9.1.17

అమెరికా పొమ్మంటుంటే.. హైదరాబాద్ రమ్మంటున్నది!


మా ఉద్యోగాలు మాకేనంటున్నది అమెరికా కొత్త పాలకవర్గం! అనడమేకాదు.. అగ్రరాజ్యంలో ఉద్యోగాలు చేసుకునే వారిపై కత్తిగడుతున్నది! మరి అమెరికా పొమ్మంటే అక్కడి భారతీయ ఉద్యోగులంతా ఎక్కడికి వెళ్లాలి? అటువంటి వారికి కష్టకాలంలో హైదరాబాద్ ఓ వెలుగు బావుటాలా నిలుస్తున్నది! నేనున్నాను రమ్మంటూ భరోసానిస్తున్నది!

వలసదారులకు భూతల స్వర్గమని అమెరికాకు పేరుంది. ఏ దేశంవారైనా సరే.. నైపుణ్యం ఉంటే చాలు.. అమెరికాలో బతికేయవచ్చు! కానీ.. ఇకపై అలా కాదు! అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకేనంటూ అగ్రరాజ్యపు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఇకపై ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లే వారికి కష్టాలు తప్పవు. ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నవారు సైతం అనేక మంది తిరుగు ప్రయాణం కట్టాల్సిన పరిస్థితి ఉంది. మరి ఇంత మందికి ఎవరు ఉద్యోగాలు కల్పిస్తారు? ఎక్కడ వారికి ఉద్యోగాలు దొరుకుతాయి? ఇదే విషయంలో అమెరికాలోని పలువురు భారతీయ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను అక్కడి ప్రముఖ పత్రిక వాషింగ్టన్ పోస్ట్ కదిలిస్తే.. వారు మాకు హైదరాబాద్ ఉంది అంటూ ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ కేంద్రంగా ఐటీ పరిశ్రమలో పెద్దఎత్తున వస్తున్న అవకాశాలపై దేశీయ ఇంజినీర్లలో పూర్తి ధీమా ఉందని వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది.

హైదరాబాద్‌పై అచంచల విశ్వాసం ఉందన్న వాషింగ్టన్ పోస్ట్
హెచ్1బీ వీసాల కుదింపుపై పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతున్నప్పటికీ.. భారతీయులు ముఖ్యంగా తెలుగు ఐటీ ఉద్యోగులు మాత్రం ధీమాగా ఉన్నారని వాషింగ్టన్ పోస్ట్ విశ్లేషించింది. హైదరాబాద్‌లోనే అమెరికా స్థాయిలోని ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయనేది వారి ధీమాగా పేర్కొంది. ఓర్లాండోలో ఇటీవలికాలం వరకు డెలాయిట్ కంపెనీలో పనిచేసిన మధు అనే ఉద్యోగి వాషింగ్టన్ పోస్ట్‌తో మాట్లాడుతూ వీసా పునరుద్ధరణ కోసం హైదరాబాద్‌కు వచ్చాను. వీసా రెన్యువల్ అవుతుందని భావిస్తున్నాను. కాకపోయినా ఇబ్బందేం లేదు. ఇక్కడ బోలెడు అవకాశాలున్నాయి. అత్యుత్తమ కంపెనీలు ఇక్కడ ఉన్నందున మంచి అవకాశం దొరుకుతుంది అంటూ ధీమా వ్యక్తంచేశారు.
ఇలా భారతీయ ఉద్యోగులు ఒకవేళ అమెరికా నుంచి తిరిగి వస్తే హైదరాబాద్, బెంగళూరులో అనేక అవకాశాలు ఉన్నాయని వాషింగ్టన్ పోస్ట్ విశ్లేషించింది. అందులో ముఖ్యంగా హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ రంగం విస్తృతి పెరుగుతున్నదని పేర్కొంది. గతంలో ఔట్‌సోర్సింగ్‌కు కేంద్రంగా ఉండగా.. ఇటీవలి కాలంలో ప్రముఖ కంపెనీలు తమ అతిపెద్ద కార్యాలయాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాయి. ఆపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్‌కు చెందిన అతిపెద్ద కార్యాలయాలు అమెరికా తర్వాత హైదరాబాద్‌లోనే కొలువుదీరి ఉన్నాయి. అమెజాన్, డెల్, ఉబెర్ వంటి దిగ్గజ సంస్థలతో పాటు అనేక ప్రముఖ ఐటీ కంపెనీలు ఇక్కడ నేరుగా సేవలందిస్తున్నాయి.

హెచ్1బీ కథాకమామిషు ఇది
హెచ్1బీ వీసాపై ఏటా సుమారు లక్షమందికిపైగా నిపుణులైన ఉద్యోగులు అమెరికాకు వలస వెళ్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఐటీ రంగానికి చెందిన భారతీయుల సంఖ్య అధికంగా ఉంది. హెచ్1బీ వీసాలను చీప్ లేబర్ ప్రోగ్రాం అని విశ్లేషించిన ట్రంప్ దీన్ని పూర్తిగా సమీక్షించడానికి సిద్ధమవుతున్నారు. ఈ నిర్ణయంతో ప్రధానంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు ప్రభావితం కానున్నాయి. కాగా హెచ్1బీ వీసాలపై అమెరికాకు ఉద్యోగులుగా వచ్చిన అనేకమంది తదనంతర కాలంలో ఆయా సంస్థల్లో అత్యున్నత స్థానానికి చేరారు. అంతేకాకుండా ప్రముఖ కంపెనీలను స్థాపించారు. ఈ పరిణామం అమెరికన్ల పొట్టకొట్టిందని భావిస్తూ ట్రంప్ వీసాలను కత్తిరించేందుకు సిద్ధమయ్యారు.

ఈ ఆర్టికల్ నమస్తే తెలంగాణ జనవరి 10 సంచికలో ప్రచురితమైన వార్త.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి