gold sales- narendra modi | `` ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా యుద్ధంతో మదుపర్లు స్వర్గధామంగా భావించిన బంగారం ధరకు రెక్కలొచ్చాయి. ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నేపథ్యంలో వచ్చే ద్రవ్య పరపతి సమీక్షలో వడ్డీరేట్లు తగ్గిస్తామన్న యూఎస్ ఫెడ్ రిజర్వు సంకేతాల మధ్య దేశీయ బులియన్ మార్కెట్‌లో తులం బంగారం ధర రూ.1.83 లక్షల నుంచి దిగి వచ్చి రూ.1.23 లక్షలకు చేరుకుంది. దంతేరాస్, దీపావళి పండుగల సందర్భంగా లైట్ వెయిట్ డిజైన్లు, తక్కువ క్యారట్ల బంగారం కొనుగోళ్లకు మగువలు మొగ్గు చూపారు.``
gold sales- narendra modi | బంగారం అంటే భారతీయులకు.. అందునా బామలకు ఎంతో ఇష్టం. అవకాశం ఉంటే ప్రతి శుభ కార్యానికి పిసరంత బంగారం కొనడానికే మొగ్గు చూపుతారు. ధరలు పెరిగినా.. దిగుమతి సుంకాలు ఇబ్బడి ముబ్బడిగా పెంచేసినా మగువలు కించిత్ కూడా వెనక్కి తగ్గలేదు. మానవాళిని గడగడలాడించిన కరోనా మహమ్మారి సమయంలోనూ బంగారం ఆభరణాల విక్రయాలు జోరుగా సాగాయి. ప్రస్తుతం తులం బంగారం ధర గత జనవరిలో రూ.1.80 లక్షలతో ఆల్‌టైం గరిష్టాన్ని తాకి.. రూ.1.26 లక్షలకు దిగొచ్చింది.
ప్రధాని నరేంద్ర మోదీ ఏమన్నారంటే..!
`అత్యవసరమైతే తప్ప బంగారం కొనుగోలు చేయొద్దని నేను ఇచ్చిన పిలుపును దేశ ప్రజలు పాటించారు. దాని వల్ల బంగారం ధర తగ్గడంతోపాటు డబ్బు ఆదా అయింది` అని ఈ నెల 21న లక్నోలో జరిగిన ఐదో కౌశల్ దీక్షాంత్ సమారోహ్‌లో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఈ క్రెడిట్‌ను ప్రజలకే ఇచ్చారు. ఈ విషయమై చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) అధ్యక్షులు బ్రిజేశ్ గోయల్.. ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాశారు. అయితే, ప్రధాని పిలుపు వల్లే దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గాయా..? ఇతర కారణాలేమైనా ఉన్నాయా...?! ఈ విషయమై ఓ లుక్కేద్దాం..
డాలర్, యూఎస్ బాండ్ల విలువ పెరుగుదల వల్లే..
అమెరికాలో తుమ్ములు వస్తే భారత్‌లో జలుబు చేస్తుందంటారు పెద్దలు. అమెరికాలో జరిగే పరిణామాలు భారత్ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తూనే ఉంటాయి. ఇరాన్-ఇజ్రాయెల్- అమెరికా, ఉక్రెయిన్-రష్యా మధ్య సాగుతున్న యుద్ధం.. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులను తెచ్చి పెట్టింది. దీనికి తోడు క్రూడాయిల్ ధర పెరగడంతో పైపైకి దూసుకెళ్లిన ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి అమెరికా ఫెడ్ రిజర్వు సిద్ధమైంది. దీని ఫలితంగానే గత నెల నుంచి దేశీయ బులియన్ మార్కెట్‌లో క్రమంగా బంగారం ధరలు దిగి వస్తున్నాయి.
ఫెడ్ సమీక్ష వైపే మదుపర్ల చూపు
మదుపర్లు కూడా నిత్యం లాభాల వైపే మొగ్గు చూపుతుంటారు. వచ్చే నెలలో జరిగే ద్రవ్య పరపతి సమీక్షలో ఫెడ్ వడ్డీరేట్లు తగ్గిస్తామని సంకేతాలివ్వడంతోనే డాలర్, యూఎస్ ట్రెజరీ బాండ్ల విలువ అమాంతం పెరుగుతోంది. తక్షణ లాభాలకు ప్రాధాన్యం ఇచ్చే మదుపర్లు బంగారం వదిలించుకుని డాలర్లు, యూఎస్ ట్రెజరీ బాండ్ల కొనుగోలుపైనే దృష్టి పెడతారని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) అంచనా వేసింది.
తక్కువ క్యారట్లూ... లైట్ వెయిట్ ఆభరణాలపై మగువల మోజు
ప్రతి ఏడాది మాదిరిగానే ఈఏడాది పండుగల సీజన్‌లో బంగారం ఆభరణాలకు గిరాకీ ఏమాత్రం తగ్గలేదు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో బంగారం ఆభరణాలు, నాణాలు, బార్లకు విస్తృత స్థాయిలో కొనుగోళ్లు జరిగాయని, ఆరోగ్య కర వాతావరణం నెలకొందని (డబ్ల్యూజీసీ) అంచనా వేసింది. గత అక్టోబరులో వరుసగా ఐదో నెల భారత గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్స్ రికార్డు నెలకొల్పాయి. ఇదే ఒరవడి నవంబరులోనూ కొనసాగుతుందని డబ్ల్యూజీసీ తెలిపింది. తక్కువ క్యారట్లు, లైట్ వెయిట్ ఆభరణాల కొనుగోలుకు వినియోగదారులు మొగ్గు చూపారు.
కరోనా తర్వాత మదుపుకు స్వర్గధామం పసిడి
పిల్లల పెళ్లిళ్ల కోసం అందునా పెళ్లి కూతురు కోసం బంగారం కొనాలను కునే వారికి బంగారం ధర తగ్గితే.. ఓవరాల్‌గా ఆభరణాల కొనుగోలు ఖర్చు తగ్గుతుంది. హెవీ బ్రైడల్ సెట్స్, నెక్లెస్‌లు, గాజుల కొనుగోళ్లకు ప్రజలు ప్రాధాన్యం ఇస్తుంటారు. కొవిడ్ తర్వాత బంగారం పట్ల మదుపర్ల విజన్ కూడా మారిపోయింది. అప్పటి వరకూ ఆభరణాలకే ప్రాధాన్యం ఇచ్చే కుటుంబ పెద్దలు.. కరోనా తర్వాత డిజిటల్ బంగారం (ఈటీఎఫ్) మార్కెట్లలో కొనడానికి.. ఇతర పెట్టుబడి మార్గాలను అన్వేషిస్తున్నారు. కొవిడ్ తర్వాతే డిజిటల్ బంగారానికి, భౌతిక బంగారానికి గిరాకీ పెరిగింది.
ఆంక్షల నేపథ్యంలో డిజిటల్ గోల్డ్‌కు డిమాండ్
అంతర్జాతీయ అనిశ్చితి వల్ల 2018-19లో వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేసి నిల్వ పెట్టుకున్నాయి. కరోనా నియంత్రణకు ప్రభుత్వాలు ప్రకటించిన ఉద్దీపనలు, లాక్‌డౌన్లు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు బంగారం ధరపై ప్రభావం చూపాయి. బంగారం కొనుగోళ్లపై కేంద్ర ఆంక్షల నేపథ్యంలో ఆన్‌లైన్ బంగారం కొనుగోళ్లు, డిజిటల్ గోల్డ్ వాలెట్ల కొనుగోళ్లు, గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులకు దారి తీశాయి. వినియోగదారులు బంగారం దుకాణాల ముందు బారులు తీరేందుకు కారణమయ్యాయి.
కరోనా తర్వాత బంగారం పై చూపులే
2020లో తులం బంగారం ధర గరిష్టంగా రూ.48,723 పలికితే.. ఏడాది తర్వాత రూ.47,999లకు చేరుకుని 2022లో 52,731, 2023లో రూ.60,624, 2024లో రూ.75,842, 2025లో రూ.1,03,870- 1,23,195 మధ్య (డిసెంబరు 19న రూ.1,36,570 పలికింది. ఈ ఏడాది జనవరి 29న రూ.1,83,050లకు చేరిన తులం బంగారం ధర తాజాగా రూ.1,26,421లకు చేరుకుంది.
దీపావళి-దంతేరాస్ సేల్స్ దూకుడు ఇలా
2020-2026 మధ్య ప్రతి ఏటా దీపావళి, దంతేరాస్ పర్వదినాల సందర్భంగా బంగారం ధరలతోపాటు దాని కొనుగోలు విలువ పెరుగుతూనే ఉంది. ధర పెరిగినా కొద్దీ పాత బంగారం మార్పిడి, లైటర్ డిజైన్లు, తక్కువ క్యారట్ల బంగారం కొనుగోళ్లకు భారతీయ మహిళలు ప్రాధాన్యం ఇస్తున్నారు. 2020లో తులం బంగారం ధర రూ.48651 పలికితే.. కరోనా ఆంక్షల మధ్య చిన్న చిన్న వస్తువుల కొనుగోళ్లు, డిజిటల్/ అడ్వాన్సు బుకింగ్స్ నమోదయ్యాయి.
రూ.50 వేలు దాటిన బంగారం ధర
2021లో రూ.48,720 పలికిన పది గ్రాముల బంగారం.. దంతేరాస్ సందర్భంగానే 42 టన్నుల బంగారం అమ్ముడైంది. 2022లో కరోనా తర్వాత పెళ్లిళ్లు, పండుగల సీజన్‌లలో షాపుల్లో కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఆ ఏడాది తులం ధర రూ.50,062. 2023లో ఫెస్టివ్ సీజన్‌లోనే బంగారం, వెండి కొనుగోళ్లు రూ.30 వేల కోట్లు దాటాయి.
రూ.75 వేల కోట్లకు బంగారం బిజినెస్
2024లో రూ.78,745లకు చేరుకున్న బంగారం ధర నేపథ్యంలో దంతేరాస్ వేళ రూ.20,000-23,000 కోట్ల (25-30 టన్నుల బంగారం) కొనుగోళ్లు జరిగాయి. 2025లో తులం బంగారం ధర రూ.లక్ష దాటి రూ.1,29,584లకు చేరుకోవడంతో దంతేరాస్ సందర్భంగా రూ.60 వేల కోట్ల లావాదేవీలు జరిగాయి. 2024తో పోలిస్తే 25 శాతం ఎక్కువ. ఈ ఏడాది దంతేరాస్, దీపావళి పర్వ దినాల సందర్భంగా తులం బంగారం ధర రూ.1,40,054 పలికినా కొనుగోళ్లు రూ.75 వేల కోట్ల పై చిలుకు మాటే. 2025తో పోలిస్తే విలువ పరంగా బంగారం కొనుగోళ్లు 15-25 శాతం పెరిగాయి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి