8.10.26

Nirvachan Sadan - SIR | నిర్వాచ‌న్ స‌ద‌న్ క‌ప్ప‌దాట్లు..!



Nirvachan Sadan - SIR | ఎస్ఐఆర్ (స‌ర్‌) పేరిట దేశ‌వ్యాప్తంగా 13 కోట్ల మంది ఓటు హ‌క్కును కాల‌రాసిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం (ఈసీఐ).. క‌ప్పదాట్ల‌కు పాల్ప‌డుతోంది. గ‌త 10 నెల‌ల్లో 14 సార్లు తాము అభ్యంత‌ర పెట్టినా కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ జ్ఞానేశ్ కుమార్ ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యాలు తీసుకుని అమ‌లు చేస్తున్నార‌ని సుఖ్‌బీర్ సింగ్ సంథూ, వివేక్ జోషి కేంద్ర క్యాబినెట్ కార్య‌ద‌ర్శికి రాసిన లేఖ మీడియాలో రావ‌డంతో తేనెతుట్టెను క‌దిలించిన‌ట్ల‌యింది. ప్ర‌ధానంగా స‌ర్‌కు అనుసంధానంగా గ‌తంలో త‌ల్లిదండ్రులు/ నాన‌మ్మ తాత‌య్య‌లు ఓటేసిన వివ‌రాల‌పై డిక్ల‌రేష‌న్ ఇవ్వాల‌ని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ సార‌థ్యంలోని ఈసీఐ పౌరుల‌కు సూచించ‌డం ప్ర‌ధానంగా వివాదానికి హేతువైంది. అలాగే ఈఆర్ఓల‌కు ఎన్నిక‌ల సంఘం వెబ్‌సైట్‌లో మార్పులు చేర్పులు చేయ‌డానికి సాఫ్ట్‌వేర్ అనుమ‌తించ‌డం లేదు. దీనివ‌ల్లే గోవాలో స‌ర్‌లో తొల‌గించిన సుమారు 95 మంది పేర్ల‌ను ఓట‌రు జాబితాలో చేర్చ‌డాని సాఫ్ట్‌వేర్ అడ్డంకిగా మారింది. ఆన్‌లైన్‌లోనే న‌వ వ‌యోజ‌నులు ఓటరు గుర్తింపు కార్డు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకుంటూ ఉంటే.. ఎన్నిక‌ల సంఘం ఆధ్వ‌ర్యంలో ప‌ని చేసే ఈఆర్‌వోల‌కు అందుబాటులో లేక‌పోవ‌డం అనుమానాల‌కు తావిస్తోంది. దీనికి తోడు ఫామ్‌-7 ద్వారా త‌మ‌కు న‌చ్చ‌ని ఓట‌ర్ల పేర్లు తొల‌గించ‌మ‌ని ఈసీఐని ఏవ‌రైనా కోర‌వ‌చ్చు. అయితే ఫామ్‌-7 పై చేతితో రాసి.. బూత్ లెవ‌ల్ ఆఫీస‌ర్ (బీఎల్‌వో)కు ద‌ర‌ఖాస్తు స‌మ‌ర్పించాలి. తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్‌లోని ముషీరాబాద్‌, బ‌హ‌దూర్‌పురా, గోషా మ‌హాల్ అసెంబ్లీ సెగ్మెంట్ల ప‌రిధిలో కొంద‌రి ఓట్లు తొల‌గించాల‌ని భారీగా `ఫ్రీ ప్రింటెడ్ ఫామ్‌-7` ప‌త్రాల‌ను బీఎల్ఓల‌కు అంద‌జేయ‌డం కూడా అనుమానాల‌కు తెర తీస్తోంది.

స‌ర్‌ను విప‌క్షాలు వ్య‌తిరేకిస్తూ ఇండియా కూట‌మి పార్టీలు, కాక్రోజ్ జ‌న‌తా పార్టీ (సీజేపీ) వంటి సంస్థ‌లు ఈ నెల రెండో తేదీ నుంచి ఆందోళ‌న‌కు శ్రీ‌కారం చుట్ట‌డంతో అస‌లు సంగ‌తి బ‌య‌ట ప‌డింది.  `స‌ర్‌` మీద అనుమానాలు ఉన్న‌ప్పుడు ప్ర‌జ‌లు, పౌర స‌మాజ ప్ర‌తినిధులు, రాజ‌కీయ పార్టీలు ఆందోళ‌న‌కు దిగ‌డం స‌హ‌జ ప‌రిణామ‌మే. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లో వెలుగు చూసిన ప్రీ ప్రింటెడ్ `ఫామ్‌-7` ప‌త్రాల‌పై రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి (సీఈఓ), రాష్ట్ర డీజీపీ, హైద‌రాబాద్ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ ల‌కు టీపీసీసీ, కాంగ్రెస్ నేత‌లు ఫిర్యాదు చేయ‌డంతో సీఈఓ అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ప్రీ ప్రింటెడ్ న‌కిలీ ఫామ్‌-7 ప‌త్రాల పంపిణీపై విచార‌ణ‌కు ఆదేశించారు. ఎన్నిక‌ల సంస్క‌ర‌ణ‌ల‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మాట్లాడుతూ.. చొర‌బాటు దారుల్ని ఏరివేయ‌డ‌మే త‌మ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని, ఎవ‌రేమ‌న్నా వెన‌క్కు త‌గ్గేది లేద‌ని చెప్పారు. కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా నిర్ణ‌యాన్ని గౌర‌వించ‌వ‌ల్సిందే. కానీ, 12 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న‌ది ఎన్డీఏ ప్ర‌భుత్వం. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ స‌హా దాదాపు అన్ని రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌లు ప్ర‌భుత్వం గుప్పిట్లో ఉన్నాయ‌న్న‌ది నిష్ఠూర సత్యం. ఈ వ్య‌వ‌స్థ‌ల స‌హ‌కారంతో దేశంలో ఉన్న చొర‌బాటు దారుల‌ను గుర్తించ‌డం  సాధ్యం కానిదేమీ లేదు. 

`స‌ర్‌`ను ఉప‌సంహ‌రించాల‌ని, ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల‌ని పౌర స‌మాజం స‌హా ప్ర‌తిప‌క్ష ఇండియా కూట‌మి ఆందోళ‌న‌కు శ్రీ‌కారం చుట్ట‌గా, మ‌రోవైపు స‌ర్‌`లో మార్పుల‌పై సుప్రీంకోర్టు క‌న్నెర్ర చేసింది. చ‌ట్ట‌బ‌ద్ధం గానీ `స‌ర్‌` నిబంధ‌న‌ల‌ను అనుమ‌తించేది లేద‌ని, చ‌ట్ట‌బ‌ద్ధం కాకుంటే ఏం చేయాలో కోర్టుకు తెలుసున‌ని న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్యలు చేసింది. అలా స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం వ్యాఖ్య‌లు చేసిన గంట‌ల్లో ప‌రిస్థితి మారిపోయింది. ఓటు హ‌క్కును ర‌ద్దు చేయ‌డం ప్రాణం పోవ‌డంతో స‌మానం అని సుప్రీంకోర్టు సీనియ‌ర్ న్యాయ‌మూర్తి వ్యాఖ్యానించారు. ప్ర‌ప్ర‌థ‌మంగా బీహార్‌లో `స‌ర్‌` ప్రారంభించిన‌ప్పుడే `నాన‌మ్మా తాత‌య్య‌, త‌ల్లిదండ్రుల ఓటు హ‌క్కు`పై డిక్ల‌రేష‌న్ స‌మ‌ర్పించాల‌ని మెలిక పెట్టి ల‌క్ష‌ల మంది ఓట‌ర్ల ఓటుహ‌క్కు ఉసురు తీసిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం.. స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం త‌మ నిర్ణ‌యానికి ఆమోదం తెలిపింద‌ని బుకాయించింది. దీనిపై విచార‌ణ సంద‌ర్భంగా ప్ర‌తిస్పందించిన సుప్రీంకోర్టు.. స‌ర్‌కు సంబంధించిన చ‌ట్ట విరుద్ధ స‌వ‌ర‌ణ‌ను ఆమోదించ‌డం లేద‌ని తేల్చి చెప్పిన కొన్ని గంట‌ల్లోనే ఆన్‌లైన్ నుంచి డిక్ల‌రేష‌న్ ఫామ్‌ను తొల‌గించేసింది నిర్వాచ‌న్ స‌ద‌న్‌. `స‌ర్` అమ‌లైన రాష్ట్రాల్లో ఓటు కోల్పోయిన వారి ఓటు హ‌క్కు పున‌రుద్ధ‌ర‌ణ కోసం ఎన్యూమ‌రేట‌ర్లు ఇంటింటికి తిరిగి ఓటు హ‌క్కు క‌ల వారి పేర్లు న‌మోదు చేసుకోవాల‌ని ఈసీఐ ఆదేశించింది. 

అంత‌కు ముందు మ‌హారాష్ట్ర‌, హ‌ర్యానా, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లో ఓట్ల తొల‌గింపుపై `లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ.. అనునిత్యం `ఓట్ చోరీ`పై ప్ర‌జంటేష‌న్లు ఇస్తూనే ఉన్నారు. తొలిసారి మ‌హారాష్ట్ర‌పై రాహుల్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చిన‌ప్పుడు ఆగ‌మేఘాల మీద స్పందించిన ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ జ్ఞానేశ్ కుమార్‌.. మీడియాతో మాట్లాడుతూ.. 48 గంట‌ల్లో త‌న‌కు క్ష‌మాప‌ణ చెప్పాలి లేదంటే ఓట్ చోరీకి సంబంధించిన ఆధారాలు త‌న‌కు స‌మ‌ర్పించాల‌ని డిమాండ్ చేశారు. కానీ, ఇప్పుడు ఇద్ద‌రు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ల అభ్యంత‌రాల‌ను బ‌య‌ట పెట్ట‌డంతో బ‌య‌టికి వెళ్లాలంటేనే వెనుకాడుతున్నారాయ‌న‌. యూపీ త‌దిత‌ర రాష్ట్రాల్లో ఆయ‌న ప‌ర్య‌ట‌న వాయిదా వేసుకుంటే.. తాజాగా ఛ‌త్తీస్‌గ‌ఢ్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ఆయ‌న‌కు జ‌డ్‌ప్ల‌స్ కేట‌గిరీ భ‌ద్ర‌త‌ను కేంద్రం ప‌టిష్ఠం చేయ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం. 

ఓట‌రు గుర్తింపు కార్డుతో ఆధార్‌ను అనుసంధానించాల‌న్న డిమాండ్ ఎంతోకాలంగా ఉన్న‌దే. బ్యాంకుల్లో ఆర్థిక లావాదేవీల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానించాల‌ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ‌శాఖ నిర్ణ‌యించింది. అదే పౌరుడి ఓటు హ‌క్కును నిర్ణ‌యించ‌డానికి ఆధార్‌, పాన్ కార్డులు స‌రైన డాక్యుమెంట్లు కాద‌ని ఎన్నిక‌ల సంఘం మెలిక పెట్ట‌డం గ‌మ‌నార్హం. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి