30.8.14

నాడు వద్దన్నారు... నేడు ముద్దన్నారు

                                     


                                           గవర్నర్‌కు అధికారాలపై మారిన తెదేపా వైఖరి


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అవశేష ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కొత్త రాజధాని ఎంపిక చేసేవరకు పదేళ్ల పాటు హైదరాబాద్‌ నగరాన్నే రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా విభజన చట్టంలో పేర్కొన్నారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ నగరంలో శాంతిభద్రతలు, సంస్థలు, ఆస్తుల పరిరక్షణపై గవర్నర్‌ పర్యవేక్షణ ఉండాలని కూడా చట్టంలో పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన అధికారాల ప్రకారం ఒక రాష్ట్ర గవర్నర్‌, సంబంధిత రాష్ట్ర మంత్రివర్గం సూచన మేరకు వ్యవహరించాల్సి ఉంటుంది. ఇదే అంశం కూడా విభజన చట్టం 8 సెక్షన్‌లో ఉంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కేంద్రంలో నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కొలువు దీరడం, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ తెలుగుదేశం పార్టీ దశాబ్ధ కాలం తర్వాత తిరిగి అధికార పీఠానికి దగ్గరయ్యాయి. ఇదే కేంద్ర, రాష్ట్ర సంబంధాలకు సరికొత్త నిర్వచనానికి దారితీసే పరిస్థితులు ఏర్పడ్డాయి. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వాన్ని ఇరుకున బెట్టడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ, తన మౌలిక విధానానికి భిన్నంగా వ్యవహరిస్తూ వచ్చింది.

కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఏకఛత్రాధిపత్యానికి వ్యతిరేకంగా... తెలుగు ఆత్మగౌరవ నినాదంతో 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించిన నందమూరి తారక రామారావు 1983లో కాంగ్రెస్‌ పార్టీ కోటలు బద్దలు కొట్టారు. కానీ 1984లో బైపాస్‌ సర్జరీ కోసం అమెరికా వెళ్లిన ఎన్‌టిఆర్‌, తిరిగి భాగ్యనగరానికి చేరుకునేలోపే కొందరు కాంగ్రెస్‌ నేతలు మంత్రాంగం నెరిపారు. దీనికి నాటి ఎన్‌టిఆర్‌ కేబినెట్‌లో ఆర్థికమంత్రిగా ఉన్న నాదెండ్ల భాస్కర రావు సహకరించారు. పూర్వాశ్రమంలో ఆయన కాంగ్రెస్‌ నేతే మరి. ఆగస్టు 15వ తేదీన పరేడ్‌ గ్రౌండ్స్‌లో త్రివర్ణ పతాకావిష్కరణ సజావుగానే సాగిపోయింది. కానీ ఈలోగా గవర్నర్‌ రామ్‌లాల్‌ నుంచి పిలుపు రావడంతో ముఖ్యమంత్రిగా వెళ్లిన ఎన్టీఆర్‌, అధికార వాహనం వదిలి రావడం అందరి మనస్సులు కలచివేసింది.

మెజారిటీ సభ్యుల మద్దతు ఎన్‌టిఆర్‌కు లేదని, నాదేండ్ల భాస్కర రావుకు మద్దతు పలుకుతున్నారని కేంద్రానికి నివేదించిన గవర్నర్‌ రామ్‌లాల్‌, నాదేండ్లను ముఖ్యమంత్రిని చేశారు. ఈలోగా రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం మొదలైంది. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, జనతా పార్టీ, బీజేపీ, కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ఎన్‌టిఆర్‌ ఆధ్వర్యంలో సాగిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమానికి మద్దతునిచ్చాయి. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు తరగతులు బహిష్కరించి రోడ్లమీదకు వచ్చారు. శాసనసభావేదికగా బల నిరూపణకు అవకాశం కల్పించినా విఫలమైన నాదేండ్ల భాస్కర రావు రాజీనామా చేశారు.

ఆ వెంటనే కేంద్రం రామ్‌లాల్‌ను గవర్నర్‌గా వెనక్కు పిలిపించి శంకర్‌ దయాళ్‌శర్మను నియమించింది. తిరిగి ఎన్‌టిఆర్‌ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రతిపక్షాల మద్దతుతో గవర్నర్ల వ్యవస్థకే వ్యతిరేకంగా పోరుబాట పట్టారు. పలుమార్లు ఎన్‌టిఆర్‌ గవర్నర్‌ కేంద్రం ఏజంట్‌ అని వ్యాఖ్యలు కూడా చేశారు. గవర్నర్ల వ్యవస్థకు వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు కూడా జరిగాయి. కేంద్రం కూడా తన తప్పిదం తెలుసుకున్నది. కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సంధానకర్త అవసరమే లేదని చెప్పారు అన్నగారు.

1989లో వీపీ సింగ్‌ ప్రభుత్వ హయాంలో తమిళనాడు గవర్నర్‌గా నియమితులైన ఎస్‌ఎస్‌ బర్నాలా, 1991లో నాటి కరుణానిధి ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయమని కేంద్రానికి నివేదిక సమర్పించకున్నా ముందుగా డిఎంకె సర్కార్‌ను సాగనంపి, బర్నాలాకు ఉద్వాసన పలికిన నేపథ్యం కాంగ్రెస్‌ పార్టీది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రజాప్రభుత్వాలకు ఐదేళ్లపాటు ప్రజలు అధికారం కట్టబెట్టినా, శాంతిభద్రతల సాకుతో మధ్యలోనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఉసురు తీసిన ఘనత కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీది. దీనికి వ్యతిరేకంగా పలు దఫాలు కమ్యూనిస్టులు ముందు పీఠిన నిలిచి పోరాటాలు సాగించినా, ఎన్‌టిఆర్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొలువు దీరిన తర్వాత ఎక్కువ ప్రచారం లభించింది.

కానీ ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం గవర్నర్‌కు అధికారాలు అప్పగించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ శాంతిభద్రతల అంశం గవర్నర్‌కు అప్పగించాలని చంద్రబాబు నాయుడు డిమాండ్‌ చేస్తూ వచ్చారు. విభజన అంతా అవకతవకలుగా జరిగిందీ, కనుకే గవర్నర్‌కు అధికారాలు దఖలు పర్చాలన్నది చంద్రబాబు, ఆయన నేతృత్వంలోని తెలుగు తమ్ముళ్ల ప్రధాన డిమాండ్‌ కూడా. తొలుత జూలైలో ప్రభుత్వ కార్యకలాపాల బిజినెస్‌ రూల్స్‌ మార్చుకోవాలని హైదరాబాద్‌ నగరంలో పోలీసు, కార్య నిర్వాహక అధికారాలు గవర్నర్‌కు దఖలు పరచాలని, లేకపోతే అభ్యంతరాలు ఉంటే తమకు తెలియజేయాలని కేంద్ర హోంశాఖ, తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. అప్పట్లో తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూడా ఘాటుగానే స్పందించారు.

మళ్లీ నెల రోజుల తర్వాత తప్పనిసరిగా తమ ఆదేశాలు పాటించాల్సిందేనంటూ మరో మెలిక పెట్టింది కేంద్ర హోంశాఖ. హైదరాబాద్‌ నగర పాలక సంస్థ, సైబరాబాద్‌, రంగారెడ్డి జిల్లా పరిధిని గవర్నర్‌ నియంత్రణలోకి తేవాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈసారి అమలు చేయాల్సిందేనని నిబంధన కూడా పెట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలను ప్రభావితం చేసే ఈ అంశంపై దేశంలోని ముఖ్యమంత్రులందరినీ కూడగట్టాలని నిర్ణయించుకున్నారు కేసీఆర్‌. మరోవైపు పార్లమెంట్‌ వేదికగా ఆందోళనకు అమీతుమీకి సిద్ధమంటూనే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు జరిపిన రాజీ యత్నాలు ఫలించాయేమో తెలియదు గానీ, క్రమంగా మార్పు వచ్చింది.

కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా పార్లమెంట్‌ వేదికగా విభజన చట్టంలో పేర్కొన్నవే అమలు చేస్తున్నామని నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే ఇది కేంద్రం సలహా మాత్రమేనని, తెలంగాణ ప్రభుత్వం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముక్తాయింపునిచ్చారు. తర్వాత వెసులుబాటు చేసుకుని తెరాస ఎంపీలతో రాజ్‌నాథ్ సింగ్ సమావేశమైనప్పుడు తెలంగాణ రాష్ట్ర హక్కులు హరించే పని చేయబోమని ఆందోళన చెందాల్సిన పని లేదని ఊరడించారు. అయితే మున్ముందు తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్లకుండా అడ్డుకట్ట వేయడానికి వేసిన వ్యూహంలో భాగంగానే కేంద్ర హోంశాఖ నోటీసు జారీ చేసింది. ఆ నోటీసుకు అనుగుణంగానే తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లతో కమిటీని నియమిస్తుంది. ఈ కమిటీ మున్ముందు హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల నిర్వహణను పర్యవేక్షిస్తుంది. కేంద్రం జారీ చేసిన నోటీసు ఉపసంహరణ ఉండదు. అలాగాని అమలు ఉండదు. యధాతథ పరిస్థితి కొనసాగుతుందన్న మాట.

అసలు హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారాలు దఖలు పర్చాలన్న డిమాండ్‌ ఎందుకు వచ్చింది? విభజన బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందక ముందు భాగ్య నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని పదేపదే సీమాంధ్ర నేతలు ఎందుకు డిమాండ్‌ చేశారు? తాజాగా గవర్నర్‌కు అధికారాలు దఖలు పరిచే విషయంలో కాంగ్రెస్‌ పార్టీ తరహాలోనే జాతీయ పార్టీ అయిన భిన్నమైన సిద్ధాంతాలు కలవని చెప్పుకునే బీజేపీ వ్యవహరించడానికి కారణాలేమిటి? విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉన్నది.

తెలంగాణలో ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు కొలువు దీరగానే హైదరాబాద్‌ నగరంలో అక్రమ కట్టడాలపై కొరడా ఝుళిపించడం సీమాంధ్రులకు ప్రత్యేకించి భూకబ్జాలకు పాల్పడిన వారి వల్లు జల్లుమన్నది. తెర వెనక నుంచి ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడుతో లాబీయింగ్‌ నడిపారు. ఆ వెంటనే కేంద్రానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సారధిగా లేఖ రాయడం, దానికి స్పందనగా కేంద్ర హోంశాఖ తెలంగాణ సర్కార్‌కు హుకుం జారీ చేయడం. ఇదీ అసలు కథ.

నిజాం నవాబ్‌ హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసినప్పుడు లక్షల ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించారు. ఇప్పుడు ఆ లెక్కలు ఎక్కడా దొరకడం లేదు. అంటే అంతా మెక్కేసారన్నమాట. ఇటువంటి వారికందరికీ ఇప్పుడు అండదండలనిచ్చేది చంద్రబాబే. ఒకప్పటి సీనియర్ కాంగ్రెస్ వాదీ ప్రస్తుత బీజేపీ నేత కావూరి సాంబశివరావు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు చేసిన ప్రయత్నం విఫలం కావడంతో కాషాయం కండువా కప్పుకున్నారు. తాజాగా ఆ బాటలోనే మరికొందరు తమ సామాజిక వర్గం నేతలను తరలించేందుకు భారీ ప్రయత్నాలు సాగుతున్నాయి.

ఇటువంటి వారికి హైదరాబాద్‌లో ఉన్న ఆస్తులు రక్షించుకునేందుకు భాగ్యనగరం అధికారాలను గవర్నర్‌ పరిధిలోకి అంటే పరోక్షంగా కేంద్రం పాలన అమలులోకి తేవాలన్న దూరాలోచన సాగించారు. విభజన చట్టానికి అనుగుణంగా వ్యవహరిస్తే అన్ని రాజకీయ పార్టీలు సహకరిస్తాయి. అందుకు భిన్నంగా కేంద్ర హోంశాఖ ప్రతిపాదించిన నిబంధనలు పరిశీలిస్తే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదానికి దారి తీసే పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ ఆ నిబంధనలు అమలు చేయాల్సి వస్తే తెలంగాణ ప్రభుత్వం, ఇతర రాష్ట్రాల సీఎంలతో కలిసి కేంద్రంతో ఘర్షణ పడాల్సి వచ్చేది. ఇది కేంద్రానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది కాదు. ఇరు పక్షాలు సంయమనంతో వ్యవహరించడంతో గాలిలో బుడగలా తప్పిపోయింది. అయితే ముప్పు తొలగిపోలేదు. కేంద్రంలో మోడీ సర్కార్‌ కొలువు దీరిందే తడవుగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో నీట మునిగే ఖమ్మం జల్లాలోని ఏడు మండలాలను తమ మెజారిటీతో కేంద్రం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కలిపేస్తూ విభజన చట్టానికి సవరణలు తీసుకు వచ్చింది.

ఒక రాష్ట్రంలో కొంత భూభాగంపై గవర్నర్‌కు అధికారాలు కల్పించాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి. అయితే దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపితేనే అది సాధ్యం. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏ పార్టీ ఈ వివాదంలో తల దూర్చేందుకు సాహసిస్తుందని చెప్పడం కష్టమే. కాంగ్రెస్‌ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ వంటి పార్టీలు సహకరిస్తే రాజ్యాంగ సవరణ తేలికే. ఈ మొత్తం ఎపిసోడ్‌లో గమ్మత్తేమిటంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలకు సరికొత్త నిర్వచనం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు గవర్నర్‌కు అధికారాలు దఖలు పర్చాలని కోరడం. 1996లో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వ కూటమి కన్వీనర్‌గా చంద్రబాబు నాయుడు కేంద్ర రాష్ట్ర సంబంధాల బలోపేతానికి సర్కారియా కమిషన్ల సిఫార్సుల అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు.

తర్వాత 1999లో వాజపేయి ప్రభుత్వ హయాంలో మెజారిటీ సర్కారియా కమిషన్‌ సిఫార్సులకు కేంద్రం ఆమోద ముద్ర వేయించడంలో కీలక భూమిక పోషించారు చంద్రబాబు నాయుడు. అనూహ్యంగా 2004 నుంచి 2014 వరకూ విపక్షంలో ఉండడం, రాష్ట్ర విభజనతో హైదరాబాద్‌ నగరంలో నివసిస్తున్న సీమాంధ్ర పెద్దల ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా చంద్రబాబు వైఖరిలో మార్పు వస్తున్నది. అందరికీ ఆదర్శప్రాయమైన రాజకీయాలు నడిపి మన్ననలు పొందిన ఎన్‌టిఆర్‌, గవర్నర్ల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడితే, ఆయన రాజకీయ వారసుడిగా చంద్రబాబు నాయుడు కొన్ని పాక్షిక ప్రయోజనాల కోసం గవర్నర్‌కు అధికారం అప్పగించాలని డిమాండ్‌ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో వైచిత్రి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి