19.9.26

Danam Nagender | దానంపై వేటు స‌బ‌బే.. సీనియ‌ర్ నేత పిల్లి మొగ్గ‌లు...!

 


Danam Nagender | 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ నుంచి ఖైర‌తాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందిన సీనియ‌ర్ నేత దానం నాగేంద‌ర్‌.. నాలుగు నెల‌ల్లోనే కాంగ్రెస్ పార్టీ కండువా క‌ప్పుకోవ‌డ‌మే కాదు.. సికింద్రాబాద్ లోక్‌స‌భ స్థానానికి హ‌స్తం పార్టీ అభ్య‌ర్థిగా పోటీ చేయ‌డం నిసిగ్గుగా ప్ర‌జా ప్రాతినిధ్య చ‌ట్టాన్ని అప‌హ‌స్యం చేయ‌డ‌మే అవుతుంది. 1952లో గ‌ణ‌తంత్ర భార‌తంగా అవ‌త‌రించిన త‌ర్వాత నైతిక విలువ‌లకు క‌ట్టుబ‌డిన నేత‌లు అనేకం. 1967లో లోక్‌స‌భ స్పీక‌ర్‌గా ఎన్నిక‌వ్వ‌గానే నీలం సంజీవ రెడ్డి త‌న  పార్టీ స‌భ్య‌త్వానికి రాజీనామా చేసి అసాధార‌ణ రికార్డు నెల‌కొల్పారు. సాధార‌ణంగానే ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గానీ, ఎంపీగా గానీ ఎన్నికైన త‌ర్వాత మ‌రో పార్టీలోకి వెళ్లాలంటే ముందు ఎంపీ/ ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి.. తాజా ప్ర‌జా తీర్పు కోరాల్సి ఉంటుంది. కానీ, దానం నాగేంద‌ర్ ఆ ప‌ని చేయ‌లేదు. 

2004లో ఇలా సైకిలెక్కి.. త‌ర్వాత `చే`యూత‌

`ఆయారాం గయారాం`ల సంస్కృతికి తెర దించేందుకు స్వ‌ర్గీయ మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీ 1985లో తెచ్చిన పార్టీ ఫిరాయింపుల నిరోధ‌క చ‌ట్టం ప్ర‌కారం కూడా ప్ర‌జాప్ర‌తినిధిగా పార్టీ మారాలంటే ముందు త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల్సిన నైతిక బాధ్య‌త దానం నాగేంద‌ర్‌దే. కానీ అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌డ‌మే ఆయ‌న ప్ర‌స్తుత దుస్థితికి కార‌ణం. దానం నాగేంద‌ర్ పార్టీ మార‌డం కొత్తేమీ కాదు. విద్యుత్ చార్జీల వ్య‌తిరేక పోరాటం, ఎన్జీవోల ఆందోళ‌న‌, ఆర్టీసీ స‌మ్మె త‌దిత‌ర కార‌ణాల‌తోపాటు తెలంగాణ ఉద్య‌మం బ‌లోపేత‌మైన నేప‌థ్యంలో అధికార టీడీపీ-బీజేపీ కూట‌మిపై నాటి తెరాస‌, ఉమ్మ‌డి క‌మ్యూనిస్టు పార్టీల‌తో క‌లిసి తొలిసారి 2004లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధిస్తుందా? లేదా..? అన్న డైల‌మాతో నామినేష‌న్ వేయ‌డానికి కొన్ని గంట‌ల ముందు `సైకిల్ ఎక్కిన దానం నాగేంద‌ర్‌.. ఎన్నిక‌ల్లో గెలుపొందినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. నాటి సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి అత్యంత స‌న్నిహితుడైన దానం.. కొన్ని రోజుల‌కే ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ, ఉప ఎన్నిక‌లో ఎంఐఎం గెలిచింది. 

రాజీనామా చేసి కేసీఆర్ మంత్రిగా చ‌క్రం తిప్పిన త‌ల‌సాని

నాడు దానం నాగేంద‌ర్ టీడీపీలో చేర‌డానికి కార‌కులైన మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌.. తెలంగాణ ఏర్పాటై 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి.. త‌ర్వాత మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల్లో గులాబీ `కారె`క్కారు. కాక‌పోతే సాంకేతికంగా ఇబ్బంది లేకుండా ఎమ్మెల్యే ప‌ద‌వికి త‌ల‌సాని రాజీనామా చేశారు కానీ స‌భాప‌తి మ‌ధుసూధ‌న‌చారి స‌భాకాలం పూర్త‌య్యే వ‌ర‌కూ నేళ మాలిగ‌లో భ‌ద్రంగా దాచి పెట్టారు. అలా సాంకేతికంగా రాజీనామా చేసిన త‌ర్వాత కేసీఆర్ మంత్రివ‌ర్గంలో చేరారు త‌ల‌సాని. త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌తోపాటు దానం నాగేంద‌ర్ జ‌నం నాయ‌కులు. ఎక్క‌డికెళ్లినా అభిమానులు వెన్నంటి ఉంటారు. కానీ, స‌భా నిబంధ‌న‌లు పాటించ‌డంలో కాదు కాదు పాటించిన‌ట్లు న‌టించ‌డంలో త‌ల‌సానితో పోలిస్తే దానం నాగేంద‌ర్ ఫెయిల‌య్యార‌న్న మాటే. అందుకే ఖైర‌తాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం కానున్న‌ది. అయితే, గియితే సీఎం రేవంత్ రెడ్డి సిఫార‌సు మేర‌కు కాంగ్రెస్ హై క‌మాండ్.. దానంతో సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేయిస్తుందా? లేదా..? అన్న సంగ‌తి ఇంకా ఇత‌మిద్దంగా తెలియ రాలేదు. 

భార‌త రాజ‌కీయాల్లో పార్టీ ఫిరాయింపులు ఇప్పుడు నిత్య‌కృత్యం. ప్ర‌జ‌లు కూడా ప‌ట్టించుకున్న దాఖ‌లాలు లేవు. 1980, 1990 వ ద‌శ‌కాల‌తో పోలిస్తే ఇప్పుడు ఓటుకింత డ‌బ్బు చెల్లించే సంప్ర‌దాయం తీసుకొచ్చాయి పార్టీలు.. అభ్య‌ర్థులు కూడా భారీగా డ‌బ్బు వెద‌జ‌ల్లుతున్నారు కూడా. ఉప ఎన్నిక అంటే రూ.కోట్ల‌లో ఖ‌ర్చు చేయాల్సిందే. అందుకు కాంగ్రెస్ హై క‌మాండ్‌, దానం నాగేంద‌ర్ సాహ‌సిస్తారా? అన్న‌ది సందేహ‌మే. 

నైతిక విలువ‌ల‌కు దానం తిలోద‌కాలు

అధికార కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌కు ఇదే తీర్పు వ‌ర్తిస్తుంద‌ని, అక్క‌డా ఉప ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశ‌లు గ‌ట్టిగానే పెంచుకున్నారు. క‌డియం శ్రీ‌హ‌రి కూతురు కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీగా ఎన్నిక‌య్యారే కానీ, క‌డియం స‌హా ఇత‌ర ఎమ్మెల్యేలు సాంకేతికంగా బీఆర్ఎస్‌లో కొన‌సాగుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. చ‌ట్ట ప్ర‌కారం పార్టీ ఫిరాయింపుల ఆధారంగా ఎమ్మెల్యేలు, ఎంపీలపై అన‌ర్హ‌త వేటు వేయాలా..? వ‌ద్దా? అన్న విష‌య‌మై తుది నిర్ణ‌యం స‌భాప‌తిదే. తెలంగాణ స‌భాప‌తి గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ స‌ద‌రు ఫిరాయింపు ఆరోప‌ణ‌ల విష‌య‌మై సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు సుదీర్ఘ విచార‌ణ జ‌రిపి.. వారు పార్టీ మార‌లేద‌ని తీర్పు చెప్పారు. సాంకేతికంగా స‌భాప‌తి ట్రైబ్యున‌ల్ తీర్పు స‌రైందే.. ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూనే మ‌రో పార్టీ త‌రపున ఎంపీగా పోటీ చేయ‌డంతో బ‌హిరంగంగా దానం నాగేంద‌ర్ పార్టీ ఉల్లంఘించార‌న్న‌ది సుస్ప‌ష్టం. 

అవిశ్వాసానికి సోమ‌నాథ్ నో

 ఈ విష‌యంలో మ‌రో సంగ‌తి గుర్తుకొస్తోంది. 2008లో అమెరికాతో అణు ఇంధ‌న ఒప్పందానికి వ్య‌తిరేకంగా లెఫ్ట్ పార్టీలు మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రించుకున్న‌ప్పుడు జ‌రిగిన విశ్వాస తీర్మానానికి అనుకూలంగా టీడీపీ ఎంపీలు ఓటేశారు. మ‌రి కొంద‌రు ఇత‌ర పార్టీల ఎంపీలూ పార్టీ ఫిరాయించారు. దానిపై సుప్రీంకోర్టు పంపిన నోటీసుల‌ను తీసుకోవ‌డానికి కూడా నాటి లోక్‌స‌భ స్పీక‌ర్ సోమ‌నాథ్ చ‌ట‌ర్జీ నిరాక‌రించారు. స‌భ‌లో రాజ‌కీయ ప‌రిణామాల‌కు.. పార్టీ ఫిరాయింపుల‌పైనా త‌న నిర్ణ‌య‌మే ఫైన‌ల్ అని తేల్చి చెప్ప‌డంతో అత్యున్న‌త న్యాయ‌స్థానం కూడా ఏమీ చేయ‌లేక‌పోయింది. 

*పార్టీ ఫిరాయింపుల చ‌ట్టం ఏం చెబుతోంది*

రాజ్యాంగంలోని ప‌దో షెడ్యూల్‌లో చొప్పించిన 52వ రాజ్యాంగ స‌వ‌ర‌ణ చ‌ట్టం-1985.. పార్టీ ఫిరాయింపుల చ‌ట్టం. కానీ, అంత‌గా ఆ చ‌ట్టం ప‌ని చేయ‌లేదు. ఈ చ‌ట్టం ప్ర‌కారం చ‌ట్ట‌స‌భ‌ల ప్రిసైడింగ్ అధికారుల‌కు ఫిరాయింపుల చ‌ట్టం నుంచి మిన‌హాయింపు ల‌భిస్తుంది. అందుకు వారు తాము ఎన్నికైన రాజ‌కీయ పార్టీ స‌భ్య‌త్వానికి రాజీనామా చేయాలి.. త‌ర్వాత మ‌రే ఇత‌ర పార్టీలో చేర‌కూడ‌దు.  అప్పుడే చ‌ట్ట‌స‌భ‌ను త‌ట‌స్థంగా నిర్వ‌హించ‌గ‌ల‌రు. కానీ 1967 వ‌ర‌కూ దీన్ని ఏ నేత అమ‌లు చేయ‌లేద‌దు. 1967లో ఎంపీగా ఎన్నికైన నీలం సంజీవ రెడ్డి స‌భాప‌తిగా ఎన్నిక‌వ్వ‌గానే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సంచ‌ల‌నం సృష్టించిన ఏకైక నేత. 

*సోమ‌నాథ్‌పై సీపీఎం బ‌హిష్క‌ర‌ణ వేటు*

ఇక 2008లో యూపీఏ ప్ర‌భుత్వానికి లెఫ్ట్ పార్టీల మ‌ద్ద‌తు ఉప‌సంహ‌ర‌ణ‌తో మ‌న్మోహ‌న్ సింగ్ స‌ర్కారు ప్ర‌వేశ పెట్టిన విశ్వాస తీర్మానానికి వ్య‌తిరేకంగా ఓటేయాల‌ని స‌భాప‌తి సోమ‌నాథ్ చ‌ట‌ర్జీ స‌హా పార్టీ ఎంపీలంద‌రికీ సీపీఎం విప్ జారీ చేసింది. కానీ, సోమ‌నాథ్ చ‌ట‌ర్జీ ఆ విప్‌ను ప‌ట్టించుకోలేదు. సీపీఎం నుంచి ఎన్నికైనందున ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేయ‌లేదు. స్పీక‌ర్‌గా ఉన్నందున త‌న‌కు విప్ వ‌ర్తించ‌ద‌ని తేల్చి చెప్ప‌డంతో చారిత్ర‌క త‌ప్పిదాలు చేయ‌డంలో మొద‌టి వ‌రుస‌లో ఉండే సీపీఎం.. సోమ‌నాథ్‌ను పార్టీ నుంచి బ‌హిష్క‌రించింది కూడా. 

మూడింట రెండొంతుల మంది చేరితే ఆ ప‌క్షం విలీన‌మే

ఇక ఎంపీలు/ ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా పార్టీలు ఫిరాయించ‌డానికి వీల్లేదు. ఒక పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు/ ఎంపీల్లో మూడోవంతు మ‌రో పార్టీలో చేరితే పార్టీ ఫిరాయింపుల చ‌ట్టం వ‌ర్తించ‌దు. త‌ర్వాత జ‌రిగిన మ‌రో స‌వ‌ర‌ణ ప్ర‌కారం మూడింట రెండొంతుల మంది చ‌ట్ట‌స‌భ స‌భ్యులు మ‌రో పార్టీలో చేరితే.. మొత్తం శాస‌న‌స‌భా ప‌క్షం విలీన‌మైట్లే.. 2018 ఎన్నిక‌ల ముందు టీడీఎల్పీ, త‌ర్వాత శాస‌న మండ‌లిలో కాంగ్రెస్ పార్టీ ప‌క్షం అలాగే విలీన‌మైంది. పార్టీ ఫిరాయింపుల చ‌ట్టాన్ని కాంగ్రెస్ పార్టీ మాత్ర‌మే ఉల్లంఘిస్తుందా? అంటే బీఆర్ఎస్‌, బీజేపీ.. టీడీపీ, వైసీపీ స‌హా అన్ని పార్టీలు ఒక తానులో ముక్క‌లే.. అధికారంలో ఉన్న‌ప్పుడు విప‌క్షాల‌ను అత‌లాకుత‌లం చేయ‌డానికి.. త‌మ రాజ‌కీయ ఆధిప‌త్యాన్ని బ‌లోపేతం చేసుకోవ‌డానికి య‌దేచ్చ‌గా ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హిస్తూనే ఉన్నాయి పాల‌క పార్టీలు. టీడీపీ అధినేత చంద్ర‌బాబైనా.. బీఆర్ఎస్ అధ్య‌క్షుడు కేసీఆర్ అయినా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అయినా, ప్ర‌ధాని నరేంద్ర మోదీ అయినా అందులో ఘ‌నాపాఠీలే అంటే అతిశ‌యోక్తి కాదు.

*మోదీ హ‌యాంలో ఫిరాయింపులిలా*

2014లో ప్ర‌ధాని అయ్యాక న‌రేంద్ర మోదీ.. మ‌ణిపూర్‌, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌, గోవా, ఉత్త‌రాఖండ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, క‌ర్ణాట‌క‌, మ‌హ‌రాష్ట్ర అసెంబ్లీల్లో ప‌ట్టు సాధించ‌డానికి ఇత‌ర పార్టీల నుంచి య‌దేచ్ఛ‌గా పార్టీ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించారంటే అతిశ‌యోక్తి కాదు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరిన‌ప్పుడు 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాషాయ జెండా క‌ప్పుకున్నారు. 1967-70 మ‌ధ్య సుమారు 800 మంది ఎమ్మెల్యేలు/ ఎంపీలు పార్టీ మారితే వారిలో 155 మందికి మంత్రి ప‌ద‌వులు కూడా వ‌చ్చాయి. 1967లో హ‌ర్యానాకు చెందిన గ‌యాలాల్ అనే ఎమ్మెల్యే 15 రోజుల్లో మూడు పార్టీలు మారాడు.  తొలుత కాంగ్రెస్ నుంచి జ‌న‌తా పార్టీలోకి.. త‌ర్వాత కాంగ్రెస్‌లోకి.. మూడోసారి జ‌న‌తా పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. అందుకే హ‌రియాణ‌లో ఆయారాం గ‌యారాం సంస్కృతి ఉంద‌ని చెప్పుకుంటారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి