18.11.24

future-reliance | ఫ్యూచ‌ర్-రిల‌య‌న్స్ డీల్‌: లీగ‌ల్‌గా అమెజాన్ నిలుస్తుందా?!

 First Published on June 22, 2021 / 10:16 PM IST



future-reliance | దేశీయ రిటైల్ రంగంలో ఆధిప‌త్యం కోసం అటు గ్లోబ‌ల్ ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్‌.. ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ సార‌ధ్యంలోని రిల‌య‌న్స్ రిటైల్ పోటీ ప‌డుతున్నాయి. రిటైల్ మార్కెట్‌పై ప‌ట్టు సాధించ‌డానికి రిల‌య‌న్స్ రిటైల్ అన్ని ఆప్ష‌న్ల‌నూ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న‌ది. ఇప్ప‌టికే అతిపెద్ద దేశీయ రిటైల్ నెట్‌వ‌ర్క్‌గా భావిస్తున్న ఫ్యూచ‌ర్ రిటైల్ గ్రూప్‌.. అప్పుల ఊబిలో చిక్కుకున్న‌ది.

అప్పులు+క‌రోనాతో ప్యూచ‌ర్ కుదేలు

అప్పుల భారానికి తోడు గ‌తేడాది క‌రోనా మ‌హ‌మ్మారి విసిరిన పంజాతో ఫ్యూచ‌ర్ బిజినెస్ దెబ్బ తిన్న‌ది. ఈ క్ర‌మంలో ఫ్యూచ‌ర్ గ్రూప్ సీఈవో కిశోర్ బియానీ ప్ర‌త్యామ్నాయాల‌పై దృష్టి సారించారు. స‌హ‌జంగానే రిటైల్ మార్కెట్‌లోనూ కీల‌క పాత్ర పోషించాల‌ని ఉవ్విళ్లూరుతున్న రిల‌య‌న్స్ రిటైల్ దీన్ని త‌న‌కు సానుకూలంగా మార్చుకున్న‌ది. మొత్తం ఫ్యూచ‌ర్ రిటైల్ గ్రూప్‌ను త‌మ సంస్థ‌లో విలీనానికి పావులు క‌దిపింది. త‌ద‌నుగుణంగా ఫ్యూచ‌ర్‌-రిల‌య‌న్స్ మ‌ధ్య రూ.24,713 కోట్ల ఒప్పందం కుదిరింది.

రిల‌య‌న్స్‌-ఫ్యూచ‌ర్ డీల్‌పై భ‌గ్గుమ‌న్న అమెజాన్

రిల‌య‌న్స్‌-ఫ్యూచ‌ర్ మ‌ధ్య ఒప్పందం కుద‌ర‌డంతో ఎప్ప‌టి నుంచో భార‌త రిటైల్ మార్కెట్‌పై క‌న్నేసిన అమెజాన్ భ‌గ్గుమ‌న్న‌ది. దీనికీ ఓ కార‌ణం ఉంది. ఇంత‌కు ముందే ఫ్యూచ‌ర్ రిటైల్ అనుబంధ ఫ్యూచ‌ర్ కూప‌న్స్‌లో రూ.1500 కోట్ల విలువైన 49 శాతం వాటాల‌ను అమెజాన్‌ కొనుగోలు చేయ‌డ‌మే. ఒక‌వేళ చ‌ట్టాలు అనుమ‌తి ఇస్తే, మూడేండ్ల నుంచి 10 ఏండ్ల మ‌ధ్య ఫ్యూచ‌ర్ రిటైల్ ఆస్తుల‌ను అమెజాన్‌కు మాత్ర‌మే విక్ర‌యించే హ‌క్కు క‌ల్పిస్తూ రెండు సంస్థ‌ల మ‌ధ్య 2019 ఆగ‌స్టులో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందానికి నియంత్ర‌ణ సంస్థ‌ల్లో ఒక‌టైన కాంపిటీష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియా (సీసీఐ) 2019 న‌వంబ‌ర్‌లో ఆమోద‌ముద్ర వేసింది కూడా..

అమెజాన్ పెట్టుబ‌డులు ఎఫ్‌డీఏ ఉల్లంఘ‌నేనా!

దేశీయ రిటైల్ సంస్థ‌లు ఫ్యూచ‌ర్ రిటైల్ లిమిటెడ్‌, ఫ్యూచ‌ర్ కూప‌న్స్ ప్రైవేట్ లిమిటెడ్‌, రిల‌య‌న్స్ రిటైల్ మాత్రం అమెజాన్ వాద‌న నిల‌బ‌డద‌ని చెబుతున్నాయి. ఫ్యూచ‌ర్ కూప‌న్స్ ద్వారా ఫ్యూచ‌ర్ రిటైల్ లిమిటెడ్‌లో ప‌రోక్షంగా అమెజాన్ పెట్టుబ‌డులు పెట్టింద‌ని, ఇది విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల చ‌ట్టాల‌ను ఉల్లంఘించ‌డ‌మేన‌న్నాయి. మ‌ల్టీ బ్రాండ్ రిటైల్ రంగంలోకి కేవ‌లం 10 శాతం విదేశీ పెట్టుబ‌డుల‌ను మాత్ర‌మే అనుమ‌తినిస్తున్నాయ‌ని పేర్కొంటున్నాయి.

అమెజాన్ ఇలా న్యాయ‌పోరాటం

గ్లోబ‌ల్ ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జంగా అమెజాన్‌.. ఫ్యూచ‌ర్‌-రిల‌య‌న్స్ ఒప్పందాన్ని సింగ‌పూర్ అంత‌ర్జాతీయ మ‌ధ్య‌వ‌ర్తిత్వ కోర్టులో స‌వాల్ చేసింది. అమెజాన్ పిటిష‌న్‌ను విచారించిన అంత‌ర్జాతీయ మ‌ధ్య‌వ‌ర్తిత్వ కోర్టు.. ఫ్యూచ‌ర్‌-రిటైల్ ఒప్పందాన్ని త‌ప్పుబ‌ట్టింది. కానీ ఫ్యూచ‌ర్ చ‌క‌చ‌కా రిల‌య‌న్స్‌లో విలీనానికి పావులు క‌దిపింది. ఫ‌లితంగా ఢిల్లీ హైకోర్టులోనూ, సుప్రీంకోర్టులోనూ అమెజాన్ పిటిష‌న్లు వేసింది. రిల‌య‌న్స్ రిటైల్‌లో త‌మ సంస్థ విలీనాన్ని అడ్డుకోవ‌ద్దంటూ అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌కు ఫ్యూచ‌ర్ గ్రూప్ ఉద్యోగులు బ‌హిరంగ లేఖ కూడా రాశారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి