Satya Nadella- Microsoft | సత్య నాదెళ్ల.. పరిచయం అక్కర్లేని పేరు. 2014లో మైక్రోసాఫ్ట్ నూతన సీఈవోగా నియమితులైన సత్య నాదెళ్ల.. ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జన్మించారు. ఐఏఎస్ అధికారిగా పని చేసిన బీఎన్ యుగంధర్ కొడుకే సత్య నాదెళ్ల. హైదరాబాద్‌లోని బేగంపేట పబ్లిక్ స్కూల్‌లో చదువుకుని .. మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేశారు.. అమెరికాలోని విస్కాన్సిన్ విశ్వవిద్యాలయంలో చేరిన సత్య నాదెళ్ల 1990లో కంప్యూటర్ సైన్స్‌లో ఎంఎస్ పట్టా అందుకున్నారు.
అటుపై యూనివర్సిటీ ఆఫ్ షికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో 1996లో ఎంబీఏ పట్టా అందుకున్నారు. అంతకు ముందే తండ్రి యుగంధర్ సహచర ఐఏఎస్ అధికారి కూతురు అనుపమను 1992లో పెండ్లి చేసుకున్నారు. ఆయనకు ఆమె మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జూనియర్ కావడం మరో విశేషం.
సత్య నాదెళ్ల తండ్రిగా బీఎన్ యుగంధర్‌కు అత్యంత నిజాయితీ పరుడైన ఐఏఎస్ అధికారిగా పేరుంది. 1962 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి యుగంధర్.. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు 2004-09 మధ్య ప్రణాళిక సంఘం కార్యదర్శిగా సేవలందించారు.
అంతకుముందు పీవీ నర్సింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు గ్రామీణావృద్ధి శాఖలో కీలక సంస్కరణలు తీసుకు వచ్చారు. ఆ సమయంలో వాటర్ షెడ్‌ల అభివృద్ధికి రాష్ట్రాలతో సంబంధం లేకుండా కేంద్రం నుంచే నేరుగా జిల్లాలకే నిధులు వాచ్చేలా మార్గదర్శకాలు రూపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి