4.10.26

Gnanesh Kumar - SIR-ECI | జ్ఞానేశ్ కుమార్‌కు ఎందుకీ `స‌ర్‌`స‌వాళ్లు..!


Gnanesh Kumar - SIR-ECI |  చైత‌న్య‌వంత‌మైన‌, విజ‌య‌వంత‌మైన ప్ర‌జాస్వామ్యానికి స్వేచ్ఛాయుత, నిష్ప‌క్ష‌పాత ఎన్నిక‌లు కీల‌కం. 326వ రాజ్యాంగ అధిక‌ర‌ణం ద్వారా వ‌యోజ‌నుల‌కు ఓటుహ‌క్కు క‌ల్పించ‌డం ప్ర‌జాస్వామ్యానికి పునాది. కానీ, ఆధునిక‌, భావోద్వేగాల‌ భార‌త్‌లో ప్ర‌స్తుతం పౌరుడి `ఓటుహ‌క్కు`ను తొల‌గించ‌డానికి `స‌ర్‌` తేలిక మార్గం. ఓటు హ‌క్కు క‌ల్పించే ప్ర‌జాస్వామ్య పునాదిని చెరిపేస్తూ ఏ ర‌క‌మైన విధాన‌ప‌ర‌మైన అక్ర‌మాల‌కు పాల్ప‌డినా ఓటుహ‌క్కు యోగ్య‌త‌ను, ప‌విత్ర‌త‌ను దెబ్బ తీయ‌డ‌మే. ఇటీవ‌లి కాలంలో ప‌లు కార‌ణాల వ‌ల్ల భార‌త్‌లో నిష్పాక్షిక ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్ర‌శ్నార్థ‌కంగా మారుతోంది. జ్ఞానేశ్ కుమార్ సార‌థ్యంలోని కేంద్ర ఎన్నిక‌ల సంఘం తీసుకొచ్చిన ఓట‌ర్ల ప్ర‌త్యేక స‌వ‌ర‌ణ (స‌ర్‌) దీనికి హేతువ‌వుతోంది. వివిధ రాష్ట్రాల్లో దాదాపు 13 కోట్ల మంది ఓట‌ర్ల‌ను తొల‌గించింది. బీహార్ స‌హా ప‌లు రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నిక‌ల సంఘం అమ‌లు చేసిన స‌మ‌గ్ర ఓట‌ర్ల స‌వ‌ర‌ణ (స‌ర్‌) ప్ర‌క్రియ‌లో భాగంగా ఓట‌ర్ల జాబితాలో అవ‌క‌త‌వ‌క‌లకు పాల్ప‌డ‌టంతోపాటు `ఓట్ చోరీ` జ‌రిగింద‌న్న ఆరోప‌ణ‌లు వివాదాల‌కు కేంద్ర‌మ‌య్యాయి. 

స‌ర్ భారీ అక్ర‌మాలు

మైనారిటీలు, విప‌క్షాల మ‌ద్ద‌తుదారులైన ఓట‌ర్ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఓట‌ర్ల జాబితాలో భారీ అక్ర‌మాల‌కు ఎన్నిక‌ల సంఘం (ఈసీ) అనుమ‌తించింద‌న్న ఆరోప‌ణ‌లున్నాయి. మైనారిటీల‌ను ల‌క్ష్యంగా చేసుకుని బీహార్‌లో ట‌ర్ల పేర్ల‌ను తొల‌గించ‌డానికే `స‌ర్‌` అమ‌ల్లోకి తెచ్చార‌ని అభియోగం. `స‌ర్‌` ప్ర‌క్రియ‌లో బీహార్‌లో దాదాపు 65 ల‌క్ష‌ల ఓట‌ర్ల పేర్లు తొల‌గించడాన్ని స‌వాల్‌చేస్తూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. పార్ల‌మెంటులో చ‌ట్ట స‌వ‌ర‌ణ చేయ‌కుండా.. కొత్త ఓట‌రు న‌మోదు కోసం రూపొందించిన `ఫామ్‌-6`లో మార్పులు చేయ‌డాన్ని ఇద్ద‌రు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్లు వ్య‌తిరేకించారు. ఇది చ‌ట్ట విరుద్ధం కూడా.  గ‌త 10 నెల‌ల్లో 14 సార్లు సీఈసీ తీసుకున్న నిర్ణ‌యాలు త‌మ‌కు అంగీకారం కాద‌ని ఈసీలోని ఇద్ద‌రు క‌మిష‌న‌ర్లు తేల్చి చెప్ప‌డంతో `సంక్లిష్ట‌.. స‌మ‌స్య‌ల సుడిగుండమైన స‌ర్‌పై ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హావేశాలు క‌ట్ట‌లు తెంచుకుంటున్నాయి.

ఇక  స‌వ‌రించిన `ఫామ్‌-6` ప్ర‌కారం కొత్త ఓట‌ర్లుగా పేర్లు న‌మోదు చేసుకునే వారు 2002, అంత‌కు ముందు ఓట‌ర్లుగా ఉన్న త‌మ త‌ల్లిదండ్రులు, నాన‌మ్మ‌, తాత‌య్య వివ‌రాలు పేర్కొనాల్సి ఉంటుంది. దీనిపై ఇద్ద‌రు క‌మిష‌న‌ర్లు వ్య‌తిరేక‌త ప్ర‌క‌టించ‌డంతోపాటు ఇటీవ‌ల ఎన్నిక‌లు జ‌రిగిన ప‌శ్చిమ బెంగాల్‌లో ఓట‌రు జాబితాలో తొల‌గించిన 16.10 ల‌క్ష‌ల మంది ఓటుహ‌క్కును పున‌రుద్ధ‌రిస్తూ రాష్ట్రంలోని కోర్టులు ఇచ్చిన తీర్పుల‌కు వ్య‌తిరేకంగా ఎన్నిక‌ల సంఘం త‌ర‌ఫున అప్పీళ్లు దాఖ‌ల‌య్యాయి. ఇలా అప్పీళ్లు దాఖ‌లైన విష‌యం కేంద్ర ఎన్నిక‌ల సంఘంలోని ఇద్ద‌రు క‌మిష‌న‌ర్ల‌కు తెలుసా? అన్న‌ది అనుమాన‌మే.

కొత్త ఓట‌రు న‌మోదుకూ చిక్కుముడి.

కేంద్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ (సీఈసీ)ని తొల‌గించాల‌ని విప‌క్ష `ఇండియా కూట‌మి` తీర్మానించ‌డంతో ఈ ప‌రిణామాలు పరాకాష్ట‌కు చేరాయి. విప‌క్షాల‌తోపాటు అభిజిత్ దీప్కే సార‌థ్యంలోని కాక్రోజ్ జ‌న‌తా పార్టీ (సీజేపీ) ఆధ్వ‌ర్యంలో ముంబై వేదిక‌గా జ్ఞానేశ్ కుమార్‌ను తొల‌గించాల‌ని నిర‌స‌న తెలియ‌జేయ‌డంతో కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌ళ్లు తెరిచింది. `స‌ర్‌` లో ఓటు కోల్పోయిన వారి కోసం ఇంటింటికి తిరిగి ఓట‌ర్ల పేర్లు న‌మోదు చేసుకోవాల‌ని రాష్ట్రాల ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారుల‌ను ఆదేశించింది. స‌ర్‌`లో ఓటు కోల్పోయిన వారి పేర్లను ఓట‌రు జాబితాలో న‌మోదు చేసుకునేందుకే ఇది వ‌ర్తిస్తుంద‌ని.. కొత్త‌గా ఓట‌రుగా న‌మోదు చేసుకునే వ‌యోజ‌నుల‌కు మాత్రం వారి `త‌ల్లిదండ్రులు, నాన‌మ్మ‌, తాత‌య్య` ఓటు వివ‌రాలు త‌ప్ప‌నిస‌ర‌ని చెబుతోంది. 

వివాదాస్ప‌దంగా ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ల ఎంపిక ప్ర‌క్రియ‌

కేంద్ర ప్రధాన ఎన్నికల క‌మిష‌న‌ర్‌, ఇత‌ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ల నియామ‌కానికి 1991 నుంచి అమ‌ల్లో ఉన్న చ‌ట్టం స్థానే 2023లో కేంద్రం తీసుకొచ్చిన చ‌ట్టం వివాదానికి హేతువైంది. ప్ర‌ధాన‌మంత్రి అధ్య‌క్ష‌త‌న కేంద్ర‌మంత్రి, విప‌క్ష నేత‌తో కూడిన క‌మిటీ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ల‌ను ఎంపిక చేసిన త‌ర్వాత రాష్ట్ర‌ప‌తి నియ‌మిస్తారు. 1991 చ‌ట్టం ప్ర‌కారం ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ల నియామ‌క క‌మిటీలో ప్ర‌ధాని, విప‌క్ష నేత‌, సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి స‌భ్యులుగా ఉంటారు. తాజా చ‌ట్టం ప్ర‌కారం కేంద్ర ప్ర‌భుత్వం మ‌రీ ముఖ్యంగా ప్ర‌ధాని అభిమ‌తానికి అనుగుణంగా ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ల నియామ‌కానికి ఆయ‌న కేబినెట్‌లోని మంత్రి ఓటేస్తార‌న్న విమ‌ర్శ ఉంది. 

ఎంపిక క‌మిటీలో సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్‌తోనే నిష్పాక్షిక‌త‌

విప‌క్ష నేత‌తోపాటు సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి కూడా ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ల ఎంపిక క‌మిటీలో స‌భ్యులుగా ఉంటే కాసింత నిష్పాక్షిక‌త‌కు చోటు ఉండేది. దాని స్వ‌యంప్ర‌తిప‌త్తికి భంగం వాటిల్లే అవ‌కాశం లేదు. కానీ, 2023లో ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ల ఎంపికకు చేసిన చ‌ట్టంలో సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిని త‌ప్పించ‌డంతో ఎన్నిక‌ల సంఘం స్వ‌తంత్ర ప్ర‌తిప‌త్తికి భంగం వాటిల్లింద‌న్న సందేహం త‌లెత్తింది.  2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌డానికి అవ‌స‌ర‌మైన మెజారిటీ ల‌భించ‌క పోగా, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని 80 సీట్ల‌లో బీజేపీ 33 సీట్లు , దాని మిత్ర‌ప‌క్షాలు మ‌రో మూడు స్థానాలు గెలుచుకున్నాయి. యూపీలో ప్ర‌తిప‌క్ష ఇండియా కూట‌మికి సార‌థ్యం వ‌హించిన అఖిలేశ్ యాద‌వ్ సార‌థ్యంలోని స‌మాజ్‌వాదీ పార్టీకి 37, దాని మిత్ర‌ప‌క్షం కాంగ్రెస్ పార్టీ ఆరు చోట్ల గెలుపొందింది. (2014, 2019 ఎన్నిక‌లతో పోలిస్తే బీజేపీ బ‌లం స‌గానికి పైగా త‌గ్గిపోవ‌డం గ‌మ‌నార్హం). అయినా నితీశ్ సార‌థ్యంలోని యునైటెడ్ జ‌న‌తాద‌ళ్‌, చంద్ర‌బాబుకు చెందిన తెలుగుదేశం నాయ‌క‌త్వంలోని కూట‌మి వ‌ల్ల మెజారిటీ మార్కును దాటిన ఎన్డీఏ స‌ర్కారు కొలువు దీరింది. 

మెజారిటీ ద‌న్నుతో సీఈసీగా అనుకూల అధికారి నియామ‌కం

ఇప్ప‌టి వ‌ర‌కూ భావోద్వేగాల‌తోపాటు ఈడీ, సీబీఐ వంటి సంస్థ‌ల‌తో ప్ర‌త్య‌ర్థుల‌ను దెబ్బ తీసి.. మీడియా సంస్థ‌ల‌ను `గోదీ` సంస్థ‌లుగా మార్చి ప్ర‌జాభిప్రాయాన్ని అణ‌చివేసేందుకు పూనుకున్న కేంద్ర పాల‌కులు.. ఇక ముందు అలా కుద‌ర‌ద‌ని.. త‌మ‌ `ప‌ప్పులు` ఉడ‌క‌వని త‌ల‌పోశారు. 2002 నాటికి ఓటేయాల‌న్న నిబంధ‌నతో `స‌ర్‌` అమ‌లుకు తెర తీశారు. అందుకోసం పార్ల‌మెంటులో త‌మ‌కు గ‌ల మెజారిటీ ఆధారంగా సీఈసీ, ఈసీ నియామ‌క చ‌ట్టంలో నిబంధ‌న‌లు మారుస్తూ చ‌ట్ట స‌వ‌ర‌ణ చేశారు. 

ఇక కేర‌ళ క్యాడ‌ర్‌కు చెందిన సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి జ్ఞానేశ్ కుమార్‌.. త‌ర్వాత‌ర్వాత కేంద్ర హోంశాఖ‌లో `జ‌మ్ము క‌శ్మీర్‌కు 370 అధిక‌ర‌ణం ర‌ద్దు`, `అయోధ్య‌లో రామ మందిర నిర్మాణ ట్ర‌స్ట్ ప‌నుల‌` ప‌ర్య‌వేక్ష‌ణ‌తో మోదీ, అమిత్‌షాల‌కు ద‌గ్గ‌ర‌య్యార‌న్న ఆరోప‌ణ‌లున్నాయి. అంతే కాదు 32 ఏళ్ల పాటు వివాదాల‌కు దూరంగా ఐఏఎస్‌గా ప‌ని చేసిన జ్ఞానేశ్‌.. కేంద్ర పెద్ద‌ల అడుగుల‌కు మ‌డుగులొత్తుతూ కేర‌ళంలో బీజేపీ పాగా వేసేందుకు ఆ రాష్ట్ర మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి థామ‌స్‌కు బీజేపీ లోక్‌స‌భ టికెట్ ఆఫ‌ర్ చేయ‌డం, మంత్రి ప‌ద‌వి ఇప్పిస్తామ‌ని హామీ ఇవ్వ‌డం `సివిల్ స‌ర్వీస్ నిబంధ‌న‌ల‌` ఉల్లంఘ‌నే అవుతుంది. అంతే కాదు కేర‌ళంలో ప‌ని చేస్తున్న‌ప్పుడు అవినీతికి పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న కేసును ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం విజిలెన్స్ విచార‌ణ‌కు అప్ప‌గించ‌డం జ్ఞానేశ్‌కు గోటిపై రోక‌టి పోటు వంటిదే. ఇటువంటి వివాదాస్ప‌ద అధికారిని కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధానాధికారిగా నియ‌మించ‌డంతోనే ఆ సంస్థ స్వ‌యం ప్ర‌తిప‌త్తి కొడిగ‌ట్టిపోయిందంటే అతిశ‌యోక్తి కాదు.

కేంద్ర ఎన్నిక‌ల సంఘం స్వ‌యం ప్ర‌తిప‌త్తిని దెబ్బ తీసేలా 2023లో సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిని సెల‌క్ష‌న్ క‌మిటీ నుంచి త‌ప్పిస్తూ కేంద్రం చేసిన చ‌ట్టాన్ని అనూప్ బ‌ర‌న్వాల్, 2024లో జ‌యా ఠాకూర్ అనే వ్య‌క్తి సుప్రీంకోర్టులో స‌వాల్ చేశారు. వీటిని విచారించిన ద్విస‌భ్య ధ‌ర్మాస‌నం తాజాగా ఐదుగురు న్యాయ‌మూర్తుల విస్తృత రాజ్యాంగ ధ‌ర్మాస‌నానికి నివేదించాల‌ని ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి సిఫార‌సు చేసింది. 

ఈసీ రాజ్యాంగ విధి

రాష్ట్ర‌ప‌తి, ఉప‌రాష్ట్ర‌ప‌తిల‌తోపాటు పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌లు, 29 రాష్ట్రాల శాస‌న‌స‌భ‌లు, శాస‌న మండ‌లి స‌భ్యుల ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌ను నిర్దేశించ‌డంతోపాటు ప‌ర్య‌వేక్ష‌ణ‌కు 324వ అధిక‌ర‌ణం ద్వారా  కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి రాజ్యాంగం శాశ్వ‌త అధికారాలు క‌ట్ట‌బెట్టింది. ఈ రాజ్యాంగ ప్రాతిప‌దిక‌, ఎన్నిక‌ల సంఘం శాశ్వ‌త‌త్వానికి స్వ‌తంత్ర నేప‌థ్యం సృష్టించింది. 2023 ఎన్నిక‌ల సంఘం చ‌ట్టం ప్ర‌కారం ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ (సీఈసీ) ప‌ద‌విలో ఆరేళ్లు లేదా 65 ఏళ్ల వ‌య‌స్సు.. ఈ రెంటిలో ఏది ముందైతే అంత వ‌ర‌కూ కొన‌సాగుతారు. ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ (సీఈసీ), ఇతర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ల తొల‌గింపున‌కు పెట్టిన ముఖ్య‌మైన నిబంధ‌నే దాని స్వ‌తంత్ర‌త‌ను తెలియ‌జేస్తోంది. 

124(4) రాజ్యాంగ అధిక‌ర‌ణం ప్ర‌కారం దుష్ప్ర‌వ‌ర్త‌న లేదా అస‌మ‌ర్థ‌త రుజువైతే సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిని తొల‌గించిన ప్ర‌క్రియ‌నే కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ తొల‌గింపున‌కు వ‌ర్తిస్తుంద‌ని 324 అధిక‌ర‌ణంలోని 5 క్లాజ్ చెబుతోంది. అయితే సీఈసీ స‌ల‌హా మేర‌కు ఇత‌ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ల‌ను రాష్ట్ర‌ప‌తి తొల‌గించ‌వ‌చ్చు. అయిన‌ప్ప‌టికీ 1997లో వినీత్ నారాయ‌ణ్ వ‌ర్సెస్ కేంద్ర ప్ర‌భుత్వం కేసులో సీఈసీ సుమోటోగా స‌ల‌హా ఇవ్వ‌కూడ‌ద‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది. త‌ద్వారా ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ల స్వ‌యంప్ర‌తిప‌త్తి/ స్వ‌తంత్ర‌త‌కు, కార్య నిర్వాహ‌క వ‌ర్గ అధికారాల‌కు మ‌ధ్య స‌మ‌తుల్య‌త‌ను ఈ నిబంధ‌న‌ను తెలియ‌చేస్తోంది. 

1995లో బ‌హుళ స‌భ్య సంఘంగా ఎన్నిక‌ల సంఘం

1989లో ఎన్నిక‌ల సంఘాన్ని బ‌హుళ స‌భ్యుల సంస్థ‌గా మార్చినా 1990లో రెండు అద‌న‌పు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ప‌ద‌వుల‌ను ర‌ద్దు చేవారు. కానీ, టి.ఎన్. శేష‌న్ వ‌ర్సెస్ కేంద్ర ప్ర‌భుత్వం మ‌ధ్య 1993 అక్టోబ‌రు ఒక‌టో తేదీన దాఖ‌లైన కేసులో శాశ్వ‌తంగా బ‌హుళ స‌భ్యుల సంస్థ‌గా ఎన్నిక‌ల క‌మిష‌న్‌ను రూపొందించాల‌ని 1995లో సుప్రీంకోర్టు ఆదేశించింది. మ‌రో ఆస‌క్తిక‌ర విష‌య‌మేమిటంటే 324 అధిక‌ర‌ణంలోని మూడో క్లాస్ ప్ర‌కారం మ‌రో ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌ను నియ‌మిస్తే.. సీఈసీ ఎన్నిక‌ల సంఘం చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది. బ‌హుళ స‌భ్య ఎన్నికల క‌మిష‌న్‌లో ఈసీ స‌మావేశాల‌కు అధ్య‌క్ష‌త వ‌హించ‌డంతోపాటు సీఈసీకి కొన్ని ప్ర‌త్యేక అధికారాలు క‌ల్పించింది 324 అధిక‌ర‌ణం. దీని ప్ర‌కారం ప్ర‌జాతంత్ర‌యుతంగా / ఏకాభిప్రాయంతో నిర్ణ‌యాలు తీసుకోవ‌డంతోపాటు ఎన్నిక‌ల సంఘం ఒక అడ్మినిస్ట్రేట‌ర్‌గా ఎన్నిక‌ల‌ను నిర్వ‌హిస్తుంది. రాజ్యాంగ సంస్థ‌గా ఎన్నిక‌ల సంఘానికి ఈ నిబంధ‌న‌లే స్వ‌యంప్ర‌తిప‌త్తి/  స్వ‌తంత్ర‌త ద‌ఖ‌లు ప‌రుస్తున్నాయి. 

ఈసీ చ‌ట్టంలో మార్పులు చేర్పులు

1950, 1951ల్లో రూపుదిద్దుకున్న ప్ర‌జా ప్రాతినిధ్య చ‌ట్టం ప్ర‌కారం ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌, ఓట‌ర్ల న‌మోదు, అభ్య‌ర్థుల అర్హ‌త‌ల‌పై దృష్టి పెడితే.. సీఈసీ, ఇత‌ర క‌మిష‌న‌ర్ల తొల‌గింపు విధానాన్ని 2023లో తెచ్చిన సీఈసీ, ఈసీ (నియామ‌కం, స‌ర్వీసు నిబంధ‌న‌లు, ప‌ద‌వీ కాలం) చ‌ట్టం అమ‌ల్లోకి తెచ్చింది. ఎన్నికల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ (సీఈసీ)ని తొల‌గించే ప్ర‌క్రియ చాలా సంక్లిష్టం. అదొక ఖ్వాసీ జ్యుడిషియ‌ల్ పార్ల‌మెంట‌రీ విధానం. 1968 న్యాయ‌మూర్తుల (విచార‌ణ‌) చ‌ట్టంలోని సెక్ష‌న్ 3 ప్ర‌కారం ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ అస‌మ‌ర్థ‌త‌, దుష్ప్ర‌వ‌ర్త‌న‌పై ద‌ర్యాప్తు చేయొచ్చు. 

సీఈసీ తొల‌గింపున‌కు 100 మంది ఎంపీల సంత‌కంతో నోటీసు

సీఈసీ తొల‌గింపున‌కు లోక్‌స‌భ‌కు నోటీసు ఇవ్వాలంటే క‌నీసం 100 మంది లోక్‌స‌భ స‌భ్యులు సంత‌కం చేయాలి. అదే రాజ్య‌స‌భ‌కు నోటీసివ్వాలంటే 50 మంది స‌భ్యుల‌కు త‌గ్గ‌కుండా సంత‌కాలు చేయాలి. ఈ నోటీసుల‌ను లోక్‌స‌భ స్పీక‌ర్‌, రాజ్య‌స‌భ చైర్మ‌న్ అనుమ‌తించొచ్చు. లేదా అనుమ‌తించ‌వ‌చ్చు. నోటీసును అనుమ‌తిస్తే సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి/  న్యాయ‌మూర్తి, హైకోర్టు చీఫ్ జ‌స్టిస్‌, పేరొందిన న్యాయ కోవిదుడితో ముగ్గురు స‌భ్యుల క‌మిష‌న్‌ను లోక్‌స‌భ స్పీక‌ర్‌/  రాజ్య‌స‌భ చైర్మ‌న్ నియ‌మిస్తారు. పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల‌కూ నోటీసు ఇస్తే ఒకేసారి క‌మిటీ ఏర్పాటు చేస్తాయి అదీ నోటీసును అనుమ‌తిస్తేనే.. ఇక అవ‌స‌ర‌మైతే విచార‌ణ జ‌రిపి ఖ‌చ్చిత‌మైన అభియోగాలు తప్ప‌నిస‌రిగా  న‌మోదు చేయాలి. ఇక సీఈసీకి త‌న వాద‌న వినిపించేందుకు స‌హేతుక‌మైన స‌మ‌యం ఇవ్వాలి. భౌతిక‌, మాన‌సిక ప‌రిస్థితిపై ఆరోప‌ణ‌లు వ‌స్తే.. అవ‌స‌రం అనుకుంటే స్పీక‌ర్‌/ చైర్మ‌న్ నియ‌మించిన మెడిక‌ల్ బోర్డు ప‌రీక్షిస్తుంది. 

రాజ‌కీయ కోణం..

సీఈసీకి వ్య‌తిరేకంగా తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టాల‌ని భావిస్తే విప‌క్షాలు ప్ర‌జాతంత్ర ప‌ద్ద‌లు పాటిస్తాయి. అధికార కూట‌మికి పార్ల‌మెంటులో త‌గినంత బ‌లం ఉంటే ఈ తీర్మానాన్ని ప్ర‌తిస్తంభింప చేయొచ్చు. ఏ ప్రాతిప‌దిక‌తో కూడిన ఆరోప‌ణ‌లనైనా ప్ర‌భుత్వం తిర‌స్క‌రించ‌వ‌చ్చు. ఈ రాజ్యాంగ సంస్థ‌ల‌ను ప్ర‌తిప‌క్షం లేదా అధికార పార్టీ స‌హా పౌరులంతా గౌర‌వించాల్సి ఉంటుంది. లేక‌పోతే స‌మాజానికి త‌ప్పుడు సంకేతాలు పంపిన‌ట్ల‌వుతుంది. రాజ్యంగం పొందుప‌రిచిన నిబంధ‌న‌ల‌కు లోబ‌డి రాజ్యాంగ సంస్థ‌లు ప‌ని చేస్తాయ‌న్న విష‌యం రాజ‌కీయ పార్టీలు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి. ఈ సంస్థ‌ల‌కు వ్య‌తిరేకంగా అస‌మ్మ‌తి వ్య‌క్తం చేయ‌డం త‌ప్పు కాదు. కానీ, రాజ్యాంగాన్ని, రాజ్యాంగ సంస్థ‌లపై రాజ‌కీయం చేయ‌డం భార‌త ప్ర‌జాస్వామ్యానికి హానిక‌రం.  దీన్ని (ఎన్నిక‌ల సంఘాన్ని) ఏ విధంగా బ‌ల‌హీన ప‌రిచినా రాజ‌కీయంగా సున్నిత అంశంగా మార‌డంతోపాటు కేంద్ర ప్ర‌భుత్వం, స్వ‌తంత్ర‌/  విశ్వ‌స‌నీయ ప్ర‌జాతంత్ర సంస్థ‌ల మ‌ధ్య అధికార స‌మ‌తుల్య‌త‌తోపాటు ఎన్నిక‌ల ప్ర‌క్రియ నిర్వ‌హ‌ణ‌లో నిష్పాక్షిక‌త‌పై ప్ర‌భావం ప‌డుతుంది. క‌నుక రాజ్యాంగం క‌ల్పించిన రాజ‌కీయ భ‌ద్ర‌త‌ను ప‌రిర‌క్షించ‌డం అత్య‌వ‌స‌రం. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి