
తెలంగాణ తెచ్చింది మేము... ఇచ్చింది సోనియా అనే నినాదంతో ఎన్నికల ప్రచారంలోకి దిగారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు. తొలి నుంచి తమ నియోజక వర్గానికే పరిమితమవుతూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతలు అనూహ్యంగా తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి సారధ్యం వహించాల్సి రావడంతో ఉక్కిరి బిక్కిరయ్యారు. తెరాస విలీనంపై జరిగిన నర్మగర్భ చర్చల్లో పాల్గొన్న టి. కాంగ్రెస్ నేతలు, గులాబీ దళాధిపతి, ఆయన నాయకత్వం విధించిన షరతుల పట్ల మండి పడ్డారు.
విలీనం అక్కర్లేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడంతో కాంగ్రెస్ పార్టీ అనుకూల పవనాలు వీస్తున్నాయని అధిష్టానం వద్ద వాదించడంలో కృతకృత్యులయ్యారు టి. కాంగ్రెస్ నేతలు. ఎన్నికల ప్రచారంలో విపక్ష పార్టీల నేతల విమర్శలకు ధాటిగా సమాధానం చెప్పేందుకు విడిగా పార్టీ కమిటీ ఏర్పాటు చేయడంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలకు స్వేచ్ఛ లభించినా, ఇతర సమస్యలు వచ్చి పడ్డాయి.కానీ కెసిఆర్ రాజకీయ చతురత ముందు కాంగ్రెస్ నేతల ప్రచారం విలవిలలాడింది.
పలు దఫాలు వరంగల్ జిల్లా జనగామ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ప్రాతినిధ్యం వహించిన బిసి నేతగా పొన్నాల లక్ష్మయ్యకు టిపిసిసి కిరీటం లభించింది. దీంతో ఉబ్బితబ్బిబైన పొన్నాల, తెరాస - ఆ పార్టీ నాయకత్వంపై వ్యక్తిగత విమర్శలకు ప్రాధాన్యతనిచ్చారే తప్ప, తెలంగాణలో పార్టీ అభ్యర్థులందరికీ దన్నుగా ఎన్నికల ప్రచారం చేయడంలో విఫలమయ్యారని విమర్శకుల మాట. అపూర్వ ప్రజాకర్షక నేతగా కెసిఆర్ వ్యూహాత్మక ప్రచారం ముందు పొన్నాల సహా తెలంగాణ కాంగ్రెస్ నేతలు విలవిల్లాడారు.
ఇక టిపిసిసి పదవిపై ఆశలు పెట్టుకున్న సీనియర్లు డిఎస్, గీతారెడ్డి, దామోదర రాజనర్సింహ, జానారెడ్డి వంటి వారు తమ నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ గట్టి పోటీనిస్తుండడంతో హుజూర్ నగర్ నియోజకవర్గానికే పరిమిత మయ్యారు. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ వ్యూహకర్తలు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్‌లను రప్పించారు.
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు డిగ్గీ రాజా హైదరాబాద్ నగరానికి వచ్చీరాగానే పరిస్థితిని మధించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు హితబోధ చేశారు. తెలంగాణలో పార్టీ ఓటమి పాలైతే, జాతీయ స్థాయిలో అధి నాయకత్వం విమర్శల పాలవుతుందని నేతలకు డిగ్గీరాజా తలంటారని వార్తలు వెలువడ్డాయి. మరోవైపు విభజనతో కీలక నేతలంతా పార్టీకి దూరమైనా అధినాయకత్వం నిర్ణయానికి కట్టుబడి పని చేస్తున్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఉమ్మడిగా ప్రచార బరిలో దూసుకెళుతు న్నారు.
ప్రజా వ్యతిరేకత, నిరసనలను సహృదయంతో స్వీకరించడం ద్వారా వారి అభిమానాన్ని చూరగొనేందుకు ప్రయత్నిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి బృందం. తెలుగుదేశం, బిజెపి నేతల విమర్శలపై ధాటిగానే సమాధానం చెబుతూ మొండిగా సీమాంధ్రలో తమ సహచర నేతలు ఎన్నికల ప్రచారం చేస్తున్న తీరు చూసి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు నేర్చుకోవాల్సింది చాలానే ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
తొలుత పార్టీ పదవుల కోసం ప్రయత్నాలు సాగించిన వారంతా తమకు అవకాశం లభించదని తేలిపోవడంతో వ్యక్తిగతంగా తమ విజయావకాశాలపైనే దృష్టి సారించడం ఆసక్తికర పరిణామం. తెలంగాణ ఉద్యమ సారధిగా కెసిఆర్, టి. కాంగ్రెస్ నేతలతో పోలిస్తే చమత్కారాలు, చాతుర్యంతో మందుకెళుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్లపై బలమైన అభ్యర్థులను బరిలోకి దించడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన కెసిఆర్, ఎన్నికల ప్రచారంలో సమయానుకూలంగా కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలపై పదునైన ఆరోపణాస్త్రాలు సంధిస్తూ దూసుకెళుతున్నారు.
అయితే ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో మాత్రమే తెరాసకు సంస్థాగత నిర్మాణం ఉంది. ఈ నేపథ్యంలోనే వరంగల్ జిల్లాలో 1983 నుంచి తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో ఉన్న కడియం శ్రీహరి, 1995 స్థానిక సంస్థల ఎన్నికల్లో రంగ ప్రవేశం చేసిన మాజీ కాంగ్రెస్ నేత కొండా సురేఖ దంపతులను రాజకీయ లక్ష్యాల సాధన కోసం పార్టీలోకి ఆహ్వానించారు. జలగం వెంకట్రావును పార్టీలోకి తీసుకోవడం ద్వారా ఖమ్మం జిల్లాలో పాగా వేయడానికి ప్రయత్నిస్తున్నారు గులాబీ బాస్.
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాదులే ఉన్నాయి. ఈ ఆరు జిల్లాల్లో ఆయా పార్టీల నేతలను విస్తృత స్థాయిలో పార్టీలోకి తీసుకోవడం ద్వారా సంస్థాగతంగా బలోపేతమైనా ఇప్పటికిప్పుడు శాసనసభ, పార్లమెంట్ స్థానాలకు జరిగే ఎన్నికల్లో ప్రయోజనం పొందగలమా? లేదా? అన్న అనుమానం తెరాస శ్రేణుల్లోనూ, ప్రధాన నాయకత్వం లోనూ ఉంది. ఖమ్మం జిల్లాలో బోణీ చేయడంతోపాటు మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి నల్గొండ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంస్థాగత నెట్‌వర్క్‌ను ఎదుర్కోవడం టిఆర్ఎస్ నాయకత్వానికి అంత తేలికేం కాదని విశ్లేషకులు చెబుతున్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి