఖ దంపతులను రాజకీయ లక్ష్యాల సాధన కోసం పార్టీలోకి ఆహ్వానించారు. జలగం వెంకట్రావును పార్టీలోకి తీసుకోవడం ద్వారా ఖమ్మం జిల్లాలో పాగా వేయడానికి ప్రయత్నిస్తున్నారు గులాబీ బాస్‌.
హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌ నగర్‌, నల్గొండ, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్‌ పార్టీకి బలమైన పునాదులే ఉన్నాయి. ఈ ఆరు జిల్లాల్లో ఆయా పార్టీల నేతలను విస్తృత స్థాయిలో పార్టీలోకి తీసుకోవడం ద్వారా సంస్థాగతంగా బలోపేతమైనా ఇప్పటికిప్పుడు శాసనసభ, పార్లమెంట్‌ స్థానాలకు జరిగే ఎన్నికల్లో ప్రయోజనం పొందగలమా? లేదా? అన్న అనుమానం తెరాస శ్రేణుల్లోనూ, ప్రధాన నాయకత్వం లోనూ ఉంది. ఖమ్మం జిల్లాలో బోణీ చేయడంతోపాటు మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి నల్గొండ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంస్థాగత నెట్‌వర్క్‌ను ఎదుర్కోవడం టిఆర్ఎస్ నాయకత్వానికి అంత తేలికేం కాదని విశ్లేషకులు చెబుతున్నారు.

పవన్ ఇంటికి దారేది

నాక్కొంచెం తిక్కుంది... దానికో లెక్కుంది అని పవర్‌ స్టార్‌... పవన్‌ కల్యాణ్‌ చెబుతుంటారు. జన చైతన్యం కోసమే జనసేన పార్టీ స్థాపించినట్లు ప్రకటించిన మెగాస్టార్‌ సోదరుడు తెలుగుదేశం, బిజెపి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని ప్రతీనబూనారు. కానీ మంగళవారం హైదరాబాద్‌ నగరం - ఎల్‌బి స్టేడియంలో జరిగిన భారీ బహిరంగ సభలో 'జనసేన' అధిపతి పవన్‌ కల్యాణ్‌, నరేంద్ర మోడీ, చంద్రబాబుతో కలిసి పాల్గొన్నారు.
ముగ్గురు నేతలు కలిసి పాల్గొనడానికి పాల్గొన్నారే గానీ, ఒకరి పొడ మరొకరికి పడినట్లు కనిపించడం లేదు. చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌ ఎల్‌బి స్టేడియం వేదికపై ఎడమొహం పెడమొహంగానే వ్యవవహరించారు. పేరుకే కర చాలనాలు తప్ప ఇష్ట పూర్తిగా పలకరించుకోలేదు.
ఈ విషయాన్ని నిశితంగా గమనించారు నరేంద్ర మోడీ. బహిరంగ సభ ముగిసిన తర్వాత ఒకే కారులో వెళ్లిన మోడీ, చంద్రబాబుతో ఈ విషయం ప్రస్తావించినట్లు సమాచారం. కూటమి అభ్యర్థుల విజయం కోసం పరస్పరం పని చేస్తున్న అధినేతలిద్దరూ ఎడమొహం పెడమొహంగా వ్యవహరించడం సబబు కాదని, తప్పుడు సంకేతాలనిస్తుందని మోడీ సూచించడంతోనే పవన్‌ కల్యాణ్‌ ఇంటికి బుధవారం తేనీటి విందుకు చంద్రబాబు వచ్చారు. ఇద్దరు నేతలు రాజకీయ పరిస్థితుల గురించి చర్చించుకున్నాక మీడియా ముందుకు వచ్చారు.పవన్ కల్యాణ్ వంటి చైతన్యంతో కూడిన యువకుల సహకారం ఉంటే ముందుకెళ్లగలమని పొగడ్తల్లో ముంచెత్తారు.

గమ్మత్తేమిటంటే ‘తెలుగు ఆత్మ గౌరవ’ పరిరక్షణ నినాదంతో 30 ఏళ్ల క్రితం 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి, కాంగ్రెస్ ఆధిపత్య రాజకీయాలనే కూకటి వేళ్లతో పెకలించి వేసిన అన్నగారు ‘ఎన్టీఆర్’ అల్లుడిగా, పార్టీలో చక్రం తిప్పారు. 1994లో మూడోసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్, తన భార్య లక్ష్మీ పార్వతికి ప్రాధాన్యతనివ్వడంతో క్రమంగా శాసనసభ్యులను, నేతలను, నందమూరి కుటుంబ సభ్యులందరినీ తనకు అనుకూలంగా మార్చుకున్నారు.
చంద్రబాబు. 1995లో తెలుగుదేశం పార్టీ, రాష్ట్ర ప్రభుత్వ సారధ్య బాధ్యతలు చేపట్టడంలో చాణక్య నీతి ప్రదర్శించిన చాతుర్యం బాబు గారిది.
రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి వినూత్న పద్దతుల్లో పాలన సాగించి, యునైటెడ్ ఫ్రంట్‌కు కన్వీనర్‌గా ప్రభుత్వ ఏర్పాటులోనూ, 1998లో వాజపేయి సర్కారుకు షరతులతో కూడిన మద్దతునివ్వడంలో రాజనీతిజ్ఞత కనబరిచి తనదైన శైలిలో జాతీయ స్థాయిలో రాజకీయ యవనికపై కీలక భూమిక పోషించిన నేత చంద్రబాబు.

రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ కాలం ముఖ్యమంత్రి పదవి నిర్వహించిన ఘనత తెదేపా అధినేతదే. ఆర్థిక సంస్కరణల అమలులో తనకు తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సిఇఓననని ప్రకటించుకుని జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి గడించిన చంద్రబాబు 2004 నుంచి ఇప్పటి వరకూ పదేళ్ల పాటు విపక్ష నేతగా కూడా రికార్డు నెలకొల్పారు.

తెలంగాణలో పట్టు సాధించేందుకు 2008లో అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు, 2009లో కేంద్రం తెలంగాణ ప్రకటించిన తర్వాత మరో చేత్తో రాజీనామా డ్రామాలు నడిపించిన వ్యూహకర్త చంద్రబాబు. తీరా 2013లో కేంద్రం తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభించింది మొదలు పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందే చివరి క్షణం వరకూ నిలువరించేందుకు తన రాజకీయ అనుభవాన్ని రంగరించి మరీ విఫల యత్నాలు చేశారు.

పార్టీ మనుగడను కాపాడుకునేందుకు బిజెపితో రెండోసారి చెట్టాపట్టాల్ వేసుకున్న చంద్రబాబు, సీమాంధ్రలో పార్టీని కాపాడుకునేందుకు కేంద్ర మంత్రి చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్ మద్దతు కోసం ఆయనింటికి వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న వైచిత్రికి నిదర్శనం.

పవన్‌ పార్టీ స్థాపించక ముందు బిజెపి, తెలుగుదేశం పార్టీల నేతలు పుల్లవిరుపుగా మాట్లాడారు. తీరా పవర్‌ స్టార్‌ లక్ష్యాలు, ఆలోచనలు తెలిసిన తర్వాత ప్రశంసల్లో ముంచెత్తారు. కేవలం తెదేపా, బిజెపిలకు మద్దతు కూడగట్టేందుకేనని మరో ప్రకటన చేయడంతో ఆనంద డోలికల్లో మునిగి తేలుతున్నారు. తీరా పవన్‌ కల్యాణ్‌ సన్నిహితులకు టిక్కెట్లు కేటాయించాల్సి వచ్చే సరికి మాట మార్చేశారు 'సైకిల్‌' సారధి.

బయటకు మాత్రం మద్దతునిచ్చిన జనసేన అభిమానులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు, తీరా పవర్‌ స్టార్‌ సన్నిహితులను చేరదీయడానికి సహకరించక పోవడంతో పవన్‌ కల్యాణ్‌ కూడా కినుక వహించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా విజయవాడ నుంచి పొట్లూరి వర ప్రసాద్‌ అభ్యర్థిత్వం కోసం చివరి వరకూ పవన్‌ కల్యాణ్‌ విఫల యత్నం చేశారు.

కానీ చంద్రబాబు చాణక్య రాజనీతి ముందు అదేమీ కుదరలేదు. అసలు బిజెపి - తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు ఉంటుందా? లేదా? అన్న అంశంపై సంశయం వ్యక్తం కావడంతో పొట్లూరి వర ప్రసాదరావు పోటీ చేయాలన్న ప్రతిపాదనను పవన్‌ కూడా నిరుత్సాహ పరిచారని వార్తలొచ్చాయి.

కేంద్ర మంత్రి చిరంజీవి సోదరుడిగా కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పినందుకు మాత్రం పవన్‌ కల్యాణ్‌ మద్దతు స్వీకరించేందుకు వెనుకాడని చంద్రబాబు, మెగాస్టార్‌ సోదరుడి అనుయాయులకు టిక్కెట్లివ్వడానికి మనస్కరించలేదు.
అసలు సంగతి తేలిపోవడంతోనే పవన్‌ కల్యాణ్‌ కూడా బయటకు చంద్రబాబు నాయుడుకు మద్దతు పలికినా, వ్యక్తిగతంగా విభేదిస్తున్నారని, అందువల్లే ఎల్‌ బి నగర్‌ స్టేడియం సభలో కనీసం పలకరింపుల్లేవని మీడియా వ్యాఖ్యానిస్తోంది. అంటే పరిస్థితులు మనకు అనుకూలిస్తే మంచిది.. లేదంటే నీ దారి నీదే... నా దారి నాదే అన్న ధోరణి అన్నమాట...

ఇదీ నరేంద్ర మోడీ అదే ఎల్‌ బి స్టేడియం వేదికగా చెప్పిన 'చంద్రబాబు + మోడీ + పవన్‌ కెమిస్త్రీ = 1 + 1+ 1 అంటే 3 కాదు 111 అని' పేర్కొనడంలో అంతరార్థం. ముగ్గురు నేతలు కలిస్తే ఆంధ్రావనిలో ప్రభంజనం సృష్టించేందుకు ఈ కెమిస్త్రీ పండిందని అభివర్ణించిన మోడీ, ఆయన మద్దతు దారులుగా ఉన్న చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఒకరంటే మరొకరికి గిట్టక పోతే, ఈ కెమిస్ట్రీ పండుతుందా? ఫెయిలవుతుందా? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మిగులుతుంది.