11.6.14

ఆయన వద్దంటే... అల్లుడు హత్తుకున్నారు



సరిగ్గా 34 ఏళ్ల తెలుగు ఆత్మ గౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన తెలుగు తెర ఇలవేలుపు నందమూరి తారక రామారావు ఏనాడూ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కు తిరిగి చూడలేదు. ఎన్టీఆర్ తనకు ఉన్న ప్రజాకర్షణే ప్రధాన అస్త్రంగా ఎన్నికల కురుక్షేత్రంలో తల పడితే, ఆయన అల్లుడు- ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా వ్యూహ రచన ద్వారా ముందుకెళుతున్నారు.1990లో విశ్వనాథ ప్రతాప్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించిన బిజెపిని తర్వాత ఎన్టీఆర్, మతతత్వం పేరుతో దూరం పెడితే, చంద్రబాబు మాత్రం అందుకు భిన్నంగా కమలనాథులతో మమేకమవుతూ రాజకీయంగా విజయాలు సాగిస్తూ ముందుకెళుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. నిత్యం ఎన్టీఆర్ యుగ పురుషుడని కీర్తిస్తూనే చంద్రబాబు మామను మించిన రాజకీయ చతురత ప్రదర్శిస్తున్నారని తెలుగు తమ్ముళ్లు పేర్కొంటున్నారు...
1984లో నాదెండ్ల భాస్కరరావు కుట్ర పూరితంగా తొలిసారి అధికారానికి దూరమైన నాటి తెదేపా అధ్యక్షుడు ఎన్టీఆర్‌, ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో ఇతర విపక్షాల మాదిరిగానే బిజెపి కూడా కలిసి వచ్చింది. నాడు పెనవేసుకున్న బంధం తెలుగుదేశం, బిజెపి మధ్య 1990లో నేషనల్‌ ఫ్రంట్‌కు నాయకత్వం వహిస్తున్న విశ్వనాథ ప్రతాప్‌ సింగ్‌ ప్రభుత్వానికి కమలనాథులు మద్దతు ఉపసంహరించే వరకూ సాగింది.
1990లో విశ్వనాథ ప్రతాప్‌ సింగ్‌ 'మండల్‌ కమిషన్‌' నివేదిక దుమ్మదులిపి బిసిల రిజర్వేషన్ల అమలుకు ప్రతిపాదనలు ముందుకు తెస్తే, బిజెపి నేటి అగ్రనేత లాల్‌కృష్ణ అద్వానీ ఆధ్వర్యంలో రామ మందిరం పేరుతో అయోధ్యకు రథ యాత్ర మొదలు పెట్టింది. బీహార్‌లో నాటి సిఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ దాన్ని అడ్డుకున్నందుకు నిరసనగా విపి సింగ్‌ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది బిజెపి.
నాడు తమ భవిష్యత్‌ కోసం ఐదేళ్ల పాటు సాగాల్సిన వి పి సింగ్‌ ప్రభుత్వం ఉసురు తీసిన బిజెపిని తర్వాతి కాలంలో ఏనాడూ ఎన్‌టిఆర్‌ దరి చేరనివ్వలేదు. 1994 ఎన్నికల్లోనూ ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో కలిసి ముందుకు సాగారు ఎన్టీఆర్‌. తొలుత ఆయన పంథానే అనుసరించిన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 1995లో రాష్ట్ర ప్రభుత్వ సారధ్య బాధ్యతలు స్వీకరించిన మూడేళ్లలో వ్యూహం మార్చారు.
వాజ్‌పేయి వ్యక్తిగత ప్రతిష్ట ఆధారంగా ఎన్నికల బరిలోకి దిగిన బిజెపి, 1998 ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినా పూర్తి మెజారిటీకి కొద్ది స్థానాలు తక్కువ పడ్డాయి. ఆ ఎన్నికల్లోనూ ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పోటీ చేసిన చంద్రబాబు, వాజ్‌పేయి సర్కార్‌కు తొలుత షరతులతో కూడిన మద్దతునిచ్చారు. తర్వాత 1999, 2004 ఎన్నికల్లో అధికారిక కూటమిగా మారిపోయింది.
2004 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత భవిష్యత్‌లో బిజెపితో పొత్తు పెట్టుకోబోమని ప్రకటనలు చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత. అవునా అన్నట్లు 2004 తర్వాత ప్రతి ఎన్నికల్లోనూ బిజెపికి, కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా నిలిచారు. 2009 ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టులు, తెరాసతో కలిసి ప్రయాణం సాగించిన చంద్రబాబుకు వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు.
కానీ గత ఏడాది జూలైలో అప్పటి యుపిఎ ప్రభుత్వం, దానికి నేతృత్వం వహించిన కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణకు అనుకూలంగా సూత్రప్రాయ నిర్ణయం తీసుకోవడంతో తెలుగుదేశాధినేత చంద్రబాబు నాయుడు రాజకీయ భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది.
తప్పనిసరి పరిస్థితుల్లోనే కమలనాథులతో కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్న చంద్రబాబు నాయుడు తర్వాతి కాలంలో విభజనను నిలువరించేందుకు అదే పంథా అవలంభించారు.కానీ జాతీయ పార్టీగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్న బిజెపి తన వైఖరి మార్చుకోకుండానే తెదేపాతో జట్టుకు సిద్దమైంది.
2002 నాటి అల్లర్లకు కారణమైన గుజరాత్ సిఎం మోడీని తప్పించాలని డిమాండ్‌ చేసిన చంద్రబాబే, అదే మోడీ మంచి పరిపాలనాదక్షుడని ప్రశంసల జల్లు కురిపించారు. దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం దూసుకెళుతున్న తరుణంలో కమలనాథులతో కలిసి నడవాలని చంద్రబాబు తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయమే ఆయన్ను కాపాడగలిగింది.
2004 ఎన్నికల తర్వాత ఏనాడూ బిజెపితో కలిసి పనిచేయనని పదేపదే ప్రకటనలు చేసిన చంద్రబాబు నాయుడు, పరిస్థితులు తారుమారైతే... నిర్ణయాలను తిరగదోడడంతోపాటు రాజకీయ వ్యూహం మార్చుకోవడానికి మారుపేరుగా నిలిచారు.
దేశవ్యాప్త ప్రభంజనం ఒక కారణమైతే... రాష్ట్ర విభజన పట్ల కోస్తాంధ్రుల్లో నెలకొన్న ద్వేషం, కాంగ్రెస్‌ పార్టీని మట్టి కరిపించింది. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ముందుకు వచ్చిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, తెలుగుదేశం - బిజెపి కూటమి వ్యూహం ముందు కుదేలయ్యింది. విభజన తర్వాత కొత్త ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం తర్వాత జరిగిన అభినందన సభ 'ఎన్‌డిఎ సభ'గా మారిందంటే అతిశయోక్తి కాదు. విజయం సాధించిన వేళ... కూటమి అభినందన సభ సహేతుకమే.
అదే సమయంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్య నాయుడు అభినందన సభలో వ్యాఖ్యాతగా, సంధాన కర్తగా వ్యవహరించారు. కేంద్ర మంత్రివర్గ సభ్యులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను సీమాంధ్రులకు పరిచయం చేయడం ద్వారా వెంకయ్య నాయుడు మీకు తామంతా అండగా ఉన్నామన్న సందేశాన్నిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు దాదాపు అదే స్ఫూర్తినింపినా ఒక్క విషయంలో తన రూటే సెపరేటని నిరూపించుకున్నారు.
మామ - తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టిఆర్‌, మతతత్వ బిజెపిని దూరంగా ఉంచాలని నిర్ణయిస్తే, చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా పొత్తు కుదుర్చుకుని అధికారంలోకి వచ్చారు. తద్వారా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బిజెపి బలోపేతం కావడానికి పరోక్ష సహకారాన్ని అందిస్తున్నారు. దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. పరస్పర అవసరాల కోసం పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం, బిజెపిలు తమ భవిష్యత్‌ కార్యాచరణను వేటికవే అమలు చేయ పూనుకోవడం కొసమెరుపు.