23.10.20

Nayini Narsimha Reddy | తెలంగాణ బెబ్బులి నాయిని

Nayini Narsimha Reddy | తెలంగాణ రాష్ట్ర సాధన తొలితరం ఉద్యమంలోనూ పాల్గొని మలితరం ఉద్యమంలో ప్రస్తుత సీఎం-తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. అందరూ ముద్దుగా పిలుచుకునే కేసీఆర్‌తో కలిసి ముందుకు నడిచిన సహచరుడు నాయిని నర్సింహారెడ్డి. అన్నివేళలా కేసీఆర్‌తో సాన్నిహిత్యంతో ప్రతి అంశాన్ని చర్చించగల చొరవ ఉన్న నేతల్లో నాయిని ఒకరు. అందుకే 2014లో తెలంగాణ రాష్ట్ర కల సాకారమైన వెంటనే ఏర్పాటైన తొలి క్యాబినెట్‌లో రాష్ట్ర హోంమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 

కానీ కరోనా మహమ్మారి కాటు నుంచి కోలుకున్నా.. దానివల్ల ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ రావడంతో ఆరోగ్య సమస్యలు తిరగబెట్టాయి. ఫలితంగా ఈ నెల 13 నుంచి జుబ్లీ హిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరినా.. వెంటిలెటర్ మీద చికిత్స అందించినా భువిపై తాను నిర్వర్తించాల్సిన కార్యాలు పూర్తయ్యాయంటూ నింగికెగసిపోయారు.

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని ప్రముఖ రాజకీయ నాయకుల్లో నాయిని నర్సింహారెడ్డి అంటే అతిశయోక్తి కాదు. వీఎస్టీ గుర్తింపు కార్మిక సంఘం నేతగా ముషీరాబాద్ ప్రాంత వాసులకు చిర పరిచితుడు. భాగ్యనగరంలోని పలు సంస్థల్లోని కార్మిక సంఘాలకు గుర్తింపు పొందిన నేతగా పేరు తెచ్చుకున్నారు. ఒకనాడు మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య.. తర్వాత పీజేఆర్‌గా పేరు తెచ్చుకున్న పబ్బతిరెడ్డి జనార్దన రెడ్డి.. బీజేపీ నేత అలే నరేంద్ర వంటి నేతల సరసన నాయిని నిలుస్తారు. 

ఉక్కుమహిళగా పేరు తెచ్చుకున్నా.. దేశంలో ఎమర్జెన్సీ విధించిన మచ్చ తెచ్చుకున్న ఇందిరాగాంధీ హయాంలో ప్రజావ్యతిరేక ఉద్యమాలకు సారథ్యం వహించిన జయప్రకాశ్ నారాయణ్‌కు శిష్యుడిగా మారారు. నాటి రైల్వే సమ్మెను జయప్రదం చేయడంలో తన వంతు పాత్ర పోషించారు. ఆ తర్వాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో 1978లో జనతా పార్టీ నుంచి ముషీరాబాద్ ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు. తిరిగి 1985లో జనతా పార్టీ తరపున రెండోసారి, 2004లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా విజయం సాధించారు. 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికై రాష్ట్ర తొలి హోంమంత్రిగా 2018 వరకు సేవలందించారు.

కేంద్ర కార్మిక సంఘాల్లో పట్టు కోసం హిందూస్థాన్ మజ్దూర్ సంఘ్ (హెచ్ఎంఎస్) స్థాపించినా.. దాన్ని సింగరేణిలో విస్తరించినా నాయినిలోని కార్మిక పక్షపాతమే కారణం. ఇక 2001లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హయాంలోని ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకరకంగా నియంత పాలనే సాగించింది. తెలంగాణ గడ్డ మీద ‘జై తెలంగాణ’ అనే పదంపై అప్రకటిత నిషేధం అమలైంది. అంతెందుకు మీడియా సంస్థల్లోనూ ఈ ధోరణి కొనసాగింది. నాడు సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఒక ఆంగ్ల దినపత్రిక ఎడిటర్ ఒక అడుగు ముందుకేసి సంస్థలో తెలంగాణ పదం వినిపించరాదని సర్క్యులర్ జారీ చేశారంటే తెలంగాణ ప్రజలు ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నారో అర్ధం అవుతుంది.

ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ సాధనకు కేసీఆర్ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక సభ్యుల్లో నాయిని నర్సింహారెడ్డి ఒకరు. ఆ వెంటనే 2002లో వచ్చిన హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున మేయర్ అభ్యర్థిగా పోటీ చేశారు. నాటి ఎన్నికల్లో మేయర్‌గా గెలుపొందిన తీగల కృష్ణారెడ్డి 2014లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించి.. మారిన పరిస్థితుల్లో తెరాసలో చేరారు. అది వేరే సంగతనుకోండి.

2004లో లెఫ్ట్, టీఆర్ఎస్ పార్టీలతో కలిసి పోటీ చేసి విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ఆర్ సారథ్యంలోని క్యాబినెట్‌లో నాయిని నర్సింహారెడ్డి పని చేశారు. వైఎస్ఆర్ తన రాజకీయ చాతుర్యంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడుతుండటంతో కేసీఆర్ పిలుపు మేరకు తొలుత మంత్రి పదవికి, తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గొప్ప చరిత్ర నాయిని సొంతం. దీంతో 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో ఇటు రాష్ట్ర సీఎం - కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి, అటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ పట్ల సానుకూలం అన్న అభిప్రాయం కలిగించారు. ఫలితంగా 15 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే ఏడుగురు మాత్రమే విజయం సాధించారు. 

దీంతో తెరాసలో అంతర్గత సంక్షోభం వేళ నాడు కేసీఆర్ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆ క్రమంలో తెలంగాణ నినాదం పనైపోయిందని మీడియా ఊదరకొడుతుంటే తెలంగాణ భవన్ వద్దకు చేరుకున్న నాయిని మాట్లాడుతూ.. ఎవడ్రా.. తెలంగాణ పనైపోయిందనేది.. రండిరా చూసుకుందాం.. అని గర్జించిన ఘటన ఎవరి స్మ్రుతిపథం నుంచి వీడిపోలేదు. ఈనాడు రాజకీయ నాయకులంతా హంగూ ఆర్బాటాలకు ప్రాధాన్యం ఇస్తే.. నిరాడంబరతకు పెట్టింది పేరు ఆయన. తనకు ఇష్టమైన బైక్ ‘బుల్లెట్‘పైనే అసెంబ్లీకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ముషీరాబాద్ ప్రాంతంలో 1980,90వ దశకాల్లో బుల్లెట్ బైక్ శబ్దం వినిపిస్తే నాయిని వచ్చాడనే స్థానికులు గుర్తు చేసుకునేవారు. నాయినికి బుల్లెట్ బైక్ అంటే అంత ప్రీతి మరి.

గమ్మత్తేమిటంటే నాటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టంగుటూరి అంజయ్య భార్య మణెమ్మ చేతిలో నాయిని ఓటమి పాలైనా.. నమ్మిన సిద్ధాంతం కోసం రాజీ పడలేదు. తెలంగాణ సాధన కోసం చివరివరకు నిలిచి.. రాష్ట్రంలో తొలి హోంమంత్రిగా సేవలందించి గగనానికి ఎగసిపోయిన నాయినికి ఉద్యమం.. వేల మంది ప్రాణత్యాగ ఫలంగా సాధించుకున్న తెలంగాణను భారతదేశంలోనే అన్నింటా అగ్రస్థానంలో నిలుపడం.. అందరికీ ప్రభుత్వ ఫలాలు అందుబాటులోకి తేవడమే నిజమైన నివాళి...


జై తెలంగాణ.. జై హింద్అ

మర్ రహే అమర్ రహే నాయిని.. అమర్ రహే

First Published on 22 October 11:02 AM 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి