KCR-Sonia Gandhi | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని ప్రజాకూటమికి, అధికార టీఆర్ఎస్ మధ్య నువ్వా? నేనా? అన్నట్లు పోరాటం సాగుతోంది. ఈ క్రమంలో ఇటీవల సోనియాగాంధీని నీకెందుకు బాధవుతున్నదమ్మా? అని ప్రశ్నించిన సీఎం కేసీఆర్.. ఆమె ఉదాత్తమైన, ఉదారమైన నాయకురాలని కీర్తించారు. దీని వెనుక భావమేమిటన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే.
హైదరాబాద్: యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఉదారమైన నేత.. ఈ మాటలన్నది ఎవరో కాదు సాక్షాత్ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో విజయావకాశాలపై ప్రముఖ ఆంగ్ల టీవీ చానెల్ ఎడిటర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్య ఇది. తెలంగాణ రాష్ట్ర సాధన డిమాండ్ ను గట్టిగా వినిపించిన కేసీఆర్.. ఆ డిమాండ్‌లో న్యాయబద్ధత, హేతుబద్దతను గుర్తిస్తూ 2014లో యూపీఏ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ తీసుకున్న సాహసోపేత నిర్ణయం వల్లే తెలంగాణ కల సాకారమైందని అంగీకరించారు.
2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియాగాంధీ పాత్ర, క్రెడిట్‌ను ఎవరూ కొట్టేయలేరని కేసీఆర్ చెప్పారని సదరు టీవీ చానెల్ ఎడిటర్ గుర్తు చేశారు. ఈ విషయం సబ్బండ తెలంగాణ వర్ణాలన్నింటికి తెలుసు. కానీ రెండు రోజుల క్రితం కేసీఆర్ తనయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రాజకీయ అనివార్యత వల్లే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిందని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సారథ్యం వహించిన సోనియాగాంధీ ఇటీవల మేడ్చల్ వేదికగా ప్రజాకూటమి ఎన్నికల ప్రచారసభలో సమర శంఖారావం పూర్తిస్తూ ‘నాకడుపు తరుక్కుపోతోంది.. తెలంగాణ పరిస్థితి చూసి బాధ కలుగుతోంది.. మిమ్మల్ని చూస్తుంటే కొన్నేళ్ల తరువాత పిల్లల్ని చూసినట్లుంది.. నీళ్లు, నిధులు, నియామకాల ఆకాంక్షల్ని టీఆర్ఎస్ నెరవేర్చలేదు.. కేసీఆర్ ప్రజల్ని పక్కన పెట్టి కుటుంబ బాగోగులు చూసుకున్నారు.. మాటపై నిలబడని వారిని నమ్మకూడదు.. పిల్లలు అభివృద్ధి చెందితేనే తల్లికి ఆనందం.. రాజకీయంగా నష్టమని తెలిసీ తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం.. కొత్త రాష్ట్రంలో అభివృద్ధి, పరిపాలన జరగడం లేదు’ అని తెలంగాణ ప్రజల్లో సెంటిమెంట్ పండించారు.
కానీ ఈ అప్పీల్ అధికార టీఆర్ఎస్ నాయకత్వానికి కష్టంగా తోచింది. ఎన్నికల సమరాంగణంలో తమ ప్రత్యర్థి కాంగ్రెస్ కనుక.. వెనుకా ముందు చూసుకోకుండా సీఎం కేసీఆర్ మొదలు కేటీఆర్, హరీశ్ రావు, కవిత అంతా సోనియా వ్యాఖ్యలపై విరుచుకు పడ్డారు.
ఆ మరుసటి రోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ‘అమ్మా.. సోనియా గాంధీ.. తెలంగాణ ప్రజలను చూసి ఎందుకు తల్లడిల్లుతున్నావు.. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినట్లు నీకు మామూళ్ల సూట్‌కేసులు రావడం లేదా.. తెలంగాణలో రైతులు, చేనేత కార్మికుల ఆకలి చావులు, ఆత్మహత్యలు తగ్గాయనా.. ఎందుకమ్మా? నీకు సూటుకేసులు వస్తలేవని తల్లడిల్లుతున్నవా?’ అని ఎదురు దాడికి దిగారు.
ఇంకా ‘మొన్న రాష్ర్టానికి సోనియాగాంధీ వచ్చిండ్రు. అమె కడుపు తరుక్కుపోతున్నదట మరి ఏం జరిగిందో! ఇక్కడి కాంగ్రెస్ దద్దమ్మలు రాసిస్తరు.. ఆ సోనియాగాంధీ చదివిపోతరు. తెలంగాణ గడ్డమీద మీటింగ్‌పెట్టి ఆంధ్రకు ప్యాకేజీ ప్రకటించి పోతరు. మన దగ్గర ఉన్న పరిశ్రమలన్నీ పోవాల్నా? తల్లడిల్లుతున్నదట సోనియాగాంధీ. ఎందుకు తల్లడిల్లుతున్నవమ్మా? సమైక్యరాష్ట్రంలో వచ్చినట్టు నెలవారీ మామూళ్లు వస్తలేవా? సూటుకేసులు, మూటలు బంద్ అయినందుకే కదా నీ బాధ! ఏం కొంపలంటుకున్నయని.. ఎందుకు కడుపు తరుక్కుపోతుందో.. తల్లడిల్లుతున్నవో చెప్పాలె’ అని నిష్ఠూరమైన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్.
అంతేకాదు 2001లో విద్యుత్ పోరాటం పుణ్యమా? అని 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైతును ఆదుకునేందుకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ అందుబాటులోకి తెచ్చింది. కానీ ఈ నాడు తెలంగాణ వచ్చిన తర్వాత ధనిక రాష్ట్రంగా నిధులు అధికంగా ఉండటంతో 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారు కేసీఆర్.. కానీ దీనికి మూలం 2004లో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ప్రారంభమైందన్న సంగతి ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తున్నారని రాజకీయ విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు. అంతేకాదు మాట మీద నిలబడని వారిని నమ్మకూడదని మేడ్చల్ సభలో సోనియాగాంధీ పేర్కొన్నారు.
వాస్తవమేమిటంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందు రాష్ట్ర విభజన పూర్తయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేస్తానని నర్మగర్భంగా పదేపదే హామీలు గుప్పించారు. తీరా ఏరు దాటే వరకు ఓడ మల్లయ్య.. దాటిం తర్వాత బోడిమల్లయ్య అన్నచందంగా పార్టీ విలీనం సంగతి దేవుడెరుగు.. కనీసం కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు కూడా సుముఖత వ్యక్తం చేయలేదు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే దళితుడ్ని సీఎంగా చేస్తానని ఇచ్చిన హామీని ఫలితాలొచ్చిన తర్వాత తుంగలో తొక్కేశారు. ఇలా అవసరానికి అనుగుణంగా వ్యూహాలు మార్చడంలో మన కేసీఆర్ గండరగండుడేనని రాజకీయ వ్యాఖ్యాతలు అభిప్రాయ పడుతున్నారు.
ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని ప్రజాకూటమికి ‘టఫ్’ ఫైట్ జరుగుతున్నదని పరిస్థితులు చెబుతున్నాయి. ఈ తరుణంలో 100కి పైగా సీట్లు గెలుచుకుని విజయం సాధిస్తామని సీఎం కేసీఆర్ పదేపదే చెబుతున్నా.. అది వాస్తవమా? కదా? అన్న సంగతి తెలియాలంటే మరో ఎనిమిది రోజులు వేచి చూడాల్సిందే.
ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక సమరానికి దిక్సూచి కానున్నాయని రాజకీయ పార్టీలు, విశ్లేషకులు, మేధావులు భావిస్తున్నారు. అందువల్లే జాతీయ మీడియా కూడా హైదరాబాద్ వేదికగా పరిస్థితులను మదింపు చేస్తున్నది. ఈ తరుణంలోనే ప్రముఖ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘సోనియాగాంధీ ఉదాత్తురాలు’ అని ముక్తాయింపునిచ్చారు సీఎం కేసీఆర్.. దీని వెనుక పరమార్థం ఏదైనా ఉన్నదా? అని రాజకీయ విశ్లేషకులు సందేహిస్తున్నారు. దీని భావమేమిటన్నది ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే వరకు మిలియన్ డాలర్ల ప్రశ్నే మరి.


కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి