2.2.17

హెచ్‌1బీ కొత్త నిబంధన కొంచెం ఇష్టం...కొంచెం కష్టం

ఎక్కడో అమెరికాలో అక్కడి ప్రభుత్వం చట్ట సవరణ చేస్తుంటే ఇక్కడ మహా నగరం కంగారుపడుతోంది. హెచ్‌1బీ వీసా నిబంధనల్లో తెచ్చే మార్పు వల్ల మనోళ్లు నష్టపోతారేమోనని ఆందోళన చెందుతోంది. అసలు ఈ సవరణ వల్ల విద్యార్థులు, ఉద్యోగులపై పడే ప్రభావం కన్నా సంస్థలపైనే పెనుభారం పడనుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. సాఫ్ట్‌వేర్‌ రంగంలో అక్కడ కొలువులు సంపాదించే వారిపై పెద్దగా ప్రభావం పడకపోవచ్చు. టీచర్లు, ఫిజియోథెరఫిస్టులు, నర్సులు వంటి వారు తీవ్రంగా నష్టపోయే అవకాశాలున్నాయి. ప్రస్తుతం 60 వేల అమెరికన్‌ డాలర్ల వార్షిక కనీస వేతనం ఉంటే వారు హెచ్‌1బీ వీసా అర్హత సాధిస్తారు. దాన్ని 130 వేల డాలర్లకు పెంచుతూ ముసాయిదా సిద్ధం చేయడంపై సర్వత్రా ఆందోళనలు రేగుతున్నాయి.

విద్యార్థులకు నైపుణ్యాల గండం
మాస్టర్‌ డిగ్రీ కోసం అమెరికా వెళ్లే విద్యార్థులు ఎఫ్‌1 వీసాతో వెళ్లి హెచ్‌1బీ సాధించాలంటే కొత్త నిబంధనలతో కొంత మేర కష్టమే. సాధారణంగా ఉన్నత విద్యను అభ్యసించడానికి అక్కడికెళ్లే విద్యార్థులకు నిబంధనల ప్రకారం మొదటి సంవత్సరం వరకు ఆఫ్‌ క్యాంపస్‌ ఉద్యోగాలు చేసేందుకు సాధ్యపడదు. ఆ తర్వాత రెండు రకాలుగా ఉద్యోగం చేసే అవకాశం ఉంది. ఒకటి కరుక్యులర్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (సీపీటీ), ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఓపీటీ) తరహాలో పని చేయొచ్చు. సీపీటీ పూర్తిగా ఇన్‌టెన్‌షిప్‌ తరహాలో చేయాల్సి ఉంటుంది. ఓపీటీ వచ్చి చదువుతూ ఉండే సమయంలోనూ చదువు అయిన తరవాత కాని చేయొచ్చు.
ప్రస్తుతం 36 నెలల వరకు ఈ తరహాలో ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ సమయంలో ఐటీ ఉద్యోగులకు 60 వేల డాలర్ల నుంచి 75 వేల డాలర్ల మధ్యనే సగటు వార్షిక వేతనం ఉంటుంది. కొంతమేర కన్సల్టెన్సీ ద్వారా వెళ్లడం వల్ల మరో 10 వేల నుంచి 15వేల డాలర్ల వరకు వారికి వస్తుంది. దీంతో వారు 90 వేల డాలర్ల వరకు అధికారికంగా సంపాదిస్తారు.

కొత్త నిబంధనల నేపథ్యంలో
మూడేళ్ల అనుభవం ద్వారా వచ్చే హైక్‌లతో దాదాపు కొత్త నిబంధనల మేర ఇవ్వాల్సిన వేతనానికి చేరుకుంటారు. దాంతో నైపుణ్యముండే విద్యార్థులకు ఇబ్బందులుండవు. మూడేళ్లలో వివిధ రకాల కారణాలతో ఉద్యోగాలు మానేయడం.. సంస్థలు తొలిగించడం వంటి ప్రభావాలు పడిన వారిపై కొంత ప్రతికూలంతో ఉండొచ్చు. ఓపీటీలో మొదటి ఏడాది కేవలం 90 రోజులు మాత్రమే ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఆ తరవాతి రెండేళ్లలో 120 రోజులకు అవకాశం ఉంటుంది. అంటే దాదాపు రెండున్నరేళ్ల పాటు సర్వీ్‌సలో ఉండి తమ నైపుణ్యాలతో సంస్థ మన్ననలు పొందిన వారికి ఇబ్బందులు ఉండకపోవచ్చని నిపుణులు వెల్లడిస్తున్నారు. అటువంటి వారిని వదులు కోకుండా సంస్థలు కనీస వేతనం ఇచ్చేందుకు ఒప్పుకుని వారిని కొనసాగించేలా చేస్తాయని అంచనా వేస్తున్నారు.

మనకే లాభం
కొత్త నిబంధనల సాకు చూపుతూ హెచ్‌1బీ వీసాపై ఉన్నవారిని తిరిగి మన దేశానికి పంపితే అక్కడి కంపెనీలకే ఎక్కువ నష్టమని నిపుణులు వివరిస్తున్నారు. ప్రస్తుతం టాప్‌ కంపెనీలన్నీ ఇతర దేశాల ఉద్యోగులపైనే ఎక్కువ ఆధారపడుతున్నాయి. కొత్త నిబంధన పరిధిలోకి కొందరు ఉద్యోగులు రాక వారిని వదులు కోవాల్సి వస్తే అక్కడ మానవ వనరుల కొరత ఏర్పడే అవకాశముందని, దాంతో సంస్థలన్నీ పొరుగు సేవలపై ఆధారపడాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. దాంతో ఐటీలో అభివృద్ధి చెందుతున్న ప్రభావశీల నగరాల్లో హైదరాబాద్‌ ఒకటి. అందువల్ల ఇక్కడ అవకాశాలు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన అమెరికా ఐటీ కంపెనీలకు నగరంలో కార్యాలయాలు ఉండటంతో అక్కడ చేయాల్సిన పని బదిలి చేయొచ్చు. లేదా వేరే సంస్థలకు పొరుగు సేవలకు ఇవ్వొచ్చు. దాని వల్ల తుది ఉత్పత్తిని అమెరికాలో వాడుకున్నా కేవలం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఆ విధంగా సంస్థలు ప్రత్యామ్నాయం చూస్తాయి. అలాగైన నగరానికి మేలు జరిగే అవకాశాలే ఎక్కువ.

చిన్న నగరాలపైనే ఎక్కువ ప్రభావం
అమెరికాలో ఉద్యోగం చేసే ఐటీ ఉద్యోగులందరికీ ఒకే రకమైన వేతనాలు ఉండకపోవచ్చు. వారు పనిచేసే నగరాలను బట్టి ఎక్కువ మార్పులుండొచ్చు. హైస్కిల్స్‌ ఉండేవారిని లెక్కించకున్నా సగటు నైపుణ్యాలతో ఉండేవారికి కాలిఫోర్నియాలో 70 వేల డాలర్ల నుంచి 130 డాలర్ల వరకు వార్షిక వేతనం ఉంటుంది. అదే న్యూయార్క్‌ నగరాన్ని తీసుకుంటే 60 వేల డాలర్ల నుంచి 90 వేల డాలర్ల వరకు ఉండొచ్చు. ఫ్లోరిడా, టెక్సస్‌, నార్త్‌కెరలినా వంటి నగరాల్లో అది 50 వేల డాలర్ల నుంచి 70 వేల డాలర్ల మధ్య ఉంటాయి. ఈ పరిస్థితుల్లో హెచ్‌బీ1 వీసా నిబంధనల్లో మార్పు తెస్తే వెంటనే చిన్న నగరాలపై ప్రభావం పడుతుంది. ఎక్కువ మంది అక్కడుండే వారే నష్టపోతారు. సంస్థలు ముందుకొచ్చి భారీ స్థాయిలో హైక్‌ ఇస్తే తప్పా అక్కడుండే అవకాశం ఉండకపోవచ్చనే చెప్పాలి.

ఓపీటీ సమయం మారిస్తేనే..
ప్రస్తుతం విద్యార్థులకిస్తున్న ఓపీటీ సమయాన్ని ఏడాదికి కుదిస్తారనే ప్రచారం వల్ల కొంత ఆందోళన ఏర్పడుతోంది. ఇప్పటి వరకు ముసాయిదాలో అటువంటి మాట పేర్కొనలేదు. పైగా ఎఫ్‌1 వీసాపై వచ్చే వారికి గ్రీన్‌ కార్డు త్వరగా వచ్చేలా ప్రత్యేక మార్గం ఇచ్చే అవకాశం ఉన్నట్లు ముసాయిదా పేర్కొంటోంది. ప్రస్తుతం స్పష్టమైన వివరాలు ఇవ్వకున్నా అది విద్యార్థులకు మేలు చేయొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఓపీటీ సమయం మార్చకపోతే వెంటనే వచ్చే ఇబ్బందులు లేవనే చెబుతున్నారు.

చిన్న ఉద్యోగాలపైనే ప్రభావం
హెచ్‌1బీపై కొత్త నిబంధనలు వెంటనే తీసుకొచ్చినా ఐటీ రంగంపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. టీచర్లు, ఫిజియోథెరఫిస్టులు, నర్సుల వంటి చిన్న ఉద్యోగాలు చేసేవారికి ఇబ్బంది ఉంటుంది. వారికి వార్షిక వేతనం 60 వేల డాలర్లు ఇవ్వడమే కష్టం. అలాంటి వారు తిరిగి తమ దేశాలకు వెళ్లిపోవాల్సి రావొచ్చు. తెలుగు వారు ఎక్కువగా ఐటీ రంగంలోనే ఉంటారు. కేరళ వంటి రాష్ట్రాల్లో నర్సులు ఎక్కువగా ఉంటారు. దాంతో మనపై పెద్దగా ప్రభావం పడకపోవచ్చు. నేరుగా సంస్థల ద్వారా ఉద్యోగం సంపాదించకుండా కన్సల్టెన్సీల నుంచి వస్తే వారికి చెల్లించే మొత్తం ఎక్కువ ఉండి పే రోల్‌లో చూపే అవకాశం లేని వారు కొంత మేర ఇబ్బంది పడొచ్చు. ఈ ఎపిసోడ్‌తో ఉద్యోగాలు పోయే పరిస్థితి వస్తే అది తెలుగు రాష్ట్రాలకే కలిసొస్తుంది. పెద్ద ఐటీ సంస్థలన్నీ పొరుగు సేవల పేరుతో మనలాంటి దేశాలపైనే ఆధారపడాల్సి ఉంటుంది. ప్రస్తుత ప్రభుత్వాలు ఐటీ అనుకూల నిర్ణయాలతో ముందుకు సాగడం వల్ల ఇక్కడ ఉద్యోగ కల్పన పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
- బుచ్చి రాంప్రసాద్‌, ఏపీఎన్‌ఆర్‌టీ చీఫ్‌ కోఆర్డినేటర్‌, యూఎస్ఏ

స్కిల్‌ ఉండేవారికి నష్టముండదు
అమెరికాలో ఉండే భారతీయులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే సంస్థ మాది. మా అంచనా ప్రకారం ఓపీటీలో మార్పులు చేయకుంటే విద్యార్థులకు మూడేళ్ల అనుభవం వల్ల మంచి వార్షిక వేతనం పొందేందుకు అవకాశం ఉంది. సాధారణంగా ఇండియా నుంచి వచ్చే విద్యార్థులపై ఐటీ సంస్థలకు మంచి అభిప్రాయం ఉండటం. ఎడ్యుకేషన్‌ లోన్ల ద్వారా వచ్చే విద్యార్థులు సైతం దానికి తగిన విధంగా కష్టపడి పనిచేయడం వల్ల ఓపీటీ మూడేళ్లలో 90 శాతం ఉద్యోగులను సంస్థలు వదులుకునేందుకు సిద్ధంగా ఉండవు. దాంతో వారికి కనీసం వేతనం ఇచ్చేందుకు ముందుకొస్తాయి. దాని వల్ల సంస్థలపైనే భారం ఉంటుంది తప్ప విద్యార్థులుగా వచ్చి ఉద్యోగాలు సంపాదించేవారిపై తక్కువే ఉంటుంది. దానితో పాటు నైపుణ్యాల విషయంలో కొంత వెనుకబాటు ఉండేవారు అసలు మూడేళ్ల పాటు అక్కడ పని చేయలేకపోవచ్చు. అలాంటి వారు హెచ్‌1బీ వీసా వచ్చేలోపే తిరిగి ఇండియాకి వెళిపోతారు. స్కిల్‌ ఉండేవారికి కొత్త నిబంధనలు వచ్చిన ఇబ్బంది ఉండకపోవచ్చు.
- నరేంద్ర ఎల్లంకి, దేశీ ఓపీటీ సంస్థ సీఈవో

1.2.17

మరో కోణం: హెచ్ 1 బీ వీసాలో కోత అమెరికాకే నష్టమా?

వాషింగ్టన్ / న్యూఢిల్లీ: విదేశీ ఉద్యోగులను తగ్గించి అమెరికన్లకు ఉద్యోగావకాశాలు కల్పించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తలపోస్తున్నారు. అందుకు అనుగుణంగా ఇంతకుముందు అమలులో ఉన్న హెచ్ - 1 బీ వీసా చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ అమెరికా ప్రజాప్రతినిధుల సభలో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే.. భారత్ నుంచి అమెరికాకు ఉన్నత విద్య, తర్వాత ఉద్యోగం సంపాదించుకునేందుకు వెళ్లిన వారంతా తమ వీసా గడువు ముగియగానే అన్నీ సర్దుకుని వెనుదిరిగి రావాల్సిందే. డిపెండెంట్ వీసాలకు, దంపతుల వీసాలకు ఇక తావు ఉండక పోవచ్చు. ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన హెచ్ 1 బీ వీసా చట్ట సవరణ ప్రకారం ఐటీ కంపెనీలు తొలుత అమెరికన్ ఇంజినీర్‌ను నియమించుకోవాలి. ఒకవేళ విదేశీ సిబ్బందిని నియమించుకోవాల్సి వస్తే అత్యంత అధిక వేతనం చెల్లించాలి. ఈ నిర్ణయం అమలులోకి వస్తే ఆపిల్ వంటి దిగ్గజ టెక్నాలజీ సంస్థలు ప్రతిభావంతులైన ఉద్యోగుల నియామక విధానంలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ఫోసిస్, విప్రో వంటి భారతీయ కంపెనీలు పూర్తిగా నియామక పద్ధతులే మార్చుకోవాల్సి ఉంటుంది. 

కొత్త బిల్లులో పేర్కొన్న నిబంధన ప్రకారం హెచ్ 1 బీ వీసా కింద పనిచేసే ఉద్యోగి కనీస వేతనం 60 వేల డాలర్ల నుంచి 1.30 లక్షల డాలర్లకు పెంచాలి. ప్రస్తుత ఇమ్మిగ్రేషన్ పాలసీ, అమెరికా సమాజం, ఆర్థిక వ్యవస్థ, కార్మికులు, విదేశాంగ విధానం, జాతీయ భద్రతపై దాని ప్రభావం ఎలా ఉందో విశ్లేషించేందుకు ఒక కమిషన్ లేదా సలహా సంఘాన్ని నియమించాలని కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రతిపాదించనున్నది. అమెరికా జాతీయ ప్రయోజనాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి అమలు చేసేలా మన దేశ వలస విధానాలు రూపొందించాల్సి ఉందని హెచ్ - 1 బీ వీసా చట్టం సవరణ బిల్లు ముసాయిదాలో ఉంది. 

ఇండియాకు వరప్రదాయినే....
ఉద్యోగావకాశాలు కల్పించేందుకు హెచ్ 1 బీ వీసాలో భారీకోత విధించేందుకు చట్ట సవరణ చేయడం భారతదేశానికి వరంగానే పరిణమిస్తుందని విప్రో మాజీ అధ్యక్షుడు, హ్యాపీయెస్ట్ మైండ్స్ టె‌క్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అశోక్ సూత వ్యాఖ్యానించారు. ట్రంప్ నిర్ణయంతో ఐటీ పరిశ్రమ విదేశాలకు.. ప్రత్యేకించి భారత్‌కు తరలే అవకాశం ఉన్నదని, దీనివల్ల దీర్ఘ కాలంలో మనదేశానికి, భారత ఐటీ సంస్థలకు లబ్ది చేకూరనున్నదన్నారు. ఐటీ వంటి ప్రత్యేక రంగాల్లో అమెరికా ప్రతిభావంతుల కొరత ఎదుర్కోనున్నదన్నారు. అమెరికా ఐటీలో ఖాళీగా ఉన్న పది లక్షల ఉద్యోగాలను స్థానిక ఐటీ కంపెనీలు భర్తీ చేయలేవన్నారు. అమెరికాకు భారత్ లోని ఐటి నిపుణులు అవసరం అని స్పష్టంచేశారు. అయితే తాను ఆశావాదినని, అమెరికాలో విధానాలు మారినప్పుడల్లా భారత ఐటీ కంపెనీలు వాటిని తమకు అనుకూలంగా మార్చుకుని లబ్ది పొందాయని అశోక్ సూత గుర్తుచేశారు.

అమెరికాకే నష్టం... 

అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించాలన్న వాదాన్ని సంతృప్తి పరిచేందుకు లాఫ్‌గ్రీన్ ప్రవేశపెట్టిన హెచ్ 1 బీబిల్లులో కొన్ని లోపాలు ఉంటాయని నాస్కామ్ పేర్కొంది. నర్సింగ్, లైఫ్ సైన్సెస్, ఇంజినీరింగ్ పరిశ్రమలపై ఈ బిల్లు ప్రభావం చూపుతుందని నాస్కామ్ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖరన్ తెలిపారు. అమెరికా కార్మికశాఖ వద్ద అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఇప్పటికే పది లక్షల మందికిపైగా నిరుద్యోగులు ఉన్నారని దీనికి తోడు రాజకీయ కారణాలతోగానీ, ఆవేశంగా గానీ నిపుణులపై విధించే ఆంక్షల వల్ల ఆ ఉద్యోగాలను అమెరికా కంపెనీలు భర్తీ చేయలేవని, దీనికి తోడు సదరు ఉద్యోగాలన్నీ విదేశాలకు తరలుతాయని చంద్రశేఖరన్ స్పష్టం చేశారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టమన్నారు. అమెరికా సంస్థల ధిక్కారం... హెచ్ 1 బీ వీసా చట్టం కఠినతరం చేయడం వల్ల ఐటీ రంగ పరిశ్రమపై గణనీయ ప్రభావం చూపుతుందని బెంగళూరు చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ జనరల్ రాజు భట్నాగర్ వ్యాఖ్యానించారు. దీనికి వ్యతిరేకంగా అమెరికా కంపెనీలే ముందు వరుసలో నిలిచి ఈ చట్టాన్ని అమలు చేయొద్దని ట్రంప్ సర్కార్ పై ఒత్తిడి తీసుకొస్తాయని.. ఇప్పటికే తీవ్రస్థాయిలో ధిక్కారస్వరం వినిపిస్తున్నాయని తెలిపారు. ఒకవేళ పరిస్థితులు విషమిస్తే వలస వాదులను ఆదుకునేందుకు సాఫ్ట్ వేర్ దిగ్గజం ‘గూగుల్' నాలుగు మిలియన్ డాలర్ల సహాయ నిధి సిద్ధం చేసిందని గుర్తుచేశారు. ప్రభుత్వంతో అమెరికా దిగ్గజ కంపెనీలన్నీ ముఖాముఖీ తలపడతాయని స్పష్టంచేశారు. భారత ఐటీ కంపెనీలు కూడా మారిన పరిస్థితులకు అనుగుణంగా తమ ఆర్థిక విధానాలను పునర్నిర్వచించుకుంటాయని రాజు భట్నాగర్ తెలిపారు. ఇతర దేశాల్లో విధుల నిర్వహణ ద్వారా ఆదాయాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తాయని చెప్పారు. 

విదేశీ ఉద్యోగుల కోసమే...

ప్రత్యేకమైన విభాగాల్లో సిద్ధాంతపరమైన, సాంకేతికపరమైన నైపుణ్యం అవసరమైన రంగాల్లో ఉన్నత విద్యావంతులైన విదేశీ ఉద్యోగుల నియామకానికి అనుమతించే నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాను హెచ్-1బీ గా పిలుస్తారు. సైంటిస్టులు, ఇంజినీర్లు లేదా కంప్యూటర్ ప్రోగ్రామర్లు వంటి వృత్తి నిపుణులు ఈ క్యాటగిరీలోకి వస్తారు. ప్రతి ఏటా అమరికా 65వేల హెచ్-1బీ వీసాలను జారీచేస్తుంది. 2014లో ప్రపంచ వ్యాప్తంగా హెచ్ 1 బీ వీసా పొందిన వారిలో 70 శాతం భారతీయులే. ప్రస్తుతం అమెరికాలో సుమారు 3.5 లక్షల మంది భారతీయ ఇంజనీర్లు ఉన్నారని ఒక అంచనా. ప్రస్తుతం అమెరికాలోని ఇన్ఫోసిస్‌లో పని చేస్తున్నవారిలో 60శాతానికి పైగా హెచ్-1బీ వీసాదారులే. ఇంకో గమ్మత్తేమిటంటే 2016 ఆగస్టు వరకు భారతీయులు 72 శాతం హెచ్ 1 బీ వీసా, 30 శాతం ‘ఎల్ 1' వీసా పొందారు. 

న్యాయపోరాటానికి దిగ్గజ కంపెనీలు

ట్రంప్ సర్కారు ఉత్తర్వుపై వాషింగ్టన్ రాష్ట్ర అటార్నీ జనరల్ వేసిన పిటిషన్‌కు మద్దతు తెలుపనున్నట్టు అమెజాన్ సీఈవో జెఫ్రీ బెజోస్ కంపెనీ ఉద్యోగులకు ఈ మెయిల్ పెట్టారు. న్యాయవాదులు ఇందుకు అవసరమైన పత్రాలు సిద్ధం చేశారని ఆయన చెప్పారు. గూగుల్, ఎయిర్ బీఎన్బీ, నెట్‌ఫ్లిక్స్ వంటి బడాకంపెనీలు ట్రంప్ విధానంపై పోరాటానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.