13.11.26

Gold ETFs | ఆక‌ర్ష‌ణీయంగా గోల్డ్ ఈటీఎఫ్స్‌.. 2026 తొలి ప‌ది నెల‌ల్లోనే రికార్డు.. ఎలాగంటే..?!

Gold ETFs | ``బంగారం అంటే భార‌తీయుల‌కు ఎంతో మోజు. ధ‌ర పెరిగినా బంగారం కొన‌డం ఆప‌ట్లేదు. ఆ కోవ‌లోకే వ‌స్తాయి గోల్డ్ ఈటీఎఫ్‌లు. నిరుడంతా వ‌చ్చిన పెట్టుబ‌డుల‌తో పోలిస్తే 2026లో జ‌న‌వ‌రి నుంచి గ‌త నెల వ‌ర‌కే 15% ఎక్కువ మ‌దుపు చేశారు ఇన్వెస్ట‌ర్లు. గ‌త ప‌ది నెల‌ల్లో వ‌చ్చిన గోల్డ్ ఈటీఎఫ్ పెట్టుబ‌డుల‌లో సింహ భాగం జ‌న‌వ‌రిలోనే న‌మోద‌య్యాయి. అక్టోబ‌రులో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో మ‌దుపులు మోస్త‌రుగా ఉన్నా.. సిల్వ‌ర్ ఈటీఎఫ్‌ల్లో గ‌ణ‌నీయ పెట్టుబ‌డులు న‌మోద‌య్యాయి. అక్టోబ‌రులో గోల్డ్‌, సిల్వ‌ర్ ఈటీఎఫ్‌ల్లో క‌లిపి పెట్టుబ‌డులు రూ.6,566 కోట్లు కాగా, వాటిల్లో సిల్వ‌ర్ ఈటీఎఫ్‌ల వాటా రూ.3,092 కోట్లు``

బంగారం అంటే ఎవ‌రికైనా ఇష్ట‌మే.. భార‌తీయులు.. అందునా బామ‌లు బంగారం ఆభ‌ర‌ణాలంటే మ‌న‌స్సు పారేసుకుంటారు. బంగారం ప‌ట్ల ప్ర‌జ‌ల్లో మోజు, దానికి ఉన్న విలువ‌ను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్ర‌భుత్వం `గోల్డ్ ఈటీఎఫ్‌`ల‌ను అందుబాటులోకి తెచ్చింది. గోల్డ్ ఈటీఎఫ్‌లంటే గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అన్న మాట‌.

కొవిడ్‌తో దూసుకెళ్లిన బంగారం ధ‌ర‌లు

2019 చివ‌ర్లో డ్రాగ‌న్‌లో వెలుగు చూసిన కొవిడ్‌-19 మ‌హ‌మ్మారి ప్ర‌భావంతో బంగారంతోపాటు వెండి వంటి ముఖ్య‌మైన లోహాల ధ‌ర‌ల‌కు రెక్క‌లొచ్చాయి. ఇన్వెస్ట‌ర్లు కూడా స్టాక్ మార్కెట్ల‌లో పెట్టుబ‌డుల‌తోపాటు ప్ర‌త్యామ్నాయంగా బంగారం, వెండి వంటి అమూల్య‌మైన లోహాల‌పైనా పెట్టుబ‌డులు పెడుతూ వ‌స్తున్నారు.

ధ‌ర పెరిగినా బంగారంపై త‌గ్గ‌ని మోజు

అటువంటి కోవ‌లోకే వ‌స్తాయి గోల్డ్ ఈటీఎఫ్‌లు. తులం బంగారం ధ‌ర రూ.1.37 ల‌క్ష‌ల పైచిలుకు ప‌లుకుతోంది. కానీ, భార‌తీయుల్లో బంగారం ప‌ట్ల మోజు ఎంత మాత్ర‌మూ త‌గ్గ‌ట్లేదు. ఇక గోల్డ్ ఈటీఎఫ్‌ల సంగ‌తి స‌రేస‌రి. ఏయేటికాయేడు ఈటీఎఫ్‌ల‌పై పెట్టుబ‌డులు గ‌ణ‌నీయంగా పెరుగుతున్న‌ట్లే ఈ ఏడాదీ పెరిగాయి. గ‌త నెల‌లో మోస్త‌రుగా ఉన్నాగ‌తేడాది (2025) కంటే ఈ ఏడాది గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి తొలి 10 నెల‌ల్లోనే అత్య‌ధిక పెట్టుబ‌డులు వ‌చ్చాయి.

తొలి 10 నెలల్లోనే 15 శాతం పెరిగిన ఈటీఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌

2026 జ‌న‌వ‌రి నుంచి అక్టోబ‌రు వ‌ర‌కూ రూ.49,399 కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చాయి. ఇవి గ‌తేడాది పొడ‌వునా వ‌చ్చిన రూ.42,961 కోట్ల కంటే ఎక్కువ అని మార్నింగ్ స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ ఇండియా చెబుతోంది. అంటే నిరుడంతా గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి వ‌చ్చిన పెట్టుబ‌డులతో పోలిస్తే ఈ ఏడాది తొలి ప‌ది నెల‌ల్లోనే రూ.6,438 కోట్లు ఎక్కువ‌. ఇన్వెస్ట‌ర్లు 15 శాతం అధికంగా పెట్టుబ‌డులు పెట్టార‌న్న మాట‌.

అక్టోబ‌రులో మంద‌గించినా గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబ‌డుల వ‌ర‌ద‌

ఈ ఏడాది ప్రారంభంలో బులియ‌న్ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌లు దూసుకెళ్ల‌డంతో ఇన్వెస్ట‌ర్లు లాభాల స్వీక‌ర‌ణ‌కు ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో గ‌త నెల‌లో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబ‌డులు మోస్త‌రుగా వ‌చ్చాయి. కానీ, వైవిధ్య భ‌రిత‌మైన‌, మ‌ల్టీ అసెట్ పోర్ట్ ఫోలియోల్లో పెట్టుబ‌డులు పెట్ట‌డానికే ఇన్వెస్ట‌ర్లు ఆస‌క్తి క‌న‌బ‌రిచారు. ప్ర‌త్యేకంచి బంగారాన్ని దీర్ఘ‌కాలిక పోర్ట్‌ఫోలియోగా భావిస్తున్న మ‌దుప‌ర్లు సుముఖ‌త చూపారు.

జ‌న‌వ‌రిలోనే స‌గం పెట్టుబ‌డుల వ‌ర‌ద‌..

నెల వారీ పెట్టుబ‌డుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకంటే గోల్డ్ ఈటీఎఫ్‌ల‌కు జ‌న‌వ‌రి అసాధార‌ణ‌మైంది. వివిధ పంట‌ల దిగుబ‌డులు రావ‌డంతోపాటు చేతికి డ‌బ్బు వ‌స్తుంది. అలా వ‌చ్చిన డ‌బ్బును విశ్వ‌స‌నీయ‌మైన మార్గాల్లో పెట్టుబ‌డిగా పెట్ట‌డానికి ప్రాధాన్యం ఇస్తారు. అలా పోలిస్తే.. గ‌త జ‌న‌వ‌రిలోనే గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.24,040 కోట్ల విలువైన పెట్టుబ‌డులు వ‌చ్చాయి. 2026 తొలి ప‌ది నెల‌ల్లో వ‌చ్చిన పెట్టుబ‌డుల్లో 49 శాతం. ఫిబ్ర‌వ‌రిలో రూ.5,255 కోట్లు, సెప్టెంబ‌రులో రూ.4,451 కోట్లు వ‌చ్చాయి. ఇక గ‌త ప‌ది నెల‌ల్లో మే నెల‌లో మాత్ర‌మే గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి ఇన్వెస్ట‌ర్లు న‌గ‌దు ఉప‌సంహ‌రించుకున్నారు.

గోల్డ్‌లోనే పెట్టుబ‌డులు ఎందుకంటే..

ఉక్రెయిన్‌-ర‌ష్యా యుద్ధం, ప‌శ్చిమాసియాలో ఇరాన్‌పై ఇజ్రాయెల్‌-అమెరికా దాడులు, ప్ర‌తి దాడుల‌తో యావ‌త్ ప్ర‌పంచ దేశాలు త‌ల్ల‌డిల్లుతున్నాయి. దీనికి తోడు ఎల్‌నినో ప్ర‌భావం ఉండ‌నే ఉంది. ఫ‌లితంగా అంత‌ర్జాతీయ ఆర్థిక వృద్ధిరేటుపై నెల‌కొన్న అనిశ్చితి.. వివిధ దేశాల ద్ర‌వ్య ప‌ర‌ప‌తి విధానంపై అంచ‌నాల‌తో ఇన్వెస్ట‌ర్లు బంగారంపై పెట్టుబ‌డులు పెట్ట‌డానికే మొగ్గు చూపుతున్నార‌ని మార్నింగ్ స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ ఇండియా అన‌లిస్టు మెష్రాం పేర్కొన్నారు. షార్ట్ ట‌ర్మ్ ఇన్వెస్ట్ మెంట్ అవ‌కాశాల‌కంటే వైవిధ్య భ‌రిత‌మైన డెఫినెటివ్ అసెట్‌గా రూపాంత‌రం చెందిన బంగారంపైనే ఇన్వెస్ట‌ర్లు పెట్టుబ‌డులు పెట్ట‌డానికి మోజు పెంచుకుంటార‌ని తెలిపారు.

గోల్డ్ ఈటీఎఫ్‌ల‌కు త‌గ్గినా జోరుగా సిల్వ‌ర్ ఈటీఎఫ్‌లు

ఇన్వెస్ట‌ర్లు అక్టోబ‌రులో మోస్త‌రుగా గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబ‌డులు వ‌చ్చినా.. సిల్వ‌ర్ ఈటీఎఫ్‌ల‌లో జోరుగా ఇన్వెస్ట్‌మెంట్స్ పెరిగాయి. దేశీయ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌ల‌ను బ‌ట్టే గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబ‌డులను పెట్ట‌డానికే ఇన్వెస్ట‌ర్లు మొగ్గు చూపుతుంటారు. అక్టోబ‌రులో గోల్డ్ అండ్ సిల్వ‌ర్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబ‌డులు రూ.6,566 కోట్లు కాగా, వాటిల్లో సిల్వ‌ర్ ఈటీఎఫ్‌ల వాటా రూ.3,092 కోట్లు. అమూల్య‌మైన లోహాల్లో పెట్టుబ‌డులు సుస్థిరంగా పెరుగుతాయ‌ని ఇన్ క్రెడ్ మ‌నీ మ్యూచువ‌ల్ ఫండ్స్ సీఈఓ నితిన్ అగ‌ర్వాల్ తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి