17.10.26

ECI-SIR-Gen Z | స‌ర్కారు మార్పును కోరుకోవ‌డం త‌ప్పిద‌మా..?!



ECI-SIR-Gen Z | సాధార‌ణ భార‌తీయ పౌరులు గౌర‌వ ప్ర‌దంగా త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగుర‌వేయ‌డం నేర‌మా..? ప్ర‌భుత్వ మార్పును కోరుకోవ‌డం త‌ప్పిద‌మా..? ఆందోళ‌న‌కు దిగ‌డం పొర‌పాటా..? అంటే కానే కాద‌ని రాజ్యాంగంలోని (19)(1)(ఏ) అధిక‌ర‌ణం చెబుతోంది. 2002కు ముందు వ‌ర‌కూ త్రివ‌ర్ణ ప‌తాకావిష్క‌ర‌ణ‌పై ఆంక్ష‌లున్నా.. `ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002` ప్ర‌కారం సాధార‌ణ పౌరులు త‌మ ఇళ్లు, కార్యాల‌యాలు, సంస్థ‌ల‌పై ఎప్పుడైనా త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగురేయ‌వ‌చ్చు. కానీ,  `స‌ర్‌` పేరుతో కేంద్ర ఎన్నిక‌ల సంఘం  భారీగా ఓట్ల తొల‌గింపు చేప‌ట్ట‌డాన్ని యువ‌త‌రం మొద‌లు సామాజిక కార్య‌క‌ర్త‌లు, విద్యార్థి యువ‌జ‌న సంఘాలు, పౌర స‌మాజ ప్ర‌తినిధులు, ప్ర‌తిప‌క్ష రాజ‌కీయ పార్టీలు వ్య‌తిరేకిస్తూ ఆందోళ‌న బాట ప‌ట్టిన‌ప్పుడు `త్రివ‌ర్ణ ప‌త‌కా`న్ని చేబూని దూసుకెళుతున్నారు. స‌ర్‌కు సూత్ర‌దారి, కేంద్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ జ్ఞానేశ్ కుమార్‌ల‌కు వ్య‌తిరేకంగా జెన్‌-జీ త‌రం దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. దాదాపు కొన్నేళ్లుగా కెరీర్‌కే ప్రాధాన్యం ఇచ్చిన యువ‌త‌రం.. దేశ భ‌విత‌వ్యం, ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ కోసం వీధుల్లోకి దూసుకొస్తున్నారు. త‌మ దేశం ప‌ట్ల భ‌క్తి ప్ర‌ప‌త్తుల‌ను నిర్భ‌యంగా, నిర్మొహ‌మాటంగా ప్ర‌క‌టిస్తున్నారు. త‌మ భ‌విష్య‌త్ భార‌తం ప‌ట్ల ఆందోళ‌న‌తో నిర‌స‌న తెలుపుతున్నారు. 2024 మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల నుంచి ఓట్ చోరీపై విప‌క్ష నేత రాహుల్‌గాంధీ ఊరూవాడా తిరుగుతూ ప్ర‌చారం చేస్తూంటే ప‌ట్టించుకోని కేంద్రం, కేంద్ర ఎన్నిక‌ల సంఘం.. ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ ప‌త్రిక‌లో వార్త‌లొచ్చాక అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. త్రిస‌భ్య ఎన్నిక‌ల సంఘం స‌మావేశ‌మై తాము ఏక‌గ్రీవ నిర్ణ‌యాలు తీసుకున్నామ‌ని ఫొటోకు ఫోజులిచ్చినంత మాత్రాన స‌మ‌స్య ప‌రిష్కారం కాలేదు. ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌రిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నిక‌ల్లోపే 13 కోట్ల ఓట్లు తొల‌గింపున‌కు గురి కావ‌డం అన్ని వ‌ర్గాల‌ను ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. ఈ అంశ‌మే జెన్ జీ త‌రం వీధుల్లోకి దూసుకు రావ‌డానికి నేప‌థ్యం. గ‌తంలో ఆందోళ‌న‌లు అంటే ఆమ‌డ‌దూరం ఉండే యువ‌త‌రం ఇప్పుడు జాతీయ జెండాను చేత‌బ‌ట్టి.. కేంద్రం, ఎన్నిక‌ల సంఘానికి వ్య‌తిరేకంగా ఉత్సాహంగా నినాదాలిస్తూ ఉద్య‌మాల‌కు కొత్త ఊపిరి పోస్తున్నారు. 

దూకుడుగా యువ‌త‌రం ఆందోళ‌న‌

నీట్‌లో అవ‌క‌త‌క‌వ‌ల‌కు వ్య‌తిరేకంగా కాక్రోజ్ జ‌న‌తా పార్టీ (సీజేపీ) వ్య‌వ‌స్థాప‌కులు అభిజిత్ దీప్కే ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన నిర‌స‌న‌లోనూ యువ‌త‌రం దూకుడుగా పాల్గొన్నారు. పోలీసుల నిర్బంధాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆంక్ష‌ల‌ను తోసి రాజ‌న్నారు.  త‌మ‌కు అత్యంత ఇష్ట‌మైన నేత ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌తో ప్ర‌ధాని మోదీ రాజీనామా చేయించ‌డం సాధార‌ణ‌మేమీ కాదు. గ‌త 12 ఏళ్ల కాలంలో ఏనాడూ మోదీ నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌ల‌ను ప‌ట్టించుకున్న దాఖ‌లాలు లేవు. కానీ, మొద‌టిసారి `నీట్‌` నిర‌స‌న వేడి గ‌ట్టిగానే తాకింది. ప్ర‌జ‌ల్లోకి వెళ్లింది కూడా. యువ‌త‌రానికి ఇష్ట‌మైన ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లాల‌ని త‌న స‌హ‌చ‌ర మంత్రుల‌కు ప్ర‌ధాని మోదీ హిత‌వు ప‌లికారంటే.. జెన్‌జీ ప్ర‌భావం ఎలా ఉంటుందో ఆయ‌న‌కు అర్థ‌మైన‌ట్లుంది. కానీ, గోటిపై రోక‌టి పోటు మాదిరిగా రెండేళ్లుగా త‌మ అనుకూల అధికారితో అమ‌లు చేస్తున్న `స‌ర్‌`లో లోపాల‌పై వార్త‌లు రావ‌డంతో ప్ర‌భుత్వ వ్య‌తిరేక ప‌క్షాలు ఒక్క‌ట‌వుతున్నాయి. ఈ నెల 10న జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద భారీ ధ‌ర్నాకు సీజేపీ ప్లాన్ చేస్తే.. అప‌ర చాణ‌క్యుడిగా పేరొందిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. ఢిల్లీలోనే తిష్ట‌వేసి చ‌క్రం తిప్పారు. రాష్ట్రాల నుంచి పారా మిలిట‌రీ బ‌ల‌గాల‌ను మోహ‌రించి.. 144 సెక్ష‌న్ అమ‌లు చేసి.. ఎక్క‌డిక‌క్క‌డ యువ నేత‌ల‌ను క‌ట్ట‌డి చేయ‌డం.. ప్ర‌భుత్వ పెద్ద‌ల్లో ఆందోళ‌న‌ను తెలియ‌జేస్తోంది. సుప్రీంకోర్టు నిషేధాజ్ఞ‌ల‌ను ఎత్తేయాల‌ని ఆదేశించినా హోంశాఖ వెన‌క్కు త‌గ్గ‌లేదు. అయినా రోజు రోజుకు నిర‌స‌న‌లు పెరుగుతూనే ఉన్నాయి. జంత‌ర్ మంత‌ర్ ఆందోళ‌న‌కు వేదిక‌గా ఉంటే త‌మ ప్ర‌భుత్వ మ‌నుగ‌డ‌కు ముప్పు అని ప‌రిగ‌ణించిన పాల‌కులు.. ఆందోళ‌న వేదిక‌గా జంత‌ర్‌మంత‌ర్‌ను తొల‌గించ‌డం యువ‌త‌రం ఆగ్ర‌హానికి కార‌ణ‌మైంది. 

తిరంగ‌యాత్ర‌తో ఉలిక్కి ప‌డ్డ పోలీసులు

జంత‌ర్ మంత‌ర్ నిర‌స‌న వేదిక‌ను ర‌ద్దు చేయ‌డానికి వ్య‌తిరేకంగా క‌న్నాట్‌ప్లేస్‌లోని ఢిల్లీ సెంట్ర‌ల్ పార్కు వ‌ద్ద తిరంగా యాత్ర ప్ర‌ద‌ర్శ‌న‌కు పిలుపునిచ్చినా పోలీసు యంత్రాంగం ఉలిక్కి ప‌డింది. ఎక్క‌డిక‌క్క‌డ యువ నేత‌ల‌ను అరెస్టు చేసినా వేలాది మంది యువ‌త‌రం త‌ర‌లి రావ‌డంతో తిరంగా యాత్ర విజ‌య‌వంత‌మైంది. దీన్ని నివారించ‌డానికి యువ‌త‌రం నేత‌ల ఇళ్ల‌కు వెళ్లి మ‌రీ హాజ‌రు కావ‌ద్ద‌ని పోలీసులు నోటీసులు ఇస్తున్నారంటే వారికి మార్గ‌ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న పాల‌కుల్లో ఎంత భ‌యం గూడుక‌ట్టుకున్న‌దో అవ‌గ‌త‌మ‌వుతూనే ఉంది. విమ‌ర్శ‌లు వ‌స్తాయ‌ని తిరంగా యాత్ర‌కు తాము వ్య‌తిరేకం కాద‌ని, ప్ర‌జ‌లు ఎక్కువ‌గా గుమి కూడొద్ద‌ని నిషేధాజ్ఞ‌లు అమ‌ల్లో ఉన్నందునే అరెస్టు చేశామ‌ని చెబుతున్నారు పోలీసులు. 

స‌ర్‌, పాల‌కుల తీరుపై విస్తృత చ‌ర్చ అవ‌శ్యం

కేంద్ర ఎన్నిక‌ల సంఘం (ఈసీఐ) అమ‌లు చేస్తున్న `స‌ర్‌` ముప్పుపై దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల్లో విస్తృత స్థాయిలో చ‌ర్చ జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉంది. ప్ర‌జ‌ల‌కు ప్రాథ‌మిక అవ‌గాహ‌న ల‌భిస్తేనే స‌ర్‌కు వ్య‌తిరేకంగా.. పాల‌కుల కుటిల నీతికి వ్య‌తిరేకంగా దేశ ప్ర‌జ‌లు నిల‌బ‌డ‌గ‌లుగుతారు. అందుకోస‌మే నిత్యం ఆందోళ‌నా కార్య‌క్ర‌మాలు రూపుదిద్దుకుంటున్నాయి. యోగేంద్ర యాద‌వ్ వంటి సామాజిక కార్య‌క‌ర్త మ‌రో అడుగు ముందుకేసి.. విద్యార్థి యువ‌జ‌న సంఘాలు, ప్ర‌తిప‌క్షాలు, సామాజిక కార్య‌క‌ర్త‌లు వేర్వేరుగా ఆందోళ‌న చేసినా ప‌ర్వాలేదని. అందరి ల‌క్ష్యం ఒక్క‌టే కావాలి.. స‌ర్ ర‌ద్దు.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా లేదా.. ఆయ‌న్ను అభిశంసించాల‌న్న నినాదంతో ఆందోళ‌న ఉధృతం కావాల‌న్న‌ది సామాజిక కార్య‌కర్త‌ల ఆలోచ‌న‌. `స‌ర్‌` వ్య‌తిరేక ఉద్య‌మం ఎంత విస్త‌రిస్తే.. దేశ భ‌విష్య‌త్‌కు అంత మేలు జ‌రుగుతుంద‌న్న‌ది నిజం.

బీజేపీ, కేంద్రం విమ‌ర్శ‌ల‌కు కార‌ణ‌మిదే

`స‌ర్‌` వ్య‌తిరేక ఉద్య‌మం, ఆందోళ‌న ఉధృతమై దేశ‌వ్యాప్తంగా విస్త‌రిస్తే త‌మ మ‌ద్ద‌తు కొడిగ‌ట్టి పోతుంద‌ని క‌మ‌ల‌నాథులు క‌నిపెట్టినందునే ఆందోళ‌న‌కు దిగిన వారిపై అధికార బీజేపీ, కేంద్ర మంత్రులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.. ఉదాహ‌ర‌ణ‌కు ఏఐఎస్ఓ అధ్య‌క్షురాలు నేహాబోరా మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ త‌ర‌హా ఉద్య‌మం రావాల‌ని పిలుపునిచ్చారు. సీనియ‌ర్ ప్ర‌శాంత్ భూష‌ణ్‌ది అదే బాణి. ప్ర‌భుత్వ మార్పును కోరుకోవ‌డం ప్ర‌జాస్వామిక హ‌క్కే కానీ, చ‌ట్ట వ్య‌తిరేకం కాదు. దీనిపై ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ త‌దిత‌రులు స్పందిస్తూ కుట్ర పూరితం అనే నినాదం ఎత్తుకున్నారు. కానీ, సీజేపీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజిత్ దీప్కే త‌మ డిమాండ్ ఎన్నిక‌ల సంస్క‌ర‌ణ‌లు తేవ‌డం మాత్ర‌మేన‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.

కానీ, అస‌లు వాస్త‌వ‌మేమిటంటే.. 12 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. క్ర‌మంగా అన్న వ్య‌వ‌స్థ‌ల‌ను త‌న ఆధీనంలోకి తీసుకున్న‌ది. తీసుకుంటున్న‌ది. రాజ్యాంగంలోని 324 అధిక‌ర‌ణం ప్ర‌కారం స్వ‌యం ప్ర‌తిప‌త్తి గ‌ల ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ల నియామ‌క ప్ర‌క్రియ‌లో మార్పులు చేర్పులు చేసింది కూడా అందుకే.  అస‌లు స్వ‌యం ప్ర‌తిప‌త్తి గ‌ల‌ ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ల నియామ‌క ప్ర‌క్రియలో మార్పులపై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నా.. కేంద్రం త‌న ప‌ని తాను చేసుకుంటూ పోయింది.  కేంద్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌గా జ్ఞానేశ్ కుమార్ ఎంపిక క‌మిటీ స‌మావేశంలో విప‌క్ష నేత రాహుల్ అస‌మ్మ‌తిని తోసిరాజ‌ని 2/1 మెజారిటీతో ఆమోద ముద్ర వేయ‌డంలో మ‌త‌ల‌బు ఇదేన‌ని అనిపిస్తోంది. ఇప్పుడు వాస్త‌వాలు క్ర‌మంగా బ‌య‌ట‌కు రావ‌డంతో మ‌సిపూసి మారేడు గాయ చేయ‌డానికి కేంద్రం, అధికార బీజేపీ, ఎన్నిక‌ల సంఘం శ‌త‌విధాల ప్ర‌య‌త్నిస్తున్నాయి. 

విప‌క్షాలు, సామాజిక కార్య‌క‌ర్త‌లిలాగే ఉంటారు..

ప్ర‌తిప‌క్షంలో ఉన్న వారు, విద్యార్థి యువ‌జ‌న స‌మ‌స్య‌ల కోసం ప‌ని చేస్తున్న సంఘాలు, పౌర స‌మాజం స‌హ‌జంగానే నిత్యం ప్ర‌భుత్వ మార్పును కోరుకుంటాయి. ఇప్ప‌టి నుంచి వాస్త‌వాల ప్రాతిప‌దిక‌న నిరంత‌రం ఆందోళ‌న‌, ప్ర‌చారోద్య‌మం సాగితే, దేశ‌వ్యాప్తంగా ఎదో ఒక రూపంలో ఆందోళ‌న విస్త‌రిస్తే కేంద్రంలోని మోదీ స‌ర్కారుకు ప్ర‌మాద ఘంటిక‌లు మోగుతున్న‌ట్లే. కానీ, ఇప్ప‌టికిప్పుడు మోదీ ప్ర‌భుత్వానికి వ‌చ్చిన భ‌య‌మేమీ లేదు. పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల్లో బీజేపీ, దాని ఎన్‌డీఏ కూట‌మికి అవ‌స‌ర‌మైన మెజారిటీ ఉంది. ఆ మెజారిటీ ఉన్నంత కాలం కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఎవ‌రూ ఏమీ చేయ‌లేర‌న్న‌ది నిష్ఠూర స‌త్యం. హిందూత్వ‌ను జాతీయ‌వాదంగా ప్ర‌చారం చేస్తున్న పాల‌క పార్టీ త‌న వ్య‌తిరేకుల‌పై దేశ‌ద్రోహుల ముద్ర వేస్తూ వ‌చ్చింది. ఇటువంటి ప‌రిణామం గ‌తంలో ఎన్న‌డూ చోటు చేసుకోలేదు. తాజాగా త‌మను వ్య‌తిరేకిస్తున్న వారంతా జాతి వ్య‌తిరేకుల‌ని, కుట్ర‌దారుల‌ని విష ప్ర‌చారం చేస్తోంది. స‌ర్‌కు వ్య‌తిరేకంగా దేశ రాజ‌ధానిలో ఇంట‌ర్నెట్ వినియోగం ర‌ద్దు, మెట్రో రైలు స్టేష‌న్ల మూసివేత‌, ఢిల్లీకి వ‌చ్చే ప‌లు రైళ్ల ర‌ద్దు వంటి నిర్ణ‌యాలు అసాధార‌ణ చ‌ర్య‌లే కావడంతోపాటు అప్ర‌క‌టిత ఎమ‌ర్జెన్సీని త‌ల‌పించాయి.

ఇందిరాగాంధీ విధించిన ఎమ‌ర్జెన్సీకి కొడుకు రాజీవ్ గాంధీ, మ‌నుమ‌డు రాహుల్ గాంధీ కూడా క్ష‌మాప‌ణ చెప్పుకోవాల్సిన దుస్థితి నెల‌కొంది. నాడు స్వ‌ర్ణ దేవాల‌యంపై సైనిక చ‌ర్య‌కు ఇందిరాగాంధీ ఆదేశిస్తే.. ఆమె కోడ‌లు సోనియా.. మ‌న్మోహ‌న్ సింగ్‌ను ప్ర‌ధానిని చేయ‌డం ద్వారా సిక్కుల మ‌న‌స్సు చూర‌గొనేందుకు ప్ర‌య‌త్నించారు. కానీ, మిత‌వాద శ‌క్తులు సంద‌ర్భం దొరికిన‌ప్పుడ‌ల్లా `ఎమ‌ర్జెన్సీ` అంశాన్ని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఇప్పుడు నేరుగా ఎమ‌ర్జెన్సీ విధిస్తే ప్ర‌జాగ్ర‌హం పెల్లుబుకుతుంద‌ని కేంద్రంలోని పాల‌కుల‌కు తెలుసు క‌నుకే ప‌రోక్షంగా ఆందోళ‌న‌ల‌ను క‌ట్ట‌డి చేయ‌డానికి శ‌త విధాల ప్ర‌య‌త్నిస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగా ఆందోళ‌న‌లు జ‌ర‌గ‌కుండా ఆంక్ష‌లు విధించ‌డంలో ఆంత‌ర్య‌మిదే. కానీ, ఇప్ప‌టికైనా ప‌రిస్థితులు మ‌రింత విష‌మించ‌క ముందే కేంద్రం, కేంద్ర ఎన్నిక‌ల సంఘం దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్ట‌క‌పోతే ప‌రిస్థితి మ‌రింత విష‌మిస్తుంది. ప్ర‌ధాని మోదీ, అధికార బీజేపీకి ఉన్న ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గుతుంది. అది జ‌ర‌క్కుండా ఉండాలంటే ప్ర‌జాస్వామ్య‌యుతంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌లు స్వ‌తంత్రంగా ప‌ని చేసేందుకు అనుమ‌తినిస్తే ఏ స‌మ‌స్యా ఉండ‌దు. ఇక అదే ప‌నిగా అభిజిత్ దీప్కేతో ష‌ర‌తుల బాండ్ల‌పై సంత‌కాలు చేయించుకోవ‌డం కూడా ఆయ‌న దూకుడు ప‌ట్ల పాల‌కుల‌కు ఉన్న భ‌యాన్ని ప‌ట్టిస్తోంది త‌ప్ప మ‌రొక‌టి కాదు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి