5.8.14

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ కనుమరుగు




చితికిన 'చేయి'
జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పొందగల స్థాయిలో లోక్‌సభ సీట్లు గెలుచుకోలేక పోయిన కాంగ్రెస్‌ పార్టీ ఘోర పతనానికి ఆ పార్టీ నేతలే కారణం తప్ప, మోడీని కానీ, బిజెపిని గానీ విమర్శించి ప్రయోజనం లేదన్నది నిష్ఠూర సత్యం. విధానాల అమలులో గానీ, ప్రజలకు సానుకూల సంకేతాలివ్వడంలో గానీ కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నాయకత్వం గత పదేళ్ల కాలంలో విఫలమైందని చెప్పడానికి 16వ లోక్‌సభ ఎన్నికల ఫలితాలే చక్కని ఉదాహరణ.
సరిగ్గా 23 ఏళ్ల క్రితం బంగారాన్ని ప్రపంచ బ్యాంకు వద్ద తాకట్టు పెట్టుకుని రుణాలు తెచ్చుకోవాల్సిన పరిస్థితుల్లో 1991లో దేశ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆర్థిక వేత్త మన్మోహన్‌ సింగ్‌, 2004లో అనూహ్య పరిస్థితుల్లో యుపిఎ ప్రభుత్వ సారధిగా బాధ్యతలు స్వీకరించారు. యావత్‌ ప్రపంచం మెచ్చిన ఆర్థిక వేత్త అన్న సంగతి కాంగ్రెస్‌ పార్టీ నేతలు విస్మరించారు.1996 నుంచి 2004 అధికారానికి దూరంగా ఉన్న 'హస్తం పార్టీ' నేతలు 2004లో ప్రభుత్వ సారధ్యం తొలి రోజుల్లో బాగానే వ్యవహరించినట్లు కనిపించారు. కానీ కాల క్రమేణా ప్రజలకు దూరమవుతూ వచ్చారు. దీనికి తోడు సోనియా గాంధీపై 1999 - 2004 మధ్య లేవనెత్తిన విదేశీయత కూడా ఆమె సారధ్యానికి సానుకూలంగా మారింది. పార్టీ శ్రేణులు కూడా వివిధ రాష్ట్రాల్లో అధికారాన్ని చేపట్టేందుకు ఐకమత్యంగా పని చేశాయి కూడా.

2004లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ నేతల వ్యవహార శైలి క్రమంగా మారింది. ఒకవైపు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటూ, మరోవైపు ప్రభుత్వ పథకాల ఫలాలు ప్రజల దరికి చేర్చాల్సిన బాధ్యత అధికార పార్టీది. కానీ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఎప్పటికప్పుడు అవసరాలకు అనుగుణంగా వ్యూహాలు మార్చుకుంటూ వచ్చారు. క్రమంగా ప్రజలకు, నేతలకూ దూరం అయ్యారు. అధికార లాలసత్వం వంట బట్టిన తర్వాత ఒకింత అహంకార పూరిత వ్యవహార శైలి ప్రదర్శించారు.

రంగంలోకి మోడీని దించిన పరివార్
మరోవైపు 1998 - 2004 మధ్య అధికారంలో ఉన్న బిజెపి, దాని మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా అంతర్మధనంలో పడ్డాయి. ప్రజలకు దగ్గర కావడంలో ఎక్కడ విఫలం అయ్యామన్న విషయం నిర్థారించుకున్న సంఘ్‌ పరివార్‌ నేతలు పార్టీని అధికారంలోకి తీసుకు రాగల సామర్థ్యం గల నేత కోసం దేశమంతా జల్లెడ పట్టాయి. ఈ క్రమంలోనే 2002లో గోధ్రా సబర్బతి ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగీ తర్వాత జరిగిన మారణ కాండపై వచ్చిన విమర్శలను ఎదుర్కొంటూనే పార్టీని గుజరాత్‌ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి తీసుకు వచ్చిన ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ కనిపించారు. 2009 వరకూ మోడీ పేరు బయటకు రాకున్నా, ఆ తర్వాత బిజెపి పగ్గాలు క్రమంగా కొత్త తరం నేతలకు అప్పగించాలని సంఘ్‌ పరివార్‌ నిర్ణయించింది.
బిజెపిలో సంస్థాగతంగా సీనియర్లు చురుకైన పాత్ర పోషిస్తున్నా, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వం, క్రమంగా మోడీని జాతీయ నేతగా ముందుకు తేవడానికి కసరత్తు మొదలెట్టింది. అందులో భాగంగా పార్టీ ఎన్నికల కమిటీ సభ్యత్వం, ఆ తర్వాత ఎన్నికల ప్రచార సారధిగా ప్రకటించారు. కురు వృద్ధుడు లాల్‌కృష్ణ అద్వానీ, సీనియర్‌ నేతలు సుష్మా స్వరాజ్‌, మురళీ మనోహర్‌ జోషి, యశ్వంత్‌ సిన్హా వంటి సీనియర్ల అసంతృప్తిని పక్కన బెడుతూనే మోడీకి అన్ని రకాల వెసులుబాటు కల్పించారు. సరిగ్గా గతేడాది నుంచే ఎన్నికల కురుక్షేత్రానికి నరేంద్ర మోడీ సమర శంఖారావం పూరించి, సామెతలు, నర్మగర్భ వ్యాఖ్యలతో ప్రజలను సమ్మోహితులను చేయగలిగారు.

ముస్లిం మైనారిటీలపైనే కాంగ్రెస్ ఆశలు
ఈ విషయం గమనించని కాంగ్రెస్‌ పార్టీ వ్యూహకర్తలు, మోడీ పట్ల ముస్లిం మైనారిటీలు, క్రైస్తవుల వ్యతిరేకత తమకు లాభిస్తుందని అంచనాలు వేసుకున్నారు. బయటకు గంభీర ప్రకటనలు చేసినా అంతర్గతంగా మోడీ తమపై దండెత్తుతారని కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వానికి స్పష్టంగానే తెలుసు. ఈ విషయాలన్నీ తెలిసినా అనవసర తప్పిదాలకు పాల్పడింది కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం.
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన విషయంలో గానీ, నేర చరితులకు రక్షించేందుకు జారీ చేసిన ఆర్డినెన్స్‌ విషయంలో గానీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ స్పందించిన తీరు ప్రజల్లో ఏహ్యా భావాన్ని పెంపొందించాయని చెప్పవచ్చు. ప్రధానిగా మన్మోహన్‌ సింగ్‌ విదేశీ పర్యటనలో ఉండగా, అకస్మాత్‌గా మీడియా ముందుకు వచ్చి నేర చరితులకు పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని ప్రతిపాదించిన ఆర్డినెన్స్‌ను చించి పారేయాలని సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రతికూల సంకేతాలు పంపింది. ప్రభుత్వ సారధిగా మన్మోహన్‌ సింగ్‌ పాత్ర పరిమితం అన్నే తప్పుడు సంకేతాలు రాహుల్‌ గాంధీ యావత్‌ భారతావనికి పంపారు.
తొలిసారి ప్రధానిగా మన్మోహన్‌ సింగ్‌ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కాంగ్రెస్‌ చోటా మోటా నాయకులు మొదలు ఎఐసిసి పరిశీలకులు, కేంద్ర మంత్రులు సైతం రాహుల్‌ భజన మొదలు పెట్టారు. ఇక 2009లో రెండోసారి యుపిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార కాంగ్రెస్‌ పార్టీ నేతల్లో 'రాహుల్‌ భజన' మరింత పెరిగింది.
పలు దఫాలు తన కేబినెట్‌లోకి తీసుకుంటానని మన్మోహన్‌ సింగ్‌ ప్రతిపాదించినా, తిరస్కరించడం రాహుల్‌ గాంధీ చేసిన వ్యూహాత్మక పొరపాట్లలో మొదటిదని ఘంటాపథంగా చెప్పడానికి అభ్యంతరాలు లేవు. రాహుల్‌ గాంధీ, మన్మోహన్‌ సింగ్‌ కేబినెట్‌లో సభ్యుడిగా ఉంటే ప్రభుత్వ బాధ్యతల నిర్వహణలో సాధక బాధకాలు తెలిసి ఉందేవి. ఆయన నానమ్మ దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి కోటరీ సలహాలు ఇచ్చినా తొలి నుంచి రాజకీయాల్లో క్రియాశీలంగా ఉండడం వల్ల సొంత అభిప్రాయానికే విలువనిచ్చింది.
సోనియా కూడా తొలుత ఏకపక్షంగా వ్యవహరించినా 1999 నుంచి ధోరణి మారింది. 2004 ఎన్నికల్లో పార్టీ విజయం తర్వాత ఫోర్బ్స్‌ జాబితాలో సోనియా చోటు దక్కించుకున్నారంటే ఎంత పరిణతి సాధించారో తెలుసుకోవచ్చు. ఇటు సోనియా, అటు రాహుల్‌ గాంధీలకు నేతల కోటరీలు మొదలయ్యాయి. రాహుల్‌ యూత్‌ బ్రిగేడ్‌ దేశవ్యాప్తంగా పుక్కిటి పురాణాల వంటి సర్వేలతో ఊదర గొట్టాయి. కొన్ని సంస్థాగత కార్యక్రమాలు చేపట్టినా, సీనియర్ల వ్యూహాల ముందు రాహుల్‌ ఎత్తులు ఫలించలేదు.
ప్రస్తుత తరం నేతల అభిప్రాయాలకు విలువనిస్తూనే, భవిష్యత్‌ తరం నేతలను తయారు చేసుకోవడం అధినాయకత్వం ప్రధాన లక్షణం. కానీ రాహుల్‌ గాంధీలో అది లోపించిందన్న విషయం స్పష్టంగా కాన వస్తోంది. 16వ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయం పాలవ్వడానికి మరో కారణం. అది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన ప్రక్రియ. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రిగా సోనియా గాంధీ, నాటి కరీంనగర్‌ ఎన్నికల ప్రచార సభలో స్థానికుల ఆకాంక్షలేమిటో తనకు తెలుసు, తమ కూటమిని గెలిపిస్తే వాటిని నెరవేరుస్తామని హామీనిచ్చి ప్రజల మనస్సులు చూరగొంది.

ఒకవైపు హామీ... మరోవైపు పార్టీకి నష్టమని తెలిసినా...
కానీ 2004లో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడంలో వైఎస్‌ రాజశేఖర రెడ్డి కీలక భూమిక పోషించారు. అంతకు ముందు చంద్రబాబు నాయుడు విధానాలపై నేతలంతా మూకుమ్మడిగా పోరాటం జరిపినా వైఎస్‌ రాజశేఖర రెడ్డి పాదయాత్ర గణనీయ ప్రభావం చూపింది. దీంతో పార్టీ విజయం సాధించిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్‌ రాజశేఖర రెడ్డి 2004 ఎన్నికల్లో ఇచ్చిన హామీ, 2009 డిసెంబర్‌ తొమ్మిదో తేదీన కేంద్ర హోంమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు చేసిన ప్రకటన, కాంగ్రెస్‌ పార్టీ అధి నాయకత్వాన్ని నిత్యం వెంటాడాయి.
2013 - 14 సంవత్సర బడ్జెట్‌ సమావేశాలు ముగిసిన తర్వాత నాలుగేళ్లుగా అటకెక్కించిన తెలంగాణ అంశాన్ని దుమ్ము దులిపి 2013 జూలై 30వ తేదీన బయటకు తీసింది కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం. ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్‌ పార్టీ, ఆ పార్టీ నేతృత్వం వహిస్తున్న అధికార యుపిఎ కూటమి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు అనుకూలమని తీసుకున్న నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తమకు ప్రతికూల పరిస్థితులు తెచ్చి పెడుతుందని తెలుసు గానీ, మూలాలే లేకుండా పెరికి వేస్తుందని కాంగ్రెస్‌ పార్టీ వ్యూహకర్తలు ఊహించనే లేదు.
తొలి నుంచి రాష్ట్ర విభజనకు వ్యతిరేకిస్తూ వచ్చిన సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు చివరి క్షణం వరకూ అదే జోరు కొనసాగించారు. బెదిరింపులకు దిగారు. బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు నడిపారు. జాతీయ స్థాయి పార్టీలు సూత్రప్రాయంగా తీసుకున్న నిర్ణయం నుంచి వెనక్కు తగ్గితే జాతీయంగానే కాదు అంతర్జాతీయంగానూ ప్రతిష్ట దెబ్బ తింటుంది. ఆ విషయం తెలిసి కూడా సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలంతా వ్యతిరేక ధోరణి ప్రదర్శించారు. ఇది కాంగ్రెస్‌ పార్టీ అధి నాయకత్వానికి ఆగ్రహం తెప్పించడానికి కారణమైంది. ఇక వారి మాటలు, బెదిరింపులు పట్టించుకోకుండా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్‌ పార్టీ, యుపిఎ ప్రభుత్వం.

కిరణ్ కుమార్ రెడ్డి ‘శల్య’ పాత్ర
పార్టీ అధినాయకత్వం నిర్ణయాన్ని ప్రశ్నించలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నాటి కిరణ్‌ కుమార్‌ రెడ్డిది. అయినా అధి నాయకురాలిని ఎదిరించారని సమాచారం. దీంతో సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారని, ఆ తర్వాత కిరణ్‌ కుమార్‌ రెడ్డితో నేరుగా మాట్లాడేందుకు ఆమె ముందుకు రాలేదు. తొలుత తన వైఖరి బయట పెట్టకుండా 10 రోజుల పాటు బేగంపేట క్యాంపు కార్యాలయానికి పరిమితమైన కిరణ్‌ కుమార్‌ రెడ్డి, విభజనకు వ్యతిరేకంగా తన స్వరం వినిపించారు. నాటి నుంచి పార్లమెంట్‌ ఉభయ సభలు 'ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్వవస్థీకరణ బిల్లు'కు ఆమోదం తెలిపే వరకూ ప్రజల్లోకి బలంగా తన వాణి తీసుకెళ్లారు కిరణ్‌ కుమార్‌ రెడ్డి. బిల్లు శాసనసభ ఆమోదం పొందిన తర్వాత కూడా చట్టం కాదని ప్రజల్లో ఆశలు కల్పించిన నేపథ్యం కిరణ్‌ కుమార్‌ రెడ్డిది.
పార్టీ నాయకత్వం పట్ల విధేయత కనబరుస్తూనే, చాపకింద నీరులా తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు కిరణ్‌ కుమార్‌ రెడ్డి. మరోవైపు ప్రజల్లోనూ ఇమేజ్‌ సృష్టించుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రిగా వ్యతిరేకించడంతో సహజంగానే ప్రజలు ఆయనకు మద్దతు పలికారు కూడా. కానీ పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందడం, తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్రతో చట్టంగా రూపుదిద్దుకోవడం, సుప్రీంకోర్టు పూర్తిగా అధ్యయనం చేయడానికి మాత్రమే ప్రాధాన్యతనిచ్చింది.
ఎన్నికల ఫలితాల తర్వాతే విభజనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లు విచారిస్తామని తేల్చడంతో విభజనను అడ్డుకోవడం కష్టమని సాధారణ ప్రజలకూ అరటి పండు వలిచి పెట్టినంత తేలిగ్గా అర్థమైంది. కానీ కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం, యుపిఎ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకతను పెంపొందించడంలో కిరణ్‌ కుమార్‌ రెడ్డి సఫలీకృతులయ్యారనడంలో సందేహం లేదు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్‌ పార్టీకి పుట్టగతుల్లేకుండా చేయడమే లక్ష్యంగా కిరణ్‌ కుమార్‌ రెడ్డి వ్యూహాత్మకంగా ప్రజల్లో ద్వేష పూరిత భావాన్ని పెంపొందించారు.

చంద్రబాబుతో జట్టు కట్టిన బిజెపి
నాటి ప్రధాన ప్రతిపక్షమైన బిజెపి నేరుగా, రాష్ట్రంలో ప్రధాన విపక్షం తెలుగుదేశం పార్టీ పరోక్షంగా విభజనకు మద్దతు పలికినా, సొంత పార్టీ నేతలే వ్యతిరేక స్వరం వినిపించడం కాంగ్రెస్‌ పార్టీ పుట్టి ముంచింది. పార్టీ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూనే, మరోవైపు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ కిరణ్ కుమార్ రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరించినందుకు ఆ పార్టీ నేతలంటే ప్రజల్లో ఆగ్రహావేశాలను రగిల్చింది.

కాంగ్రెస్ హైకమాండ్ ఆశలపై కిరణ్ నీళ్లు
ప్రస్తుత తమిళనాడు గవర్నర్‌ రోశయ్య స్థానంలో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించడానికి అధినాయకత్వం ఆశీస్సులే పని చేసినా, అదే అధినాయకత్వాన్ని ధిక్కరించడమే కాదు మరో అవకాశం లేకుండా వ్యవహరించిన తీరు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని నామరూపాల్లేకుండా తుడిచి పెట్టేసింది. విభజనను వ్యతిరేకించిన కిరణ్‌ కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలుగుతారేమోనని ఎదురు చూసిన కాంగ్రెస్‌ అధినాయకత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసుకుంది.
అదే కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న అతి స్వేచ్ఛ కూడా విభజనపై నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు సీమాంధ్ర నేతలు వ్యతిరేకించడానికి కారణం. సూత్రప్రాయంగా వ్యతిరేకించినా, రాష్ట్రంలో పార్టీని కాపాడుకోవాలన్న తపన, విపక్షాల ఆరోపణలు ఎదుర్కోవడానికి బదులు వారికంటే మిన్నగా విభజన వ్యతిరేక స్వరం వినిపించడం తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలకు, బిజెపికి అంది వచ్చిన వర ప్రదాయిని అయింది.

కిరణ్ కుమార్ రెడ్డితో తీరని లోటు : కాంగ్రెస్ నేతలు
విభజన ప్రక్రియ సూత్రప్రాయంగా పూర్తయిన తర్వాత మీడియా ముందుకు వచ్చిన ఆనం రామ నారాయణ రెడ్డి, నీలకంఠం రఘువీరారెడ్డి వంటి వారు చేసిన వ్యాఖ్యలతో కిరణ్‌ కుమార్‌ రెడ్డి వల్ల పార్టీకి కోలుకోలేని నష్టం జరిగిందని స్పష్టమైంది. నాడు కేంద్రంలో మంత్రులుగా ఉన్న వారు గానీ, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కిరణ్‌ కుమార్‌ రెడ్డి, ఇతర మంత్రులు చివరి క్షణం వరకూ కొత్తగా ఏర్పాటయ్యే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఫలానా వసతులు కావాలన్న ప్రతిపాదనలు చేయనే లేదు. ఒకవైపు అసమ్మతి స్వరం వినిపిస్తూనే కాంగ్రెస్‌ పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు తమ రాజకీయ భవితవ్యంపై దృష్టి సారించారు.
అటువంటి వారిలో ముందు పీఠిన నిలుచున్న వారు ఏరాసు ప్రతాప రెడ్డి, టి జి వెంకటేష్‌, గంటా శ్రీనివాసరావు, కొలుసు పార్థ సారధి వంటి వారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన తర్వాత కొలుసు పార్థ సారధితోపాటు శత్రుచర్ల విజయ రామరాజు, సీనియర్‌ నేతలు జె సి దివాకర్‌ రెడ్డి, తొలి నుంచి కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగిన గల్లా అరుణ కుమారి, ఆమె తనయుడు - అమర్‌ రాజా బ్యాటరీస్‌ చైర్మన్‌ గల్లా జయదేవ్‌, రాయపాటి సాంబశివరావు తదితరులు 'సైకిల్‌' ఎక్కేశారు.

కావూరి మొదలు సీనియర్లంతా వలస బాట
మరో సీనియర్‌ నేత కావూరి సాంబశివరావు కార్యకర్తల మనోగతం పేరుతో పచ్చ జెండా కప్పుకునేందుకు సిద్ధమైనా మాగంటి వెంకటేశ్వర రావు (బాబు) వర్గీయులు గండి కొట్టారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికల ప్రచారంలో బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. అంతకు ముందే నందమూరి ఆడబడుచుగా దగ్గుబాటి పురందేశ్వరి కేంద్ర మంత్రిగా కార్యకలాపాల్లో పాల్గొంటూనే బిజెపిలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. విభజన ప్రక్రియ పూర్తి కాగానే బిజెపిలో చేరిన దగ్గుబాటి పురందేశ్వరి, రామాయం పేట వద్ద పోర్టు నిర్మించాలని జైరామ్‌ రమేష్‌ వంటి వారు విమర్శలు గుప్పించారు. దీనికి ప్రతిగా సమాధానం చెప్పిన పురందేశ్వరి పార్టీ మారడానికి కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం అనాలోచిత ధోరణే కారణం.
ఎన్నికల షెడ్యూల్‌ వెల్లడైన తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి సోదరుడు - పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ 'జనసేన' పేరుతో పార్టీ స్థాపించారు. కేంద్రంలో బిజెపికి, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించడమే కాదు అనుకూలంగా ప్రచారం సాగించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగానూ, కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగానూ, పవన్‌ కల్యాణ్‌ చేసిన ప్రచారం కూడా తెలుగుదేశం పార్టీ పుంజుకోవడానికి కారణమైంది.

వైఎస్‌ జగన్‌తోనే కాంగ్రెస్‌ శ్రేణులు మమేకం
రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ కుదేలవ్వడానికి మరో కారణం 2009లో వైఎస్‌ హఠాన్మరణం తర్వాత ఆయన తనయుడు - ప్రస్తుత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన రెడ్డి పట్ల అధినాయకత్వం ధోరణి మరొకటి. వైఎస్‌ పట్ల వ్యతిరేకతను రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ నేతలు సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించి చివరకు పార్టీ అడ్రస్సు గల్లంతవ్వడానికి కారకులు అయ్యారని చెప్పక తప్పదు.
ఒకవైపు పార్టీ నాయకత్వం పట్ల విధేయత ప్రకటించినా, ప్రజల మనస్సుల్లో చోటు దక్కించుకున్న వైఎస్‌, రెండుసార్లు పార్టీని రాష్ట్రంలోకి అధికారంలోకి తేవడానికి ఆయన వ్యూహ చతురతను భవిష్యత్‌ పార్టీ బలోపేతానికి వినియోగించుకోవాలన్న చతురత ప్రస్తుత కాంగ్రెస్‌ పార్టీ నేతలకు వంటబట్టలేదు. కొందరు నేతలు వైఎస్‌ మరణం తర్వాత ఇక అంతా తామేనన్నట్లు వ్యవహరించారే తప్ప, వారిలో పార్టీని ఎన్నికల సమరంలో ముందుకు నడిపించే సామర్థ్యం ఉన్న వారే లేరు. అందుకే ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ కర్ణాటక సీనియర్‌ నేత వీరప్ప మొయిలీ తామే జగన్‌ను బయటకు తరిమేశామని, తమది స్వయంకృతమని చెప్పడం గమనార్హం.
వయస్సు వేడిలో ఉన్న వైఎస్‌ జగన్మోహన రెడ్డి, వైఎస్‌ఆర్‌ మరణం తర్వాత ఒకింత దూకుడుగానే వ్యవహరించారని చెప్పక తప్పదు. అధికారం చేతిలో ఉన్నప్పుడు సహజంగానే చుట్టూ భజన బృందం చేరతారు. మూడు దశాబ్ధాల పాటు రాజకీయాల్లో తలపండిన నేతగా వైఎస్‌ రాజశేఖర రెడ్డికి, ఎఐసిసి నేతలతో, అధినేతలతో ఎలా వ్యవహరించాలన్న సంగతి స్పష్టంగానే తెలుసు.
అంతర్గత సమావేశాల్లో వైఎస్‌, అధి నాయకత్వానికి ఏం చెబుతున్నారనే విషయం బయటకు లీకయ్యేదే కాదు. కానీ మీడియా ముందు మాత్రం పార్టీ అధి నాయకురాలి పట్ల విధేయత ప్రదర్శించారు వైఎస్‌. దీనికి తోడు పాదయాత్రలో స్వయంగా చూసిన చేదు జ్ఞాపకాలను తన మదిలో ఉంచుకుంటూనే మరోవైపు వాటిని పునరావృతం కాకుండా చేయడానికి కృత నిశ్చయంతో ముందుకు సాగారు. ఆ క్రమంలోనే ప్రజలకు మరింత దగ్గరయ్యే విధంగా ప్రజాకర్షక పథకాలు అమలు చేయడంలో వైఎస్‌ తర్వాతే ఎవరైనా కూడా.
ఈ ధోరణే ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతాల్లో ఆయనకు ఎనలేని పేరు, కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టింది. ఆయన మరణ వార్త వినగానే బలవన్మరణాలకు పాల్పడిన వారు వందల్లోనే ఉన్నారు యావత్‌ ఆంద్రావనిలో. వైఎస్‌ రాజశేఖర రెడ్డి పట్ల విశ్వసనీయతను సొమ్ము చేసుకోవడానికి ఓదార్పు యాత్ర చేపట్టిన జగన్మోహన రెడ్డి తర్వాత పార్టీని వీడడం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ స్థాపించడం చకచకా జరిగి పోయాయి.

1978 తర్వాత 1999లో శాసనసభకు వైఎస్ఆర్ ఎన్నిక
1978లో ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాదు మంత్రిగా పని చేసిన వైఎస్‌ రాజశేఖర రెడ్డి తిరిగి 1999లో గానీ శాసనసభలో అడుగు పెట్టలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 1999 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఎవరికి వారు సిఎం బరిలో ఉన్న వారే. అందుకే వారు ఒకరినొకరు ఓడించుకోవడానికే ప్రయత్నించారు తప్ప, పార్టీని అధికారంలోకి తేవాలన్న ధ్యాస వారికి లేదు. ఉచిత విద్యుత్‌ నినాదంతో వైఎస్‌ రాజశేఖర రెడ్డి వంటి వారు ముందుకెళ్లాలని భావించినా, ప్రత్యర్థులు అడ్డుకున్నారు.
నాటి ఎన్నికల తర్వాత శాసనసభలో విపక్ష నేతగా ఎన్నికవ్వడంతో రాజశేఖర రెడ్డి ఖాళీ చేసిన పిసిసి అధ్యక్ష పదవిని కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఎమ్మెస్సార్‌కు అప్పగించారు. ఎమ్మెస్సార్‌ కూడా చివరి వరకూ వైఎస్‌కు అండగానే ఉన్నారు. వైఎస్సే ముఖ్యమంత్రి అభ్యర్థి అని బహిరంగంగా ప్రకటించి కొందరు నేతలకు కంటగింపుగా కూడా మారారంటే అతిశేయోక్తి కాదు.
నాటి నుంచి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ, మరోవైపు అసెంబ్లీ బయట జరిగే ఉద్యమాలతో మమేకమై ప్రజలకు దగ్గరయ్యారు వైఎస్‌. ఇక 2003లో ఆయన నిర్వహించిన పాదయాత్రలో ప్రజల బాధలు కళ్లకు కట్టినట్లు కనిపించాయి. ఎక్కడికక్కడ ఆయా ప్రదేశాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న నిర్థిష్ట సమస్యలు అకళింపు చేసుకున్న వైఎస్‌, 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి పరిష్కారానికి శ్రద్ధాసక్తులతోనే పని చేశారు.

జలయజ్ఞం, తదితర పథకాలతో జననేతగా మారిన వైఎస్
ఆరోగ్య శ్రీ, జలయజ్ఞం, అభయ హస్తం తదితర పథకాలతో జనానికి చాలా సన్నిహితంగా మారారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అంటే వైఎస్‌, వైఎస్‌ అంటే కాంగ్రెస్‌ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. ఉన్నత విద్యను అభ్యసించాలని ఆకాంక్షించే పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేయడం సాహసోపేతం. అప్పట్లోనూ, ఇప్పట్లోనూ ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసమే కొన్ని వృత్తివిద్యా కళాశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయనే విమర్శ కూడా ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
2004 ఎన్నికల్లో ఇతర కాంగ్రెస్‌ పార్టీ నేతలందరికీ నాయకత్వం వహిస్తూ, వారిలో ఒకడిగా  తెరాస - వామపక్షాల మద్దతుతో అధికారానికి చేరువైతే, 2009 ఎన్నికల్లో ఒకవైపు తెదేపా - వామపక్షాలు - తెరాస నేతృత్వంలోని మహా కూటమి, మరోవైపు మెగాస్టార్‌ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని ఎదుర్కొని పార్టీ విజయానికి బాటలు వేశారు వైఎస్‌.
పార్టీ అధినాయకత్వం కూడా 2009లో రెండోసారి పార్టీ విజయం సాధించిన తర్వాత స్వేచ్ఛనిచ్చింది. 2004, 2009 ఎన్నికల్లో అత్యధిక లోక్‌సభ స్థానాలు గెలిపించడం వైఎస్‌ రాజశేఖర రెడ్డికి, తర్వాత ఆయన తనయుడు వైఎస్‌ జగన్మోహన రెడ్డికి ఫ్లస్‌ పాయింట్‌గా మారింది. హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన తర్వాత వైఎస్‌ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల ఫలాలు అనుభవించిన పేదలు అల్లాడిపోయారు.

వైఎస్ హఠాన్మరణంతో కకావికలం
అప్పటికే పార్టీలో తమకంటూ ప్రత్యేక వర్గాన్ని కొనసాగిస్తూ వచ్చిన వైఎస్‌ అనుచర ఎమ్మెల్యేలు జగన్‌కు అనుకూలంగా మారారు. వైఎస్‌ జగన్‌కు మద్దతు పలికినా అధిష్టానం కరిగిపోలేదు. అయినా ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణ చూసేందుకు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు, ఎఐసిసి నాయకత్వం గుర్తించి, సరిదిద్దేందుకు ప్రయత్నించిన దాఖలాల్లేవు. ఒకవేళ ప్రయత్నించిన వారినే ప్రశ్నించిన పరిస్థితులు ఉన్నాయి.

అంజయ్యకు అండగా నిలిచినా...
తొలి సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్టులు గట్టిపోటీనిచ్చినా విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీ 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించే వరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లో ఏకఛత్రాధిపత్యం వహించింది. 1978లో పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చిన మర్రి చెన్నారెడ్డిని సొంత పార్టీలోని వ్యతిరేకులే ఇంటికి పంపారు. ఆయన స్థానంలో కార్మిక నేత టంగుటూరి అంజయ్యను సిఎంగా ఇందిరా గాంధీ ఎంపిక చేశారు.
అప్పటికే ప్రజాదరణ గల నేతగా ఉక్కు మహిళగా ఇందిరా గాంధీ ఒకానొక దశలో ప్రధాని హోదాలోనే నేరుగా హైదరాబాద్‌ నగరానికి చేరుకుని ఆఘమేఘాల మీద సిఎల్పీ సమావేశం నిర్వహించి అంజయ్య వ్యతిరేకులకు ప్రతికూల సంకేతం పంపారు. కానీ బేగంపేట అంతర్జాతీయ విమానాశ్రయంలో రాజీవ్‌ గాంధీ, సిఎంగా అంజయ్యను అవమానించడం అప్పుడు అక్కడే ఉన్న నందమూరి తారక రామారావు వంటి వారిని కలచివేసింది.

తెలుగు ఆత్మగౌరవం పేరుతో కూకటి వేళ్లతో కాంగ్రెస్ పెకలింపు
తెలుగు ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించిన నందమూరి తారక రామారావు 1982 ఫిబ్రవరిలో తెలుగుదేశం పార్టీని స్థాపించి, రాష్ట్ర పర్యటన మొదలు పెట్టారు. ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్న సంగతి చూసి కాంగ్రెస్‌ పార్టీ నేతల్లో గంగవెర్రులెత్తించింది. ముందస్తుగా ఎన్నికలు జరిపి విజయం సాధించాలని ఇందిరా గాంధీ చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి.
అప్పటికే ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చి కర్నూల్‌ పెద్దాయనగా పేరొందిన కోట్ల విజయ భాస్కర రెడ్డి మొదటిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. నిత్యం అసమ్మతి, ముఖ్యమంత్రుల మార్పిడి, అశ్రిత పక్షపాతం, అవినీతి లీలల పట్ల ప్రజల్లో వ్యతిరేకత, జన కథా నాయకుడిగా ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి దగ్గర చేసింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన మూడు దశాబ్దాల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని కూకటివేళ్లతో పెకలించి వేశారు ఎన్టీఆర్‌. 1983 - 89 మధ్య ఎన్టీఆర్‌ పాలన సాగింది.

1989 - 94 మధ్య కాంగ్రెస్ అహంకార పూరిత ధోరణి
1989 - 94 మధ్య కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నా మళ్లీ అదే ధోరణి. మధ్య నిషేధం నినాదంతో మూడోసారి ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా 1994లో బాధ్యతలు స్వీకరించారు. 1995లో ఎన్టీఆర్‌ స్థానంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిస్థితి మారిపోయింది. కార్గిల్‌ పోరు - బిజెపి పొత్తుతో 1999లో చంద్రబాబు నాయుడు రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

జగన్‌పై విచారణ పట్ల అనుమానాలు
మళ్లీ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి దశాబ్ధ కాలం పట్టింది. చంద్రబాబు నాయుడు వంటి రాజకీయ చాతుర్యం గల నేతను ఎదుర్కోవడం కాంగ్రెస్‌ పార్టీకి అంత తేలికేం కాదు. అయినా 2009 ఎన్నికల్లో విజయం సాధించడంతో వైఎస్‌ పట్ల, కాంగ్రెస్‌ పార్టీ పట్ల ప్రజలు ఉన్న నమ్మకం ఏమిటో తేలిపోయింది. కానీ వైఎస్‌ రాజశేఖర రెడ్డి హఠాన్మరణం తర్వాత మారిన ఆయన తనయుడి పట్ల 10, జనపథ్‌ అనుసరించిన తీరు ప్రజల్లో అనుమానాలు, సందేహాలు రేకెత్తించింది.
దీనికి తోడు వైఎస్‌ సిఎంగా ఉన్న సమయంలో జరిగిన లావాదేవీల్లో అవకతవకలపై రోశయ్య సిఎంగా ఉన్నప్పుడే జగన్‌కు వ్యతిరేకతంగా సిబిఐ కేసు దర్యాప్తు చేపట్టింది. జగన్‌ను కట్టడి చేయడానికే కేసులు నమోదు చేశారన్న అనుమానం ప్రజల్లోకి వెళ్లింది. వైఎస్‌ రాజశేఖర రెడ్డి మరణంతో పార్టీకి నాయకత్వం వహించగల శక్తి, సామర్థ్యాలు ఉన్న నేత కాంగ్రెస్‌ పార్టీలో నాడూ నేడూ లేరంటే అతిశేయోక్తి కాదు.
ప్రస్తుతం నేతలంతా అధినాయకత్వం నిర్ణయానికి అనుగుణంగా నడుచుకోవడమే తప్ప, వ్యక్తిగత ఛరిస్మా ఉన్న నేతలే కరువు. అటు ఆంధ్రప్రదేశ్‌, ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ కాగడా పెట్టి వెతికినా శక్తి సామర్థ్యాలున్న నేతలు దొరకరంటే సందేహమేమీ లేదు. ఇక విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్‌ పార్టీ, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను మెప్పించడంలో పూర్తిగా విఫలమైంది.

మౌలిక వసతుల కల్పన వైఫల్యమే...
2009 డిసెంబర్‌లో ప్రకటన చేసినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కేంద్రీయ ఉన్నత విద్యా సంస్థలు ఏర్పాటు చేయడానికి ప్రాధాన్యత చూపలేదు. ఈ మౌలిక వసతుల కల్పనకు మొగ్గు చూపి ఉంటే పరిస్థితి మరోవిధంగా ఉండేది. అటు అధిష్టానం, ఇటు ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ నేతలు తమ వైఖరులకే కట్టుబడి ఉండడం పరిస్థితిలో మార్పు లేక పోవడానికి కారణం. అధి నాయకత్వం నిర్ణయాన్ని మీడియా ముందు వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించడం, మరోవైపు అధికారంలో ఉండడానికి ప్రాధాన్యతనిచ్చారు సీమాంధ్ర నేతలు.
విభజన జరిగితే తమ వ్యక్తిగత ప్రయోజనాలేమిటని ఆలోచించారే తప్ప, దశాబ్దాల తరబడి అండగా నిలిచిన పార్టీ భవిష్యత్‌ గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. విభజన ప్రక్రియ జరుగుతుండగానే సీమాంధ్ర నేతలంతా బిజెపి వైపు చూడడం మొదలెట్టారు. అందుకే ప్రస్తుత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ముప్పవరపు వెంకయ్య నాయుడు పదేపదే చెబుతూ వచ్చారు విభజన విషయంలో కాంగ్రెస్‌ పార్టీ ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని. అది నిజం కూడా.
అధినేత సోనియా గాంధీ ఢిల్లీకి పరిమితం. ద్వితీయ శ్రేణి నాయకత్వం కనీసం హైదరాబాద్‌ నగరానికి వచ్చి విభజనకు తీసుకున్న నేపథ్యం ఇది, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవసరాలేంటి, ఏయే వసతులు కల్పించాలని అడిగిన వారే లేరు. బిల్లు రూపకల్పనకు పూనుకున్న మంత్రుల బృందమూ 'హస్తిన'కే పరిమితమైంది. ఇది ఆంధ్రుల్లో వ్యతిరేకతను పెంచి పోషించింది. విభజనకు ముందస్తుగానే నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్‌ పార్టీ అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వసతుల కల్పనకు చర్యలు తీసుకోలేదనే వెంకయ్య నాయుడు వాదన అక్షరాల సత్యం.
విభజనతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పునాదులు బలోపేతం చేసుకోవాలని భావించిన కమలనాథులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఒకవైపు విభజన బిల్లుకు మద్దతునిచ్చి, మరోవైపు సమన్యాయం పేరుతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అవరోధాలు సృష్టించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో పొత్తుకు వెనుకాడలేదు.

‘కమలా’నికి చేరువైన ప్రధాన సామాజిక వర్గం
మరోవైపు వైఎస్‌ జగన్‌తోపాటు రెడ్డి సామాజిక వర్గం, ముస్లిం మైనారిటీలు, క్రైస్తవులు వెళ్లిపోవడం, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అత్యధిక శాతం జనాభా గల కాపులను దగ్గరకు తీసుకోవాలని కాంగ్రెస్‌ హై కమాండ్‌ చేసిన ఆలోచనతో ఆంధ్రప్రదేశ్‌ వాసుల్లో ప్రత్యేకించి ఓ బలమైన సామాజిక వర్గంలో కాంగ్రెస్‌ పార్టీ అంటే ద్వేషం పెరిగి పోయింది. తమ సామాజిక, ఆర్థిక, ఆధిపత్య అవసరాలు నెరవేర్చుకోవాలంటే ప్రత్యామ్నాయాలు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి.
ఇదే బలమైన సామాజిక వర్గం ప్రభావం గల సినీ రంగం, వ్యాపార వాణిజ్యవేత్తల దన్నుతో రాజకీయాల్లోకి వచ్చిన పవర్‌ స్టార్‌ - జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రచారం కూడా కాంగ్రెస్‌ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత మరింత పెంచింది. శాసనసభా ఎన్నికలు మొదలు జడ్పీ, మండల పరిషత్‌, మునిసిపాలిటీలు, నగర పాలక సంస్థల ఎన్నికల్లోనూ కొన్ని స్థానాల్లో కూడా పాగా వేయలేక కాంగ్రెస్‌ పార్టీ విలవిలలాడుతోంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మునిసిపాలిటీలో మాత్రమే కాంగ్రెస్ పాలక వర్గాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఈ ఆత్మకూర్ సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆనం రామ నారాయణ రెడ్డి సొంత నియోజకవర్గం కావడం గమనార్హం.అధికార పార్టీగా గణనీయంగా ప్రభావితం చేసిన కాంగ్రెస్‌ పార్టీ, ఇప్పుడు చుక్కాని లేని నావ మాదిరిగా తమకు నాయకత్వం వహించే నేత ఎవరా? అని ఎదురు చూస్తోంది.

* 1952 తొలి ఎన్నికల్లో కమ్యూనిస్టులతో గట్టి పోటీనెదుర్కొన్నా, టంగుటూరి ప్రకాశం పంతులు, గౌతు లచ్చన్న, ఎన్‌జి రంగా వంటి వారి మద్దతుతో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
* 1969లో తెలంగాణ ఉద్యమం, 1971 - 72లో జై ఆంధ్రా ఉద్యమం ముందుకు వచ్చినా నిలదొక్కుకున్నది కాంగ్రెస్‌ పార్టీ.
* 1983 - 89 మధ్య, 1994 - 2004 మధ్య అధికారానికి దూరమైనా ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ దూరం కాలేదు.
* 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించి ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ఇందిరా కాంగ్రెస్‌ పార్టీకి 1977లో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు నీరాజనాలు పలికారు. నంద్యాల లోక్‌సభ స్థానం తప్ప, అన్ని సీట్లు కాంగ్రెస్‌ పార్టీ గెలుచుకుంది.
* 1984 లోక్‌సభ ఎన్నికల్లో  ఎన్టీఆర్‌ ప్రభంజనం కాంగ్రెస్‌ పార్టీని ఇబ్బంది పెట్టినా 1989 ఎన్నికల్లో పుంజుకుంది.
* 2004, 2009 ఎన్నికల్లోనూ 33, 35 పార్లమెంట్‌ సీట్లలో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించారు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలు. కానీ వారి మనస్సుల్లో ఏముంది, వారికి ఏం చేయాలనే ఆలోచన ఇటు రాష్ట్ర నేతలకు గానీ, అటు జాతీయ స్థాయి నేతలకు కానీ పట్టక పోవడమే ఆ పార్టీ నేటి దుస్థితికి కారణం. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి